11, డిసెంబర్ 2012, మంగళవారం

పద్య రచన - 187

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

9 కామెంట్‌లు:

 1. సాగర నరుడా ముందుకు
  సాగర మధనమ్ము దలచి సాధన లోనన్
  ఆగకు విషమే వచ్చిన
  దాగిన యమృతమ్ము దక్కి త్రాగే వరకున్.

  రిప్లయితొలగించండి
 2. మందర పర్వత మదియౌ
  యందముగా జుట్ట బడెను నహి వాసుకి చేన్
  ముందర వెనుకన నుండియు
  సుందరముగ లాగు చుండ్రి సురలు నసురులున్ .

  రిప్లయితొలగించండి
 3. గిరిసుతపతిదేవుండే
  గరళము మ్రింగని యెడల జగమ్ముల నిక సా
  గర మథనవేళ కాచగ
  సరి దైవమదెవరటంచు సందియమగునే!

  రిప్లయితొలగించండి
 4. క్షీర సాగర మథనము:

  క్షీరసాగరమును మథించిన లభించు
  నమృతమని విని యట్టి కార్యక్రమమున
  నమరు లసురుల యొక్క సాయమును గోరి
  యొక్క సుముహూర్తమున యత్న మూనుకొనిరి

  కవ్వమయ్యెను మంథర క్ష్మాధరమ్ము
  త్రాడుగానయ్యె ఫణిరాజు దానవులును
  దేవతలును క్షీరాబ్ధి మథించు వేళ
  నమృతమును బొందుటకగు ప్రయత్నమందు

  క్షీర సాగరమున్ మథించగ జెచ్చెరన్ దనుజుల్ సురల్
  భారమైనది గాన మంథర పర్వతేంద్రము క్రుంగె నా
  తీరు గాంచి సముద్ధరించెను దేవదేవుడు కూర్మమై
  వారిజాక్షుడు మోసె నా ఘన పర్వతమ్మును వీపుపై

  దేవ దానవ తతులు మథించుచుండ
  క్షీర సాగరమున నిండి ఘోరమైన
  రీతినందుండి విషవహ్ను లాతరి కడు
  భీకరమ్ముగ వ్యాపించె విశ్వమందు

  పరువిడి పోయి భీతిమెయి పాహి మహేశ్వర! పాహి పాహి హే
  పరమశివా! మహోగ్రమగు జ్వాలలతో విషవహ్ని లోక భీ
  కరమయి గాల్చుచుండెను జగమ్ముల నంతట వ్యాప్తి జెందుచున్
  హర హర! యంచు వేడగ సురాసురులా తరుణాన శంకరున్

  హరుడు వేగ పట్టి యంత హాలహలము నంతయున్
  కరతలాన జేర్చి మ్రింగి కంధరమున నిల్పె దు
  ర్భర మహోగ్ర గరళ మటుల బాపె నా విపత్తు ని
  ర్జరులు దైత్యు లెల్లరు మది సంతసింప నెంతయున్

  పిదప ప్రభవించె సురభియు, వేల్పుజెట్టు,
  హయవరమ్ము, నైరావత, మాదిలక్ష్మి,
  శశియు, చింతామణియును నా జలధినుండి
  యుద్భవించె నంత్యమున పీయూష మపుడు

  త్రిభువన మోహినియై శ్రీ
  విభు డచటకు జేరి పంచె పీయూషంబున్
  శుభమతులగు దేవతలకు
  రభసమ్మున నార్తి మిగిలె రాక్షస తతికిన్

  జయము కూర్మ రూప! జయ జగన్మోహినీ!
  స్వామి! విష్ణు దేవ! జయము జయము
  జయము నీలకంఠ! జయము లోకత్రాత!
  జయము పార్వతీశ! జయము జయము

  రిప్లయితొలగించండి
 5. విందొనరించ సురాసుర
  బృందము క్షీరాబ్దిఁజిలుక పేరిమి గిరియౌ
  మంధరతో వాసుకినిడి,
  చిందెను సుధ కూర్మ మౌచు సిరి పతి నిలువన్!

  ఏకాగ్రతఁబెట్టి త్రిగుణ
  శ్రీకారముతో మొదలిడ సిరిపతి కరుణన్
  యే కార్యంబైననుఁ దా
  సాకారంబౌ ధరణిన సంకల్పమునన్!

  రిప్లయితొలగించండి


 6. క్షీరసాగర మథనమ్ము జేయ మంద
  రగిరి కవ్వమై వాసుకి త్రాడు గాగ
  కొండ నెత్తగ విష్ణువు కూర్మ మయ్యె;
  దేవ దానవుల్ జిలికిరి దినము పగలు

  క్రమమునన్ బుట్టె చంద్రుడు కమలవాసి
  కామధేనువు చౌదంతి కల్పతరువు
  మదిర హాలాహలమ్ములు ; తుదకు బుట్టె
  నమృతము సురలు రాక్షసులబ్బుర పడ

  గరళమును మ్రింగి గాచె లోకముల నెల్ల
  హరుడు ;మోహిని రూపమై యవతరించె
  హరియె పంచె నమృతమును సురలు ద్రావ ;
  నాంది దేవదానవ పోరు నాటి నుండి.

  రిప్లయితొలగించండి
 7. పాల నిధి లోన మంధర పర్వతమును
  కవ్వముంజేసి దానికి గట్టిగాను
  వాసుకిం జుట్టి త్రాడుగా పట్టి సురులు
  నసురులు చిలుకగా పుట్టె నమృత ఝరి.

  రిప్లయితొలగించండి


 8. క్షీరసాగర మథనమ్ము చింతజేయ
  మనకు గుణపాఠమును నేర్పు ,మరలకుండ
  ఎన్ని కష్టమ్ములనుగాని,యెంతశ్రమను
  సాధనముజేయ ఫలితమ్ము సాధ్యమౌను.


  రిప్లయితొలగించండి
 9. నేమాని గారి పద్యములు బాగుగనే ఉన్నవి ." భారమైనది గాన" కాకూడదు , భారమైనది కాన అనియే ఉండవలెను .
  "కరమయి గాల్చుచుండెను" ను కరమయి కాల్చుచుండెను అని మార్చవలెను . స్వస్తి.

  రిప్లయితొలగించండి