15, డిసెంబర్ 2012, శనివారం

పద్య రచన - 191

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

 1. దివిజారాతుల సంహరించుచు మహా తీవ్రాహవ క్షోణిలో
  నవనీ భారము బాపుచున్ దనరు నంబా! కాళికా! సత్కృపా
  ర్ణవ వీవంచు దలంచుచుండి నిను సంప్రార్ధింతు సౌమ్యాకృతిన్
  శివ భామామణి! మమ్ము బ్రోవుము శివా! క్షేమంకరీ! శాంకరీ!

  రిప్లయితొలగించండి
 2. అయ్యా,
  రెండవ పాదములో మీరు వేసినది స్వరయతి అనుకుంటున్నాను. దయచేసి తెలుపగలరా?

  ధరణీ భారము పెంచు రక్కసులనే దాక్షిణ్యమున్ జూపకన్
  శరవేగంబుగ సంహరించు తరుణీ సామర్థ్యమున్ జూడ నా
  సురసంఘమ్ములు జేరవచ్చెనదిగో! శోభిల్లు శూరత్వమున్
  పరదైవమ్మిట జూపె, వందనమిదే! పాలింపు భద్రాంబికా!

  రిప్లయితొలగించండి
 3. జూపకన్ అనే పదము మార్చి...

  వీడుచున్

  అని గమనించగలరు.

  రిప్లయితొలగించండి
 4. అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
  అవని శబ్దములోని "అ" అకారమునకు యతి స్థానములోని అంబా అనే సంబోధనలోని చివరి "ఆ" కారమునకు యతి మైత్రి కలదు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 5. కాళికా మాత ! మమ్ముల గరుణ జూడు
  నియమ నిష్ఠలు దప్పక .నిన్ను గొలిచి
  పరిమళం బగు సౌగంధి ఫలము లిత్తు
  దినము దినమును నిజముగ దేవి ! నీ కు .

  రిప్లయితొలగించండి
 6. భండుండాది సమస్త దైత్య తతులన్ భంజింపవే తల్లి! బ్ర-
  హ్మాండంబుల్ పరిరక్ష సేయుటకునై మాల్మిన్ మహా కాళి! పిం-
  డాండంబుల్ మనలేవు నీ కనులలో నగ్నుల్ జ్వలింపంగ నే
  దండంబున్ పచరింతు సౌమ్యవయి మాతా! లోకముల్ గావవే .

  రిప్లయితొలగించండి
 7. అయ్యా మిస్సన్న గారూ!
  శుభాశీస్సులు.
  మీ పద్యములో "భండుండాదిగ సర్వ దైత్య తతులన్" .. కి బదులుగా "భండాది ప్రముఖామరారి తతులన్" అంటే బాగుంటుంది అని నా భావన. చూడండి. పద్యము చాల బాగున్నది. అభినందనలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 8. జాలిన్ జూపి కుసంస్కా
  రాళిని మా మానసమున కావల పారన్
  ద్రోలగఁ జూచి దనుజతన్
  ఖాళీ జేయవె కపాళి! కాళీ మాతా!

  రిప్లయితొలగించండి
 9. మిత్రులారా! శుభాశీస్సులు.

  ఈనాటి చిత్రమును గురించి సంగ్రహ వాక్యములు.

  నాకు బాగుగ పరిచయమున్న డా.కొల్లూరు అవతార శర్మ (విశ్రాంత రీడరు, పీ ఆర్ కాలేజ్, కాకినాడ) గారిని అడిగేను. వారు శ్రీదేవీ ఉపాసకులు. వారు చెప్పిన రీతి:

  (వారునూ వినినదే యట)
  సృష్టి యొక్క మహా సంహారము తరువాత శక్తిహీనుడై అచేతనుడై స్పందనలేక పరమశివుడు పడియున్న వేళలో శక్తి విజృంభించి భయంకర నాట్యమాడు వేళ ఆమె పాదముల క్రింద శివుడు పడెను. దీనికి ఎక్కడా సరియైన ఆధారములునూ వారు చూడలేదుట.

  మీరు ఎవరైన ఇంకనూ కొన్ని వివరములను తెలియ జేసినచో సంతోషము.

  స్వస్తి

  రిప్లయితొలగించండి
 10. అఖిల భువనమ్ములును లయమైన వేళ
  శక్తిహీనుడై పడియుండ శంకరుండు
  శక్తి జృంభించి నాట్యంబు సలుపుచుండ
  పడెను పతిమీద జగదంబ పాద మకట!

  రిప్లయితొలగించండి
 11. శ్రీ పండితుల వారికి ప్రణామములు
  శ్రీ చాగంటి వారి ప్రవచనములలో విన్నట్టు కొంచం గుర్తు. అది ఏ చాప్టరో సరిగా వెతక లేక పోతున్నాను.వారు చెప్పింది గుర్తున్నంత వరకు
  " దైత్య సం హారమప్పుడు రుద్ర భూమిలొ ఆమె రౌ ద్రాన్ని భరించ లేక ఆపగల శక్తి లేక దేవతలు శివుని వేడినట్లు , అందుకు గాను శివుడు తానె వెళ్ళి ఆ మరు భూమిలో పరుండగా దేవి చూడ కుండా శివునిపై కాలువేసి తొక్కినపుడు ఆ స్పర్స కు భర్త అని గ్రహించి , పొరబాటుకి చింతించి , తన ఉగ్ర రూపాన్ని ఉపసం హరించు కుంది " అని విన్నట్టు గుర్తు. అది సరిగా వెతక లేక పోతున్నాను. పొరబాట్లు ఉన్నయెడల క్షంతవ్యు రాలను.

  రిప్లయితొలగించండి
 12. కాల రూపిణి వీవమ్మ కాళి మాత
  తలపు నీవమ్మ పట్టిన తలయె గుర్తు
  దండలవి యాయె లోబడి యుండు గుర్తు
  నీదు లోబడి యుండుగా భవుడెయైన.

  రిప్లయితొలగించండి
 13. కాల రూపిణి వీవమ్మ కాళి మాత
  తలపు నీవమ్మ పట్టిన తలయె గుర్తు
  తలలు జన్మల గుర్తుగా దండలాయె
  శక్తి యుండదు నువు లేక శంభుకైన.

  రిప్లయితొలగించండి
 14. నేమాని పండితార్యా మీ సూచనకు ధన్యవాదములు.
  ఇప్పుడు పద్యపు నడక సరళంగా అందంగా ఉంది.

  భండాది ప్రముఖామరారి తతులన్ భంజింపవే తల్లి! బ్ర-
  హ్మాండంబుల్ పరిరక్ష సేయుటకునై మాల్మిన్ మహా కాళి! పిం-
  డాండంబుల్ మనలేవు నీ కనులలో నగ్నుల్ జ్వలింపంగ నే
  దండంబున్ పచరింతు సౌమ్యవయి మాతా! లోకముల్ గావవే .

  రిప్లయితొలగించండి
 15. ఈ నాటి చిత్రం నేపథ్యం గురించి ఒక మిత్రుడు ప్రశ్నించడంతో ఆసకికరమైన చర్చకు అవకాశం లభించింది. పండిత నేమాని వారు, నేదునూరి రాజేశ్వరి అక్కయ్య కొన్ని వివరాలు తెలిపారు. మా మిత్రుడొకరు శివుని రూపంలో వచ్చి పార్వతిని వంచింపబోయిన జలంధరుడనే రాక్షసుని వృత్తాంతాన్ని తెలిపాడు. అందరికీ ధన్యవాదాలు.
  ఇక ఈనాటి చిత్రానికి తగిన పద్యాలను రచించి అలరింపజేసిన కవిమిత్రులు....
  పండిత నేమాని వారికి,
  లక్ష్మీదేవి గారికి,
  సుబ్బారావు గారికి,
  మిస్సన్న గారికి,
  సహదేవుడు గారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  అభినందనలు, ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి