26, డిసెంబర్ 2012, బుధవారం

సమస్యా పూరణం - 918 (వమ్ము సర్వమ్ము)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
వమ్ము సర్వమ్ము నేత్రపర్వమ్ము సుమ్ము
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదములు.

18 కామెంట్‌లు:

 1. చిత్ర నాయకీ మణులెల్ల చేరి రొక్క
  శత దినోత్సవము జరుగు సభను చూడ
  వారి తళుకు బెళుకు హొయలును మరి పరు
  వమ్ము సర్వమ్ము నేత్రపర్వమ్ము సుమ్ము

  రిప్లయితొలగించండి
 2. కాకతీయుల ప్రాభవ గరిమ చెలగి
  వేయిస్థంభాల గుడిలోన వెలసె నౌర !
  తెలుగు జాతికి నీ కాకతీయ యుత్స
  వమ్ము సర్వమ్ము నేత్రపర్వమ్ము సుమ్ము

  రిప్లయితొలగించండి
 3. శంకరాభరణాఖ్య ప్రశస్త వేది
  సద్గురుండగు శ్రీ కంది శంకరయ్య
  గార్కి కవనాభిషేక ప్రఖ్యాత గౌర
  వమ్ము సర్వమ్ము నేత్రపర్వమ్ము సుమ్ము

  రిప్లయితొలగించండి
 4. ఆ ప్రపంచపు తెలుగు మహా సభలకు
  వెనుక కోనేటి రాయుని విభవమొప్ప!
  ముందు లేపాక్షి నందియే మ్రొక్కు చుండ!
  మాతృ భాషాక్షరాలతో మ్రాకు ప్రాభ
  వమ్ము సర్వమ్ము నేత్రపర్వమ్ము సుమ్ము!

  రిప్లయితొలగించండి
 5. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మబుధవారం, డిసెంబర్ 26, 2012 11:01:00 AM

  అండ పిండ బ్రహ్మాండ నాయకుడు నిత్య
  వడ్డి కాసుల వానికి వరుస జరుగు
  భవ్య దివ్యమౌ బ్రహ్మోత్సవాల ప్రాభ
  వమ్ము సర్వమ్ము నేత్ర పర్వమ్ము సుమ్ము.

  రిప్లయితొలగించండి
 6. భక్తి శ్రద్ధలు లేనట్టి పత్రి పూజ
  వమ్ము సర్వమ్ము , నేత్ర పర్వము సుమ్ము
  వేంకటేశుని రూపంబు వీ క్ష సేయ
  దయలు వరలును నిరతము దైవ మునకు

  రిప్లయితొలగించండి
 7. సంఘ విద్రోహ శక్తుల యాగడమ్ము
  భూరి రక్షణ దళముల ముందు నిజము
  వమ్ము సర్వమ్ము నేత్రపర్వమ్ము సుమ్ము
  దేశ గణతంత్ర వేడుక దివ్య మగును.

  రిప్లయితొలగించండి
 8. ‘గాలి’వాటు సంపద లెల్ల గట్టిగాను
  నేర పరిశోధనా శాఖ నిజము వెలికి
  తీయ పేలపిండి పగిది తేలిపోయె
  వమ్ము సర్వమ్ము నేత్రపర్వమ్ము సుమ్ము

  రిప్లయితొలగించండి

 9. సుందరకుసుమభరతరుశోభితమ్ము
  పౌర్ణమీశీతచంద్రికాభాసితమ్ము,
  కేకినృత్యవిలాసమ్ము,కోకిలార
  వమ్ము,సర్వమ్ము నేత్రపర్వమ్ము సుమ్ము.

  రిప్లయితొలగించండి
 10. కళల కాణాచి యైనట్టి కాక తీయ
  కవులు నిండుగ కొలువున్న భువన జయము
  భోజ రాజిత మందలి భోగ వైభ
  వమ్ము సర్వమ్ము నేత్ర పర్వమ్ము సుమ్ము

  రిప్లయితొలగించండి
 11. జనులు సంబరముగ గూడి జాతరయను
  విధమున జరుగు చున్నట్టి వేడుకలట!
  తెలుగు మాటాడు ప్రజలకు దీని వైభ
  వమ్ము సర్వమ్ము నేత్ర పర్వమ్ము సుమ్ము

  రిప్లయితొలగించండి
 12. కొండ కోనల సొగసులు నిండు మనము
  చంద్ర కాంతులు సోకిన సంత సమ్ము
  పుడమి సోయగ మెంతైన భూరి వైభ
  వమ్ము సర్వమ్ము నేత్ర పర్వమ్ము సుమ్ము !

  రిప్లయితొలగించండి
 13. కవిమిత్రులకు నమస్కృతులు.
  నిన్న రోజంతా మా మిత్రుడు విద్యాసాగర్ కవితాసంకలనం ‘అరణ్యం’ ఆవిష్కరణ సభలో వ్యస్తుణ్ణి.
  చక్కని పూరణలు అందించిన మిత్రులు...
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  నాగరాజు రవీందర్ గారికి,
  పండిత నేమాని వారికి
  సహదేవుడు గారికి,
  తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
  సుబ్బారావు గారికి,
  మిస్సన్న గారికి,
  చంద్రశేఖర్ గారికి,
  కమనీయం గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు,
  లక్ష్మీదేవి గారికి
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 14. మాఘమాసంలో తిరుమలలో రథసప్తమి పర్వదినాన బ్రహ్మాండ నాయకునికి జరిగే వైభవము చూచిన వారి జన్మ సార్థకమౌతుంది.

  వరుస దశదిన బ్రహ్మోత్సవాల దీప్తి
  యొక్క రథసప్తమి దినాన యొదిగి పోవ
  భువిని వైకుంఠమును జేయు మూర్తి వైభ
  వమ్ము సర్వమ్ము నేత్ర పర్వమ్ము సుమ్ము

  రిప్లయితొలగించండి
 15. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మూడవ పాదంలో యతి తప్పింది.
  ‘వారి తళుకు బెళుకు హొయ ల్వగలును పరు’ అందామా?
  *
  నాకు ‘కవనాభిషేకం’ చేసిన గురువులు నేమాని వారికి నమస్సుమాంజలి.
  *
  తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
  ‘నిత్య’కు అన్వయం. ‘నిత్య వడ్డికాసులవాడు’ అని సమాసం చేయలేము కదా! ‘నాయకుడు గనుక’ అందామా?
  *
  కమనీయం గారి ప్రకృతి వర్ణన మనోహరంగా ఉంది.

  రిప్లయితొలగించండి
 16. సహదేవుడు గారూ,
  శ్రీనివాసుని దివ్య మూర్తి వైభవమ్ము’ను ప్రస్తావించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. మాస్టరు గారూ ! చక్కని సవరణకు ధన్యవాదములు. సవరణతో...

  చిత్ర నాయకీ మణులెల్ల చేరి రొక్క
  శత దినోత్సవము జరుగు సభను చూడ
  వారి తళుకు బెళుకు హొయ ల్వగలును పరు
  వమ్ము సర్వమ్ము నేత్రపర్వమ్ము సుమ్ము

  రిప్లయితొలగించండి