22, డిసెంబర్ 2012, శనివారం

పద్య రచన - 198

1                                     2
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:

Pandita Nemani చెప్పారు...

వచ్చెను దాహముతో నొక
పిచ్చుక త్రాగినది నీరు వేడ్కగ నాపై
చెచ్చెర నూగుచు నచ్చట
ముచ్చటలన్ దేలుచుండె ముదమున గనుడీ

గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...


పిట్టల జంటను చూడుడు
ఎట్టాగో నీటిపైన నెగురుచు మొక్కల్
పట్టుకు నూగుచు నొడుపుగ
పట్టెను గా చేప నొకటి పలికెద 'వహ్వా'.

subbarao చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
subbarao చెప్పారు...


పిచ్చుక జంటను జూడుడు
నెచ్చెలి కట నిడుచు నుండె నీరము నహహా
యచ్చమ మగు కూరిమి నన
ముచ్చట గా నుండె మఱియు మోదము గూర్చెన్

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

ప్రకృతి విన్యాసములనెల్ల పరవశించి
చూచుటకునిచ్చగించెద, శోభకనగ
జీవనమదెల్ల చాలదు, చిట్టడవుల
నుండి కనవచ్చు నివియెల్ల నూత్నవిధిని

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు...

పరిగ లిండ్ల నెవరు పైన పెట్టుటలేదు
ప్రాణ హాని యయ్యె పర్యావ రణ మేమి
చేయ లేక నిస్స హాయపు పిచ్చుకల్
చేల చేరి గ్రోలె సేదదీర జలము.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

పచ్చిక బయల్ల మేసిన
పిచ్చుక జతగా సరసున విన్యాసములన్
హెచ్చిన దప్పికఁదీరగ
ముచ్చటగామొక్క బట్టి ముందుకు వంగెన్!

Unknown చెప్పారు...

పరక మొక్కను కాళ్ళతో పట్టుకొనుచు
ముక్కులను నీటిలో ముంచి ముందు కొరిగి
ముచ్చటల గొల్పు విన్యాసములను కరము
మీరి చేయు పులుగులార ! మీకు శుభము !

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నీటిపై నీదుచు పక్షులు
పోటీ పడి యెరను గాంచి పొందుట కొఱకై !
నోటను కఱచుకు పోవగ
యేటికి యెదురీది గెలువ నెవ్విధి నైనన్

కంది శంకరయ్య చెప్పారు...

కవిమిత్రులకు నమస్కృతులు.
అక్కడ ఉన్న రెండు చిత్రాలూ ఒకే పక్షివి. అందుకే చిత్రాల క్రింద 1,2 అని పేర్కొన్నాను. కొందరు అవి వేరు వేరని పొరపాటు పడ్డారు.
ముచ్చట గొల్పే పిచ్చుకపై మనోహరములైన పద్యాలు రచించిన కవిమిత్రులు...
పండిత నేమాని వారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
సుబ్బారావు గారికి,
లక్ష్మీదేవి గారికి,
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
సహదేవుడు గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు
అభినందనలు, ధన్యవాదములు.
*
గోలి వారూ,
‘ఎట్టాగో’ అని గ్రామ్యపదాన్ని వాడారు. ‘చూడుం/ డెట్టులొ యా నీటిలోన...’ అని నా సవరణ.
*
సుబ్బారావు గారూ,
‘అచ్చము’ ఉంది కానీ ‘అచ్చమము’ అనే శబ్దం లేదు. ‘అచ్చంబగు/అచ్చమ్మగు’ అంటే సరి!
*
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
మీ పద్యంలో ౨, ౪ పాదాలలో గణదోషం. నా సవరణలతో మీ పద్యం....
పరిగ లిండ్ల నెవరు పైన పెట్టుటలేదు
ప్రాణ హాని గూర్చెఁ బ్రకృతి యేమి
చేయ లేక నిస్స హాయపు పిచ్చుకల్
చేల జలము గ్రోలి సేదదీరె.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మొదటి పాదంలో గణం తప్పింది. ‘నీటను నీదుచు’ అందాం.

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు...

మాస్టారూ! కృతజ్ఞుడను.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

మాస్టరు గారూ ! ధన్యవాదములు. మీరు చూపిన సవరణతో.

పిట్టల జంటను చూడుం
డెట్టులొ యా నీటిపైన నెగురుచు మొక్కల్
పట్టుకు నూగుచు నొడుపుగ
పట్టెను గా చేప నొకటి పలికెద 'వహ్వా'.