22, డిసెంబర్ 2012, శనివారం

త్రిశత్యక్షర సంక్షేప రామాయణము

                      సోపాన దండకము

రామ!
భూమీశ!
కౌసల్యజా!
సద్గుణస్తోమ!
కారుణ్యవారాశి!
ధర్మప్రభాభాసురా!
తాటక ప్రాణసంహార!
గాధేయ యజ్ఞావనోత్సాహ!
మౌనీంద్ర సంస్తుత్య వీర్యోన్నతా!
ధారుణీనందినీ మానసారామ!
దేవేంద్ర ముఖ్యామర స్తుత్య చారిత్ర!
కళ్యాణ శోభాన్వితానంద రూపోజ్వలా!
పైతృకాజ్ఞా ప్రకారాంచిత త్యక్తసామ్రాజ్య!
సోర్వీసుతా లక్ష్మణారణ్య సంవాస సంప్రీత!
ఘోరాటవీప్రాంత వాసర్షి బృందావనానందితా!
క్రూర దైత్యాంగనా దుష్ట కామార్తి విధ్వంసనోత్సాహ!
మాయామృగాకార మారీచ ఘోరాసుర ప్రాణసంహార!
ధాత్రీతనూజా వియోగాతి దుఃఖాగ్ని సంతప్త హృన్మందిరా!
అంజనాపుత్ర సంశుద్ధ వాగ్భూషాణానీక సంశోభితాత్మాబ్జ!
వాతాత్మసంజాత రంహత్సమానీత భూమీసుతా క్షేమ సందేశ!
సంగ్రామ రంగస్థ లంకాధినాథాది ఘోరాసురానీక సంహారకా!
దేవతానీక దిక్పాల గంధర్వ యక్షోరగవ్రాత సంస్తుత్య సత్కీర్తి!
విశ్వసర్గాది నాశాంతలీలా వినోదాభిరామా! నమస్తే నమస్తే నమః 


పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

7 కామెంట్‌లు:

 1. గోలి హనుమచ్ఛాస్త్రిశనివారం, డిసెంబర్ 22, 2012 7:49:00 AM


  సోపానపు దండకమే
  మా పాలికి మీదు రచన మాకందించే
  సోపానము రామ పదము
  నేపారగ చేరు కొరకు నద్భుత పథమే.

  రిప్లయితొలగించండి
 2. మిత్రులారా!
  ఈ దండకమునకు "ఉత్తరోత్తరావరోహణ పూర్వక చతుర్వింశత్యక్షర సోపాన సంక్షేప రామాయణ దండకము" అనే పేరును డా. ఏల్చూరి మురళీధర రావు గారు సూచించేరు. వారికి శుభాశీస్సులు.
  ఇది దండకము ఛందస్సులో వ్రాయబడినది. ఇందులో మొదట ఒక అక్షరముతో, తరువాత 2 అక్షరములతో, ఆ పిదప అదే విధముగా 24 అక్షరముల వరకు నుంచుతూ రామాయణమును సంక్షేపముగా చెప్పుట యైనది. తిలకించండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 3. బాగున్నదండీ.కథ వివరించినట్టు కాకుండా సంబోధనల్లోనే వివరణ కనిపిస్తూ విభిన్నంగా ఉన్నది.

  రిప్లయితొలగించండి
 4. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశనివారం, డిసెంబర్ 22, 2012 12:01:00 PM

  దండ మయా పండి తార్య! మీ కోదండ
  దండక నిబిడీకృత సుమ దండ
  రామ కథను చదువ రమ్యమై యుప్పొంగె
  మాహృదయము లెంత మధుర గతిని.

  రిప్లయితొలగించండి
 5. శ్రీ గురువులకు ప్రణామములు!

  ఈ నాటి మీ దండక లఘుకావ్యం సహృదయమనోభిరామంగా విరాజిల్లుతున్నది. భక్తిబంధురంగా ఉన్నది.

  శ్రీరామచంద్రుండు కారుణ్యవారాశి
  కౌసల్య చల్లని కడుపు పంట
  శ్రీరామచంద్రుండు ఘోరాసురారాతి
  గాధేయ సవనరక్షాప్రణేత
  శ్రీరామచంద్రుండు సీతావధూమనో
  రాజీవపంజర రాజహంస
  శ్రీరామచంద్రుండు వీరాగ్రగణ్యుండు
  రావణ రిపు నిబర్హణవిధాత

  యనుచు సుశ్రావ్యపదగుంఫితాద్వితీయ
  రమ్యసోపానపంక్తుల గమ్యమాన
  మగుచు రామాయణార్థభాష్యంబు గాఁగ
  దండకముఁ గూర్చె నేమాని పండితుండు.

  విధేయుఁడు,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి

 6. రండు విన రామకథ యని
  దండకముగ వ్రాసి మనల ధన్యులఁ జేసెన్
  నిండు మనంబున మ్రొక్కెద
  పండిత నేమాని పాదపద్మమ్ములకున్.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  లక్ష్మీదేవి గారూ,
  ఏల్చూరి మురళీధర రావు గారూ,
  ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 7. అచ్చపు మదితో మిత్రులు
  మెచ్చిరి నా దండకమును మేలగు రీతిన్
  హెచ్చుగ వారికి దీవెన
  లిచ్చెద మంగళము లొంది యెసగెడు నటులన్

  రిప్లయితొలగించండి