5, డిసెంబర్ 2012, బుధవారం

సమస్యా పూరణం - 897 (భాగ్య నగరాన దిరుగ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
భాగ్య నగరాన దిరుగ వైరాగ్య మొదవు.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

15 కామెంట్‌లు:

  1. భద్రగిరి కేగుచో మది భక్తి పొంగు
    మానస సరోవరమ్మున జ్ఞాన మబ్బు
    భాగ్యనగరాన దిరుగ వైరాగ్య మొదవు
    కాశికాపురి జేర మోక్షంబు గలుగు

    రిప్లయితొలగించండి
  2. మూసి ప్రక్కన నడ వలె ముక్కు మూసి
    చిన్న వర్షంబుకే నీరు చేరి నిలచు
    మూసి లేనట్టి "మ్యాన్ హోల్సు" మూయు మనల
    భాగ్య నగరాన దిరుగ వైరాగ్య మొదవు.

    రిప్లయితొలగించండి
  3. ఇరుకు గల్లీలు వీధులు మరుగు దొడ్లు
    వాన కురిసెనా కావలె పడవలు పలు
    రోడ్డు దాటంగ ట్రాఫిక్కు గడ్డు చిక్కు
    భాగ్యనగరాన దిరుగ వైరాగ్య మొదవు

    రిప్లయితొలగించండి
  4. పుణ్య తీ ర్ధా ల కేగిన పుణ్య మబ్బు
    కాశి నగరాన దిరుగ మో క్షంబు గలుగు
    జంట నగరాల దిరిగిన జ్వరము వచ్చు
    భాగ్య నగరాన దిరుగ వై రాగ్య మొదవు .

    రిప్లయితొలగించండి
  5. మిత్రులారా! శుభాశీస్సులు.
    మన మహానగరము కదా అని అభిమానముతో ఎవరైన వ్రాస్తారేమో యని చూచేను. సరే నేనే మళ్ళీ పూనుకొనినాను.

    ఆంధ్ర ప్రదేశాని కదె రాజధానియై
    ....వేవెలుంగుల జిల్కు ఠీవి మెరయ
    భరత దేశమ్మున ప్రఖ్యాతి గాంచిన
    ....దైదవ దనుచు మహాపురముల
    విద్యాలయమ్ములు వైద్యశాలలు మహా
    ....వాణిజ్య సంస్థలు వరలుచుండు
    ఉన్నత భవనమ్ము లుద్యానవనములు
    ....నతి విశాల పథమ్ము లలరుచుండు
    తీర్చు కోర్కెలు పూర్తిగా దృప్తి గూర్చు
    నన్ని విధముల సౌఖ్యమ్ము లలరుచుండ
    జ్ఞాన మలరారు జనులకు శాంతి గలుగు
    భాగ్యనగరాన దిరుగ వైరాగ్యమొదవు

    రిప్లయితొలగించండి
  6. రాష్ట్ర రాజధాని మిగుల రమ్యమయిన
    నగరమగునట్లు జేయ మనమును శ్రద్ధ
    జూపవలదె? యటులకానిచో నిజముగ
    భాగ్య నగరాన దిరుగ వైరాగ్య మొదవు.

    రిప్లయితొలగించండి
  7. విజయవాడలోన వసించిన జయముగల్గు
    రాజమండ్రిలో తిరుగాడ వ్రాత మారు
    మూలపాడులోముష్ఠెత్త ముద్ద దొరకు
    వలదు వలదన్న మనకిక భాగ్యనగర
    వాసమెంత గడించిన వట్టి పోవు
    బ్రతుకుబండినిలాగుట భారమగును
    భాగ్య నగరాన దిరుగ వైరాగ్య మొదవు!

    రిప్లయితొలగించండి
  8. సర్వ కాలుష్యముల తోడ చతికిలబడి,
    యువత మాదక ద్రవ్యాల నొదుగు చుండి,
    నుగ్ర వాద విలాసమై యొప్పు చుండు
    భాగ్యనగరాన దిరుగ వైరాగ్య మొదవు!

    రిప్లయితొలగించండి
  9. ఒకడు భోగలాలస నొందు నూరు విడచి
    భాగ్య నగరాన దిరుగ ; వైరాగ్య మొదవు
    నొక్కడికి నదే నగరాన నుండి పోవ ;
    నునుపు దూరపు కొండలు వినుము మనుజ !

    రిప్లయితొలగించండి
  10. భాగ మతిపేర విలసిల్లు భాగ్య మనగ
    రత్న రాసుల నిలయమ్ము రాచ నగరు
    సకల భోగము లన్నియు వికల మయ్యె
    భాగ్య నగరాన దిరుగ వైరాగ్య మొదవు !

    రిప్లయితొలగించండి
  11. శంకరమఠ మందిప్పుడు స్వామి యైన
    భారతీ తీర్థ వేంచేసి ప్రవచనముల
    మోక్షమార్గము దెలుపుచు బ్రోచు జనుల ;
    భాగ్య నగరాన దిరుగ వైరాగ్య మొదవు

    రిప్లయితొలగించండి
  12. అక్కునం జేర్చుకొని తగ నాశ్రయమిడు
    భాగ్య నగరి ననంత సౌభాగ్య మొంది,
    భాగ్య నగరినే చులకన పరచు వారు
    భాగ్య నగరాన దిరుగ - వైరాగ్య మొదవు!

    రిప్లయితొలగించండి
  13. నేమాని గారు!
    "ప్రదేశానికి" - వ్యావహారిక రూపం.
    "ప్రదేశానకు" (= "ప్రదేశమునకు") - సాధు రూపం.
    "స్వర్గానకు భూమి నుండి రస గంగలు చిమ్మెద" - దాశరథి గారి ప్రయోగం.
    గమనించ గలరు!

    రిప్లయితొలగించండి
  14. తెలుగ దనముట్టి పడనట్టి తీరు గనిన
    మోసకారుల 'ఆటోల' మూట్ట జూడ
    నగరమున పారు దుర్గంధ నదిని గాంచ
    భాగ్య నగరాన దిరుగ వైరాగ్య మొదవు .

    రిప్లయితొలగించండి