25, డిసెంబర్ 2012, మంగళవారం

పద్య రచన - 201

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

21 కామెంట్‌లు:

  1. నా కృతి శ్రీగిరి మల్లికార్జున శతకమునుండి:

    ఓమ్మను నాద మాద్యముగ నో పరమేశ! నమశ్శివాయ మం
    త్రమ్ము సమస్త పాపహరణమ్ము భవాంబుధి తారణమ్ము ని
    త్యమ్ము జపింతు భక్తి మెయి ధ్యానము నందున నొప్పు నీదు త
    త్త్వమ్ము శుభప్రదమ్ము ప్రమథస్తుత! శ్రీగిరి మల్లికార్జునా!

    సురనది కేశపాశమున సొంపుగ నూగిస లాడగా సుధా
    కరుడు చలించు చుండగ ధగద్ధగ దీప్తుల జిమ్ముచుండి, కం
    ధరమున నాడుచుండ ఫణి తాండవకేళి నొనర్చునట్టి సుం
    దర నటరాజ! నిన్ గొలిచెదన్ మది శ్రీగిరి మల్లికార్జునా!

    భారతి వీణ మీటి కలుపన్ శ్రుతి తాళము గూర్ప బ్రహ్మ పా
    కారి యొనర్ప వేణురవ మచ్యుతు డింపుగ మ్రోయ మద్దెలన్
    గౌరిని గూడి తాండవము కన్నుల విందుగ జేసితయ్య దై
    త్యారి గణార్చితా! కొలిచెదన్ నిను శ్రీగిరి మల్లికార్జునా!

    రిప్లయితొలగించండి
  2. మల్లి కార్జును డక్కడ మంది గూడి
    నాట్య మొనరించు చుండగ నయన పర్వ
    మయ్యె జూడుడు మీ రును నార్యు లార!
    సకల శుభములు గలిగించు సర్ప ధరుని

    రిప్లయితొలగించండి
  3. భక్తవశులై త్రిమూర్తులు పరవశమున
    మునులు కీర్తించ నాట్యాన మునిగి రచట
    దైవ మానంద పడినంత జీవులకిట
    సర్వ శుభములు యొనగూడి శాంతి గూర్చు

    రిప్లయితొలగించండి
  4. బిందు రూపిణి పరి పూర్ణ యిందు వదన
    సృష్టి, పాలన, లయకారు లిష్ట బడుచు
    తిరుగు చుందురు నీ చుట్టు తేజ మలర
    అణువు లోపల నున్నట్టి యమరిక వలె.

    రిప్లయితొలగించండి
  5. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మమంగళవారం, డిసెంబర్ 25, 2012 2:50:00 PM

    సదా శివుండు తాండవంబు సల్పనంబ ముంగిటన్
    ముదావహంబుతోడ విష్ణుమూర్తి మద్దెలందగన్
    పదాల ధాతతాళమేయ వాణివీణ మీటగన్
    పదేపదిన్ గజాననుండు పాటపాడు చుండగన్.

    రిప్లయితొలగించండి
  6. సాయంసంధ్యను వెండికొండ విడిదిన్ సర్వేశ్వరుం డల్లదే
    మ్రోయింపంగ మృదంగమున్ హరి! శ్రుతిన్ మోదమ్మునన్
    వాణియే
    చేయన్! తాళము వేయ బ్రహ్మ! ప్రమథుల్ చిందింపగా నవ్వులన్!
    వేయన్ చిందు సుతుండు విఘ్నపతి! దేవిన్ గూడి నర్తిం చెడిన్!

    రిప్లయితొలగించండి
  7. మిత్రుల పద్యములన్ని చాలా బాగుగ నున్నవి. ఈరోజు ఒక పంచచామరము ఒక శార్దూలము కూడా సముత్సాహముతో దర్శనము నిచ్చినవి. అందరికీ శుభాశీస్సులు. అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. నేమాని పండితార్యా! ధన్యవాదములు.
    మరొక ప్రయత్నం:

    వేయన్ శీర్షముపైన గంగ యురకల్ భీతిల్లి! నాగేంద్రముల్
    ఓయమ్మో యని జారి క్రింద పడ! బాబోయంచు రేవెల్గు నా
    కాయుష్షిం తటితో సమాప్తమని క్షీణాభంబుతో క్రాలగా!
    సాయంతాండవ మాడె శంభుడదె! రోషావిష్టుడై చూడరే!

    రిప్లయితొలగించండి
  9. దేవతలెల్లరాడుచును ధింధిమి యంచును నాట్యమాడుటన్
    భావన జేసి యొక్కడిట బాగుగ చిత్తరువిందు వ్రాయగా
    కావగ నెప్పుడున్ కదలి కష్టము దీర్చగ వచ్చి వారలే
    దీవనలెల్ల కొల్లలుగ తిన్నగ నాతని కిచ్చిపోవరే!

    రిప్లయితొలగించండి
  10. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మమంగళవారం, డిసెంబర్ 25, 2012 7:22:00 PM

    నేమాని పండితార్యా! నమస్సులు.40 సం.ల కోరిక ఈరొజు తీరినది శంకరయ్య మాష్టారి దయవలన.ఇది నా ప్రథమ ప్రయత్నము.మీ ఆశీస్సులు పొందుట నా అదృష్టము.

    రిప్లయితొలగించండి
  11. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మమంగళవారం, డిసెంబర్ 25, 2012 7:35:00 PM

    మరచితిని. దీనిపై ఒక భజన కీర్తన ఉన్నది.77,78 సం. లలొ నేను మానేపల్లి హైస్కూలులొ పనిచేసేటప్పుడు విన్నాను.
    శివుడాను దినమున తాండవ మాడును
    జగదాంబ ముందట
    .....లన్నియు జవజవ లాడగ.

    హరే రాణి ఉప్పాంగం పూరింపన్..
    ఇలా సాగుతుంది. చాల బాగుంటుంది. మిత్రులెవరి వద్ద నున్న తెలుపగలరు.

    రిప్లయితొలగించండి
  12. అయ్యా శ్రీ తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారు! శుభాశీస్సులు.

    శివుడు తాండవము చేసేనమ్మా! అనే పాట నేను విన్నదే. అంతర్జాలములో వెదికితే దొరకవచ్చు. చిన్న మాట. జగదాంబ అనుట సాధువు కాదు. జగత్ + అంబ = జగదంబ అనాలి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. శ్రీకరంబగు సర్వలోకంబునన్ చిత్ప్ర
    భాకరంబై యొప్పు ప్రాంతమందు
    బహువిధ పరిమళభర పుష్పమయ లతా
    పాదపాన్విత దివ్య వనమునందు
    కమనీయ కల్ప వృక్షఛ్ఛాయలో రత్న
    సింహాసనమున నాసీనయైన
    అఖిలాండకోటి బ్రహ్మాండాధినేత్రియౌ
    శ్రీమాతృ దేవతా సేవలోన
    ఆదరమ్మున వివిధ విన్యాసములను
    సకల దేవబృందంబులు సలుపుచుండి
    రా మహావైభవము కనులార గనిన
    యట్టి సుజనుల జన్మ ధన్యమ్ము సుమ్ము

    ఆనంద సాంద్రుడై యమర సంసేవ్యుడై
    తాండవమ్మొనరింప త్ర్యంబకుండు
    తద్ధిమి తకిటతై తద్ధిమి తకిటతై
    తద్ధిమి తద్ధిమి తకిట తకిట
    పదము లేర్పడ చాల పరవశమ్మున దేలి
    సోమేశ్వరుండతి సుందరుండు
    అతి విశాలంబైన ఆ వ్యోమకేశుని
    జడలలో నలరారు జహ్ను కన్య
    మెరయుచుండ ధగద్ధగద్ధల్ మించురీతి
    నమృతభానుండునున్ గదలాడు చుండ
    ధాళధాళ్యంబు దిశలెల్ల తనరజేయ
    నీలకంధర తాండవకేళి యలరె

    సరిగమపదని సుస్వర సమన్వితముగ
    కలగాన మొనరింప కరిముఖుండు
    కఛ్ఛపీ శ్రుతిగొల్పగా భారతీదేవి
    రాజీవసూతి తాళమ్ము గూర్ప
    మధుకైటభారాతి మద్దెల మ్రోయింప
    వేణునాదమొనర్ప విబుధనేత
    నందీశ్వరుండును నాగాధిపుండును
    వనమయూరమును తత్పరత చెంద
    హాయిగూర్చు సాయం సమయమ్మునందు
    దివ్యతేజంబు నింపుచు దిక్కులందు
    డమరుకను బూని శివుడు తాండవమొనర్చె
    నఖిల లోకాల కమిత సౌఖ్యమ్ము గూర్చె

    రిప్లయితొలగించండి
  14. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మమంగళవారం, డిసెంబర్ 25, 2012 9:13:00 PM

    శివతాండవ దృశ్యము కనులకు కట్టినట్లు చూపిన దృగ్దర్శక పండితులవారికి నమస్సులు. మీసూచన ప్రకారం వెదికెదను.

    రిప్లయితొలగించండి
  15. అయ్యా! మిస్సన్న గారూ!
    శుభాశీస్సులు.

    శివు డానందముతో తాం
    డవ మొనరించిన విధమ్ము నయముగ వ్రాయన్
    ప్రవహించును కవితా ఝరి
    ఠవ ఠవ లేకుండ బళి హుటాహుట నడలన్

    రిప్లయితొలగించండి



  16. వీణ వాయించుచుండగ వాణి,హరిమృ
    దంగమున ననుసరింపగ ,దగినరీతి
    మురళినూదగ సురపతి మోదమలర
    దివ్య తాండవలీల నర్తించు శివుని
    హర్షపులకితయై కాంచె నద్రితనయ.

    రిప్లయితొలగించండి
  17. ఈనాటి పద్యరచనకు ఆ చిత్రాన్ని ఇస్తూ స్పందన ఎలా ఉంటుందో అని సందేహించిన మాట వాస్తవం. కానీ ఇన్ని అద్భుతమైన పద్యాలు వ్రాసి కవిమిత్రులు రంజింపచేస్తారని ఊహించలేదు. మహదానంగా ఉంది. వివిధ ఛందాలలో వైవిధ్యంగా పద్యాలను రచించి ఆనందింపజేసిన కవిమిత్రులు....
    పండిత నేమాని వారికి,
    సుబ్బారావు గారికి,
    సహదేవుడు గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    మిస్సన్న గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    అభినందనలు, ధన్యవాదములు.
    *
    సహదేవుడు గారూ,
    ‘శుభములు + ఒనగూడి’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘శుభములు ప్రాప్తించి’ అందామా?
    *
    మిస్సన్న గారూ,
    ‘నాగేంద్రముల్ ఓయమ్మా’ అని విసంధిగా వ్రాసారు. ‘నాగేంద్రులే యో యమ్మా’ అంటే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి
  18. వెండి కొండను సురలంత విడిది జేసి
    సంధ్య కాంతులు విరజిమ్ము శశి ధరుండు
    కనుల విందుగ ప్రకృతి కావ్య మలర
    ప్రమద గణముల నృత్యమ్ము భాసు రమ్ము !

    రిప్లయితొలగించండి