18, డిసెంబర్ 2012, మంగళవారం

పద్య రచన - 194

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

27 కామెంట్‌లు:

 1. కంబము గొట్టగ కశిపుడు
  అంబరమున నుండి యందె హరి నర హరిగా
  సంబర మందగ బుట్టెను
  సంబరమే బుట్టె నసుర చావు తెలివికిన్

  రిప్లయితొలగించండి
 2. నా కృతి శ్రీలక్ష్మీనరసింహ శతకమునుండి:

  సుతు ప్రహ్లాదుని చీరి దైత్యపతి నిన్ జూపింపుమంచున్ గదా
  హతి స్తంభంబును దాక వెల్వడితి వీవందుండి తీవ్రోజ్జ్వలా
  కృతితో తీక్ష్ణ భయంకరేక్షణల నగ్నిజ్వాలలన్ జిమ్ముచున్
  శ్రిత బృందావన తత్పరా! పరమ! లక్ష్మీ నారసింహ ప్రభూ!

  క్షితి కంపించెను దద్దరిల్లెను దిశల్ జీవుల్ భయభ్రాంతులై
  ధృతి గోల్పోయిరి నీ మహోగ్రతమ మూర్తిన్ గాంచి భీతిల్లియున్
  దితిజేశుం డెదిరింప నెంచి నిలిచెన్ తీక్ష్ణోగ్ర దృగ్జాలుడై
  శ్రిత బృందావన తత్పరా! పరమ! లక్ష్మీ నారసింహ ప్రభూ!

  శత కంఠీరవ కోటి గర్జనల ప్రాశస్త్యంబునున్ మించి హుం
  కృతులన్ జేయగ నా రవమ్మునకు దిగ్వీధుల్ ప్రకంపించె దే
  వత లెంతే భయమొంది తేరుకొని నిన్ ప్రార్థించి రుత్సాహులై
  శ్రిత బృందావన తత్పరా! పరమ! లక్ష్మీ నారసింహ ప్రభూ!

  గతమయ్యెన్ దితిజేంద్రనాథు బలమున్ గాంభీర్యమున్ ధైర్యమున్
  చితికెన్ స్థైర్యము వామహస్తమున వానిన్ బట్టి నీవీడ్వ సం
  స్తుతులన్ జేసిరి దేవతల్ మునులు సంతోషమ్ము పెంపారగన్
  శ్రిత బృందావన తత్పరా! పరమ! లక్ష్మీ నారసింహ ప్రభూ!

  అతి తీక్ష్ణాగ్ని శిఖేక్షణ జ్వలన భీతారాతివై విక్రమో
  న్నతి దీపింపగ బట్టి యీడ్చి దితిజున్ హాహాకృతుల్ సేయ చీ
  ల్చితి తీవ్రమ్ముగ గోళ్ళతో నుదరమున్ జేజేలు జేజే యనన్
  శ్రిత బృందావన తత్పరా! పరమ! లక్ష్మీ నారసింహ ప్రభూ!

  రిప్లయితొలగించండి
 3. అయ్యా,
  నరసింహస్వామి ఆవిర్భవించినప్పుడు వాతావరణం ఎట్లా ఉంటుందనుకుంటామో అట్లే సరిగ్గా వర్ణించారు.
  ఎంతో బాగున్నది.
  నా అజ్ఞానాన్ని మన్నించి, నాల్గో పద్యములో రెండవ పాదపు యతిని, జేజేలు జేజేలనన్ అనకుండా య ఉపయోగించటంలో అంతరార్థాన్ని దయచేసి బోధించమని ప్రార్థన.

  రిప్లయితొలగించండి
 4. నరహరి రూపము దాల్చిన
  హరిహరుడవు నీ వె నయ్య ! యదుకుల నాధా !
  హరియించి పాత కంబులు
  దరి నీ నన్ జేర్చు కొనుము దనుజ విరో ధీ !

  రిప్లయితొలగించండి
 5. అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
  మీ సందేహాలకు సమాధానము:

  1. యతి గురించి:
  ఒక పాదము చివరలో "న్" మొదలైన పొల్లులతో నున్న హల్లులను వాడినప్పుడు దాని తరువాతి పాదములోని తొలి యక్షరముతో కలియును:
  ఉదా: ధైర్యమున్ + చితికెన్ -- ధైర్యమున్చితికెన్ అని అవును కదా.
  న్చి కి యతిస్థానములో నిన్ తో యతి చెల్లును కదా.
  మీకు అర్థము అయినది అనుకొంటాను. ఆ విధముగానే పాదాంతములో ల్ కాని మరియే పొల్లు కాని ఉండిన యెడల దాని తరువాతి పాదములో యతి మైత్రికి సహాయకారి యగును.

  2. జేజేలు అనగా దేవతలు అని అర్థము. జేజే యనన్ అంటే జయ జయ ధ్వానములు చేయగా అని అర్థము.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 6. అయ్యా,
  దయతో వివరించినందుకు కృతజ్ఞతలు.
  జేజేలు అంటే దేవతలు ఉండవచ్చు అనే ఊహతో ఆంధ్రభారతి చూస్తే అట్లా లేకపోవడంతో అడిగినాను. ధన్యవాదములు.

  బాలుండైనను నమ్మిగొల్చెనని స్తంభమ్మిట్లహో ! చీల్చుచున్
  కాలుండోయన దైత్యుపాలిటికి భీకాకారమున్ దాల్చితే!
  పాలింపంగ సురాళిని వ్విధము నీవార్భావమున్ పొందగా
  కాలంబెల్ల నుతించినన్ పొసగు; సాకారమ్ము మోక్షమ్మికన్.

  రిప్లయితొలగించండి
 7. అమ్మా! లక్ష్మీ దేవిగారూ! శుభాశీస్సులు.
  మీ పద్యమునకు చేసిన ప్రయత్నము బాగున్నది.
  2వ పాదములో "భీకాకారము" బాగులేదు. భీకరాకారము అని ఉండాలి.
  3వ పాదములో "ఆవార్భావము" బాగులేదు. ఆవిర్భావము అని ఉండాలి.
  అందుచేత మరొక ప్రయత్నము చేస్తే బాగుంటుందేమో.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 8. మన్నించండి. సరిచూసుకోకుండా ప్రచురించాను.

  బాలుండైనను నమ్మిగొల్చెనని స్తంభమ్మిట్లహో ! చీల్చుచున్
  కాలుండోయన దైత్యుపాలిట, మహాకారమ్మునే దాల్చితే!
  పాలింపంగ సురాళిని వ్విధము దేవా, నారసింహా! నినున్
  కాలంబెల్ల నుతించినన్ పొసగు; సాకారమ్ము మోక్షమ్మికన్.

  రిప్లయితొలగించండి
 9. రారాచూపుమటంచురాక్షసజనారాధ్యుండు ముక్కోపియై
  వీరంగంబుసృజించి గర్వితమతిన్ భేదించగాస్థంబమున్
  పారావారదయాంతరంగుడు వెసన్ ప్రాగల్భ్యతేజంబునన్
  మారంకంబొనరించినిల్చెనరసింహస్వామిరూపంబుతోన్.

  రిప్లయితొలగించండి
 10. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మమంగళవారం, డిసెంబర్ 18, 2012 6:58:00 PM

  త్రిశతాబ్ది పారతం త్ర్యమును పా రగద్రోలి
  సాధించి యిచ్చెగా గాంధి ప్రజకు
  స్వాతంత్ర్యమ యినను నేతల రాతల
  మన తల రాతలు మార లేదు
  స్వార్ధ రాజకమున సాధించి నది సున్న
  పదవినంటగ పరి పాల నయగుటన్
  కాలాయసస్తంభ కరణిగ రాజకీ
  యంబులు పెరుగనా స్తంభ మడచి
  దుష్ట నికృష్ట చేష్టితులనెడి పాలక
  కనక కసిపు దునుమ కాన రార!
  నరహరీ!భవహర నారసింహా!మరి
  యొక్క సారి రమ్ము యోమహాత్మ.

  రిప్లయితొలగించండి
 11. నరసిం హుని యవతారము
  పరి మార్చ్రెను హిరణ్య కశిపుని పాప హరం బౌ !
  కరుణించగ ప్రహ్లాదుని
  తరియించెను హరి పదముల ధన్యత నొందన్ !

  రిప్లయితొలగించండి
 12. పండిత నేమాని వారూ,
  మీ ‘శ్రీలక్ష్మీనరసింహ శతకము’ నుండి పంచరత్నాలు చదివి ధన్యడనయ్యాను. మొత్తం శతకం ఎంత రసవత్తరంగా ఉందో కదా! పద్యరచనా కళకు లక్ష్యాలుగా ఉన్న మీ పద్యాల వల్ల ఎంతో నేర్చుకుంటున్నాము. ‘శ్రిత విద్యార్థిని నేను, మీ కవితకున్ జేజే యందు సద్భక్తితోన్’
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘దరి నీ నన్ జేర్చు’ అనడంలో కొద్దిగా అన్వయక్లేశం ఉంది. ‘దరికిన్ నన్ జేర్చు..’ అందామా?
  *
  లక్ష్మీదేవి గారూ,
  సవరించిన పద్యం చాలా బాగుంది. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  స్తంభము టైపాటు వల్ల స్థంబము అయినట్టుంది. ‘మారంకంబు’...?
  *
  తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
  మీ ప్రయత్నం ప్రశంసనీయం. అభినందనలు.
  1,7,8 పాదాల్లో యతిదోషం. 6,9 పాదాల్లో గణదోషం.
  ‘కాయసస్తంభ’ అర్థం కాలేదు. ‘కశ్యపుడు’ను ‘కసిపుడు’ అనరాదు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ ప్రయత్నం ప్రశంసింప దగినది.
  కానీ రెండవ పాదంలో గణదోషం ఉంది. ‘కశిపుడు’ అనరాదు. అన్వయదోషం కూడా ఉంది.

  రిప్లయితొలగించండి
 13. భక్తుని గావగ వానికి
  ముక్తి నొసగ నవతరించె పురుషోత్తముడే !
  యుక్తిన జంపెను కశిపుని ;
  భక్తియె ముక్తి పథమునకు ప్రారంభమ్మౌ !

  రిప్లయితొలగించండి
 14. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ‘రామజోగి’ యైన నేమాని వారికన్నా ముందున్న ‘హనుమ’ను గమనించలేదు. మన్నించాలి.
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  కానీ ‘కశిపుడు’ అనరాదని పండితులు చెప్తారు. దానికి బదులు ‘దనుజుం/డంబరమున’ అందాం. ‘అసుర చావు’ను ‘అసురు చావు’ అనండి.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘కశిపుడు’కు బదులు ‘దనుజుడు’ అందాం. ‘యుక్తిన’
  కంటే ‘యుక్తిని’ అనడం బాగుంటుంది.

  రిప్లయితొలగించండి
 15. అయ్యా! శ్రీ శంకరయ్య గారు/శ్రీ తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారు!
  శుభాశీస్సులు.

  హిరణ్యకశిపుడు లేక కనకకశిపుడు అనుటే సాధువు. బంగారు శయ్య కలవాడు అని అర్థము.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 16. పండిత నేమాని వారూ,
  నా అజ్ఞానాన్ని మన్నించండి. ఏ ఆలోచనల్లో ఉన్నానో... నేనే పొరబడ్డాను.
  *
  తోపెల్లి వారూ,
  రాజేశ్వరి అక్కయ్యా,
  గోలి వారూ,
  రవీందర్ గారూ,
  మన్నించండి. మీ ప్రయోగమే సరియైనది. ‘కశిపు’డనేదే సాధువు.

  రిప్లయితొలగించండి
 17. మిత్రులారా! శుభాశీస్సులు.
  నేను రచించిన శ్రీ లక్ష్మీ నరసింహ శతకమునకు అభిప్రాయము వ్రాసిన శ్రీ (డా.) కొల్లూరు అవతార శర్మ గారు ఇచ్చిన వివరణ ప్రకారము హిరణ్యకశిపుడు అంటే బంగారు శయ్య కలవాడు అని అర్థము. నేను శబ్ద రత్నాకరమును చూచేను -- అందులో కశిపువు శబ్దము కలదు - దానికి ఇచ్చిన అర్థములు: 1. అన్నము, 2. వస్త్రము, 3. అన్నవస్త్రములు, 4. పఱపు. అందుచేత హిరణ్యకశిపుడు అనే ప్రయోగము సాధువేనని నా నమ్మకము. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 18. నేమాని గురువర్యులకు వందనములు. అభినందనలు. మీ పద్యాలు చదువుతుంటే మాకు కనుల ముందు 'నారసింహావతార ఘట్టము ' మరోసారి ఆవిష్కృతమై ధన్యులమైనాము.

  గురువుగారూ! మీరే నేనొక మారు 'కశ్యపుడు ' అని ఉపయోగించితే ' కశిపుడు' అని అనాలన్నారు. మీరు సూచించినట్టు ' యుక్తిని ' అనడం బాగుంది. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 19. అసహజంబగు వరమున నమరుడవగ
  నా హిరణ్య కశిపుడట నాశ పడగ
  పుట్ట గిట్టకఁ దప్పదు పుడమి ననగ
  నార సింహుడై జంపెను శౌరి తానె!

  రిప్లయితొలగించండి
 20. గురువుగారికి నమస్కారములు

  మారంకము అంటే చంపటము, కొట్టటము అని అనుకున్నాను. మీరు సందేహము వెలిబుచ్చిన తరువాత అంధ్రభారతి నిఘంటువులో చూస్తే ఎదిరించు అని ఉన్నది.

  భావము రీత్యా ఈ పదము సరిపోతుందో లేదో తెలుపవలసినదిగా ప్రార్థన.

  రిప్లయితొలగించండి
 21. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మమంగళవారం, డిసెంబర్ 18, 2012 10:10:00 PM

  పెద్దలందరికి నమస్సులు. మిత్రులందరి పూరణలు చాల ఉత్తేజ జనకముగా యున్నవి.నాహృదయపూర్వకాభినందనలు.
  పండిత నేమాని వారి పేరున యోగులకు యోగి "రామజోగి" యుండుట ఇప్పుడే గమనించితిని. మత్పితాగ్రజుల నామధేయము గూడ "రామజోగి శర్మ".గనుక నేమాని వారు పుత్రవాత్సల్యము జూపి నా దొసగులను తెల్పుచు నన్ను కృతార్ధిని జేయ ప్రార్ధన.

  శంకరయ్య మాష్టారుకు శతాధిక వందనములు.
  1 పా. త్రి లోని రేఫకు త్ర్య నందలి రేఫకు ఇ కార ధ్వనిచే యతి చెల్లినదని
  7 పా. కాలాయసన లోని "కా" కును కరణి నందలి "క" కును యతి చెల్లినదని
  8 పా. ప్రాసాక్షరం "ంబు" కును సంభ లోని "భ" కును యతి చెల్లినదని
  భావించి వ్రాసినాను.
  6వ. పా. సగణమే అయ్యింది గాని సలం కాలేదు దోషమే.
  9వ పా. సూ.గ. బదులు జ.గ. పడింది.దోషమే.
  యతులపై వివరణ యిచ్చుచు నా మతిని బాగుచేయ ప్రార్ధన.

  రిప్లయితొలగించండి
 22. స్తంభమునుండి వెల్వడె విశాలగుహాంతరభీకరాస్యుడై
  డింభకు బ్రోవ జిత్రమగు దివ్యమహత్తర ఘోరరూప సం
  స్తంభితలోక దేహమును దాలిచి శ్రీహరి దానవేంద్రునిన్
  జృంభణతో వధింపగను జ్వాలలు గ్రక్కుచు నారసింహుడై.

  రిప్లయితొలగించండి
 23. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మమంగళవారం, డిసెంబర్ 18, 2012 10:16:00 PM

  అన్నట్లు మరచితిని మాష్టారూ!
  కాలాయసము అనగా ఇనుము అని ఆంధ్రభారతోవాచ.
  దానికి భారత రాజకీయ వ్యవస్థ అభేద్యమైన ఇనుపస్తంభం లా మారినదని భావించుచూ
  "కాలాయస స్తంభ"మని ప్రయోగించినాను. ప్రయోగ "సాధు - అసాధు " వివరణ తో నన్ను నేను సవరించుకుంటాను.
  నమస్కారములతో

  రిప్లయితొలగించండి
 24. ' కశిపుడు ' అనడమే సరి ఐనది.పోతనగారి భాగవతంలో ప్రహ్లాదచరిత్రని ఒకసారి చూస్తే అనుమానం తీరిపోతుంది.

  రిప్లయితొలగించండి
 25. నమస్కారములు.
  శ్రీ పండితుల వారి చేతుల మీదుగా వారి భక్తి రసామృత మైన నృసిం హ శతకము నేను పొంద గలగడం నా అదృష్టం .వారి శతకం నావద్ద ఉన్నది.శ్రీ పండితుల వారికి ధన్య వాదములు

  రిప్లయితొలగించండి
 26. నేమాని పండితార్యా! ధన్యులము. నారసింహుని కళ్ల ముందుంచారు.

  రిప్లయితొలగించండి