19, డిసెంబర్ 2012, బుధవారం

సమస్యా పూరణం - 911 (మువ్వలు గువ్వలై మొలచె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
మువ్వలు గువ్వలై మొలచె మోదము మోహన రాగ మయ్యెడిన్.
ఆకాశవాణి సౌజన్యంతో ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

27 కామెంట్‌లు:

 1. సవ్వడి లేక జూచిరట 'శారద' నాట్యము పూర్తి గాగనే
  సవ్వడి జేసి భేషులనె చప్పటులప్పుడు మారు మ్రోగగా
  రివ్వున మానసంబెగసె రెక్కలు వచ్చెను సంతసంబుతో
  మువ్వలు గువ్వలై మొలచె మోదము మోహన రాగ మయ్యెడిన్

  రిప్లయితొలగించండి
 2. కవ్వము ద్రిప్పుచుండ శుభగాత్రి యశోద, ముకుందు డొప్పుగా
  నవ్వుల నీనుచున్ సరస నాట్యము చేయదొడంగె నంతనా
  సవ్వడి రక్తి గూర్చె నరుసమ్మున కృష్ణుని కాలి గజ్జెలున్
  మువ్వలు గువ్వలై మొలచె మోదము మోహనరాగ మయ్యెడిన్

  రిప్లయితొలగించండి
 3. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారి రసనాగ్రముపై శారద నిత్యము నాట్యము చేస్తూనే యున్నది. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 4. శ్రీ పండిత నేమాని గారికి నమస్కారములు.ఆర్యా ! మీ ఆశీస్సులు ప్రసంసలే మాకు కొండంత బలము.

  రిప్లయితొలగించండి
 5. అవ్వన సీమ మధ్యమున నా మురళీ ధరుడల్ల ప్రేమపుం
  బువ్వను బెట్టి రాధికను ముగ్ధ మనోహర లాలనమ్ములన్
  పువ్విలుకాని క్రీడలను ముంచగ ప్రేయసి కాలి యందియల్
  మువ్వలు గువ్వలై మొలచె మోదము మోహన రాగ మయ్యెడిన్.

  రిప్లయితొలగించండి
 6. మిస్సన్న గారూ ! ప్రేమపుంబువ్వ చాలా రుచిగా ఉన్నదండీ...

  రిప్లయితొలగించండి
 7. గోలి వారూ ధన్యవాదాలు. మీ సవ్వడి వీనుల విందుగా లేదూ?

  రిప్లయితొలగించండి
 8. అయ్యా! శ్రీ తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ! శుభాశీస్సులు.

  మీరు నిన్న వ్రాసిన పద్యమును గురించి కొన్ని సూచనలు:

  1. "త్రి"కి "త్ర్య"కి యతి మైత్రి కుదురదు. యతి మైత్రి హల్లులతో బాటు ఆ హల్లులపై నున్న అచ్చులకి కూడ చెల్లవలెను. "ఇ"కారమునకు "అ" కారమునకు యతి కుదరదు కదా.

  2. సాధించి - గాంధి లకు ప్రాసయతి కుదురదు. గాంధిలో అనుస్వారముతో కూడిన ధ కలదు. సాధించిలో ధికి ముందు అనుస్వారము లేదు కదా.

  3. 3వ పాదము చివరలో గణములు సరిగా వేయలేదు.

  4. యంబులు - స్తంభము లకు ప్రాసయతి చెల్లదు.

  5. రమ్ము యో మహాత్మ! - ఇక్కడ యడాగమము రాదు అందుచేత రమ్మోమహాత్మ! అని ఉకార సంధి చేయవలెను.

  కాబట్టి నా సలహా : మీరు ఛందస్సును గురించి వ్యాకరణ సూత్రములను గురించి (ముఖ్యముగా తెలుగు సంస్కృత సంధులు) గురించి బాగుగ అభ్యాసములను చేయండి. అటులనే నిత్యము భారతము భాగవతము (పద్య కావ్యము) లను చదవండి. మహకవుల కావ్యములలో ప్రాస, యతి, సమాసములు మొదలైన విషయములను నిత్యము పరిశీలించుచు మీ భాషా వైదుష్యమును పెంచుకొనండి. మేము అప్పుడప్పుడు తగు సూచనలను ఈయగలము. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 9. ఇవ్వని తీరునన్ తనువ దెల్ల వసంతుఁడు పూనె, నమ్మవే
  జవ్వని! నాఁడు నా ప్రియుఁడు చక్కని వాఁడు,మనోహరమ్ముగా
  నవ్వులు రువ్వుచున్ భువికి నాకము దించుచు, నన్ను చేరగా,
  మువ్వలు గువ్వలై మొలచె మోదము మోహన రాగ మయ్యెడిన్.

  రిప్లయితొలగించండి
 10. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మబుధవారం, డిసెంబర్ 19, 2012 1:06:00 PM

  కావ్యము “శంకరాభరణ” కారణ చిత్రము “విశ్వనాధు”డే
  దివ్యత నిచ్చెగా తెనుగు తేజము నల్గడ లుజ్జ్వరిల్లగన్
  భవ్యత నిచ్చుచున్ మనకు భాగ్యము గల్గగ జేయ నాహృద్
  మువ్వలుగువ్వలైమొలచెమోదముమోహన రాగమయ్యెడిన్.

  రిప్లయితొలగించండి
 11. ఆలమందలను మేపుటకు పచ్చిక బయళ్లకు తీసుకువెళ్లిన పిదప - కాసేపటిలో తిరిగి ఇళ్ళకు బయలుదేరే సమయం లో -

  జివ్వున సోకగాన్ జెవులఁ చిన్నిముకుందునివేణుగానమే
  యెవ్వరు తామనన్ మరచి హేలఁసఖుల్ తగు చిందులేయగన్
  దవ్వున యున్నగోవులవి దగ్గరఁజేరగ పర్వుచుండ,లే
  జవ్వని బృందమాతురతఁ స్వామిని జేరియె నాట్యమాడగాఁ
  మువ్వలు గువ్వలై మొలచె మోదము మోహన రాగ మయ్యెడిన్

  రిప్లయితొలగించండి
 12. పువ్వుల తోటలోన నొక పుత్తడి బొమ్మ మనోహరమ్ముగా
  నవ్వుచు గోయుచుండగను నవ్య సుమంబుల నంతలోన యా
  జవ్వని చెంత జేరిన రసజ్ఞుని మోహన రూపునిన్ గనన్
  మువ్వలు గువ్వలై మొలచె మోదము మోహన రాగ మయ్యెడిన్.

  రిప్లయితొలగించండి
 13. ఇవ్వనసీమలో,సఖియ ,యీ మధుయామిని చాంద్రి వేళలో,
  సవ్వడి యేమదో వినుమ,చక్కని గోపకుమారుడెవ్వడో
  క్రొవ్వలపున్ దలంపు మది గోరికలూరగ,నూదె వేణువున్,
  మువ్వలు గువ్వలైమొలచె మోదము మోహనరాగ మయ్యెడిన్.

  శంకరార్యా,సమస్య లో ''గువ్వలైమొలచె '' అనేందుకుబదులు ''గువ్వలై యెగసె '' అంటే ఇంకా బాగుంటుందేమో కదా.
  ఎప్పటివలెనే సంకలినిలో సమస్యాపూరణ చేద్దామంటే Malware ahead అని హెచ్చరికవచ్చి ఆపేసింది.దీనికి పరిష్కారమేమిటి?

  రిప్లయితొలగించండి
 14. జవ్వని కాలియందె లట సవ్వడి చేయగ ఘల్లుమంచు లే
  నవ్వులు మోమునన్ విరియ నామెకు దోచెను హావభావముల్
  అవ్వనజాక్షి నర్తనము నత్తఱి సేయగ చూడగన్ బళా !
  మువ్వలు గువ్వలై మొలిచె మోదము మోహన రాగమయ్యెడిన్.

  రిప్లయితొలగించండి
 15. జవ్వని వాలు చూపులకు జాబిలి యందము చిన్న బోవగా
  నవ్వులు రువ్వుచున్ పలుకు నాసతి మోమున వెల్గులన్ గనన్
  సవ్వడి జేయ కుండ దరి సాహస మొందుచు జేరి నంతనే
  మువ్వలు గువ్వలై మొలచె మోదము మోహన రాగ మయ్యెడిన్

  రిప్లయితొలగించండి
 16. మిత్రులారా!
  నా రచనలు (1) శ్రీమదధ్యాత్మ రామాయణము (పద్యకావ్యము) ను మరియును (2) శ్రీ లక్ష్మీ నరసింహ శతకమును ఆసక్తిగల వారికి ఉచితముగా పోస్టులో పంపుతాను. నాకు మీ మీ చిరునామాలను తెలియజేయండి: స్వస్తి.
  N.R.Sanyasi Rao, HIG 33, Flat No.203,
  Navya's Vijay Heights,
  Marripalem Vuda Lay out.
  Visakhapatnam 530 009.

  రిప్లయితొలగించండి
 17. కాళియమర్దనము.........

  నవ్వుచునాల్గుదిక్కులననాయసమున్ఁ దిరుగాడుచుండి యా
  దవ్వునపారుచుండిననదంబునకేగి విలాసచిత్తమున్
  నవ్వులుమోముతోటియదునందనుడాడగ కాలిగజ్జలున్
  మువ్వలు గువ్వలై మొలచె మోదము మోహనరాగమయ్యెడిన్.

  రిప్లయితొలగించండి
 18. తమ తమ పూరణలలో మోహన రాగాన్ని పలికిస్తూ మంచి పద్యాలను అందించిన....
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  పండిత నేమాని వారికి,
  మిస్సన్న గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
  రామకృష్ణ గారూ,
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  కమనీయం గారూ,
  నాగరాజు రవీందర్ గారూ,
  రాజేశ్వరి అక్కయ్య గారికి,
  సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
  అభినందనలు, ధన్యవాదములు.
  *
  తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
  మూడవ పాదాంతంలో గణదోషం. ‘కల్గగ నా మనమ్ములో’ అందాం.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  ‘అంతలోన యా’ అని యడాగమం రాదు. ‘అంతలోన నా’ అవుతుంది.
  *
  కమనీయం గారూ,
  ‘గువ్వలై యెగసె’ చక్కని సూచన. ధన్యవాదములు.
  ఇక ‘సంకలిని’లో పూరణ చేయడమేమిటో అర్థం కాలేదు. మాల్ వేర్ అంటే ఏమిటో చెప్పగలిగే సాంకేతిక పరిజ్ఞానం నాకు లేదు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  దయచేసి పదాల మధ్య వ్యవధానం (స్పేస్) ఇవ్వండి.

  రిప్లయితొలగించండి
 19. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మబుధవారం, డిసెంబర్ 19, 2012 10:07:00 PM

  పండితార్యా! నమస్సులు.మీరిచ్చిన సూచనలు ప్రారంభించినాను౤ ఇంతక్రితమే సులక్షణసారం సలక్షణంగా అంతర్జాలంనుండి దిగుమతి చేసికున్నాము. నాచిరునామా
  తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ, సీనియరు అసిస్టెంటు, మండల ప్రజా పరిషత్తు, కరప, తూర్పుగోదావరి జిల్లా లేదా మం.ప్ర.ప. ప్రా.పాఠశాల వెనుక, మాధపట్నం, కాకినాడ-5.
  తమ రచనలు వీలఇనచో పంప గోర్తాను లేదా నేను వైజాగ్ వచ్చినపుడు తమ రచనలు ఆశీర్వచనములు తీసికుందును.

  రిప్లయితొలగించండి
 20. కమనీయం గారూ! నమస్కారములు. మాల్ వేర్ అనునది ఒక రకమైన వైరస్. ఒకవేళ ఇది మీ కంప్యూటర్ లోకి వచ్చిచేరిందేమో తెలియదు. కనుక మీరు malwarebytes anti-malware అను సాఫ్ట్ వేర్ ను డౌన్ లోడ్ చేసికొని దానిని ' రన్ ' చేసి మీ కంప్యూటర్ని ఒకమారు పూర్తిగా స్కాన్ చేసి చూడండి. దానివల్ల వైరస్ లన్నీ తొలగించబడతాయి.

  రిప్లయితొలగించండి
 21. నాగరాజు రవీందర్ గారూ,నమస్తే,మీ సూచనకు ధన్యవాదాలు.అమలుపరచి చూస్తాను.

  రిప్లయితొలగించండి
 22. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  శీర్ణమేఖల :

  కర్ణునితో చదరంగ మాడుతున్న భానుమతి సుయోధనుని రాక చూచి
  లేవబోగా, రారాజును గమనించని కర్ణుడు ఆగమని వడ్డాణం పట్టుకుంటే
  అది తెగి మువ్వలన్నీ నేలపై చిందర వందరౌతాయి !

  అన్యథా భావించని రారాజు ,
  నవ్వుతూ మువ్వలను ఏరడానికి సమాయత్తమవ్వడం
  చూచిన భానుమతి మది నిజంగానే మోహనరాగ మౌతుంది :

  01)
  _________________________________________

  రివ్వున రాజదే వెడల - లేచెను రాణియె , స్వాగతింపగన్
  చివ్వున లాగ, సూతుడట - చిందెను మేఖల మువ్వలా తరిన్
  నవ్వుచు వారితో గలసి - నమ్రత నేరగ సాగ రాజదే
  మువ్వలు గువ్వలై మొలచె - మోదము మోహన రాగ మయ్యెడిన్ !
  _________________________________________
  రాణి = భానుమతి
  సూతుడు = సూతపుత్రుడైన కర్ణుడు
  రాజు = రారాజు(సుయోధనుడు)

  రిప్లయితొలగించండి
 23. గురువుగారు గమనించి ఉండరు. సుబ్రహ్మణ్య శర్మ గారు ప్రాస నిమయాన్ని పాటించ లేదు. చెప్పక పోతే అది సరైనదే అనుకొంటారేమో అని..........

  రిప్లయితొలగించండి
 24. మిస్సన్న గారూ,
  నిజమే... మీరు చెప్పేదాకా నేను గమనించనే లేదు. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 25. డా.తోపెల్ల రామలక్ష్మిగురువారం, డిసెంబర్ 20, 2012 8:31:00 PM

  రవ్వల బోలుపద్యముల వ్రాయుటకున్మది మోసులెత్తగా
  సవ్వడి లేకయే నిలచె చక్కని సూచన లీయనెంచి రం
  డివ్వన భూమికంచు మము డిగ్గున శంకరుబిల్వగా మదిన్
  మువ్వలుగువ్వలై మొలచె మోదము మోహన రాగ మయ్యెడిన్ !

  రిప్లయితొలగించండి
 26. panditha nemanigariki naskaramulu!!miru mi rachanalu pampisthanu chirunamanu evvamannaru.naku pusthaka patanam ante antho makkuva.anduke naku mi pusthakamulu kavalsi vundi.dayatho naku pampistharani koruthu.....!

  na chirunama:
  jangidi rajendar,s/.ellaiah,
  vi:borlagudem.
  mo:mahamutharam.
  di:karimnagar-505503,cell:9866017692

  రిప్లయితొలగించండి
 27. Widows of Brindaavan break barriers:

  చెవ్వులు తూటులన్ పడగ చెన్నుగ పాడుచు పాత కీర్తనల్
  నవ్వులు చిందుచున్ మురిసి నాట్యము నాడుచు వింతవింతగా
  నవ్వలు హోలి యాడగను హాయిని పొందుచు వారి కాళ్ళవౌ
  మువ్వలు గువ్వలై మొలచె మోదము మోహన రాగ మయ్యెడిన్

  రిప్లయితొలగించండి