28, డిసెంబర్ 2012, శుక్రవారం

పద్య రచన - 204

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

 1. అనసూయ తల్లి దత్తుడ
  కన మూడౌ మూర్తులైన ఘన చరితుండా
  శునకమ్ములాయె వేదాల్
  విన గొప్పది నీదు చరిత వినతులు గొనుమా !

  రిప్లయితొలగించండి
 2. అనసూయ తల్లి దత్తుడ
  కన మూడౌ మూర్తులైన ఘన చరితుండా
  శునకమ్ములాయె వేదాల్
  నిను గొల్చుచు చుట్టునుండె నీకివె వినతుల్ !

  రిప్లయితొలగించండి
 3. అనసూయాత్మజ! భగవన్!
  ఘనచరిత! మహానుభావ! కల్మషహారీ!
  మునిజనహృదయవిహారీ!
  తనయుని ననుగావుమయ్య దత్తాత్రేయా!

  రిప్లయితొలగించండి
 4. అత్రికి బ్రహ్మ విష్ణు శివులంచిత రీతి వరమ్ము నీయగా
  పుత్రుడవై వివేక గుణ భూషణ రాజమవై విశిష్ఠ చా
  రిత్రుడవై సమాశ్రితుల శ్రేయము గూర్చు గురుండ వౌచు నీ
  ధాత్రి జెలంగినట్టి గురుదత్త! సుమాంజలి నీకు గూర్చెదన్

  రిప్లయితొలగించండి
 5. జగతి నేలెడు మువ్వురి చల్లదనము
  కలసి వెలసిన దైవము ఘనత నంత
  ధార గా పద్యముల జెప్పి ధన్యులైన
  వారికెల్ల నే జేతును వందనములు.

  రిప్లయితొలగించండి
 6. వినుతింప పతివ్రతనుచు
  యనసూయను,యా త్రిమూర్తి యవతారుడిగాఁ
  దనయుడె దత్తా త్రేయుడు
  కనికరమును జూపి మనల కాపాడునయా!

  రిప్లయితొలగించండి
 7. అనసూయాత్మజ!వందన
  మనువారల నాదరించి యతివత్సలతన్
  ఘనతరశక్తుల నిచ్చుచు
  ధనకనకము లొసగెదీవు దత్తాత్రేయా!

  నవవిధ నిధులును, సిద్ధులు
  వివిధాద్భుతమంత్రశక్తివిభవము లబ్బున్
  స్తవనీయుని నిను గొల్చిన
  ధవళితదివ్యాంగదీప్త! దత్తాత్రేయా!

  మూర్తిత్రయరూపుడవై
  యార్తుల బాధలను దీర్చి యనుపమ సుఖస
  త్కీర్తులు సంతస మనిశము
  కూర్తువు సుగుణప్రదాత! కూర్మిని దత్తా!

  నీవే తండ్రివి జగముల
  కీవే మముగాచువాడ వీప్సితవరదా!
  దేవా! దత్తాత్రేయా!
  రావే జగములను బ్రోవ రయముగ సుఖదా!

  శ్రీకరుడవు సద్భక్తవ
  శీకరుడవు దత్తదేవ! జిజ్ఞాసులకున్
  ధీకరుడవు దీనులకు గృ
  పాకరుడవు సతము నీకు ప్రణతులొనర్తున్.

  రిప్లయితొలగించండి

 8. అరయగా త్రిమూర్తులకు ప్రత్యంశ యగుచు,
  వేదములె శునకమ్ములై వెంట దిరుగ
  ప్రజల నున్మత్తువలె భ్రమింపంగ జేయు
  సిద్ధదత్తగురునికి నే జేతు ప్రణతి.

  రిప్లయితొలగించండి
 9. దత్తాత్రేయని గురించి మనోహరమైన పద్యాలను రచించిన కవిమిత్రులు....
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
  పండిత నేమాని వారికి,
  లక్ష్మీదేవి గారికి,
  సహదేవుడు గారికి,
  కమనీయం గారికి,
  అభినందనలు, ధన్యవాదములు.
  *
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  మీరు ప్రత్యేకంగా వ్రాసిన దత్తాత్రేయ స్తుతి మనోహరంగా ఉంది. అభినందనలు, ధన్యవాదములు.
  *
  సహదేవుడు గారూ,
  ‘పతివ్రత + అనుచు’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. నా సవరణతో మీ పద్యం....
  వినుతింప పతివ్రత యగు
  ననసూయకు నా త్రిమూర్తు లరయగ నొకటై
  తనయుడుగ బుట్టె దత్తుడు,
  కనికరమును జూపి మనల కాపాడునయా!

  రిప్లయితొలగించండి
 10. దత్తాత్రేయుని గొలిచిన
  నుత్తమ గతులందు జనులు నుతియింప దగున్ !
  చిత్తము నిలిపిన దైవము
  బత్తుని కడగండ్లు బాపి పరిణతి నొందన్ !

  రిప్లయితొలగించండి

 11. Poem of Smt. Rajeswaramma with slight modifications:

  దత్తాత్రేయుని గొలిచిన
  నుత్తమ యోగమ్ము లెపుడు నొదవుచునుండున్
  చిత్తము నిలిపిన దైవము
  బత్తుని కడగండ్లు బాపి భద్రములిచ్చున్

  రిప్లయితొలగించండి
 12. నమస్కారములు
  గురువులు శ్రీ పండితుల వారికి కృతజ్ఞతలు

  రిప్లయితొలగించండి
 13. క్షమించాలి. మా బండి చాలా ఆలస్యం:

  శ్రీ దత్త: శరణం మమంచు నిరతిన్ సేవించుచున్ భక్తితో
  మోదం బొప్పగ తన్మయత్వమున కై మోడ్పుల్ సదా సల్పి నీ
  పాదాబ్జంబులలో ద్విరేఫమగుచున్ పానంబు జేయన్ సుధల్
  లేదింకన్ మరుజన్మ వానికిల మాల్మిన్ దత్త! నీ వేలుటన్.

  రిప్లయితొలగించండి
 14. శ్రీ మిస్సన్న గారి పద్యమును కొంచెము సవరించుచు:

  శ్రీదత్తశ్శరణం మమేతి విలసఛ్ఛ్రీమంత్ర రాజమ్ము స
  మ్మోదంబొప్ప జపించుచున్ వరద! కైమోడ్పుల్ సదా సల్పి నీ
  పాదాబ్జంబులలో ద్విరేఫమగుచున్ పానంబు జేయన్ సుధల్
  లేదింకన్ మరుజన్మ వాని కిల మాల్మిన్ దత్త! నీ వేలుటన్

  స్వస్తి

  రిప్లయితొలగించండి
 15. రాజేశ్వరి అక్కయ్యా,
  మిస్సన్న గారూ,
  నేమాని వారి సవరణలతో మీ ఇద్దరి పద్యాలూ మనోహరంగా రూపు దిద్దుకున్నాయి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. నేమాని పండితార్యా ధన్యవాదానేకములు.
  గురువుగారూ ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి