6, డిసెంబర్ 2012, గురువారం

పద్య రచన - 182

పళని మల
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

24 కామెంట్‌లు:

  1. పుళింద కన్య నాథుడ!
    పళని మలను వెలసినట్టి పర దైవమ్మా!
    కళలెన్నొ గల కుమారుడ!
    కలతలు మము జేరకుండ కాపాడయ్యా!

    రిప్లయితొలగించండి
  2. కవిమిత్రులకు నమస్కృతులు.
    నిన్న మా మేనల్లుడి వివాహం జరిగింది. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం. రేపు రిసెప్షన్. అందువల్ల గత రెండు రోజులుగా మిత్రుల పూరణలను, పద్యాలను పరిశీలించి వ్యాఖ్యానించే అవకాశం దొరకలేదు. మరో రెండు రోజులు కూడా పనులవల్ల వ్యస్తుడినే. మన్నించండి.
    దయచేసి మిత్రులు రెండు రోజులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
  3. శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రము:

    వందే సుబ్రహ్మణ్యం
    వందే సేనాన్య మఖిల భక్త శరణ్యం
    వందే బుధాగ్రగణ్యం
    వందే నాగార్చితం శివాతనయమహం

    వందే తారకహారిం
    వందే శక్రాది దేవ వందిత చరణం
    వందే రుద్రాత్మభవం
    వందే షాణ్మాతురం శివాతనయమహం

    వందే వల్లీసహితం
    వందే కరుణాకరం శుభప్రద మూర్తిం
    వందే మయూరవాహం
    వందే వరదం గుహం శివాతనయమహం

    వందే వీరవరేణ్యం
    వందే వందారు భక్తవర సురభూజం
    వందే భవ భయహారిం
    వందే గణపానుజం శివాతనయమహం

    వందే శరవణజనితం
    వందే జ్ఞాన ప్రభావిభాసుర మమలం
    వందే పరమానందం
    వందే ముక్తిప్రదం శివాతనయమహం

    వందే కుమారదేవం
    వందే గాంగేయ మగ్నిభవ మమరనుతం
    వందే వరశక్తిధరం
    వందే మంగళకరం శివాతనయమహం

    వందే సుందరరూపం
    వందే వేదాంత రమ్య వనసంచారిం
    వందే సురదళనాథం
    వందే జ్ఞానప్రదం శివాతనయమహం

    వందే భవ్యచరిత్రం
    వందే శుభగాత్ర మబ్జపత్ర సునేత్రం
    వందే పరమపవిత్రం
    వందే వల్లీప్రియం శివాతనయమహం

    రిప్లయితొలగించండి
  4. వందనముల్ కుమారునికి! వందనముల్ పళనీ విలాసుకున్ !
    వందనముల్ మయూర ఘన వాహునకున్! మన వల్లి భర్తకున్!
    వందనముల్ మహేంద్ర సుర వంద్యునకున్ ! వర శక్తి ధారికిన్!
    వందనముల్ శుభాప్తునికి! వందనముల్ శివ సూతికిన్ సదా!

    రిప్లయితొలగించండి
  5. శ్రీ మిస్సన్న గారి పద్యమునకు ఇలాగ చిన్న చిన్న సవరణలు చేద్దాము:

    వందనముల్ కుమారునకు వందనముల్ పళనీవిహారికిన్
    వందనముల్ మయూర ఘనవాహునకున్ ప్రియ వల్లి భర్తకున్
    వందనముల్ సురప్రకర వంద్యునకున్ వరశక్తిధారికిన్
    వందనముల్ శుభాప్తునకు వందనముల్ శివసూతికిన్ సదా

    రిప్లయితొలగించండి
  6. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారి పద్యమునకు సవరణలు ఇలాగ చేద్దాము:

    పళని గిరీంద్రావాసా!
    పుళింద కన్యా హృదీశ! భుజగేంద్రహితా!
    కళలలరు నో కుమారా!
    కలతలు మము జేరకుండ కాపాడగదే!

    రిప్లయితొలగించండి
  7. ఇల పళని మల శిరంబున
    వెలసిన యా శివుని బుత్రు వేడుక మీరన్
    కొలిచిన నిచ్చును శుభములు
    కొలువగ వేరండు మీరు గొలుతుము వానిన్ .

    రిప్లయితొలగించండి
  8. సమరపు సర్వసైన్యమును సాయుధుడై నడిపించి తారకా
    ధముని మహాపరాక్రముడు దండన జేసెను యుద్ధభూమిలో.
    శమమును శాంతిగల్గి యిట చల్లని రూపున పూజలందగా
    నెమలియె వాహనమ్ముగను నిల్చె కుమారుని సేవ చేయుచున్.

    రిప్లయితొలగించండి
  9. అమ్మా! లక్ష్మీ దేవి గారూ!
    శమము అనినా శాంతి అనినా అర్థము ఒకటే. అవి పర్యాయపదములు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. తారకు సంహరించుటకు ద్ర్యక్షకుమారుడవై జనించి నీ
    వారు దినాల ప్రాయమున నాహవరంగమునందు శత్రు సం
    హారమొనర్చినాడవు కదా! బళిరా! అరి వీర భీకరా!
    ఆరుమొగాలసామి! రిపు లార్వుర గూల్చుము నా మనమ్ములో

    రిప్లయితొలగించండి
  11. భవసుత వాసమ! పళనీ!
    వివిధైశ్వర్యముల నిధిగ వెలుగొందు గిరీ!
    ప్రవిమలమతి నిను గాంచిన
    భవ భయహర మగును పరమ పావన చరితా!

    రిప్లయితొలగించండి
  12. నేమాని పండితార్యా ! కడుంగడు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  13. అయ్యా,
    పొరబాటును తెలియజేసినందుకు ధన్యవాదములు.

    సవరించిన పాదము:
    సమయగ క్రోధమెల్ల యిట చల్లని రూపున పూజలందె నీ

    రిప్లయితొలగించండి
  14. పళని దేవుని దర్శించ పరమ ప్రీతి
    పాల కావడి దాటించ ప్రాపు గాను
    సంతు లేనట్టి వారికి వింత పడగ
    వరము లిచ్చును సంతతి కరుణ చెంది .

    రిప్లయితొలగించండి
  15. ఇల పళని మల శి ఖ రమున
    వెలసిన యా శివుని బుత్రు వేడుక మీరన్
    కొలిచిన నిచ్చును శుభములు
    కొలువగ వేరండు మీరు గొలుతుము వానిన్ .

    రిప్లయితొలగించండి
  16. తనువు లోన నక్కు తారకాసురుఁ జంప
    తమము వీడి నిశ్చల మది తోడ
    దృష్టి నిల్ప పళని తేజమ్ము షణ్ముఖ
    ప్రభువు శక్తి నిచ్చి వరము లొసగు

    రిప్లయితొలగించండి
  17. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పళనిమల వాసుని స్తుతి బాగుంది. అభినందనలు.
    నేమాని వారి సవరణను గమనించారా?
    *
    పండిత నేమాని వారూ,
    సుబ్రహ్మణ్యస్వామిపై మీ భక్త్యావేశం ఉప్పొంగినట్లున్నాయి మీరు తడవ తడవకు చేసిన స్తుతి పద్యాలు. అద్భుతంగా ఉన్నాయి. ధన్యవాదాలు.
    *
    మిస్సన్న గారూ,
    కుమారస్వామికి వందనాలు తెలిపిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    ‘పాలకావడి’ని ప్రస్తావించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. నేమాని గారు!
    తెలుగు యతి ప్రాసలు కూర్చిన ఆర్యా వృత్తాష్టకాన్ని ధారా రమ్యంగా రచించారు.
    అభినందన!

    రిప్లయితొలగించండి
  19. మిత్రులారా!
    2011 మే నెలలో నేను అమెరికాలో నున్నప్పుడు నాకు వరుసగా 3 వారములలో కలలో 3 మారులు నాగు పాములు కనుపించినవి. ఏ నాడును భయంకరముగా లేవు. 3వ మారు చాలా పెద్దది తెల్లనిది దర్శన మిచ్చినది. ఆ మరునాడు నేను ఈ సుబ్రహ్మణ్య స్తోత్రమును వ్రాసితిని. 3 గంటలలో ఈ స్తోత్రము పూర్తి అయినది. స్వస్తి.

    రిప్లయితొలగించండి

  20. ప్రమదంబయ్యె ఫణీంద్రా!
    సుమతీ! అభినందనలను జూడగనే, భ
    ద్రములను గనుమా యనినే
    నమలమతిన్ గూర్తు మీకు నాశీస్సుమముల్

    రిప్లయితొలగించండి
  21. శరణం భవ ! శరవణ భవ !
    మురుగా ! షణ్ముఖ ! కుమార ! పుణ్యము లొసగన్
    గిరిపై వెలసిన సామీ !
    శరణు శరణు ! కార్తికేయ ! శంభుని పుత్రా !

    రిప్లయితొలగించండి
  22. శంకరార్యా ! ధన్యవాదములు.
    నా పద్యమునకు చక్కని సవరణలు చేసిన శ్రీ నేమాని వారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి




  23. ఈ కింది వర్ణన మన భాగ్యనగరం(హైదరాబాదు )గురంచి మాత్రం కాదని మనవి.మరొకనగరం గూర్చి.మీరు ఊహించవచ్చును.

    క్రిక్కిరిసిన వీథులు,పేదబక్కజనులు ,
    మురికివాడలు,పారెడి మురుగునీరు,
    శబ్దకాలుష్యమును ,నెరచరితులీ య
    భాగ్యనగరాన దిరుగ వైరాగ్యమొదవు.

    రిప్లయితొలగించండి