12, ఏప్రిల్ 2014, శనివారం

సమస్యాపూరణం - 1380 (ఊర్ధ్వపుండ్రముల్ ధరియించె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ఊర్ధ్వపుండ్రముల్ ధరియించె నుమ పెనిమిటి.

15 కామెంట్‌లు:

 1. వచ్చెను వసంత కాలపు వైభవములు
  సందడులలోన నానంద మొందుచుండి
  వేసిరి విచిత్ర ధారణ వేల్పు కోటి
  ఊర్ధ్వ పుండ్రముల్ ధరియించె నుమ పెనిమిటి

  రిప్లయితొలగించండి
 2. ఏడు కొండల రాయని వేడు కొనగ
  ఊర్ద్ధ్వ పుండ్రముల్ ధరియించె , నుమ పెనిమిటి
  స్మార్తు డనగను విభూతి శంక రుండు
  భస్మ ధారణ పుండ్రమ్ము విస్మ యంబు

  రిప్లయితొలగించండి
 3. జానకీ భర్త నుదటపై జక్కగాను
  యూర్ధ్వ పుండ్రముల్ ధరియించె , నుమ పెనిమిటి
  యందముగ విభూతిని పెట్టె నడ్డముగను
  బొట్టలే నేడు మతముల గుట్టు తెలుపు.

  రిప్లయితొలగించండి

 4. విష్ణు భక్తుడు నౌటను వేంక టేశు
  ఊ ర్ధ్వ పుం డ్రముల్ ధరియించె నుమ పెనిమిటి
  శివుని భక్తుడు కతనన శివుని భజన
  జేయుచుండును నిత్యము శివశివ యని

  రిప్లయితొలగించండి
 5. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు
  ఊర్ధ్వ పుండ్రముల్ ధరియించి యున్న మిమ్ము
  గాంచ మనసాయె నన్న యా కాంత కొఱకు
  ఊర్ధ్వ పుండ్రముల్ ధరియించె నుమపెనిమిటి
  హరియు హరునకభేదమ్మనగను జాటె

  రిప్లయితొలగించండి
 6. విష్ణు భక్తుడు నిత్యము వేద విధిని
  ఊర్ధ్వపుండ్రముల్ ధరియించె; నుమ పెనిమిటి
  దైవమని విభూతిని దాల్చె శైవుడొకడు
  దేవుడొక్కడె యనుమాట తెలియ రేల ?

  రిప్లయితొలగించండి
 7. కవిమిత్రులకు నమస్కృతులు..
  నాలుగు రోజులుగా గ్రామాంతరం వెళ్ళడం వల్ల కనీసం బ్లాగును చూడడానికి కూడా అవకాశం దొరకలేదు.. ఇంతకుక్రితమే ఇల్లు చేరుకున్నాను.
  ఈ నాలుగురోజులు పూరణలు, పద్యరచన చేసిన మిత్రులందరికీ అభినందనలు, ధన్యావాదాలు.
  దయతో మిత్రుల పద్యాలను సమీక్షిస్తూ, తగిన సూచన లిచ్చి ప్రోత్సహిస్తున్న పండిత నేమాని గురుదేవులకు కృతజ్ఞతాంజలి.

  రిప్లయితొలగించండి
 8. పండిత నేమాని వారూ,
  దేవతలతో ఫ్యాన్సీ డ్రెస్సులు వేయించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  మూడవ పాదంలో గణదోషం.. ‘స్మార్తు డని చెప్పగ విభూతి శంకరుండు’ అనండి.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గండూరి లక్షినారాయణ గారూ,
  విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘చక్కగాను/ నూర్ధ్వపుండ్రముల్...’ అనండి.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. నిన్నటి దినము ప్రొద్దుటూరు శాస్త్రినగర్ శ్రీరాజరాజేశ్వరి దేవి గుడిలోని ఋణవిమోచనేశ్వర స్ఫటిక లింగానికి పూజారి ఊర్ధ్వపుండ్రాలు మూడు సమాంతరముగ దిద్ది నడుమన తిరుమణి తీర్చడము జరిగింది. నేను స్వామివారితో సంశయంగా శివకేశవులకు బేధము లేదని చెప్పదలిచారా? అని అడగడం జరిగింది.పూజారి చెప్పిన జవాబు ఈనాటి పూరణకు సరిగ్గా సరిపోయింది
  వారి మాటల్లో...

  చంద్ర శేఖరుండనిదల్చి చక్కగాను
  చంద్ర వంకలు మమ్మారు సాగ దీసి
  తీర్చి దిద్దియు నడుమన తిరుమణిడగ
  నూర్ధ్వ పుండ్రముల్ ధరియించె నుమ పెనిమిటి!

  రిప్లయితొలగించండి
 10. గురువులకు అన్నయ్యగారికి నమస్సులు !

  భక్తి యలరగ దిక్కన భజన జేసి
  హరిహరుండని కొలువగ నాద్యు డతని
  నుదుట నడ్డుగ రేఖలు గుదిరె హరికి !
  ఊర్ధ్వ పుండ్రముల్ ధరియించె నుమ పెనిమిటి !!

  రిప్లయితొలగించండి
 11. ఉదయమందున జూడగా నెదుటి యిండ్ల
  చుక్క బొట్టుతొ కనబడె సుమతి పతియె
  అడ్డనామాలు బెట్టెగా హరిత భర్త
  ఊర్ధ్వ పుండ్రముల్ ధరియించె నుమ పెనిమిటి.

  రిప్లయితొలగించండి
 12. సహదేవుడు గారూ,
  మీ పూరణ, దాని నేపథ్యం రెండూ బాగున్నవి. అభినందనలు.
  ‘తిరుమణి + ఇడు’ అన్నప్పుడు సంధి లేదు..యడాగమం వస్తుంది. అక్కడ ‘తిరుమణి యిడ’ అంటే సరి.
  *
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  బహుకాల దర్శనం. సంతోషం!
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  సుమతి, హరిత, ఉమల భర్తల బొట్టుల పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. దర్శనము నిచ్చు దైత్యారి ధాత్రిపైన
  నూర్ధ్వ పుండ్రముల్ ధరియించి, నుమ పెనిమిటి
  యడ్డ నామముల్ ధరియించు, నార్తి జనుల
  కాచి కాపాడు తుష్టినా కాటిఱేడు

  రిప్లయితొలగించండి
 15. గురువుగారికి ధన్యవాదాలు. తమరి సూచిత సవరణతో పద్యం :
  చంద్ర శేఖరుండనిదల్చి చక్కగాను
  చంద్ర వంకలు మమ్మారు సాగ దీసి
  తీర్చి దిద్దియు నడుమన తిరుమణి యిడ
  నూర్ధ్వ పుండ్రముల్ ధరియించె నుమ పెనిమిటి!

  రిప్లయితొలగించండి