19, ఏప్రిల్ 2014, శనివారం

సమస్యాపూరణం - 1387 (వరున కిత్తురు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వరున కిత్తురు కాషాయవస్త్రములను.

24 కామెంట్‌లు:

 1. సర్వ సంగ పరిత్యాగి సాధుశీలి
  సకల లోక హితైషియు జననుతుడగు
  సద్గురునకు నతులు సేసి సాదృతి యతి
  వరున కిత్తురు కాషాయ వస్త్రములను

  రిప్లయితొలగించండి
 2. కంద మూలము లనుతిని కనులు మూసి
  తపము జేయుచు రమియించు తాప సులకు
  దైవ ధ్యానము నందున తనరు మౌని
  వరున కిత్తురు కాషాయ వస్త్ర ములను
  --------------------------------------------
  సాయి నాధుని సేవను సంత సముగ
  పరమ భక్తిని కొలుచుట భాగ్య మనుచు
  నియమ నిష్టగ పూజించి శ్రేయ మనిన
  వరున కిత్తురు కాషాయ వస్త్ర ములను

  రిప్లయితొలగించండి
 3. పండిత నేమాని వారూ,
  మీ ‘యతివరుని’ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ ‘మౌనివరుని’ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘దైవధ్యనము’ అన్నప్పుడు ‘వ’ గురువై గణదోషం. ‘దైవచింతన యందున దనరు మౌని’ అందాం.

  రిప్లయితొలగించండి
 4. అమిత దీక్షను గొని పరమాత్మనరయ
  భక్తిఁ గొలుచుచు తపమున ముక్తి గోరి
  నిత్య మాతని దరిజేర నెమకు మౌని
  వరున కిత్తురు కాషాయవస్త్రములను.

  రిప్లయితొలగించండి
 5. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ రెండవ పూరణకూడా బాగుంది. అభినందనలు.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. బౌద్ధ మత సారమంత నిబద్ధుడగుచు
  తెలియ జేయ జనాళికి ,టిబెటునులకు
  పెద్దయైన దలై లామ పీఠపు గురు
  వరున కిత్తురు కాషాయ వస్త్రములను!!!

  రిప్లయితొలగించండి
 7. పెండ్లి దినమున బహుమతు ల్పేర్మి తోడ
  వరున కిత్తురు , కాషాయ వస్త్రములను
  నిత్తు రవధూ తి కాదర మింపు గొలుప
  పూజ నీయులు సర్వదా పుణ్య మతులు

  రిప్లయితొలగించండి
 8. పరువము విరబూయగ తన బావ జేరి
  సరస మాడగ మురిసెడు మరదలి గని
  దూరమంచును మడిగట్టు దోర వయసు
  వరునకిత్తురు కాషాయ వస్త్ర ములను

  రిప్లయితొలగించండి
 9. సత్య శోధన సాగించ సాధువైన
  సన్య సించిన తపసిని సన్నుతించి
  సత్క రించుచు భక్తితో సద్గురుముని
  వరున కిత్తురు కాషాయ వస్త్రములను

  రిప్లయితొలగించండి
 10. మోక్ష మాసించి సంసార మోసరించి
  తీర్థ యాత్రలు సేవించ దేవ మునుల
  గొలువ నాసించు వానికి గొప్ప సుజన
  వరున కిత్తురు కాషాయ వస్త్రములను

  రిప్లయితొలగించండి
 11. పెండ్లికేతెంచి దీవనఁ బేర్మినొసగి
  యెల్లవారల క్షేమమునెల్లవేళ
  కోరు యోగికిడుమటంచు కూర్మి తోడ
  వరున కిత్తురు కాషాయవస్త్రములను.

  రిప్లయితొలగించండి

 12. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  కాశికిన్ బోవు వటువుకు కన్య నిచ్చి
  పెండ్లి బంధమ్ముమెడ కురి బిగియ జేసి
  గాసిజెందుచునేగంగ కానలకును
  వరుని కిత్తురు కాషాయ వస్త్రములను.

  రిప్లయితొలగించండి
 13. పట్టు పీతాంబరములను పరిణయమున
  వరున కిత్తురు, కాషాయ వస్త్రములను
  కట్టుకొని నిష్ఠ బూజించి కమల నాభుఁ
  ముదముతోనేగుదురు స్వర్గమునకు బుధులు


  రిప్లయితొలగించండి
 14. ఆది శంకరా చార్యుల యసలు కథను
  చిత్రముగ తీయు వారలు సిద్ధ మగుచు
  శంకరాచార్య పాత్రలో సాగెడు నట
  వరున కిత్తురు కాషాయ వస్త్రములను.

  వెంకటేశ్వర మాలను వేడుకగను
  దాల్చి మండల దీక్షకు తరల నెంచ
  పరమ నిష్ఠా గరిష్టుడౌ బాల భక్త
  వరున కిత్తురు కాషాయ వస్త్రములను.

  రిప్లయితొలగించండి
 15. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు
  మరియొక పూరణ :దినకరుడు వరుడు పద్మిని ధీత వధువు
  అంబరపు రాజు మామట అత్త జలము
  పెండ్లి సుమూర్త ముదయము ప్రేమమీర
  వరుని కిత్తురు కాషాయ వస్త్రములను.

  రిప్లయితొలగించండి
 16. మంద పీతాంబర్ గారూ,
  మీ గురువరుని పూరణ బాగుంది. అభినందనలు.
  ‘టిబెటునులు’ అనవచ్చునా? అక్కడ ‘టిబెటు జనుల/ పెద్దయైన...’ అంటే ఎలా ఉంటుందంటారు?
  *
  సుబ్బారావు గారూ,
  విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  పెళ్ళిలో కాశీకి పోయే తంతును ఎవరు ప్రస్తావిస్తారా అని ఎదురు చూస్తున్నా... మీ దానిని ప్రస్తావించడం సంతోషాన్ని కలిగించింది. పూరణ బాగుంది. అభినందనలు.
  మీ రెండవ పూరణ కూడా బాగుంది. ‘దినకరుడు’ అన్నచోట గణదోషం. ‘దినమణి’ అనండి. ‘సుముహూర్తము’లో ‘హూ’ టైపు కాలేదు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు
  మీ సూచనమేరకు సవనజేసితిని.
  ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 18. పాద పూజలు సలుపుచు భక్తి తోడ
  ఫలము లిచ్చుచు దినుటకు, వరము లడిగి
  ఫలము లీయగ భావించి పరమ మౌని
  వరున కిత్తురు కాషాయ వస్త్రములను

  రిప్లయితొలగించండి
 19. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. పెళ్ళిలో జరిగే కాశీయాత్ర తంతులో కాషాయ వస్త్రాలియ్యడమా? ఎక్కడా వినలేదు, చూడలేదసలు.
  గురువుగారు,
  నీ = నీవు అనే అర్థంలో క్రిందటి రోజు పూరణకు వాడినానండీ, అది తప్పు అన్వయాన్నిస్తున్నదా?

  రిప్లయితొలగించండి
 21. లక్ష్మీదేవి గారూ,
  కాశీయాత్ర తంతులో కాషాయవస్త్రాలివ్వడం అనేది లేదు. నేను కేవల ఆ తంతును ప్రస్తావించినందుకు మెచ్చుకున్నాను.
  ‘నీ’ శబ్ద అన్వయం గురించి ఏ పూరణ/ పద్యం గురించి చెప్పానో గుర్తు రావడం లేదు.. వెదికినా దొరకలేదు.. అది ఏ సందర్భంగా చెప్పానో వివరించండి.

  రిప్లయితొలగించండి
 22. గురువుగారు,
  ఇక్కడ --- పద్యరచన 570 లో.


  చండీ! వందనమమ్మ! వాహనముగా శార్దూలమున్ గల్గి నీ
  ఖండింపంగను దైత్యులన్, జనులు నీ కారుణ్యముల్ పొంది వే
  దండమ్ముల్ గొనుమంచు పుష్పముల చేతన్ బూని పూజింపరే!
  నిండెన్ మానసముల్ భవత్కరుణ గాన్పింపంగనెవ్వేళనున్!

  మీకుశ్రమ ఇచ్చినందుకు మన్నించండి.

  రిప్లయితొలగించండి
 23. లక్ష్మీదేవి గారూ,
  నీ అనేది నీవు శబ్దానికి ప్రాతిపదిక. దానిని నీవు అనే అర్థంలో ప్రయోగింపరాదు. ‘నీ చెప్పిన చొప్పు...’ మొదలైన ప్రయోగాలు ఉన్నాయనుకోండి.

  రిప్లయితొలగించండి
 24. సరేనండి. అటువంటివి ఒకటో రెండో చదివిన ప్రభావమేమో. నీ ఏ విధంగా వాడతారో అధ్యయనం చేయాల్సి ఉంది.
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి