26, ఏప్రిల్ 2014, శనివారం

సమస్యాపూరణం - 1394 (జీతము లేనట్టి కొలువు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
జీతము లేనట్టి కొలువుఁ జేయుట మేలౌ.

21 కామెంట్‌లు:

  1. సీతాపతి మందిరమున
    చేతోమోదమున జేరి సేవల నెంతే
    ప్రీతిమెయి నీతివిదులై
    జీతము లేనట్టి కొలువు జేయుట మేలౌ

    రిప్లయితొలగించండి
  2. ప్రీతిగ కొలువగ రాముని
    త్రాతకు మనసున కొలువిడి దాసుడ వగుచున్
    నేతకు నౌకరు నేనని
    జీతము లేనట్టి కొలువుఁ జేయుట మేలౌ.

    రిప్లయితొలగించండి
  3. సీతారాములకును మఱి
    చేతో మోదంబు గలుగ జేయగ బెండ్లి
    న్నాతరి భక్తులు ముదమున
    జీతము లేనట్టి కొలువు జేయుట మేలౌ


    రిప్లయితొలగించండి
  4. పండిత నేమాని గారికి పూజ్యులుగురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    జీతమనగ నేమున్నది?
    నూతబడిన రూకల వలె నోటికి కరవౌ
    నీతికి నుదకము వదలిన
    జీతము లేనట్టి కొలువు జేయుట మేలౌ

    రిప్లయితొలగించండి
  5. మాతా పితరులకును గో
    మాతకు పలు జీవకోటి మనుగడ కొఱకున్
    చేతో మోదమ్మలరగ
    జీతము లేనట్టి కొలువుఁ జేయుట మేలౌ.

    రిప్లయితొలగించండి
  6. నేతలు నీతిని వీడిన
    జీతము లేనట్టి కొలువుఁ జేయుట మేలౌ
    నీతిగ బ్రతికెడు వారికి
    జీతముపొందుచు సలిపెడి జీవిత మొప్పౌ

    రిప్లయితొలగించండి
  7. నేతకు కుడిభుజమౌనెడ
    భూతలమే స్వర్గమౌను భూరిగ వనరుల్
    చేతికి చిక్కును పరిమిత
    జీతము లేనట్టి కొలువు జేయుట మేలౌ!!

    రిప్లయితొలగించండి
  8. వైతరణి దాట గుడిలో
    జీతము లేనట్టి కొలువు జేయుట మేలౌ
    నీతిని వీడిన మనుజుడు
    పాతకుడై భువిని వదలి పడయు నరకమున్

    రిప్లయితొలగించండి
  9. ప్రీతిగ కార్యాలయమున
    చాతురిమెయి పనులఁజేసి సఖ్యముతోడన్
    నీతిగ మెలఁగుచు తక్కువ
    జీతము లేనట్టి కొలువు చేయుట మేలౌ.

    రిప్లయితొలగించండి
  10. ప్రీతిగ బ్రతుకుటకై పై
    జీతము లేనట్టి కొలువు జేయుట మేలౌ
    సాతాను చేత బడినన్
    యేతెంచిన సొమ్ము యొప్పు యెట్టిదియైనన్


    రిప్లయితొలగించండి
  11. పండిత నేమాని వారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీరావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘చేతబడినన్ + ఏతెంచిన, సొమ్ము + ఒప్పు + ఎట్టిది’ అన్నప్పుడు యడాగమాలు రావు. చివరి రెండు పాదాలను ఇలా సవరించాను.
    సాతాను చేత బడుచో
    నేతెంచిన సొమ్ము మంచి దెట్టిదియైనన్.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  12. రాతియెడదగలసతి ప్రే
    మాతిశయములేకపోగ నారడిబెట్టన్
    నాతికి దవ్వున గడపగ
    జీతము లేనట్టి కొలువు జేయుట మేలౌ

    రిప్లయితొలగించండి
  13. నీతిగ నడువుము చేయకు
    జీతము లేనట్టి కొలువు ;జేయుట మేలౌ
    మేతకు గూడుకు గుడ్డకు
    వేతన మిడు వారి వద్ద ప్రియమున కొలువున్

    రిప్లయితొలగించండి
  14. జీతము వలదని బొంకగ
    నీతిగ నేలునని దలఁచి నేతను జేయన్!
    జాతరఁ జేయుచు మ్రింగెడి
    జీతము లేనట్టి కొలవుఁజేయుట మేలౌ!

    రిప్లయితొలగించండి
  15. ఖతా ముగియగ పదవిన
    నేతావున పైకమునకు ఎగబడ బోకోయ్
    సీతా రాముల సేవకు
    జీతము లేనట్టి కొలువుఁ జేరుట మేలౌ!

    రిప్లయితొలగించండి
  16. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమరి సవరణలకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  17. వేతనము లనాసించక
    పాతకములు తగుల కుండ పతి సేవలలో
    యాతన బడియైన మునుగి
    జీతము లేనట్టి కొలువు జేయుట మేలౌ

    రిప్లయితొలగించండి
  18. రామకృష్ణ గారూ,
    మీ పూరణ నాకు వృద్ధాశ్రమంలో చేరిన పరిస్థితులను గుర్తుకు తెచ్చాయి. బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    ఇల్లాండ్ర జీతము లేని కొలువు గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. కోతలు కోయుచు ప్రజలకు
    మూతులు నాకుచు ప్రభువుల ముచ్చట మీరన్
    నేతల కాళ్ళకు మ్రొక్కెడి
    జీతము లేనట్టి కొలువుఁ జేయుట మేలౌ

    రిప్లయితొలగించండి
  20. భీతిల్లుచు నీ కెప్పుడు
    నీతులు పలు చెప్పకుండ నీరజ నేత్రా!
    కోతలు కోసెడి భర్తకు
    జీతము లేనట్టి కొలువుఁ జేయుట మేలౌ

    రిప్లయితొలగించండి