22, ఏప్రిల్ 2014, మంగళవారం

సమస్యాపూరణం - 1390 (అశ్వముఖుఁ డాంజనేయుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అశ్వముఖుఁ డాంజనేయుఁ డబ్జాసనుండు.

20 కామెంట్‌లు:

  1. అశ్వముఖు డాంజనేయు డబ్జాసనుండు
    మొదలుగా గలవారలు ముదము మీర
    మెండు సేవలొనర్చిరి పండువనుచు
    పార్వతీ పరమేశుల పరిణయమున

    రిప్లయితొలగించండి
  2. గరుడ గంధర్వ కిన్నెర గణము లనగ
    అశ్వముఖు డాంజనేయు డబ్జాస నుండు
    దేవ గణములు తరలిరి దివిజ గంగ
    భువికి దిగివచ్చె ననిగాంచ భోగ మనుచు

    రిప్లయితొలగించండి
  3. దివ్య మంగళ దిదినమని తేజ మలర
    రామ పట్టాభిషేక మ్ము రమ్య మనుచు
    నశ్యముఖుడాంజనేయు డబ్జాసనుండు
    పార్వతీ నాధుతో గూడి భక్తి గనిరి

    రిప్లయితొలగించండి
  4. దివ్య మంగళ దిదినమని తేజ మలర
    రామ పట్టాభిషేక మ్ము రమ్య మనుచు
    నశ్యముఖుడాంజనేయు డబ్జాసనుండు
    పార్వతీ నాధుతో గూడి భక్తి గనిరి

    రిప్లయితొలగించండి
  5. గిరిజ కుద్వాహ తంతులు జరుగు చుండ
    న శ్వ ముఖు డాం జనేయు డబ్జాసనుండు
    నాదిగా గల దేవత లంద ఱచట
    చూచు చుండిరి కళ్యాణ చోద్య ములను

    రిప్లయితొలగించండి
  6. తుంబురుని యొక్క యితర నామంబు తెలుపు?
    అంజన సుతుడు మారుతి యనగ నెవరు?
    విధికి వేరొక పేరును విన్న వించు?
    అశ్వ ముఖుఁ డాంజ నేయు డబ్జాసనుండు

    రిప్లయితొలగించండి
  7. పండిత నేమాని గారికి పూజ్యులుగురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    వాదిరాజుని పూజలెవ్వాడు గొనును?
    మధ్వముని తొలిభవమునేమంద్రు బుధులు?
    శారదాదేవి భర్తయౌ సనతు డెవరు?
    అశ్వముఖు డాoజనేయు డబ్జాసనుండు

    రిప్లయితొలగించండి
  8. అంబరమ్మున గలడని యనిరి బుధులు
    హిమగిరిని కలడనెదరు హిందువు లిల
    పుష్టిగా జీవరాశుల సృష్టి కర్త
    అశ్వముఖుఁ డాంజనేయుఁ డబ్జాసనుండు.

    శ్రీ శంకరయ్య గారికి నమస్సులు
    నిన్నటి నా పూరణనమునకు వ్యాఖ్య పై నా అనుబంధ వ్యాఖ్య :
    మహారాష్ట్ర లో జన్మించిన కృష్ణా నది కర్నాటక దెసగా ప్రవహించిందను భావం తో నా పద్యరచన సాగింది.

    రిప్లయితొలగించండి
  9. హరికి జ్ఞానావతారమై బరగు నొకరు
    బ్రహ్మ రాబోవు యుగముల పాలి నొకరు
    సృష్టి నిర్మాణ శిల్పియై చెలగు నొకరు
    అశ్వముఖుఁ డాంజనేయుఁ డబ్జాసనుండు.

    రిప్లయితొలగించండి
  10. ఏమి చెప్పుదు నా పతి యెట్టివాఁడొ?
    చెప్పవలె నందమునఁ, గోతి చేష్టలందుఁ,
    చొక్కి విఫలుఁడై నలుదెసల్ చూడగ మగఁ
    డశ్వముఖుఁ, డాంజనేయుఁ, డబ్జాసనుండు.

    రిప్లయితొలగించండి
  11. పండిత నేమాని వారూ,
    చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    మొదటి పాదంలో ఒక ది అదనంగా టైపయింది.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    ప్రశ్నోత్తర రూపంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    క్రమాలంకార పద్దతిలో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘వాదిరాజు..’?
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘చెలగు నొక్క/ రశ్వ...’ అనండి.

    రిప్లయితొలగించండి
  12. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు
    నీ శిష్య పరమాణువు వినమ్రవందనములతో.

    గురుదేవుల పద్యములు బహు భాగున్నవి

    రిప్లయితొలగించండి
  13. అయ్యా! శ్రీ కంది శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
    ఆందమైన పద్యమే చెప్పేరు గాని, ఆ చెప్పిన పతివ్రతా శిరోమణి ఎవరో ఆమె గుణ గణాలు అంచనా వేయలేము కదా. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    వాదిరాజు యతీంద్రులు మధ్వగురువులు ప్రాతఃస్మరణీయులు హయగ్రీవ పదాశ్రయులు
    వివరములకోసముగూగుల్
    సంప్రతించండి

    రిప్లయితొలగించండి
  15. పండిత నేమాని గారికి పూజ్యులుగురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    చిన్నసందేహము పార్వతీ పరిణయము కృతయుగములో గనకజరిగి యుంటే త్రేతా యుగములో జన్మించిన
    ఆంజనేయులవారు పాల్గొనుట సంభవమేనా
    దయచేసి సంశయ నివృత్తి గావించగలరు

    రిప్లయితొలగించండి
  16. అయ్యా! తిమ్మాజీ రావు గారూ!
    శుభాశీస్సులు.
    మన దేవాలయములలో అను నిత్యము ఉత్సవమూర్తుల కళ్యాణములు జరుపు తారు కదా. యుగముతో సంబంధము లేదు. నిత్య కళ్యాణము గూర్చే చెప్పుకొందాము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. శంకరార్యా ! మీ పూరణము బహు చమత్కారముగా నున్నది..


    వరముయున్నది ముందట వచ్చునట్టి
    యుగమునందున విధితానె యగును గాద
    కోతి సింహంబు ఖగ రాజ క్రోడ సహిత
    అశ్వముఖుఁ డాంజనేయుఁ డబ్జాసనుండు.

    రిప్లయితొలగించండి
  18. అయ్యా! శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు! శుభాశీస్సులు,
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    వరము + ఉన్నది = అనుచోట సంధి నిత్యము - యడాగమము రాదు.
    సహిత + అశ్వముఖుడు= అనుచోట సవర్ణ దీర్ఘ సంధి యగును.

    రిప్లయితొలగించండి
  19. పండిత నేమాని వారూ,
    కందుల వరప్రసాద్ గారూ,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.
    *
    హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    నేమాని వారి సూచనలను గమనించారు కదా!
    *
    కవిమిత్రులారా,
    ఎల్లుండి మా మిత్రుని కూతురు నిశ్చితార్థం. రేపు ఎల్లుండి నేను బ్లాగుకు అందుబాటులో ఉండకపోవచ్చు. ఇరుపక్షాల వారికి నేను ముఖ్యవ్యక్తిని.
    రెండు రోజులకు సమస్యాపూరణ, పద్యరచన శీర్షికలను షెడ్యూల్ చేశాను. దయచేసి ఈ రెండు రోజులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
  20. ఆర్యా ! ధన్యవాదములు...
    సవరణతో..

    వరముగలదులె ముందట వచ్చునట్టి
    యుగమునందున విధితానె యగును గాద
    కోతి సింహంబు ఖగ రాజ క్రోడము మరి
    యశ్వముఖుఁ డాంజనేయుఁ డబ్జాసనుండు.

    రిప్లయితొలగించండి