4, ఏప్రిల్ 2014, శుక్రవారం

పద్య రచన – 556

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

21 కామెంట్‌లు:

 1. వానరమ్ములఁ గని నంత వత్సలతలు విరిసెనో!
  మానిని జనకజనుఁ గాచు మాన్యులైరటంచునున్
  తాను దలచి యన్నతోడ తల్లి వినగఁ బల్కెనా
  వేణుధరుడు ప్రేమ కురియ వీరలెల్లరాప్తులే!

  ఉత్సాహము
  ప్రతిపాదములో ఏడు సూర్యగణాలు, ఒక గురువు.
  ప్రాస ఉంది.
  ఐదో గణము మొదటి అక్షరము యతి.

  రిప్లయితొలగించండి
 2. శ్రీమతి లక్ష్మీదేవి గారి బాటలోనే:
  నరనాథుండగు రామచంద్రునకు నానారీతులన్ జేసె వా
  నరయూధమ్ములు పెక్కు సాయముల నన్నా! మంచివే చూడు మీ
  హరులంచున్ గొనియాడె సీరి కడ పద్మాక్షుండు వ్రేపల్లెలో
  పరితోషంబున దల్లియున్ వినుచు తద్వాక్యంబులన్ మెచ్చగా

  రిప్లయితొలగించండి
 3. వానరముల జూచి పరవశించెను శౌరి
  ముందు జన్మ స్మృతులు పొందెనేమొ?
  ఆట లాడు చుండె నత్యంత ప్రేమతో
  రాముడు కనుచుండె రమణ తోడ

  రిప్లయితొలగించండి
 4. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  చి.లక్ష్మీ దేవి ఉత్సాహకు పండిత నేమానిగారి
  మత్తేభ మునకు తేట గీతులతో బాటు నా యుత్పలమాల
  “గొల్లలు కోతులైరిపుడు గూరిమి వెన్నలు పాలు మీగడల్
  కొల్లగ నిచ్చినన్ ఋణము గొంతయు దీర్చగ లేము .యన్న!నీ
  తొల్లి భవమ్ము నందు నిను దొమ్మిని మూర్ఛను దేర్చి ప్రాణముల్
  చల్లగ గాచినారు గద”శౌరి యనెన్ బలదేవు జూచుచున్

  రిప్లయితొలగించండి
 5. మారిపోయె యుగము గాని మరవలేదు స్నేహమున్
  కోరి వేణుగానలోలు కొండముచ్చు గుంపులో
  చేరి యాడు చుండ తల్లి చెంత తలుపు మాటునన్
  ముర రిపువును జూచు చుండె మోదముప్పతిల్లగన్.

  రిప్లయితొలగించండి
 6. ముందు జన్మ దోస్తు లనుచు ముదముతోడ నాడుచున్
  వందనీయుడగు హనుమను వానరముల వెదుకుచున్
  చిందు లేయు చుండెనుగద చిన్ని కృష్ణుడన్నతో
  విందు గాను చూచు చుండె వెనుకనుండి తల్లియే

  రిప్లయితొలగించండి
 7. బాల కృష్ణుడు వెన్నను వానరముల
  కచట పెట్టుట జూడగ నంద గించె
  జగము నాడించు నాస్వామి నగవు తోడ
  నాడు చుండుట కపులతో నబ్బురంబె

  రిప్లయితొలగించండి
 8. మిత్రులారా! శుభాశీస్సులు.
  ఈనాటి అందరి పూరణలు చాలా బాగుగ నున్నవి.
  అక్కడక్కడ కొన్ని సవరణలు సూచించుచున్నాను:

  శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు:
  జన్మ స్మృతులు అను సమాసములో న్మ గురువగును. అందుచేత గణభంగము.
  రమణ అనునది పుంలింగము - కనుక ఆ పాదమును ఇలాగ మార్చుదాము కనుచునుండ రాముడును జననియు.

  శ్రీ తిమ్మాజీ రావు గారు:
  తీర్చగ లేము తరువాత యడాగమము రాదు. ఇలాగ మ్నార్చుదాము: దీర్చగలేము భ్రాత!
  ఆఖరి పాదమును ఇలాగ మార్చితే బాగుంటుంది:
  చల్లగ గాచినారనెను శౌరి ముదమ్మున నన్నగారితో.

  శ్రీ గండూరి లక్ష్మీ నారాయణ గారు:
  4వ పాదములో ప్రాస నియమమును పాటించలేదు. ఆ పాదమును ఇలాగ మార్చుదాము:
  వారిజాక్షు జూచుచుండె స్వాంతముల్లసిల్లగాన్

  శ్రీమతి శైలజ గారు:
  దోస్తులు కి బదులుగా మిత్రులు అంటే బాగుంటుంది.

  రిప్లయితొలగించండి
 9. పదుగురాడు మాట పాటియై ధర జెల్లు:

  అన్న చూడు మనును హాయిగా నాడగా
  మిత్రు లివ్వి యనును మెరయు కనుల
  తల్లి జూచి మురియ పిల్లగాండ్రను జూచి
  నంద నందనుండు చిందు లేయు.

  కోతి వంక జూచు కోతిని రమ్మను
  కోతి జన్మ మన్న గొప్ప దనును
  కోతి గుంపు జేరి చేతితో నిమురును
  లాతి ప్రేమ తోడ లాఘవముగ.

  కోతి చేష్ట జేయు కోతితో నాడును
  కోతి కిడును వెన్న కొంత దినును
  నాతి గాచి నట్టి నాటి యా కోతిని
  మరువ కుండె నేమొ మాధవుండు.

  రిప్లయితొలగించండి
 10. శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.

  ముచ్చటించితీవు మూడు పద్యములలో
  ముద్దు కృష్ణులీల ముదము మీర
  ప్రస్తుతింతు నీదు ప్రతిభా విశేషంబు
  మేలు మేలు బళిర! మిస్సన కవి!

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 11. పూజ్య గురుదేవులు పండిత నేమాని గారికి నమస్సులు. తమరి సవరణకు సలహాకు కృతజ్ఞతలు. సవరించిన పద్యము పంపుచున్నాను.
  వానరముల జూచి పరవశించెను శౌరి
  ముందు జన్మ చింత పొందెనేమొ?
  ఆట లాడు చుండె నత్యంత ప్రేమతో
  కనుచునుండ రాముడును జననియు.

  రిప్లయితొలగించండి
 12. పండిత నేమానిగారికి మీసూచనలు సవరణలకు
  ధన్యవాదములు

  రిప్లయితొలగించండి
 13. శ్రీ మిస్సన్నగారికి ...మీ పద్యములు చాలా ఆహ్లాదంగా ఉన్నాయి...

  రిప్లయితొలగించండి
 14. అమ్మ! చూడు మమ్మ! యన్నగా చెప్పినన్
  కొతి మూక తోటి కులుక జూచు
  నోట వేలు బెట్ట నొదలునా కొరకక
  చెప్ప వమ్మ తల్లి తప్పు లనుచు
  (చిన్ని కృష్ణుని చిలిపి చేష్టల తల్లికి బలరాముడు ప్రత్యక్షముగా జూపుట)

  రిప్లయితొలగించండి
 15. హరి చేయి బట్టి లాగగ
  హరియును తానాటలందునటులే దేలెన్
  హరరేయనెనన్నయ్యే
  అరవకనే యమ్మ గనెను నహ వేడుకగా !

  రిప్లయితొలగించండి
 16. మిత్రులందరికీ ధన్యవాదములు.
  ఉగాది సందర్భంగా అందమైన పద్యతోరణములు కట్టినది చూసి సంతసించినాను. కొంచెం తీరికగా చదువవలసి ఉంది.
  నేను నెట్ కు అందుబాటులో లేని కారణంగా పెండింగ్ లో ఉన్న వాటిలో నేను చేయగల వానిని ఇప్పుడు పూరణలు, వర్ణనలు చేస్తున్నాను.
  చతురతఁ జూపి కన్నెలనుఁ జక్కటి మాయల ముంచువానినిన్
  సతతము నమ్మి యుందురట సైపగలేక వియోగ,మాపురిన్
  లతలనుఁ బోలియున్న నవలామణులందరు; నట్లె దేవకీ
  సుతుని వరించి చేరి యొక సుందరి తేలె మనోజకేళిలోన్.

  పుట్టెనొ పున్నమి చంద్రుడు
  గట్టిదయిన నాదు పుణ్యఘన ఫలితమ్మై
  చిట్టి సుపుత్రుడు నవ్వగ
  నట్టింటఁ దళుక్కు మనెను నక్షత్రములే.

  సహనముఁ గోల్పోయినతఱి
  యహినొకదాని పడవేసి యతడొక ఫలమం
  దహివలన మరణమందిన
  మహినేలిన నరుని కథల మర్మమెఱుగుమా!

  మామిడి పండ్లనుఁ జూసిన
  నే మనుజునకైన మిగుల నింపగు, సతతం
  బామని వేళల మల్లెయు
  మామిడి సంబరములెల్ల మఱిమఱి పెంచున్.

  అతి పోకడలకు కాలము
  నతమస్తకమయ్యెనేడు; నమ్ముదు మదిలో
  శతవిధముల మెఱుగదియౌ
  గతకాలముకంటె వచ్చుకాలమె మేలౌ.

  అల్లదిగో మామిడి పై
  నల్లుకొనిన తీవమల్లి; యయ్యారే నీ
  యల్లరి యూహలు భళిభళి!
  మల్లియతీవియకుఁ గాచె మామిడికాయల్.

  నల్లని కొండల పాఱెడు
  చల్లని నీటి కెరటముల సాగినదదిగో
  తెల్లని గుఱ్ఱము సౌరుల
  వెల్లడి చేయగ పదములు విరళంబయ్యెన్.

  రిప్లయితొలగించండి
 17. అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యములన్నియును బాగుగ నున్నవి.
  అభినందనలు. "అతి పోకడలు" అను సమాసము బాగు లేదు - ఆ పాదమును మార్చండి.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి