15, ఏప్రిల్ 2014, మంగళవారం

పద్య రచన – 567

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు:

 1. మేటి యనగవచ్చు కోటేశ్వరాఖ్యుండు
  చిత్రకారు డెంతొ చిత్రముగను
  రమ్యమైనరీతి రామాయణంబంత
  నొక్కచోట జూపె నుత్సవముగ .

  రిప్లయితొలగించండి
 2. కట్టెన్ కొట్టెన్ తెచ్చెన్
  ఇట్టే రామాయణమ్ము నీ బొమ్మలలో
  కట్టిపడేశావ్ కొల్లగ
  గొట్టేశావ్ మనసులన్ని కోటేశన్నా !

  రిప్లయితొలగించండి
 3. చిత్ర కారుడు గీ చిన చిత్రములవి
  చూడ మురిపించు చుండెను చూడ్కులనిల
  ఓయి ! నంద్యాల కోటేషు ! బాయ కిడుదు
  నతుల శతములు మఱి నీకు నమ్రతగను

  రిప్లయితొలగించండి
 4. చక్కని రామాయణమున్
  మక్కువ గొలిపే విధముగ మహనీయముగన్
  జొక్కపు బొమ్మల జూపిన
  నక్కజమగుప్రతిభజూడ నాహా! యనరే!


  రిప్లయితొలగించండి
 5. చిత్ర విచిత్రపు బొమ్మలు
  చిత్రముగను గీసిచూపె చిత్రార్థ జుడున్
  చిత్రములు తెలుపు దశరధ
  పుత్రుని రామాయణమున పూర్వ చరిత్రన్.

  రిప్లయితొలగించండి
 6. భువిని పుత్రులు లేకున్న ముక్తి దొరక
  దంచు దశరథుడు సతుల యండ తోడ
  పుత్రకామేష్టి యాగమున్ ముదముతోడ
  సలుప నలుగురు పుత్రులు కలిగిరపుడు
  కౌశికుండు తా నేర్పెను కదన విద్య
  లన్ని రామసౌమిత్రుల కధిక నిష్ట
  గురువు యజ్ఞము గాయగన్ కూడనేగి
  రక్కసులతున్మి యజ్ఞమ్ము రక్ష జేసి
  జానకీ స్వయంవరమును జరుగు టెరిగి
  చనెను మిథిలకు గురువుతో జనకు సభకు
  శివుని చాపము విఱచి తా చెన్ను గాను
  దాశరథి జేకొనెను సీతఁ తనివి తోడ
  కుటిల మతితోడ కైకేయి కోరినట్టి
  వరములన్నియు నిచ్చెను వల్లభుండు
  తండ్రి యాజ్ఞను పాటింప తలచి, రాము
  డరగె సీతయు సౌమిత్రి యనుసరించ
  కానలకు తన పినతల్లి కారణముగ
  కనక లేడిని జూపి తా కాంక్ష తోడ
  పట్టి తెమ్మని భర్తను పట్టు బట్ట
  సీత కోర్కెను తీర్చగా సిద్ధమైన
  రాము డప్పుడు జానకీ రక్షకొరకై
  తోడ బుట్టువున్ నియమించి తోడు గాను
  వెడలె నాలేడి వెంటను వేగముగను
  చెంగుచెంగున దుముకుచు చిత్రముగను
  పోవుచున్నట్టి మృగమును పొందనెంచి
  చేసి నట్టి ప్రయత్నముల్ చెడుట గాంచి
  యసుర మాయ యని యెఱిగి యాగ్రహమున
  వాడి భాణము వేసెనా పావనుండు
  చచ్చు సమయము నందున హెచ్చు గళము
  నార్చె మారీషుడప్పుడు యార్తి తోడ
  రాము గళమున సౌమిత్రి రాక కోరి
  మాయతెలియక భయమున మాత సీత
  పంపె సౌమిత్రి రయమునన్ పతిని గావ
  మాత సీతను కాపాడు మార్గ మరసి
  రక్షరేఖను తాగీసి లక్షణముగ
  చనెనుసౌమిత్రి యన్నకు సాయ పడగ
  సాధు వేషముతోడను సాధ్వి కడకు
  రయము గావచ్చె నా దుష్ట రావణుండు
  సీతను తన మాటల తోడ గీత దాటు
  నటుల గావించి గొని పోయె నాకసమున
  నడ్డుతగిలిన ఖచరమున్ హత్య జేసి
  సీత నపహరించుట పక్షి చెప్పగానె
  పయన మయ్యిరా సోదరుల్ పక్షి జెప్పి
  నట్టి మార్గమ్ము నందున నార్తి తోడ
  కపుల సైన్యము కలసెను కాన లోన
  హనుమ రామ సౌమిత్రుల కాప్తు డయ్యె
  వార్ధి దాటి యామారుతి వార్త దెచ్చె
  సీత జాడ రామునకు తా జెప్పె నపుడు
  రణమునందున సమయగా రావణుండు
  రావణుని సోదరుని లంక రాజు జేసి
  తనదు రాజ్యమ్ము నకు నేగె దాశరథియు

  రిప్లయితొలగించండి
 7. కుంచె చేత నున్న కోరిన చిత్రముల్
  సృష్టి చేయ గలడు స్రష్ట వలెను
  రమ్య మైన రీతి రామాయ ణమ్మును
  చేరి కొలువ మదిని చిత్ర ముగను

  రిప్లయితొలగించండి
 8. రామాయణ కాండమ్ముల
  నేమారక వర్ణచిత్ర మేర్పడ గీయన్
  రామా! మా కోటేశుని
  సేమంబులజూచి సిరుల శీఘ్రమె యిమ్మా!

  రిప్లయితొలగించండి
 9. రామాయణ కాండమ్ముల
  నేమారక వర్ణచిత్ర మేర్పడ గీయన్
  రామా! మా కోటేశుని
  సేమంబులజూచి సిరుల శీఘ్రమె యిమ్మా!

  రిప్లయితొలగించండి
 10. రామాయణ కాండమ్ముల
  నేమారక వర్ణచిత్ర మేర్పడ గీయన్
  రామా! మా కోటేశుని
  సేమంబులజూచి సిరుల శీఘ్రమె యిమ్మా!

  రిప్లయితొలగించండి
 11. గురువులకు ప్రయాగ శ్రీరామచంద్రమూర్తి నమస్కారములు.
  --
  రామకథను మిగుల రమ్యముగ చిత్రించి
  కళకు వన్నె చిత్రకారి దెచ్చె
  ప్రతిభ నతడు దైవపరము జేసిన రీతి
  నిత్యమెరుక గలుగు నిక్కముగను.

  రిప్లయితొలగించండి
 12. చిత్ర పటము లోన చెన్నుగా చిత్రించె
  రామ కథను చాల రమ్యముగను
  కోరు కోర్కెలన్ని తీరు కోటేశుకు
  శక్తి కలుగ జేయు శౌరి సతము

  మొదటి తేట గీతిక లో చిన్న సవరణ
  “రాము డప్పుడు జానకి రక్ష కొరకు”

  రిప్లయితొలగించండి
 13. బాలుని చేష్టలున్ మరియు పౌరుషశాలిగఁ జేయు యుద్ధముల్,
  బాలనుఁ పెండ్లియౌ కథలఁ, బల్కిన మాటను నిల్పు శ్రద్ధలున్,
  కాలుని వోలె నిల్చి దశకంఠునిఁ జంపిన గాథలున్ భళీ!
  లీలలనెల్ల వ్రాసితివి లెస్సగ! వందనమందుకొమ్మిదే!

  రిప్లయితొలగించండి
 14. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  పద్యం బాగుంది. కోటేశన్న సంబోధించి చెప్పారు కనుక వ్యావహారిక పదప్రయోగం ఆమోదయోగ్యమే.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ సంపూర్ణ రామాయణ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘కనకలేడి’ అని సమాసం చేయరాదు కాదా... ‘కనక మృగమును’ అనండి.
  కోటేశును సంబోధించిన పద్యం కూడా బాగుంది.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘రమ్యముగ చిత్రించి’ అన్నచోట గణభంగం. అక్కడ ‘రమ్యముగ లిఖించి’ అనండి.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి