14, జులై 2015, మంగళవారం

సమస్యా పూరణము - 1730 (పుష్కరస్నాన మొనరింపఁ బోయె సిరులు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
పుష్కరస్నాన మొనరింపఁ బోయె సిరులు.

32 కామెంట్‌లు: 1. మ్రుచ్చు లుండవచ్చుజన సమూహమందు
  యనెడు మాట మరిచినట్టి యాత్రికుండు
  మూట నొడ్డున వెట్టి తా నీట మునిగి
  పుష్కర స్నాన మొనరింప బోయె సిరులు

  రిప్లయితొలగించండి
 2. పుష్కర తరుణ మందున ముష్క రుండు
  మంచి మౌనిగ నటియించి పొంచి యండి
  భక్త జనులంత నదిజేర యుక్తి గాను
  పుష్కర స్నాన మొరింపఁ బోయె సిరులు

  రిప్లయితొలగించండి
 3. పుణ్య గోదావరీ నదీ పుష్కరమన
  పోయి వచ్చితి ఫలమేము పోల్చలేను
  బస్సు ఛార్జీల పడగలు బుస్సుమనగ
  పుష్కర స్నానమొనరింపఁ బోయె సిరులు!

  రిప్లయితొలగించండి
 4. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘సమూహమందు+అనెడు’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘సమూహమందె| యనెడు...’ అనండి.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘భక్తజను లంత నది మున్గ మ్రుచ్చిలించె’ అంటే అన్వయం కుదురుతున్నది.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  నిజమే! ప్రొద్దుటూరు నుండి గోదావరికి వచ్చి వెళ్ళడం దూరభారమే!
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. పల్లె సీమను నివసించు బైతు యొకడు
  కలుషితంబైన జలమున చెలువతోడ
  పుష్కరస్నాన మొనరింప బోయె, సిరులు
  దేవత లొసగుదురనుచు తిరముగాను
  మునుగ వచ్చెను యతనికి మొండి వ్యాధి

  రిప్లయితొలగించండి
 6. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘బైతు+ఒకడు, వచ్చెను+అతనికి’ అన్నప్పుడు యడాగమాలు రావు. ‘బైతొకండు, వచ్చిన దతనికి’ అనండి.

  రిప్లయితొలగించండి
 7. ఇంటి లోపల దాచుట నింత డబ్బు
  సొమ్ములన్నియు గమనించె చోరుడొకడు
  వెడలగానె కుటుంబము వేడ్క మీర
  పుష్కర స్నాన మొనరింప, బోయె సిరులు

  రిప్లయితొలగించండి
 8. పితరులెల్లరు దీవింప ప్రీతిజెంది
  దురిత కోటులు కంపించి తూలిపోగ
  పుష్కరస్నాన మొనరింప బోయె, సిరులు
  సాటియే పుణ్య రాశుల సంపదలకు?

  రిప్లయితొలగించండి
 9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. గురుదేవులకు ధన్యవాదములు. గత గోదావరీ పుష్కరాలకు సతీసమేతంగా కాళేశ్వరం వెళ్లి వచ్చామండి.ఇపుడు వెళ్లాలని ఉన్నప్పటికి మా అమ్మాయి పెళ్లయి ఆరు నెలలు దాటనందువల్ల ప్రాప్తంలేదు. వార్తాపత్రికల్లో బస్సుఛార్జీల మోత గురించివిని ఆవిధంగా పూరించాను.స్వస్తి.

  రిప్లయితొలగించండి
 11. జనులు గోదావరీనదీ జలమునందు
  పుష్కరస్నాన మొనరింపఁ బోయె - సిరులు
  సంపదలు వుష్కలమ్ముగ నింపుమనుచు
  గుండెలందున భక్తితో కోరుకొనగ

  రిప్లయితొలగించండి
 12. పుణ్య మెంత యో కలుగును బూర్వికు లకు
  పుష్కర స్నాన మొనరింప, బోయె సిరులు
  పుష్క రస్థల మందున ముష్కర తతి
  దాడి జేయగ మామీ ద ధనము కొఱకు

  రిప్లయితొలగించండి
 13. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. చనగ గోదావరి కడకు సలిపి పూజ
  పుష్కర స్నాన మొనరించ, పోయె సిరులు
  దొంగలు పడి గృహమ్మును దోచుకొనగ
  నలువ రాతను తప్పించ నరుని తరమె?

  రిప్లయితొలగించండి

 15. తొలుత జేసిన పాపముల్ తొలగి పోవ
  పుష్కరస్నాన మొనరింప బోయె సిరులు
  కంటకమ్ముల మమతలు కాలిపోయె
  ప్రథమ సోపానమది ముక్తి పథము నందు

  రిప్లయితొలగించండి
 16. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. పుష్కర స్నాన మొనరింపఁ బోయె, సిరులు
  మూటఁ గట్టుకు దార సుపుత్రులెల్ల
  వెంటనడవంగ సత్ఫలాపేక్ష తోడ
  దానధర్మాది కార్యముల్ దలచి మదిని.

  రిప్లయితొలగించండి
 18. తే.గీ;పుత్ర బాంధవులను గూడి పుష్కరాల
  కొఱకు తానేగెసతిగూడి కూర్మితోడ
  ముక్తి మాటదేవుడెరుగు ముష్కరుండు
  ధనము నెల్ల దోచె నుయింక దారి యేది
  పుష్కర స్నానమొనరింప పోయె సిరులు.

  రిప్లయితొలగించండి
 19. మిత్రులందఱకు నమస్సులతో...

  (ఎన్నఁడునుఁ బుష్కరమ్ముల మాట సంచికను మగనిఁ బురికొల్పి, స్నానమాచరింపఁజేసిన యొక గృహిణి వృత్తాంతము)

  ఎన్నఁడుం బుష్కరమ్ముల నెదనుఁ దలఁచి,
  పోవనట్టిడు వానికిం, బోవుదమనఁ
  బుష్కరస్నాన మొనరింపఁ హేయం! సిరులు
  గృహమునందు సమృద్ధిగఁ బోహళించె!!

  రిప్లయితొలగించండి
 20. గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన విషాద సంఘటనలో మరణించినవారి ఆత్మలకు శాంతి చేకూరాలని, వారికి పుణ్యగతులు లభించాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 21. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. తే.గీ;పుత్ర బాంధవులను గూడి పుష్కరాల
  కొఱకు తానేగెసతిగూడి కూర్మితోడ
  ముష్కరుండు దో చెనచట ముల్లె నెల్ల
  పుష్కర స్నానమొనరింప పోయె సిరులు.
  మొదట పంపిన పద్యంలో ఓ పాదం ఎక్కువైందని మళ్ళీ మార్చి వ్రాశాను.

  రిప్లయితొలగించండి
 23. వాహనములు, భోజనములు, వసతి, కొరకు
  ఉన్న పైకమునకు తోడు యుంగరంబు
  వదలె, పుణ్యమెంత ప్రోవు బడెనొ గాని
  పుష్కర స్నాన మొనరింప, బోయె సిరులు

  రిప్లయితొలగించండి
 24. పుష్కరస్నాన మొనరింపఁ బోయె, సిరులు
  పెరుగునని ఘోర పాపంబు లరుగు ననియు
  నమ్మకమె కాని యాశలు వమ్ము సుమ్మి
  కర్మ బద్ధుల కేకల్గు కరము కలిమి

  రిప్లయితొలగించండి
 25. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  జన్మ జన్మల పాపము కన్మరుగవ
  మునుగ ముమ్మారు గంగను ముదుసలొకెతె
  కట్ల కాసుల పేటయే కన్మరుగవ
  పుష్కరస్నాన మొనరింపఁ బోయె సిరులు.

  పండు ముదుసలి యొక్కతె నిండుహృదిని
  పుష్కరస్నాన మొనరింపఁ బోయె; సిరులు
  సిరియె కురిపించ తదుపరి కరివరదుడు
  పుణ్య మొందగ జేసెను పుష్కలముగ

  రిప్లయితొలగించండి
 26. కంది శంకరయ్యగారికి,

  నా పూరణమును నేఁడు నా సెల్ ఫోను నుండి పంపునపుడు దోషములు దొఱలినవి. నేనుం జూచుకొనకయే ప్రచురించితిని. మన్నింపుఁడు. దానిని ఈ దిగువన సవరించుచుంటిని. పరిశీలింపఁగలరు.

  (ఎన్నఁడునుఁ బుష్కరమ్ముల మాట వచింపని మగనిఁ బురికొల్పి, స్నానమాచరింపఁ జేసిన యొక గృహిణి వృత్తాంతము)

  ఎన్నఁడుం బుష్కరమ్ముల నెదనుఁ దలఁచి,
  పోవనట్టిడు వానికిం, బోవుదమనఁ
  బుష్కరస్నాన మొనరింపఁ బోయె! సిరులు
  గృహమునందు సమృద్ధిగఁ బోహళించె!!

  రిప్లయితొలగించండి
 27. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  కందం, ఆటవెలది, అర్ధసమవృత్తాలను తప్ప మిగిలిన పద్యాలను ఎన్ని పాదాలతోనైనా వ్రాయవచ్చు.
  *****
  అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మూడవ పాదంలో గణదోషం. ‘వదలె పుణ్య మెంతగ ప్రోవు బడెనొ కాని’ అనండి.
  *****
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  గుండు మధుసూదన్ గారూ,
  అవి టైపాట్లని గమనించే నేను ప్రస్తావించలేదు. సవరించినందుకు సంతోషం, అభినందనలు.

  రిప్లయితొలగించండి
 28. శ్రీ గుండు మధుసూదన్ గారి పద్య భావం బాగుంది , నాలుగవ పాదం మరొక్క మారు పరిశీలించగలరు !

  రిప్లయితొలగించండి
 29. గురుడు సింహాన తానదే కొలువునుండ
  పుష్కరాలగు గోదారి పొందు-నఘము
  పుష్కరస్నానమొనరింప పోయె-సిరులు
  వచ్చి ముక్కోటి దైవాలు వరములీయ

  పుష్కరస్నానమొనరింపపోయె,సిరులు
  నిచ్చు గౌతమిని నఘము,నెలవునగుట
  మూడుకోట్లగు దైవాలు ముచ్చటుండ,
  సింహమందున గురుడదే చెలువునుండ

  సింహగురుడైన కాలాన చేరు పుష్క
  రుడును గోదారి దైవాలు రోచిసంద
  పుష్కరస్నాన మొనరింప పోయె,సిరులు
  నిచ్చునదియందు పాపాలు,నిచ్చుశుభము

  గౌతమీనది యందున ఘనపు నఘము
  పుష్కరస్నానమొనరింప పోయె సిరులు
  దైవమా వెంకటేశుడు తనరెనచట
  పూజలిడినను సంపద పుణ్యమిడును

  రిప్లయితొలగించండి
 30. పుష్కర స్నాన మొనరింప?బోయెసిరులు
  ప్రాణ నష్టముతోబాటు ఫలములేని
  అష్ట కష్టాలు భక్తికి నంటగట్ట?
  ఆంద్ర వర్యులకానందమబ్బుటెట్లు?

  రిప్లయితొలగించండి
 31. డా.విష్ణునందన్ గారికి ధన్యవాదములు. నాలుగవ పాదమందు ప్రాసయతి భంగమైనది. (మనస్సున ముందు "గేహ"మనుకొని, సెల్ ఫోన్‍లో వ్రాయునపుడు "గృహ"మని వ్రాసితిని. దోషమును గమనింపకయే ప్రకటించితిని. మన్నింపుఁడు. దయతోఁ దెలిపినందులకుఁ గృతజ్ఞతలు.

  దీనిని...

  ఎన్నఁడుం బుష్కరమ్ముల నెదనుఁ దలఁచి,
  పోవనట్టిడు వానికిం, బోవుదమనఁ,
  బుష్కరస్నాన మొనరింపఁ బోయె! సిరులు
  గేహమందు సమృద్ధిగఁ బోహళించె!!

  ...నని సవరించుచుంటిని. పరిశీలింపఁగలరు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 32. డా. విష్ణునందన్ గారూ,
  మీరు మిత్రుల పూరణలను నిశితంగా పరిశీలిస్తూ సూచనల నందిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదా లర్పిస్తున్నాను.
  *****
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ******
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గుండు మధుసూదన్ గారూ,
  సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  (నేనుకూడా ఆలోపాన్ని గుర్తించలేదు!)

  రిప్లయితొలగించండి