27, జులై 2015, సోమవారం

సమస్యాపూరణ - 1743 (తండ్రు లేవురు గల రండ్రు ధరను బుధులు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
తండ్రు లేవురు గల రండ్రు ధరను బుధులు.
(ఒకానొక అవధానంలో ఇచ్చిన సమస్య)

32 కామెంట్‌లు:

 1. కన్న తండ్రి, పెంచిన వాఁడు, కరుణతోడ
  నుపనయనమును జేసిన యుత్తముండు,
  గురువు, పిల్లనిచ్చిన మామ, కూడి జూడ
  తండ్రు లేవురు గల రండ్రు ధరను బుధులు!!

  రిప్లయితొలగించండి
 2. తండ్రి పెదతండ్రి పినతండ్రి తనయు డనగ
  ఉన్నతం బుగ దీర్చును మిన్న గురువు
  సతిని చేపట్టు సమయము పతికి మామ
  తండ్రు లేవురు గలరండ్రు ధరను బుధులు

  రిప్లయితొలగించండి
 3. కనిన తండ్రియె తొలిగాను కాగ తండ్రి
  వచ్చి చేరర ఎందరో వయసు తోను?
  గురులు , యాప్తులు , హితులును గూడి పెంచ
  తండ్రు లేవురు గల రండ్రు ధరను బుధులు

  రిప్లయితొలగించండి
 4. జన్మకారకు దైనట్టి జనకుడొకడె
  గాని గురువుయు,దైవము,కాంత నిచ్చు
  మామ,యన్నయు తండ్రి సమాను లనగ
  తండ్రు లేవురు గల రండ్రు ధరను బుధులు

  రిప్లయితొలగించండి
 5. కన్నవాడును, పెంచిన ఘనుడు, తనకు
  నొడుగు జేసిన వాడును, యొజ్జ,కన్య
  నిచ్చి పెండిలి జేసిన హితుడు, కలిపి
  తండ్రు లేవురు గల రండ్రు ధరను బుధులు.

  రిప్లయితొలగించండి
 6. జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
  బహుకాల దర్శనం...సంతోషం!
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘గురులు+ఆప్తులు’ అన్నపుడు యడాగమం రాదు. ‘గురువు లాప్తులు’ అనండి.
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘గురువును’ అనండి.
  *****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. వినయము వివేక మున్నట్టి విమల మతికి
  జనకుడొక్కడయిననేమి జగతి యందు
  అన్నయు, గురువునధికారి యాలితండ్రి
  తండ్రులేవురు గలరంద్రు ధరణి యందు

  రిప్లయితొలగించండి
 8. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. అప్ప,గురువు, ప్రజాపతి యంతె కాక
  మామకుడు, భర్త తండ్రియు మగువకిలను
  శాస్త్ర సమ్మత మైనట్టి సన్నుతులగు
  తండ్రులేవురు గలరంద్రు ధరణి బుధులు.

  రిప్లయితొలగించండి
 10. కన్న తండ్రియు, నగ్ర్యుడు, కరుణతోడ
  చదువు నేర్పిన గురువుయు, సతికి దండ్రి,
  వడుగు జేసిన వాడును వరుస జూడ
  తండ్రి లేవురు గలరండ్రు ధరను బుధులు!!!

  రిప్లయితొలగించండి
 11. నాన్న, మేనమామ, గురువు, నాతినిచ్చి
  నట్టి మామ మరియు నన్న యట్టివార
  లందరను గలిపి మనుజు లందరకును
  తండ్రు లేవురు గలరంద్రు ధరణి బుధులు!

  రిప్లయితొలగించండి
 12. కళ్ళలో పెట్టుకొని పెంచు కన్నతండ్రి
  గురువు దైవము నన్నయ్య మరియు మామ
  కలసి ప్రేమను పంచుచు కరము తృప్తి
  తండ్రులేవురు కలరంద్రు ధరను బుధులు

  రిప్లయితొలగించండి
 13. గురుదేవులుసూచించిన సవరణ తో పద్యము
  జన్మకారకుడైనట్టి జనకుడొకడె
  గాని గురువును,దైవము,కాంత నిచ్చు
  మామ,యన్నయు తండ్రి సమాను లనగ
  తండ్రు లేవురు గల రండ్రు ధరను బుధులు

  రిప్లయితొలగించండి
 14. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘గురువును’ అనండి.
  *****
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. కనిన తండ్రిపెం చినతండ్రి గారవమున
  నుపనయనమును నొనరించు నుత్త ముండు
  కూతు నిచ్చిన మామయు ,గురువు నాగ
  తండ్రు లేవురు గలరండ్రు ధరను బుధులు

  రిప్లయితొలగించండి
 16. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. 21-8-1929 నాటి అవధానంలో అష్టావధాని బీరము సుబ్బారెడ్డి గారి పూరణ.....

  రాజనామంబు సార్థకముగా నశ్రాంత
  ........మవనిఁ బాలించు భూధవుఁ డొకండు
  సంస్కృతీబంధ విస్తరణ కారకుఁడైన
  ........యకలంకమూర్తి దేశికుఁ డొకండు
  జీవయాత్రా సుఖస్థితి కాఢ్య యైనట్టి
  ........భార్యను గన్నట్టి ప్రభు వొకండు
  యాతనారూప దేహాత్మకుఁ డగు తన్ను
  ........నవనికిఁ దెచ్చిన యతఁ డొకండు

  నుపనయనమును జేసి మహోపకృతిని
  కలల నేర్పిన విజ్ఞానఖని యొకండు
  గాగ నొక్కొక్క నరునకు గణనసేయఁ
  దండ్రు లేవురు గల రండ్రు ధరను బుధులు.

  (కొడిహళ్ళి మురళీమోహన్ గారికి ధన్యవాదాలతో...)

  రిప్లయితొలగించండి
 18. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  భూతములనైదుగా గొల్చు పుడమి జనులు
  పుత్రులేవురు పాండు నృపునకనెదరు
  భర్త లేవురు పాంచాలి పడతి కనుచు
  తండ్రు లేవురు గల రండ్రు ధరను బుధులు.

  రిప్లయితొలగించండి
 19. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

  కన్నవాఁ, డుపనేత, శిక్షకుఁడు, నన్న
  దాతయుం, భయత్రాతయుఁ దఱచి చూడఁ
  దండ్రు లేవురు గల రండ్రు ధరను బుధులు!
  శంకరాభరణోత్కృష్ట! శంకరార్య!!

  రిప్లయితొలగించండి
 20. కంది శంకరయ్యగారూ, మీ రుదాహరించిన సీసపద్యము బహుసుందరముగ నున్నది. చక్కని పద్యము నందఁజేసినందులకు ధన్యవాదములు!

  రిప్లయితొలగించండి
 21. బాలు డభిమన్యు డేగగ పద్మమునను
  సైంధవుం డడ్డు పడుటచే శక్తులుడిగి
  నల్వురును, దూరమేగుటఁ నరుడు నకట!
  తండ్రు లేవురు గల రండ్రు ధరను బుధులు.

  (క్రొత్తదనం కోసం)

  రిప్లయితొలగించండి
 22. భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు.
  మీరు ఫోన్‍లో వినిపించిన శ్లోకాన్ని కూడ పోస్ట్ చేస్తే బాగుండేది!
  *****
  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. ధన్యవాదములు శంకరయ్యగారూ!

  ఆ శ్లోకమిది:

  జనితా చోపనేతా చ, యశ్చ విద్యాం ప్రయచ్ఛతి,
  అన్నదాతా భయత్రాతా, పంచైతే పితరః స్మృతాః.

  రిప్లయితొలగించండి
 24. తండ్రి,గురువును,నన్నయు,తనకు పిల్ల
  నిడెడివాడు పోషకుడును,నేర్పుమనకు
  జీవితంబును నిచ్చియు,చెలగువారె
  తండ్రులేవురు గలరండ్రు ధరను బుధులు

  తండ్రి,తాతయు,ముత్తాత తర్పణమున
  పిదప ననితాత,నా తాత పితరులె గద
  చెలగు చుందురు వంశాన చెలువమిడుచు
  తండ్రులేవురు గలరండ్రు ధరను బుధులు

  తనకు వయసున పెద్దలు తండ్రులేను
  గాదె,యతిధియు,మిత్రులు,కరము రక్ష
  సేయువాడును మామయు సేమమీయ
  తండ్రులేవురు గలరండ్రు ధరను బుధులు

  ఇంతి కలలోన భర్తయు,నింటియత్త,
  మామ,బావలు,నాడుబిడ్డలు మాన్యులెగద
  వారె తండ్రులు కనగాను పడతికెపుడు
  తండ్రులేవురు గలరండ్రు ధరను బుధులు

  వయసునందున విద్యచే వరలువారు
  ఆత్మబలమును గూర్చెడి యాత్మసఖుడు
  పాలకుండును,మామయు పావనులగు
  తండ్రులేవురు గలరండ్రు ధరను బుధులు

  రిప్లయితొలగించండి
 25. అన్నదమ్ములునార్గురు నందరండు
  పెద్దనాన్నయే|చదివించిపెద్దజేసె
  కలసి మెలసున్న వారంత దలచగ?పిన
  తండ్రు లేవురుగలరంద్రు ధరను బుధులు

  రిప్లయితొలగించండి
 26. గుండు మధుసూదన్ గారూ,
  ధన్యవాదాలు.
  *****
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి

 27. 243.తే.గీ:జగతి యందు జన్మ నొసగు జనకుడు మరి
  ఉపనయనము జేసినయట్టి యుత్తములును
  గురువు నన్నయు మామయు కూర్మి తోడ
  తండ్రులేవురు గలరండ్రు ధరను బుధులు.

  రిప్లయితొలగించండి

 28. 243.తే.గీ:జగతి యందు జన్మ నొసగు జనకుడు మరి
  ఉపనయనము జేసినయట్టి యుత్తములును
  గురువు నన్నయు మామయు కూర్మి తోడ
  తండ్రులేవురు గలరండ్రు ధరను బుధులు.

  రిప్లయితొలగించండి

 29. 243.తే.గీ:జగతి యందు జన్మ నొసగు జనకుడు మరి
  ఉపనయనము జేసినయట్టి యుత్తములును
  గురువు నన్నయు మామయు కూర్మి తోడ
  తండ్రులేవురు గలరండ్రు ధరను బుధులు.

  రిప్లయితొలగించండి
 30. నా రెండవ పూరణము:

  కన్నవాఁడును, నిల్లాలి కన్నతండ్రి,
  వడుగుచేసినవాఁడు, గురుఁడును, నన్న
  యంచు గణనసేయఁగఁ గొనియాడఁబడెడి
  తండ్రు లేవురు గల రండ్రు ధరను బుధులు!

  రిప్లయితొలగించండి
 31. తే.గీ.అనగనగఒక రాజనియతనికేడు
  కొడుకులనివినియుంటినిగురుతునాకు
  వారి సంతానముయెదిగి పిలువపలుకు
  తండ్రు లేవురు గల రండ్రు ధరను బుధులు

  రిప్లయితొలగించండి