20, అక్టోబర్ 2015, మంగళవారం

పద్యరచన - 1039

కవిమిత్రులారా!
ఈనాటి పద్యరచనకు అంశము...
‘బతుకమ్మ’

25 కామెంట్‌లు:

 1. బతుకమ్మను బూజింతురు
  వెతలను నిక బాపు కొఱకు వెలదులు భక్తి
  న్సతతము గాపా డుమ మఱి
  బతుకమ్మా !నీ కునిడుదు వందన శతముల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ‘వెతల నికన్ బాపు మనుచు వెలదులు...’ అంటే ఇంకా బాగుంటుంది.

   తొలగించండి
 2. రకరకమ్ముల పూలను రమ్యముగను
  పళ్ళెమందున నమరించి పడుతులంత
  పసుపు గౌరమ్మ నాపూల పైననుంచి
  ఆడి పాడుచు నుందురు వేడుకగను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 3. అతివ లంతయు శ్రీచక్ర మనగ నొప్పు
  గొప్ప రూపమ్ము విరులచే కూర్పుసేసి
  పరమ పావని గౌరమ్మ బతుక వమ్మ
  యనుచు బతకమ్మ పండగన్నాచరింత్రు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ పద్యం బాగుంది. అభినందనలు.
   ‘పండుగ నాచరింత్రు’ అంటే సరిపోయేది కదా!

   తొలగించండి
 4. మిత్రులందఱకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!

  (తెలంగాణమునం బడతు లందఱు బ్రతుకమ్మ పండుగ నాఁ డెట్టుల బ్రతుకమ్మ నలంకరించి, పూజింతు రనఁగా...)

  సీ.
  తంగేడు పూవులఁ ♦ దాంబాలమునఁ గుండ్ర
  .....ముగ నందముగఁ బేర్చి, ♦ మురువు సూపు
  వివిధమ్ములగు రంగు ♦ లవి గునుగులఁ జేర్చి,
  .....మందార, కట్ల, చే ♦ మంతుల నిడి,
  బంతిపూవులు పోఁక ♦ బంతిపూవులు వింత
  .....సొబగుల నీనఁగాఁ ♦ జూపరులకుఁ
  బ్రకృతి సోయగమంతఁ ♦ బండువు సేయంగ
  .....బ్రతుకమ్మ నడుమ గౌ ♦ రమ్మనుంచి,


  గీ.
  ధగధగలతోడి పట్టుపీ ♦ తాంబరములఁ
  గట్టుకొనియును మెఱయుచు ♦ ఘనముగాను
  కనకదుర్గకు లక్ష్మికిఁ ♦ గడు ముదమున
  వందనము సేసి, యర్చింత్రు ♦ పడతులంత!


  కం.
  బ్రతుకమ్మఁ బట్టుకొనియు వ
  నితలందఱు నూరి చివర ♦ నిక్కపు భక్త్యు
  న్నతి నాడి పాడియును స
  న్మతి బ్రతుకమ్మను నిమజ్జ ♦ నము సేతురయా!


  ఆ.వె.
  ముత్తయిదువ లపుడు ♦ పూతురు పసుపును
  పుస్తెలకును గౌరి ♦ పూజసేసి!
  సన్నిహితులు హితులు ♦ సఖులంత కష్టసు
  ఖములఁ జెప్పుకొండ్రు ♦ కలిసిన కడ!


  తే.గీ.
  ఇంటినుండియుఁ దెచ్చిన ♦ హితకరమగు
  తీపి వస్తువులనుఁ బంచి, ♦ తినియు, మఱల
  సద్దులను మూటఁగట్టియు ♦ సంబరమున
  నిండ్లకుం జేరఁ బోదురా ♦ యింతులంత!


  కం.
  బ్రతుకమ్మ పర్వదినమున
  నతి సంతోషమున దుర్గ ♦ నవ్యానందాల్
  సతులందఱ కిడి, వారలఁ
  బతులకుఁ బిల్లలకు స్థిరత ♦ బ్రతు కిడుఁ గాతన్!


  <||> శుభం భూయాత్ <||>

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండు మధుసూదన్ గారూ,
   బతుకమ్మ పండుగ ప్రాశస్త్యాన్నీ, చేసుకొనే విధానాన్నీ వివరించిన మీ ఖండకృతి అద్బుతంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 5. ద్విపద మాలిక (షట్పది):

  శ్రీగౌరి బ్రతుకమ్మ సిరులీయ రావె
  మాగౌరి వీవమ్మ మన్నింపు మమ్మ
  ఇంపార పూజింప యిలవేల్పు వమ్మ
  సొంపార సల్లంగ సూడంగ రావె
  వెతలన్ని బాపంగ వేగంబ రావె
  బ్రతుకమ్మ బ్రతుకమ్మ బంగారు తల్లి

  రిప్లయితొలగించండి
 6. 'ప్రాణద' యని స్తుతియించుచు
  మానసమున గొల్చినంత మన్నించెడు క
  ల్యాణియె బ్రతుకమ్మ! తెలం
  గాణపు నవరాత్రి మాత కలతలఁ దీర్చన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 7. రంగు రంగుల పూలను రాశిపోసి
  వరుసగా బేర్చి వనితలు పళ్ళెరమున
  మంచి బతుకమ్మలనుదీర్చి మధ్యలోన
  గౌరి దేనిని కొలువుంచి ఘనము గాను
  నందరొకచోట చేరుచు నాడిపాడి
  సంబరమ్మును జేతురు శ్రద్ధతోడ!!!

  రిప్లయితొలగించండి
 8. రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   ‘ఆంధ్రవరుల కెప్పు డింద్రధనువు’ అనండి. ‘మాన్పే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.

   తొలగించండి
 9. బంతి గునుగు నందివర్ధనములఁ
  పడతు లెల్ల చేరి ప్రార్థనలను
  భక్తి తోడ చేసి బతుకమ్మలను గొల్చి
  పాట లెన్నొ పాడి పరవశింత్రు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో గణదోషం. ‘నందివర్ధనములఁ బేర్చి’ అనండి.

   తొలగించండి
 10. పూజ్యు లు శంకరయ్య గారికి వందనములు. నా పద్యము చూడ లేదు. తిలకించ గోర్తాను.

  రిప్లయితొలగించండి
 11. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  కాకుంటే కొన్ని వ్యావహారిక పదాలు పడ్డాయి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూజ్యు లు శంకరయ్య గారికి వందనములు. ద్విపద కద పాటలా పాడుకోవడానికి బాగుంటాయని ఉద్దేశపూర్వకంగానే వ్రాసాను. అలా వ్రాయకూడదంటే సవరించ గలను.

   తొలగించండి
 12. తరములెంచగలుగు తత్వంబు నిండిన
  నమ్మకంబు సాకు –సమ్మతంబు
  భక్తి భావనలకు –బతుకమ్మ పండుగ
  ఆంద్రవరుల కెప్పుడింద్ర ధనువు.
  బతుకమ్మ పండుగనగా
  హితములు బోధించ గలిగి హీ నత ద్రుంచే
  మతమది మానవ తత్వము
  సతతము సద్భక్తి సాకు సంబరమిదియే|
  ఆటపాట లందు నాడు పడుచులెల్ల
  పూల పులకరింత జాలమందు
  పట్టుగలుగ జేయు బతుకమ్మ పండుగ
  జగతి మెచ్చగలుగు జాతరనగ

  రిప్లయితొలగించండి
 13. ధన్యవాదాలండీ."నందివర్ధనం "ఒకేపదం అనేధ్యాసలో పడి అక్షరాలు ఎక్కువవౌతాయని అలా పొరపాటు జరిగి పోయింది.సవరించానండి.
  బంతి గునుగు నందివర్ధనములఁబేర్చి
  పడతు లెల్ల చేరి ప్రార్థనలను
  భక్తి తోడ చేసి బతుకమ్మలను గొల్చి
  పాట లెన్నొ పాడి పరవశింత్రు.

  రిప్లయితొలగించండి