22, అక్టోబర్ 2015, గురువారం

పద్యరచన - 1041

దసరా శుభాకాంక్షలు
కవిమిత్రులారా!
ఈనాటి పద్యరచనకు అంశము...
“విజయదశమి”

39 కామెంట్‌లు:

 1. మిత్రులందరకూ విజయదశమి శుభాకాంక్షలు.
  'శమీ శమేతి పాపం
  శమీ శతృ వినాశనం
  అర్జునస్య ధనుర్ధారీ
  రామస్య ప్రియ దర్శనః'
  1ఆ వె:పాడ్యమి తిథి నుండి పరమేశు రాణిని
  ప్రస్తుతించి కొల్చి భక్తి తోడ
  విజయదశమి నాడు విజయంబు గోరుచు
  జమ్మి చెట్టు కొలువ జయము లొదవు.

  2ఆ.వె:జమ్మి చెట్టు గొల్చి జయమందిరెల్లరు
  నాడు విజయ మందె నరుడు తాను
  రాముడందె జయము రావణుఁ బరిమార్చి
  మరణమందె గాదె మహిషు డపుడె

  3.ఆ.వె:దుష్ట శక్తులణచ దుర్గమాతాష్ట భు
  జముల తోడ బుట్టి జంపె మహిషు;
  విజయదశమి నాడె వీరుడౌ రాముడు
  రణము నందు గెల్చె రావణాఖ్యుఁ

  రిప్లయితొలగించండి
 2. గు రు మూ ర్తి ఆ చా రి *

  గురువుగారికి వ౦దనములు
  దసరా స౦దర్బముగా కాళికామాతపై

  స్ర గ్ద రా వృత్తము :-

  ***********

  చ౦డీ ! హూ౦కార. నిర్ఘోష
  తత గగన ! రోషజ్వలన్నేత్ర. ! జన్యో


  ఛ్చ౦డీ ! ధ్వా౦తారి సాహస్ర నిభ నిలయినీ !
  చక్ర శూల స్వరూ కో


  ద౦డాస్త్రాద్యాయుధాపీత దనుజ జన హృద్రక్త. ! హర్యక్ష యుగ్యా !


  ము౦డ గ్రైవా౦చితా !
  శ౦భుసతి ! విజయ. !
  చాము౦డి ! శ్రీకాళికా౦బా !

  ప్రతిపదార్ధము::

  హు౦కారనిర్ఘోషతత గగన :
  హు౦కారధ్వనిచే ఆవరి౦పబడిన
  ఆకాశ౦గలదాన / జన్య +ఉఛ్చ౦డి,: యుధ్దభయ౦కరీ / ధ్వా౦తారి సాహస్ర నిభ నిలయినీ :వేయి సూర్యుల కా౦తి గలదాన : స్వరూ : అ౦కుశ౦ / కోద౦డ + అస్త్ర +ఆది + ఆయుధ +ఆపీత +దనుజ జన హృద్రక్త : కోద౦డము అస్త్రము మొదలగు ఆయుధములచేత త్రాగబడిన రాక్షసుల యొక్క. గు,౦డెలలోని రక్తము గలదాన / హర్యక్ష యుగ్య. : సి౦హ వాహినీ / ము౦డ గ్రైవ + అ౦చిత : రక్కసుల తలల యొక్క హారము చేత. ఒప్పినదానా
  :

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   ప్రౌఢపదబంధాలతో మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 3. మీకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు

  శ్రీ దుర్గాయైనమః

  కందము:
  భర్గుని దేవీ ! మాతా !
  దుర్గా ! నిన్ మదిని వేడి దోయిలినిడ స
  న్మార్గము జూపింతువు, దు
  ర్మార్గము మాదరికి రాగ మసియగు గాదా !


  కందము:
  అ మ్మలకే ప్రియ సుతవే !
  అమ్మలకే యమ్మవీవు యపరాజితవే !
  అమ్మహిషు పాలి కాళీ !
  అమ్మహిమను జూప మహిని యఘములు ఖాళీ !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ దుర్గాస్తుతి మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 4. విజయ దశమి శుభాకాంక్షల తో ,,,,
  -----

  విజయ దశమి నాడు వీడని భక్తిని
  జమ్మి చెట్టు పూజ సలుపు నెడల
  కార్య సిద్ధి గలుగు ,కలుగువాడు ను నగు
  సంది యంబు వలదు సత్య మిదియ

  రిప్లయితొలగించండి

 5. విజయ దశమి నాడు విష్ణు బూజనుసేయ
  సకల సంపదలును,సంతునిచ్చు
  రాముడటులజేసి రావణువధియించె
  అర్జునుండు గెలిచె నరి గణమును

  రిప్లయితొలగించండి
 6. పోచిరాజు సుబ్బారావు గారూ శ,
  మీ రెండవ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. శాంభవి విజయ మామహి షాసురుపయి
  దాశరధి జయించె నసురుఁ దశశిరునట
  పాండు పుత్రుల కజ్నాత వాస ముడిగె
  విజయ దశమి జరుపుదురు వేడ్క తోడ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 8. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

  నవదుర్గలు రక్కసులన్
  శివమెత్తుచు సంహరించి క్షేమము నీయన్
  స్తవనీయము విజయదశమి
  యవనిన్ జనులెల్ల దుర్గ నారాధించన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 9. మహిషుని ఖండించి మహి శాంతి నెలకొల్పి
  ...........మాత రక్షించిన మహితదినము
  స్తంభమ్ము వెల్వడి దానవు మర్దించి
  .............ప్రహ్లాదు గాచిన భవ్యదినము
  రావణు దెగటార్చి రామచంద్రుడు భూమి
  ............భారము బాపిన పర్వదినము
  అజ్ఞాతమౌ వాస మంతమై పాండవుల్
  ............తలయెత్తి నిలచిన ధన్యదినము


  వాహనము లాయుధమ్ముల పరికరముల
  భక్తి నర్చించి కాపాడ ప్రణతులనిడి
  సర్వులును శక్తి మహిమను సన్నుతించి
  విజయ మందెడు పర్వమ్ము విజయదశమి.


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ప్రహ్లాదుని ప్రస్తావించిన పాదంలో కర్తృపదం లోపించింది.

   తొలగించండి
 10. శుభము నొసగునాశ్వీయుజ శుద్ధ దశమి
  దసర యంచును జనులంత దండి గాను
  వేడ్క జేయుచు నుందురీ వేళ యందు
  దుష్ట శక్తుల దునుమాడి శిష్ట జనులు
  ధర్మ స్థాపన జేసిరీ ధరణి యందు
  దనుజ మహిషును వధియింప తల్లి కాళి
  ఉగ్ర రూపమ్ము ధరియించి యుర్వి బ్రోచె
  రాము కున్ విజయునకును రమ్య మైన
  విజయ మందజే సినది గా విజయ దశమి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శాస్త్రి గారూ,
   మీ పద్యం బాగుంది. అభినందనలు.
   ‘ఆస్వీయుజ’ శబ్దం లేదు. ‘శుభము నొసగు నాశ్వయుజపు శుద్ధ..’ అనండి.
   ‘రాముకున్’ అనరాదు. ‘రామునకు విజయునకును...’ అనండి.

   తొలగించండి
  2. గురువు గారికి ప్రణామములు, సవరణలు సూచించినందులకు ధన్యవాదములు
   సవరించిన పద్యము

   శుభము నొసగునాశ్వయుజపు శుద్ధ దశమి
   దసర యంచును జనులంత దండి గాను
   వేడ్క జేయుచు నుందురీ వేళ యందు
   దుష్ట శక్తుల దునుమాడి శిష్ట జనులు
   ధర్మ స్థాపన జేసిరీ ధరణి యందు
   దనుజ మహిషును వధియింప తల్లి కాళి
   ఉగ్ర రూపమ్ము ధరియించి యుర్వి బ్రోచె
   రామున కు విజయునకును రమ్య మైన
   విజయ మందజే సినది గా విజయ దశమి

   తొలగించండి
 11. పూజ్యు లు శంకరయ్య గారికి వందనములు. విజయ దశమి సందర్భముగ నా బతుకమ్మ పద్యకుసుమము.
  ద్విపద మాలిక :

  శ్రీగౌరి బ్రతుకమ్మ సిరులీయ రావె
  మాగౌరి వోయమ్మ మన్నింపు మమ్మ
  ఇంపార మాయింటి యిలవేల్పు వమ్మ
  సొంపార సక్కగ జూడగ రావె
  వెతలన్ని బాపగ వేగంబ రావె
  బ్రతుకమ్మ బ్రతుకమ్మ బంగారు తల్లి
  మాయమ్మ దుర్గమ్మ మముగన్న తల్లి
  ఆయమ్మ బ్రతుకమ్మ నర్చింప రమ్మ
  తంగేడు గుమ్మడి తామర సుమలు
  బంగారు గునుగును వామనె విరులు
  కమనీయ గరికలు కనువిందు కట్ల
  రమణీయ దోసలు లావణ్య బీర
  చేమంతి పూబంతి చెంగల్వ పూలు
  భామ లందరు జేరి వాలుగ పేర్చి
  పసుపు గౌరినిజేసి వాటిపై నుంచి
  వసుధను తంబల ప్రభల నీయంగ
  నెలత లందరు గూడి నృత్యమ్ము లాడి
  పలుమారు కీర్తించి పాటలు పాడ
  కతలన్ని వింటిమి కారుణ్య మూర్తి
  బ్రతుకమ్మ సద్దుల బ్రతుకమ్మ బ్రతుకు
  కుదురుగ నిత్యమ్ము కొలుతుము నిన్ను
  కదలిరా బ్రతుకమ్మ కాపాడ మమ్ము.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. [తంగేడు, గుమ్మడి, తామర, గునుగు, వామ, గడ్డి, కట్ల, దోస, బీర, చేమంతి, బంతి, కలువ పూలు.]

   తొలగించండి
  2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పద్యం గేయాత్మకమై అలరిస్తున్నది. అభినందనలు. స్త్రీలపాటగా ఉన్నందుకు కొన్ని వ్యావహారిక పదాలు ఉన్నా పరవాలేదు.

   తొలగించండి
 12. రావణుని దునిమి రాముడయోధ్యకు
  పట్టాభిషిక్తుడై వరలుదినము
  యంతమై పాం డ వులజ్ఞాత వాసమ్ము
  విజయుడు విల్లెక్కు పె ట్టురోజు
  మనుజాశనుండైన మహిషుని దుర్గమ్మ
  మహిషవాహను చే ర్చు మంచిరోజు
  రాజధానిగ నమరావతి యేర్పాటు
  ప్రకటించుచున్నట్టి పర్వదినము
  తెలుగువారు భుజము కలుపుచు పయనించ
  తెలుగుజాతివెలుగు దివ్యముగను
  సాగుజీవితములు సతతము తుష్టితో
  కలుగు వృద్ధి ఫలము కరము వేగ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ‘దినము+అంతమై’ అన్నప్పుడు యడాగమం రాదు.

   తొలగించండి
 13. మిత్రులందఱకు విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు!

  ఖల మహిషాసుర దురితము
  విలయ ఘటిత పటు బలమున వెడలఁగ నిడియున్
  నిలిపితివి యమర జయమును
  దలఁతును మది నిపుడు జనని దశభుజ దుర్గా!


  ఇందిరా రమణ సోదరీ! హిమజ! హిండి! చండి! ఖల శోషిణీ!
  నందయంతి! గిరిజా! మదోత్కట! మనస్వినీ! దనుజ నాశినీ!
  నందితాఖిల సురేంద్ర ముఖ్య! కరుణాంతరంగ! వరదాయినీ!
  కందుకాభ పరిపంథి శీర్ష కర ఖండితోగ్ర! మృగవాహినీ!
  వందితోరుతర భూజనాళి నత భక్తిమస్త! నగనందినీ!
  మందయాన! పరమార్థ దాయిని! నమ స్సతీ! మహిష మర్దినీ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండు మధుసూదన్ గారూ,
   మీ పద్యాలు హృద్యంగా ఉన్నాయి. అభినందనలు.

   తొలగించండి
 14. విజయదశిమి దినము విజ్ఞత జేకూర్చు
  విజయదుర్గ మనకు విజయమొసగు
  భక్తి భావమున్న?శక్తుల నొనగూర్చ
  పాడి,పంట,రైతు పరవశించు|

  రిప్లయితొలగించండి
 15. కవిమిత్రులందరికి గురువర్యులైన కందిశంకరయ్య గార్లకుదసరా శుభా కాంక్షలు

  రిప్లయితొలగించండి
 16. అమ్మ! దయామయి! సింహవాహనా!!
  *****************************************************************
  మిత్రులందఱకు దసరా పండుగ శుభాకాంక్షలు!!
  *****************************************************************
  చండి! భవాని! శైలసుత! శాంభవి! భైరవి! యోగమాయ! చా
  ముండి! వృషాకపాయి! సతి! మోక్షద! శాంకరి! దుష్ట దానవో
  త్ఖండతరాశుకాండ! వరదాయి! శుభప్రద! భద్రకాళి! పా
  షండ శిఖండి! శక్తి! మహిషాసుర మర్దిని! సింహవాహనా! (1)
  ******
  నేతల నీతిమంతులుగ నేర్పడఁ జేసియు; మమ్ము నేఁడిటన్
  పూత మనమ్ము గల్గునటు పూని, వరమ్మిడి, వెల్గఁ జేసియున్;
  చేతము చల్లనౌ నటుల శీఘ్రమె కాంక్షలఁ దీర్చి, మాకు నీ
  యాతన డుల్చి, ప్రీతిఁ గనుమమ్మ! దయామయి! సింహవాహనా! (2)
  ******
  నిరతము నిన్ను గొల్చెదము; నిక్కము! నమ్ముము! మా మనోరథ
  స్థిర నవ రాష్ట్ర మిచ్చితివి దీక్షలు సేసి, తపించి పోవ, మా
  చిరమగు వాంఛఁ దీరిచి, విశేష తమాంచిత హేమ రాష్ట్రమున్
  కర మనురాగ యుక్తముగఁ గాంచుచు నీఁగదె సింహవాహనా! (3)
  ******
  ఆత్రముతోడ వేచితిమి, హర్ష సుహృద్వర రాష్ట్రదాయి! మా
  శత్రుల మానసమ్ములనుఁ జక్క నొనర్చియు, వారలన్ సుహృ
  న్మిత్రులుగాను మార్చి, కరుణించియు, మమ్మిఁక వేగిరమ్మె స
  ద్గాత్రులఁ జేసి, స్వర్ణ తెలగాణము నీఁగదె సింహవాహనా! (4)
  ******
  ప్రజలను నిత్య సత్య యుత వర్తన శీ లురఁ జేసి, వారలన్
  గుజనులు కాక యుంటకయి కూర్మినిఁ బంచి, మహోత్తమాశయాం
  బుజ ఘన శోభి తాత్మ నిడి, ప్రోచి, ప్రశస్త సువృత్తతోన్మహా
  యజనముఁ జేయు శక్తి సదయన్నిడు మో శివ! సింహవాహనా! (5)
  ******************************************************************
  -:శుభం భూయాత్:-
  ******************************************************************

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండు మధుసూదన్ గారూ,
   మీ పద్యాలు మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.

   తొలగించండి
 17. గురువుగారూ పొరబాటుకు చింతిస్తున్నాను. సవరించిన పద్యమిది:


  మహిషుని ఖండించి మహి శాంతి నెలకొల్పి
  ...........మాత రక్షించిన మహితదినము
  నరహరి యేతెంచి నక్తంచరుని జంపి
  .............ప్రహ్లాదు గాచిన భవ్యదినము
  రావణు దెగటార్చి రామచంద్రుడు భూమి
  ............భారము బాపిన పర్వదినము
  అజ్ఞాతమౌ వాస మంతమై పాండవుల్
  ............తలయెత్తి నిలచిన ధన్యదినము


  వాహనము లాయుధమ్ముల పరికరముల
  భక్తి నర్చించి కాపాడ ప్రణతులనిడి
  సర్వులును శక్తి మహిమను సన్నుతించి
  విజయ మందెడు పర్వమ్ము విజయదశమి.


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   నా సూచనను మన్నించి సవరించినందుకు ధన్యవాదాలు.

   తొలగించండి
 18. చదువు, సంస్కారమ్ము చక్కగ నేర్వగ
  -------విజ్ఞానమందగ విజయదశిమి
  పదవులలోజేరి మది బెంచు లంచాలు
  -----విడచిన ప్రజలకు విజయదశిమి
  ఆడపుట్టుకలను అంతరింపగజేయు
  -------విషయము దగ్గించ విజయదశిమి
  పల్లె,పట్టణములు పరిశుబ్రముంచగా
  ------నిజమైన పండుగ విజయదశిమి
  ధరలు దగ్గిన రైతులు వరలుటెట్లు?
  కూలినాలికి ధరలున్న కుంగుటేగ?
  కల్మషాలున్న హృదయ వికల్పమందు
  విలువలుంచిననాడౌను విజయదశిమి|

  రిప్లయితొలగించండి