8, అక్టోబర్ 2015, గురువారం

సమస్యా పూరణం - 1820 (దుర్భర దారిద్ర్య పీడితుఁడవు కుబేరా)


కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
దుర్భర దారిద్ర్య పీడితుఁడవు కుబేరా. 

47 కామెంట్‌లు:

  1. గురువు గారికీ, సుకవి మిత్రులకు నమస్కారములు....శుభోదయము తో

    ఆర్భాట పరుని కబ్బిన
    దౌర్భాగ్యము, జూదమందు ధనమే పోవన్
    నిర్భాగ్యుని మిత్రులనిరి
    దుర్భర దారిద్ర్య పీడితుడవు కుబేరా!

    రిప్లయితొలగించండి
  2. దౌర్భాగ్యంబిదియెగదా!
    అర్భకుఁజేసిదశకంఠుడలమగ లంకన్
    స్వర్భానువాను రవివలె
    దుర్భరదారిద్ర్యపీడితుడవు కుబేరా!!

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరింప నున్నవి !

    లంక నాక్రమించుకొనిన రావణుడు కుబేరునితో :

    01)
    _________________________________________

    నిర్భయుడీ దశకంఠుడు
    దుర్భేద్యపు లంక నాది - తులువా పొమ్మా !
    నిర్భాగ్యుడ విక మీదట
    దుర్భర దారిద్ర్య పీడి - తుడవు కుబేరా !
    _________________________________________

    కుబేరుని ఐశ్వర్యాన్ని, వైభవాన్ని చూసిన సుమాలి (పాతాళ రాజు) అసూయ చెందాడు. సుమాలి

    కుమార్తె కైకసి, విశ్రవ బ్రహ్మ రెండవ భార్య అనగా కుబేరుని సవతి తల్లి. కైకసికి కూడా కుబేరుని

    వంటి ఐశ్వర్యవంతుడయిన కుమారుడు కావలెనన్న కోరికతో విశ్రవుని ఆశ్రమానికి వెళ్ళింది.

    విశ్రవుడు కైకసితో తప్పనిసరి పరిస్థితుల్లో, వేళ కాని వేళ కలిసినందున రావణుడు, కుంభకర్ణుడు

    (ఏనుగు యొక్క “కుంభ”స్థల ప్రమాణము కల కర్ణములు అనగా చెవులు కలవాడు అని అర్థం)

    అను రాక్షసులు జన్మిస్తారు. ఈ విషయం తెలుసుకున్న కైకసి తనకొక సత్పుత్రుడు కావలెనని

    అడగటంతో, విశ్రవుని అనుగ్రహం వలన విష్ణు భక్తి కల విభీషణుడు (దుష్టులకు విశేషమయిన

    భీతిని కలిగించువాడు అని అర్థం) పుడతాడు. అలా కుబేరుడు రావణాసురుడి సోదరుడనమాట!

    రావణాసురుడు రాక్షసుడు కావడంతో తన తాతగారయిన సుమాలి వద్ద పాతాళంలో ఉండేవాడు.

    కుబేరుడు మాత్రం భోగ భాగ్యాలతో లంకలో రాజ్యపాలన చేయటం చూసి తట్టుకోలేక, లంక మీదకి

    దండెత్తాడు రావణాసురుడు.

    కుబేరునికి శారీరక బలం తక్కువ, యుద్ధం చేసి జనాలను చంపే క్రూరత్వం లేదు, పైగా

    రావణాసురుడు హఠాత్తుగా రావటంతో రావణాసురుడు లంకను పుష్పక విమానంతో సహా

    స్వాధీనం చేసుకుని కుబేరుని తరిమేశాడు. దానితో భయపడిపోయిన కుబేరుడు కాశీ చేరుకుని

    పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు మొదలుపెట్టాడు. గాలిని సైతం బంధించి, ఒంటి కాలి మీద

    నిలిచి, శివుని మనసులో నిలుపుకుని తపస్సు చేయసాగాడు. తన శరీరం నుండి వచ్చిన తపోగ్ని

    జ్వాలలు ముల్లోకాలూ వ్యాపించాయి. ఈయనకి తపోభంగం కలిగించటానికి చేసిన

    ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. కాలం గడిచిన కొద్దీ కుబేరుని శరీరం ఎముకల గూడులా

    మారిపోయింది.
    see more@
    https://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B1%81%E0%B0%AC

    %E0%B1%87%E0%B0%B0%E0%B1%81%E0%B0%A1%E0%B1%81

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వసంత కిశోర్ గారూ,
      బాగున్నది పూరణ. అభినందనలు.
      రావణ కుబేరుల జ్ఞాతిత్వాన్ని వివరించినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
  4. ఐదేళ్ళుగా వర్షాభావంతో దుర్భిక్షంలో మగ్గుతున్న
    ఆగర్భశ్రీమంతుడు-100 ఎకరముల ఆసామీకి
    స్నేహితుని పరామర్శ :

    02)
    _________________________________________

    దుర్భిణితో గన్పట్టెడి
    దుర్భిక్షపు నేలె యంత ! - దుర్భాగ్యము ! యా
    గర్భపు శ్రీమంతుడవయి
    దుర్భర దారిద్ర్య పీడి - తుడవు కుబేరా !
    _________________________________________

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వసంత కిశోర్ గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘నేల+ఎ’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అలాగే ‘దౌర్భాగ్యము+ఆగర్భ..’ అన్నచోట యడాగమం రాదు. సంధి నిత్యం. ‘దుర్భిక్షపు నేలయె కద! దుర్భాగ్య మ్మా|గర్భపు...’ అందామా?

      తొలగించండి
    2. శంకరార్యా ! ధన్యవాదములు !

      02అ)
      _________________________________________

      దుర్భిణితో గన్పట్టెడి
      దుర్భిక్షపు నేలయె కద ! - దుర్భాగ్య మ్మా|
      గర్భపు శ్రీమంతుడవయి
      దుర్భర దారిద్ర్య పీడి - తుడవు కుబేరా !
      _________________________________________

      తొలగించండి
  5. తనకన్నా ఎక్కువ దానం చేసిన పేదవాడైన స్నేహితుని
    "కుబేరా " - అని అవహేళన చేస్తున్న ధనిక మిత్రుడు :

    03)
    _________________________________________

    నిర్భయుడా ! నిర్ధనుడవు !
    దౌర్భాగ్యుడ ! నిర్దయుడవు ! - దర్భాశయనా !
    గర్భదరిద్రా ! నీవిక
    దుర్భర దారిద్ర్య పీడి - తుడవు కుబేరా !
    _________________________________________

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వసంత కిశోర్ గారూ,
      మీ మూడవ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘దర్భశయనుడా’ అనండి.

      తొలగించండి
    2. శంకరార్యా ! ధన్యవాదములు !

      03అ)
      _________________________________________

      నిర్భయుడా ! నిర్ధనుడవు !
      దౌర్భాగ్యుడ ! నిర్దయుడవు ! - దర్భశయనుడా !
      గర్భదరిద్రా ! నీవిక
      దుర్భర దారిద్ర్య పీడి - తుడవు కుబేరా !
      _________________________________________

      తొలగించండి
  6. దుర్భేద్యపు కలియుగమున
    దౌర్భాగ్యపు బ్రతుకు లందు దాటగ జలధి
    న్నార్భాటము జేయకనే
    దుర్భర దారిద్ర్య పీడి తుఁడవు కుబేరా

    రిప్లయితొలగించండి
  7. కవిమిత్రులకు మనవి...
    వ్యాఖ్యను చేర్చే పద్ధతిలో చిన్న మార్పు చేశాను. మీ పూరణ క్రిందనే నా వ్యాఖ్య ఉంటుంది. ఆ వ్యాఖ్యపై మీరేమైనా చెప్పాలన్నా, సవరించిన పద్యాన్ని పెట్టాలన్నా నా వ్యాఖ్య క్రింద ‘ప్రత్యుత్తరం’ అన్నదాన్ని క్లిక్ చేసి అక్కడ మీ వ్యాఖ్యను నమోదు చేయండి. ఒక పూరణను గురించి అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు ఒకేచోట ఉంటాయి.

    రిప్లయితొలగించండి
  8. రావణునుద్దేశించి వ్రాసినది.
    ఆర్భాటంబున వచ్చుచు
    నిర్భాగ్యుని చేయనెంచి నీతిని విడిచెన్
    దౌర్భాగ్యుడ వైతివిచట
    దుర్భర దారిద్ర్య పీడితుడవు కుబేరా.

    రిప్లయితొలగించండి
  9. రిప్లయిలు
    1. ఈ పద్ధతిని రెండు మూడు రోజులు ప్రయోగాత్మకంగా పరిశీలిద్దాం. బాగుంటే కొనసాగించవచ్చు.

      తొలగించండి

  10. శ్రీగురుభ్యోనమః

    దుర్భేద్యమైన కోటను
    నిర్భయముగ నాక్రమించి నిను తొలగించె
    న్నర్భకు డా దశకంఠుడు
    దుర్భర దారిద్ర్య పీడితుఁడవు కుబేరా

    రిప్లయితొలగించండి
  11. అర్భక ! శని వలనైతివి
    దుర్భర దారిద్ర్య పీ డితుడవు కుబేరా!
    నిర్భాగ్యుని గాజేయకు
    దర్భా శ్రీరామ చంద్రు దయతో నీవున్

    రిప్లయితొలగించండి
  12. నిర్భాగ్యుండవు నీవిల
    దుర్భల దారిద్ర్య పీడితుడవు, కుబేరా
    గర్భ ధనాఢ్యుని వేడుము
    దౌర్భాగ్యముబాపు
    మంచు, ధనముల నొసగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వి.యస్. ఆంజనేయులు శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. దుర్భేద్యంబగు లంకయె
    నిర్భయుడగు నాకె చెల్లు నీకేలనురా
    దర్భవలె దుర్భలుండవు
    దుర్భర దారిద్ర్య పీడితుఁడవు కుబేరా!!!





    గర్భేశ్వరు పేరున్నను
    దుర్భర దారిద్ర్య పీడితుఁడవు కుబేరా!
    అర్భకులను గాచు హరియె
    నిర్భర కృప తోడ నిన్ను నిజముగ బ్రోచున్!!!
    కుబేర్ అనే పేరుగలవానితో స్నేహితుని పలుకులు.....
    గర్భేశ్వరుడు = ధనవంతుడురిద్ర్య పీడితుఁడవు కుబేరా

    రిప్లయితొలగించండి
  14. కః అర్భకుడౌ సుతుని కతన
    దుర్భర దారిద్ర్య పీడితుడవు కుబేరా
    నిర్భరముగ హరినిఁగొలువ
    గర్భమున నుమంచిసుతుడు కలుగును సతికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. కవిమిత్రులకు నమస్కారములతో
    గురుమూర్తి ఆచారి

    (కుబేరా రావణుడు నిన్ను లంకనుండి తరిమి వేసినపుడే దరిద్ర పీడితుడవైతివి.
    మరల శ్రీనివాసుని కేల రుణమిచ్చితివి ? వసూలు చేసుకొనగలవా?)

    దుర్బుద్ధి యగు దశాస్యుడు
    నిర్భేద్యపు లంక గైకొని వెడలగొట్టెన్ ;
    దౌర్భాగ్య హతుడవు - కడున్
    దుర్భర దారిద్ర్య పీడితుడవు కుబేరా !
    .................................................................
    నిర్భీతి (న్) శ్రీనివాసున
    కార్భాటముగ రుణమొసగితి + అయ్యో ! నీవో
    దుర్బలుడవు నీ వాతని
    నిర్బంధించుచు ధనము కొనెదవో ! లేదో !




    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  16. దర్భాసనుడవు నిత్యము
    దుర్భర దారిద్ర్య పీడితుఁడవు, కుబేరా
    యర్భకుడ నేననుచు నా
    గర్భధనసురవరుఁ వేడు కరము శుభమగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గురూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. మిత్రులందఱకు నమస్సులు!

    (కుబేరుఁడు తొలిజన్మమున యజ్ఞదత్తుఁడైన బ్రాహ్మణుని కుమారుఁడు. పేరు గుణనిథి. ఎటువంటి గుణములకు నిధి యనుకొంటిరి? దొంగతనము, వ్యభిచారము, క్రూరత్వము, దుర్మార్గము… ఇవియే యతని గుణములు. ఆ విధముగ నున్న నే తండ్రియైనను నేమి చేయును? ఇంటి నుండి పొమ్మనెను. గుణనిధి వెడలిపోయెను. కాని తినుటకుఁ దిండి కూడ కఱువైనది. దానిచే నే భక్తుఁడో శివునిం బూజించి, ప్రసాదము నర్పింపఁగ, దొంగిలించి, దాని నాఁకలిఁ గొన్న నోట వేసుకొనెను. అది చూసిన రాజభటు లూరకొనక వెంటపడిరి. కాని, యింతలోఁ జీఁకటయిపోవుటచే వారికిఁ జిక్కలేదు! అయినను, జివరికి వారి చేతిలోఁ జనిపోయిన కుబేరుని తీసుకొనిపోవుటకు యమదూతలు వచ్చిరి్... విష్ణుదూతలును వచ్చిరి. శివుని ప్రసాదముం దినినందువలన, విష్ణుదూతలే యతనిం దమవెంటఁ గొంపోయిరి! ఆ విధముగ కుబేరుఁడు గత జన్మలో దుర్భర దారిద్ర్యము ననుభవించినాఁడను విషయమునిట ననుసంధానించుకొనునది)

    స్వర్భోగాల్ గత జన్మను
    నిర్భర ప్రేమైక ధాత్రి నిజ జనని కృపా
    గర్భస్థుఁడ, కొంటివి! తుద
    దుర్భర దారిద్ర్య పీడితుఁడవు, కుబేరా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండు మధుసూదన్ గారూ,
      వివరణతో కూడిన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదములు శంకరయ్యగారూ! పై వివరణ సందర్భమున నేను కుండలీకరణమున శివభటులకు బదులుగ విష్ణుదూతలనుఁ బేర్కొనినాను. దీనిని "శివభటులు"గఁ బఠింపఁగలరు. స్వస్తి.

      తొలగించండి
  18. తేది: సెప్టెంబర్ 22, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఈయబడిన కుబేరుని చిత్రమునకు గుండు మధుసూదన్ గారు రాసిన పద్యములు...

    గుణనిధి కుబేరునిగ మారిన కథ (శివపురాణాంతర్గతము) ప్రథమ జన్మ వృత్తాంతము:

    కం.
    ధరలోన యజ్ఞదత్తుం
    డిరు బుట్టు వొకండు నుండె; నతనికి సుతుఁడొ
    క్కరుఁడు గుణనిధి యను నతఁడు
    నరయఁగఁ జోరుండు, జారుఁ డతి దుర్హృదుఁడే! (1)

    తే.గీ.
    ప్రతి దినమ్మును దుర్మార్గ వర్తనుఁడయి,
    చెడుగు పనులనుఁ జేయుచుఁ జెలఁగుచుండఁ
    దండ్రి సహియింప నోపక తన గృహమును
    వీడి పొమ్మని శాసించ, వెడలె నతఁడు! (2)

    ఆ.వె.
    కూడు, గూడు, కాసుఁ గూడ చేతను లేక
    పస్తులుండ, నొకఁడు పాయసమును
    నచటి దేవళమున నైవేద్యముగ నిడి,
    హరుని మ్రొక్కి, వేడి, యతఁడు వేగ (3)

    కం.
    గుడి నుండి వెడల, వెంటన
    గుడిలోపలి పాయసమును గుటుకున మ్రింగన్,
    గుడి బయటి భటు లదియుఁ గని,
    కడు వేగిరమునను రాఁగఁ గ్రమ్మె నిరు లటన్ (4)

    కం.
    నైవేద్యమ్మును మ్రింగిన
    యా వైనము కతనఁ గ్రమ్మె నా చీఁకటులున్!
    ఠావును విడిచిన గుణనిధి
    వేవిధముల వెతలఁ బడియు విగతాసుఁడుఁ గాన్ (5)

    ఆ.వె.
    అంత శివ భటులును నతనినిఁ గొంపోయి,
    శివుని చెంత నుంప, శివుఁడు దయను
    నిడియె మఱొక జన్మ; నిష్ఠతో జీవించు
    నట్లు వరము నిడియు, నతనిఁ బంపె! (6)

    ద్వితీయ జన్మ వృత్తాంతము:

    ఆ.వె.
    శివుని వరబలమ్ముచేఁ గళింగాధిపుఁ
    డగు నరింధమునకు దముఁ డనియెడి
    పుత్రుఁగా జనించి, భూమినిఁ బాలించి,
    దేవళమ్ములందు దీప పూజ (7)

    తే.గీ.
    నిత్యమును జేయుచును దాను నిష్ఠతోడఁ
    బూజ సేయుచు; నొకనాఁడు బోయి కాశి,
    యచట విశ్వేశునకుఁ బూజలందఁజేసె;
    నంత శివపార్వతులు మ్రోల నవతరించ (8)

    తే.గీ.
    దముఁడు పార్వతీదేవిఁ బ్రథమము గాను
    గనియు; సౌందర్య వర్ణనమునటఁ జేయ,
    క్రుద్ధ నేత్రయై పార్వతి గుణనిధిఁ గన,
    నొక్క కన్ను వ్రక్కలు గాఁగ, నొంటి కంటి (9)

    ఆ.వె.
    వాఁడు నయ్యె; నంతఁ బార్వతీదేవియు
    "నటులఁ జూచినట్టి యతఁ డెవండు?
    తెలుపుఁ" డనఁగ, శివుఁడు తెలుపఁగ,
    గరుణతో నతని కన్ను మఱల నతని కిడియె! (10)

    కం.
    చిఱునగవున శివుఁడప్పుడు
    కరుణఁ గుబేరాభిధ, నలకాపురి నిడి, యు
    త్తర దిక్పతిగ, ధనపతిగ,
    మఱి, తన సన్నిహితునిగను మన్ననఁ జేసెన్! (11)

    వ.
    కుబేరుండంతట నుత్తర దిక్పాలకత్వము నెఱపుచు, నర్హులకు ధనప్రాప్తినిఁ గలిగించుచు, నలకాపురినిఁ బాలించుచు, శివునితో సఖిత్వముఁ బాటించుచు, సుఖంబుండె... (12)
    (‘మధుర కవనము’ బ్లాగునుండి...)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదములు శంకరయ్యగారూ!

      అనుకొనని విధమున నా పద్య దర్శనము నా కానందదాయకముగఁ బ్రత్యక్షమైనది. కృతజ్ఞుఁడను.
      ఈ పద్యము లీ సందర్భమునకు నతికినట్లుగ నున్నవి. పునః ప్రచురించిన మీ కభినందనలు! కాని, నేను పై సమస్యాపూరణమందు గుణనిధిని శివభటులకు బదులు విష్ణుదూతలు కొనిపోయినట్లుగ వ్రాసితిని. ఇది సవరణనీయము. సమయమునకుం దెలిపినందులకు సంతోషముం గూడ కలిగినది.

      స్వస్తి.

      తొలగించండి
  19. దుర్భర దారిద్ర్యపీడితుడవు కుబేరా
    పూరణ:అర్భక కైకసి తనయుల
    నిర్భాగ్యుల జేసితీవునీకిక చాలున్
    దర్భలనెను పౌలస్త్యుడు
    దుర్భర దారిద్ర్య పీదితుడవు కుబేరా

    రిప్లయితొలగించండి
  20. ఓ ధనవంతుని దగ్గర 'నిండిన చెరువును కప్పలు' పదివేలు చేరినట్లు, దరిద్రుల వల్ల పీడితుడన్న భావంతో:
    ఆర్భాటపు బ్రతుకేలర?
    దౌర్భాగ్యులు బంధులమని దరిజేరెడు సం
    దర్భము గూర్చితివీవే
    దుర్భర దారిద్ర్య పీడితుడవు కుబేరా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  21. గురువుగారికి నమస్కారం. లక్ష్మీ దేవి చెంత లేక నిర్భాగ్యుడైన శ్రీహరి రాజుకూతురు పద్మావతితో ఆర్భాటముగా వివాహము చేసుకోవలసిన పరిస్థితిలో అప్పుకొరకు నీవద్దకు వస్తే ఆ అర్భకుని వడ్డీ కోరినపుడు నీకు ఎంత ధనమున్ననూ, దుర్భర దారిద్ర్య పీడితుడవే కదా కుబేరా! అన్న భావనలో రాసిన పద్యమిది. భావములో తప్పున్నా, పద్యంలో దోషాలున్నా చెప్పగలరు. ధన్యవాదములు.
    కం: నిర్భా గ్యుడుహరి, సిరిలేక
    ఆర్భా టమునజ రుపగా యావివా హమునన్
    నర్భకు నివడ్డి కోరగ
    దుర్భర దారిద్ర్య పీడితుఁడవు, కుబేరా!

    రిప్లయితొలగించండి
  22. గురువుగారికి నమస్కారం. లక్ష్మీ దేవి చెంత లేక నిర్భాగ్యుడైన శ్రీహరి రాజుకూతురు పద్మావతితో ఆర్భాటముగా వివాహము చేసుకోవలసిన పరిస్థితిలో అప్పుకొరకు నీవద్దకు వస్తే ఆ అర్భకుని వడ్డీ కోరినపుడు నీకు ఎంత ధనమున్ననూ, దుర్భర దారిద్ర్య పీడితుడవే కదా కుబేరా! అన్న భావనలో రాసిన పద్యమిది. భావములో తప్పున్నా, పద్యంలో దోషాలున్నా చెప్పగలరు. ధన్యవాదములు.
    కం: నిర్భా గ్యుడుహరి, సిరిలేక
    ఆర్భా టమునజ రుపగా యావివా హమునన్
    నర్భకు నివడ్డి కోరగ
    దుర్భర దారిద్ర్య పీడితుఁడవు, కుబేరా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వేదుల సుభద్ర గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి, రెండవ పాదాలలో గణదోషం.
      “నిర్భాగ్యుండగు హరి సిరిలే
      కార్భాటమ్ముగ జరుపగ నా కళ్యాణం
      బర్భకుని వడ్డి కోరగ....” అనండి.

      తొలగించండి