17, అక్టోబర్ 2015, శనివారం

సమస్యా పూరణం - 1827 (చేఁతకానివాఁడు సేసె సృష్టి)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
చేఁతకానివాఁడు సేసె సృష్టి.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

43 కామెంట్‌లు:

  1. త్రాగి యుండి నలువ తనరి మైకమందు
    విశ్వ మంత నింపె వెఱ్ఱి జనుల
    మెదడు నుంచ మదిని మోకాలు నందుంచె
    చేఁత కాని వాఁడు సేసె సృష్టి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      బ్రహ్మను చివరికి మదిరాపానమత్తుణ్ణి చేశారు. బాగుంది మీ పూరణ అభినందనలు.
      మొదటిపాదంలో గణదోషం. ‘తనరి మైకమునందు’ అనండి.
      మూడవపాదంలో యతిదోషం. ‘భువిని జనుల మెదడు మోకాలునం దుంచె’ అందామా?

      తొలగించండి
    2. త్రాగి యుండి నలువ తనరిమై కమునందు
      విశ్వ మంత నింపె వెఱ్ఱి ప్రజల
      భువిని జనుల మెదడు మోకాలు నందుంచె
      చేత కాని వాడు సేసె సృష్టి

      రెండు మాట్లు " జనుల " వస్తుందని ' ప్రజల " అని వ్రాసాను

      తొలగించండి
  2. గురువుగారికి నమస్కారం. సిరివెన్నెల చిత్రంలో 'ఆదిభిక్షువు ' అన్న పాట మదిలో మెదిలి ఈ క్రింది పూరణకు ప్రయత్నిమ్హ్చను. తప్పులుంటే క్షమించి తెలియచేయగలరు.

    ఆ.వె: తేనె లొలకు పూల తరుణము నొకరోజు
    ధరము లుండు నేళ్ళు ధరణి మీద
    యెంచి జూడ నిటులె, యవకత వకలతో
    చేఁత కాని వాఁడు సేసె సృష్టి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వేదుల సుభద్ర గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘తరుణమా యొకరోజు’ అనండి. ‘మీద నెంచి’ అనవలసి ఉంటుంది. కాని మూడవపాదంలో యతి తప్పింది. ‘ధరణిమీద| నరసి చూడ నిటులె యవకతవకలతో...’ అనండి.

      తొలగించండి
    2. సవరించాను గురువుగారు. ధన్యవాదాలు.
      తేనెలొలకుపూలతరుణమాయొకరోజు
      ధరములుందునేళ్ళుధరణిమీద
      నరసిజూడనిటులెయవకతవకలతో
      చేతకానివాడు జేసె సృష్టి

      తొలగించండి
  3. ముందు సిద్ధ మగును నందరి కంటెను
    చేత కాని వాడు, సేసె సృష్టి
    సకల జీవ కోటి నికమనీ యముగను
    ముఖము నందు వ్రాసి పూర్వ ఫలము

    రిప్లయితొలగించండి
  4. డంబమునకు బోయి బెంబేలు బడిపోవు
    చేతకానివాడు, సేసె సృష్టి
    నుదుట రాత రాసి చదువులముదుకడు
    జీవకోటి కెల్ల జీవ మొసగె !!!

    రిప్లయితొలగించండి
  5. పద్మ సంభవుండు వాణీశుడుశృతిసం
    ఘాతవిలసితముఖకమలుడతడు
    భళిర యొక్క సారి వ్రాయనిక మరల్ప
    చేఁతకానివాఁడు సేసె సృష్టి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. బొందితో త్రిశంకు నందించ స్వర్గమ్ము
    చేతకానివాఁడు సేసె సృష్టి
    నింగి,నేల మధ్య నిగిడి కౌశికమౌని
    తన తపో బలమ్ము తరిగిపోవ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      విశ్వామిత్రుని ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. చక్కగా జీవజాలము సాకెడు పని
    చేతగాని వాడు సేసె సృష్టి
    పెంచి పోషించును మురారి యంచితముగ
    శివుడు లయమొనరించును జీవములను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      సమస్యపాదం ఆటవెలది అయితే మీరు తేటగీతి వ్రాశారు. భావం బాగుంది. నా సవరణ...
      చక్కగాను జీవజాలమ్ము సాకఁగఁ
      జేఁతకానివాఁడు సేసె సృష్టి
      యంచితమ్ముగ హరి పెంచి పోషించును
      శివుఁడు లయ మొనర్చు జీవములను.

      తొలగించండి
  8. మిత్రులందఱకు నమస్సులు!

    ధనము గల్గువాని ధన మెక్కుడుగఁ జేసి,
    బీదవాని మిగుల బీదసేసి,
    లోకమందు భేద మీ కోవ నడపుౘుఁ
    జేఁతకానివాఁడు సేసె సృష్టి!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కొలఁది మార్పుతో...
      ధనము గల్గువాని ధన మెక్కుడుగఁ జేసె!
      బీదవాని మిగుల బీదఁ జేసె!
      భేద మేమి లేని విధముఁ బాటించుట
      చేఁతకానివాఁడు సేసె సృష్టి!!

      తొలగించండి
    2. గుండు మధుసూదన్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. సర్వజనహితముగ శాస్త్రవిజ్ఙానమ్ము
    వాడుకొనుచు లోక ప్రగతినెంచఁ
    జేతకానివాఁడు సేసె, సృష్టి లయము
    జేయఁ బ్రేల్చఁ గలుగు మాయ బాంబు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. నిందవేయువాడు నిజమునుదెలియక
    చేతగానివాడు|సేసె సృష్టి
    బ్రహ్మ శివుని యాజ్ఞ|.బాధ్యత లందున
    బెంచు విష్ణు శక్తి నుంచు సుఖము.
    2.బ్రహ్మ పుట్టుకలను,రక్షనువిష్ణువు
    లయముజేయు శివుడు నియమ మిదియె
    చేతగానివాడు సేసె సృష్టియనుట
    తప్పుమాటగాద తలచగాను

    రిప్లయితొలగించండి
  11. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    కన్నులున్నవాడు కండ్లు మూసి చరించ
    కండ్లు లేని వాడు గాంచు భువిని
    మేలు కీడు లెరిగి మెదడు లమర్చని
    చేఁతకానివాఁడు సేసె సృష్టి.

    నాతి నొక్క చోట నాపలేని నలువ
    చేతకాని వాడు సేసె సృష్టి
    తాళి కట్టి పిదప తనపత్ని తలవ్రాత
    మార్చ లేని వాడు మన విధాత !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  12. సకలజీవకోటి సంతృప్తి పరచగ
    కల్పతరువు పొడమె .కాపురుషుడు
    వంట కట్టె కొరకు పడగొట్ట గొడ్డలి
    చేతగానివాడు సేసె సృష్టి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొంత అన్వయలోపం ఉంది.

      తొలగించండి
  13. మెచ్చెదరని దలచి, మిగుల మోదముతోడ
    స్వీయ రచనఁ దండ్రి చేతికిడగ
    పలికె, రెండు పుటలు పరికించిజూచిట్లు:
    "చేఁతకానివాఁడు సేసె సృష్టి".

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఊకదంపుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      దీనిని చదవగానే భారవిని తిట్టిన తండ్రి కథ గుర్తుకొచ్చింది.

      తొలగించండి
    2. ఊకదంపుడు గారూ, పద్యం , భావం బాగున్నాయి. మనః ఫలకం మీద భారవి నిలిచాడు.
      "క్త్వార్థంబైన యిత్తునకు సంధి లేదు" కనుక "పలికె రెండు పుటలు పరికించి తానిట్లు" అని సవరిస్తే భేషుగ్గా ఉంటుంది.

      తొలగించండి
    3. డా. విష్ణునందన్ గారూ,
      ధన్యవాదాలు.

      తొలగించండి
    4. గురువు గారికి, డా.విష్ణు నందన్ గారికి ధన్యవాదములు.

      మెచ్చెదరని దలచి, మిగుల మోదముతోడ
      స్వీయ రచనఁ దండ్రి చేతికిడగ
      పలికె రెండు పుటలు పరికించి తానిట్లు:
      "చేఁతకానివాఁడు సేసె సృష్టి"

      తొలగించండి
    5. ఊకదంపుడు గారూ,
      కచ్చితంగా నేను సూచించాలనుకున్న సవరణనే మీరు వ్రాసారు. సంతోషం!

      తొలగించండి
  14. సకలజీవకోటి సంతృప్తి పరచగ
    కల్పతరువు పొడమె .కాపురుషుడు
    వంట కట్టె కొరకు పడగొట్ట గొడ్డలి
    చేతగానివాడు సేసె సృష్టి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      ఇప్పటికీ అన్వయదోషం తొలగలేదు. మీ పద్యానికి నా సవరణ....
      సకలజీవకోటి సంతృప్తి పరచగ
      కల్పతరువు పొడమె, కాని దానిఁ
      గూల్చు గొడ్డలి కనుఁగొన మేలొనర్చగ
      చేఁతకానివాఁడు సేసె సృష్టి.

      ఇదీ అంత సంతృప్తిగా లేదు, కాని కొంతలో కొంత నయం!

      తొలగించండి
  15. చేరినాడ నొక్క చిత్రప్రదర్శనా
    శాల, నందుఁ గంటి సర్రియలిజ
    మనెడి చిత్రమొకటి, యనుకొంటి నేనిట్లు
    “చేఁతకానివాఁడు సేసె సృష్టి”

    రిప్లయితొలగించండి
  16. అతిశయంబుతోడ నన్నితెలుసు నంచు
    చేతకానివాడు సేసె సృష్టి
    పిచ్చివాని చేతి వస్తువట్లు నదియు
    పేలి పోయె గాదె బిగువు లేక.

    రిప్లయితొలగించండి
  17. అతిశయంబుతోడ నన్నితెలుసు నంచు
    చేతకానివాడు సేసె సృష్టి
    పిచ్చివాని చేతి వస్తువట్లు నదియు
    పేలి పోయె గాదె బిగువు లేక.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవపాదంలో యతిదోషం. ‘పిచ్చివాని చేతఁ బెట్టిన వస్తువై’ అందామా? ‘తెలుసునంచు’ అన్నదాన్ని ‘తెలియునంచు’ అనండి.

      తొలగించండి
  18. గురువు గారికి ప్రణామములతో నేను కార్యార్థినై ఢిల్లీ రావడం వలన సమస్యాపూరణాన్నీ సకాలంలో పోస్టు చేయలేక పోయాను మన్నించగలరు

    హరి హరు లిరువురునసురకోటి దునుమాడి
    శిష్టుల పరిరక్ష సేసినారు
    కమల గర్భుడతడు కదనమాడుటయందు
    చేతకాని వాడు సేసె సృష్టి

    రిప్లయితొలగించండి