5, మే 2016, గురువారం

ఖండకావ్యము - 18

నవగ్రహ స్తోత్రము

రచన : పోచిరాజు కామేశ్వర రావు

శ్రీకర దినకర సోముల
నాకుజ బుధ గురువు శుక్రు డాదిగ శనియున్
రాకేందు రిపులు రాహువు
నా కేతువులన్ స్మరింతు నమితప్రీతిన్ (1)

ఘన తిమి రారిన్ కశ్యప
తనయున్ దురితౌఘహర్తఁ దలతుం భక్తిన్
దినకరు జపాసుమ సమున్
జననోద్దీపిత ప్రచండ సమ్యక్కిరణున్ (2)

విమలాంబుజ హిమ వర్ణున్
హిమ గిరిజాధీశ మౌళి హృత్ప్రియ వాసుం
గమలానుజున్ శశాంకున్
నమస్కరింతును నిశాధి నాధున్ సోమున్ (3)

అశనిద్యుతి సమ భాసితు
ని శక్తిహస్త విభవు ధరణీ సంజాతున్
విశ దాంగారక నామున్
భృశ మంగళకరు నుతింతు పేరిమి తోడన్ (4)

గమ్యా ప్రమేయ రూపున్
రమ్య ప్రియంగు నవ కుట్మల సమశ్యామున్
సమ్యక్సత్వ గుణ నిధిన్
సౌమ్యగ్రహ బుధు నుతింతు సమ్మోదముగన్ (5)

అమర ముని వరాచార్యున్
విమలాత్ముం గాంచన నిభ విలసిత దేహున్
సముచిత రీతి బృహస్పతి
నమస్కరింతు నిల భక్తి ననవర తమ్మున్ (6)

సకలాసుర వర గురువుఁ గ
నక సన్నిభ నవ్య కుంద నాళాభాంగుం
బ్రకటిత శాస్త్రాచార్యుని
నకలంకు నుతింతు శుక్రు నగ్ని ముఖు నిలన్ (7)

యామున సమాన దేహ
శ్యామున్ ధర్మాగ్రజు రవి సంజాతున్ ఛా
యామార్తాండ సుపుత్రున్
వేమారు నుతింతు శనిని విలసిత గాత్రున్ (8)

అతి వీరు నర్ధ కాయుని
సతి సింహిక ముద్దుపట్టిఁ జంద్రా దిత్యా
మిత దళితాసక్త మతిన్
సతతము రాహువు నుతింతు సద్భక్తి నిలన్ (9)

కుసుమామల దళ సన్నిభు
నసదృశ రౌద్రాత్ము ఘోరు నతులిత రౌద్రున్
లసితగ్రహ తారా విభు
వసుధం గేతువు నుతింతు బరమప్రీతిన్ (10)

33 కామెంట్‌లు:

  1. పోచిరాజు గారూ నవ గ్రహ స్తోత్రములు నవనవలాడుచున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  2. సుకవీంద్రులు శ్రీ కామేశ్వర రావు గారికి నమస్సులు......
    కందంబుల వెలయించితి
    రందముగ, నవగ్రహముల నతి క్రమ గతులన్
    సంధించిన సంస్కృత పద
    గుంఫనలెగసినవి మీదు గూర్పున సుకవీ!

    రిప్లయితొలగించండి
  3. సుకవీంద్రులు శ్రీ కామేశ్వర రావు గారికి నమస్సులు......
    కందంబుల వెలయించితి
    రందముగ, నవగ్రహముల నతి క్రమ గతులన్
    సంధించిన సంస్కృత పద
    గుంఫనలెగసినవి మీదు గూర్పున సుకవీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మగారు నమస్కారములు. అందమైన పద్యములో మీ అభినందనలు పంపారు. చాలా సంతోషమైనది. ధన్యవాదములు. సంస్కృత పద కుందములెగసినట్లే చూపించారు మీ పద్యములో. చాలా సంతోషము.

      తొలగించండి
  4. అయ్యా..క్షమించగలరు. చివరి పాదంలో ప్రాస తప్పింది..."బంధపు గుంఫన లలరెను వందనము కవీ" యని చదువగలరు....తొందరలో గమనించలేదు...

    రిప్లయితొలగించండి
  5. అయ్యా..క్షమించగలరు. చివరి పాదంలో ప్రాస తప్పింది..."బంధపు గుంఫన లలరెను వందనము కవీ" యని చదువగలరు....తొందరలో గమనించలేదు...

    రిప్లయితొలగించండి
  6. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    ఆ నవగ్రహ స్తోత్ర. మత్య౦త విభవ

    ముగ రచి౦చిన కవిరాజ ! పోచిరాజ !

    లోకబా౦ధవుడు కరుణాలోకనమున

    రక్షణము సేయు నిన్ను నిర౦తరమ్ము
    .

    రిప్లయితొలగించండి
  7. కామేశ్వరరావురచన
    సామాన్యుల కనువుగాను,సాష్టాంగంబున్
    సోముని,ఆదిత్యుని,శని
    ఏమారకదలచునట్లు నేర్పరచె కవీ|

    రిప్లయితొలగించండి
  8. తొమ్మిది గ్రహముల గూరిచి
    యిమ్ముగ నిట వ్రాసి నట్టి యీ కృతుల నునే
    గమ్మగ జదువుదు నిత్యము
    నిమ్మహి గామేషు కృపను నిచ్చుచు బ్రేమన్

    రిప్లయితొలగించండి
  9. మిత్రులు కామేశ్వర రావు గారిలి నమస్సులు. మీ నవగ్రహస్తోత్రకందములు సుందరపదవిలసితములై యొప్పారుచున్నవి. అభినందనలు.

    ఆరవ పద్యంలోని నాల్గవ పాదంలో అఖండయతి వేశారు. ఇది మనకు తెలియకుండానే పడుతుంది అప్పుడప్పుడు. దానివల్ల నష్టమేమీలేదని నాభావన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండి ఇప్పుడే గమనించాను.అసంకల్పితము గానే పడింది. అదీకాక రెండు "న" లు కొంత అయోమయము సృష్టించియుండవచ్చు. భారతములో వెదుకుచున్నాను అఖండ యతి వాడారా? యని. "నమ్రతబుద్దిన్" అనిన నెట్లుండును?

      తొలగించండి
    2. మీ ఖండకావ్యం మనోజ్ఞంగా ఉంది.
      అఖండయతి విషయంలో నాకు అభ్యంతరం లేదు.

      తొలగించండి
    3. నాకును అభ్యంతరం లేదు. భారతంలో చాలా ఈ ప్రయోగాలు ఉన్నాయి. మహాకవులు కూడా అఖండయతిని వాడారు.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ ప్రశంసకు ధన్యుడనైతిని. ధన్యవాదములు.
      సత్కవీంద్రులు మధుసూదన్ గారు మీ ప్రశంసకు వివరణకు నా ధన్యవాదములు.

      తొలగించండి
    5. అలా అంటే పునరుక్తి దోషమేర్పడుతుం దనిపిస్తున్నది. అందులో నమస్...ఇందులో నమ్ర... కదా ఉండేది అని! దీనికన్న ఆ పాఠమే బాగున్నది. అలాగే ఉంచితేనే బాగుంటుందేమో నని నా అభిప్రాయము.

      తొలగించండి
    6. ఆర్యా బ్రహ్మగారి మనుమడు గావున "నలినజకులజున్" అనిన నెట్లుండును?

      తొలగించండి
  10. గ్రహమేదైన మన కను
    గ్రహమొసఁగదె పాడ పోచిరాజుల వారల్
    మహనీయమ్ముగఁ గూర్చగ
    నహరహముఁ బఠించ స్తోత్ర మార్తులు బాయన్!

    రిప్లయితొలగించండి
  11. తొమ్మిది గ్రహములు మనలను
    నెమ్మదిగా జూచుచుండ నిమ్మహి మేలై
    కమ్మని సుఖములు గలుగును
    వమ్మది కాదెందుజూడ వరములెకురియున్.

    ,,,,,,,,,,,,

    కవిమిత్రులు పోచిరాజు కామేశ్వరరావు గారికి ...అనవరతము నవగ్రహానుగ్రహము మీకు కలగాలని ఆకాంక్షిస్తు..

    రిప్లయితొలగించండి
  12. బాగుందండి. నవగ్రహాలకు సంస్కృత శ్లోకాలే తెలుసును. ఇప్పుడు వారి విశేషాలతో, వారి పెద్దల ప్రసక్తి తోనూ మీరు వ్రాయడం బాగుంది. ఫేస్ బుక్ లో ఉన్న ఛందస్సు సమూహంలో ఈ మీ శ్లోకాల గురించి తెలియజేస్తాను.

    రిప్లయితొలగించండి
  13. ధన్యవాదములండి లక్ష్మి గారు. ఆ సంస్కృత శ్లోకాలకనువాదములగ వ్రాసాను కొంత చేర్చి. ఏమైనా సవరణలవసరమని పరిశీలనలో ఉంచుతున్నాను కొన్ని రోజులు.

    రిప్లయితొలగించండి
  14. నిత్యపఠనాయోగ్యమై నవగ్రహస్తుతులు అందంగా అలరారుతున్నాయి.

    రిప్లయితొలగించండి