28, జులై 2010, బుధవారం

చమత్కర పద్యాలు - 10

మత్స్య రామాయణం
భోజరాజు కాళిదాసును విశేషంగా అభిమానించి, ఆదరించడం మిగిలిన కవులకు అసూయ కలిగించింది. ఎలాగైనా రాజుకు కాళిదాసుపై దురభిప్రాయం కలిగేలా చూడాలని ప్రయత్నించేవాళ్ళు. కాళిదాసుకు చేపలంటే ఇష్టం. ఒకసారి అంగడిలో ఒక చేపను కొని, సంచిలో వేసుకొని చంకలో పెట్టిలొని వస్తున్నాడు. చేప పెద్దది కావడంతో దాని తోక
కొద్దిగ బయటికి కనిపిస్తున్నది.అదే సమయంలో భోజరాజు ఏనుగునెక్కి ఆ దారి గుండా వస్తున్నాడు. కాళిదాసంటే
గిట్టని కవులు చేపల విషయాన్ని రాజుకు చెప్పారు. అప్పుడు రాజుకు, కాళిదాసుకు మధ్య జరిగిన సంభాషణ ఈ శ్లోకం. ఇది సంవాదాత్మక చాటువు.
కక్షే కిం తవ? పుస్తకం; కిముదకం? కావ్యార్థ సారోదకం;
గంధః కిం? నను రామరావణ మహాసంగ్రామ రంగోద్భవః |
పుచ్ఛః కిం? నను తాళపత్ర లిఖితం; కిం పుస్తకం భో కవే?
రాజన్, భూమిసురైశ్చ సేవిత మిదం రామాయణం పుస్తకం ||
ఆ సంభాషణ వివరంగా ....
భోజుడు: (కక్షే కిం తవ?) నీ చంకలోని దేమిటి?
కాళిదాసు: పుస్తకం.
భోజుడు: (కిముదకం?) నీళ్ళేమిటి?
కాళిదాసు: (కావ్యార్థ సారోదకం) కావ్యం యొక్క అర్థాల సారం.
భోజుడు: (గంధః కిం?) కంపేమిటి?
కాళిదాసు: (నను రామరావణ మహాసంగ్రామ రంగోద్భవః) రామరావణ యుద్ధంలో చచ్చిన పీనుగుల కంపు.
భోజుడు: (పుచ్ఛః కిం?) తోక ఏమిటి?
కాళిదాసు: (నను తాళపత్ర లిఖితం) మొదళ్ళ కొనలు తరగని కొత్త తాటాకుల కట్ట.
భోజుడు: (కిం పుస్తకం భో కవే?) ఓ కవీ! అది ఏ పుస్తకం?
కాళిదాసు: (రాజన్, భూమిసురైశ్చ సేవిత మిదం రామాయణం పుస్తకం) ఓ రాజా! ఇది బ్రాహ్మణులు ఆదరించే రామాయణ పుస్తకం.
భోజుడు చూపించమంటే కాళిదాసు చూపించాడు. నిజంగానే ఆ చేప రామాయణ గ్రంథంగా మారిందట!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి