20, జులై 2010, మంగళవారం

వారాంతపు సమస్యా పూరణం - 1

కవి మిత్రులారా!
నేను వృత్తాలను పట్టించుకోవడం లేదని ఒక మిత్రుడన్నాడు. అనుభవజ్ఞులైన కవులకు వృత్తలేఖనం కొట్టిన పిండే. కొత్తగా పద్యాలు రాసే ఔత్సాహికులకు కష్టమే. అయితే వాళ్ళను కూడ వృత్త రచనలో పాల్గొనే అవకాశం కల్గించడానికి వారానికొక వృత్త సమస్య నిస్తాను. ఈ వారం పూరించ వలసిన సమస్య ఇది ....
రోయకఁ బెండ్లియాడెను కురూపిని చక్కని చుక్క ప్రేమతో.

31 కామెంట్‌లు:

 1. ధీయుతుడంచు;సద్గుణ విధేయుఁడటంచు.మహాత్ముడంచు; తాఁ
  బాయని ప్రేమఁ బూనె గుణవర్ధి కురూపియు నందగాడె యం
  చాయమ.పెద్దలాతని మహాత్ముఁడటంచును మెచ్చి; చేయగా
  రోయకఁ బెండ్లియాడెను కురూపిని చక్కని చుక్క ప్రేమతో.

  రిప్లయితొలగించండి
 2. పాయని భక్తితో గొలిచె బావను కోమలి కోరికోరితా,
  గాయములాయె బావకును గాత్రము మాత్రము రాదురాదనన్
  మాటలు మార్చకన్ నిలిచె మానిని బావయె భర్తనెన్ భళీ!
  రోయక బెండ్లి యాడెను కురూపిని చక్కని చుక్క ప్రేమతో!

  రిప్లయితొలగించండి
 3. చింతా రామకృష్ణారావు గారూ,
  టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
  మంచి పూరణలు. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 4. ఇద్దరి పూరణలు చాలా బాగున్నాయండి. ముఖ్యంగా వెంకటప్పయ్య గారి పూరణలో భావం బాగా ఆకట్టుకుంది.
  నాకు ఒక సందేహం. వెంకటప్పయ్య గారి పూరణలో 'ట' కి 'య' కి ప్రాస కుదురుతుందా? ఇది ఉత్పలమాల కదండీ?
  నా అల్పమైన ఛందోజ్ఞానంతో అడిగింది అర్ధం లేని ప్రశ్నే కావచ్చు. గురువుగా సందేహ నివృత్తి చేయగలరు.

  రిప్లయితొలగించండి
 5. సాయి ప్రవీణ్ గారు!
  'ట'కి, 'య'కి ప్రాస కుదరదు.
  అంతే కాదు. అసమాపక క్రియ ధ్రుతాంతము కానేరదు.
  " మార్చకన్ " అన్న ప్రయోగం కూడా తప్పు.

  రిప్లయితొలగించండి
 6. డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
  నా పక్షాన సాయి ప్రవీణ్ గారి సందేహాన్ని తీర్చినందుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 7. సాయి ప్రవీణ్ గారూ,
  కొద్ది రోజులుగా మీ వ్యాఖ్యలు రాకపోయే సరికి నా బ్లాగుపైన శీతకన్ను వేశారనుకున్నా. టచ్ లోనే ఉన్నారన్న మాట! ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 8. సుకన్య, చ్యవనుల ఉదంతము:

  పాయని భక్తిచే తపము వల్మికమందున గూర్చునో మునిన్
  గాయముఁ జేసె రాకొమరి కన్నుల దర్భలఁ గుచ్చి పుట్టకున్.
  న్యాయముఁ జేయబూని యట తండ్రికి,తల్లికి నచ్చజెప్పుచూ
  మాయని చిత్తవృత్తినిడి మౌనికి సేవలుఁ జేయ సిద్ధమై
  రోయకఁ బెండ్లియాడెను కురూపిని చక్కని చుక్క ప్రేమతో.

  రిప్లయితొలగించండి
 9. రవి గారూ,
  మంచి పూరణ. అభినందనలు. నా మనస్సులో ఉన్న భావమూ ఇదే. మరొకటుంది. అది "ఒథెల్లో".
  పద్యంలో చిన్న చిన్న లోపాలున్నాయి. సమయం చిక్క గానే సవరిస్తాను.

  రిప్లయితొలగించండి
 10. రవి గారి పూరణ బావుంది,
  ఎవరైనా ష్రెక్కు ప్రస్తావన తెస్తారోమోనని ఎదురు చూస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 11. నాయక మన్యుడుం డతఁడు తాతగు యోగము నందుఁ నృత్యముల్
  సై యని జేసి ప్రేక్షకులఁ జంపును,మోమునుఁ జూడ కోతియౌన్.
  ఆయన దొక్క భారమగు యాక్షను చిత్రము యంతమందునన్
  రోయకఁ బెండ్లియాడెను కురూపిని చక్కని చుక్క ప్రేమతో.

  - అంత సరిగ్గా కుదరలేదు. అయినా ప్రయత్నించాను.

  రిప్లయితొలగించండి
 12. మాయల మాంత్రికుండొకడు మాయను జేయగ రాకుమారుడున్
  గాయము పాల్బడెన్, తనదు కాయము ఎంతయొ రూపుమారినన్
  తీయని ప్రేమ బంధమున తేజము నొ౦దిన మానసంబునన్
  రోయకఁ బెండ్లియాడెను కురూపిని చక్కని చుక్క ప్రేమతో.

  రిప్లయితొలగించండి
 13. ఆయన భస్మధారి, జడధారి, త్రినేత్రుడు, సర్పహారి యౌ
  ఈయమ హేమ రాశి, మృదుకేశి, సుహాసిని, స్వప్రకాశి యౌ
  ఏ యణుమాత్రమైన కలదే మరి సామ్యము? బాహ్య రూపమున్
  రోయకఁ బెండ్లియాడెను కురూపిని చక్కని చుక్క ప్రేమతో!

  రిప్లయితొలగించండి
 14. శంకరయ్య గారు,
  వ్యాఖ్యలు రాయడానికి నుడి కట్టు పూరించటానికి సమయం కుదరకపోయినా సమస్యా పూరణలు చూడడానికి మాత్రం మీ బ్లాగుకు రోజు వస్తూనే ఉన్నానండి.
  నుడి కట్టును నేను ఇప్పటికి ఒక్క సారే పూర్తిగా పూరించగలిగాను. ఏదైనా కాని గూగుల్ లో వెతికో, శబ్ద రత్నాకరంలో చూసో లేక మరు రోజు మీరు ప్రచురించే సమాధానాల నుంచో ప్రతి రోజు నేను ఎంతో కొంత నేర్చుకోగలుగుతున్నాను. మీ కృషికి ధన్యవాదాలు.

  @రవి గారు,
  మీ రెండో పూరణ లో చెప్పిన విషయం తెలుగు సినిమాలలో సర్వ సాధారణం. మంచి చురక వేసారు. :)

  గిరి గారి ష్రెక్ ఆలోచన కూడా బాగుంది.

  రిప్లయితొలగించండి
 15. తీయని మాటలాడుచును ధీమతి వోలెను పోజు బెట్టుచున్
  మాయలు చేయువాడొకడు, మై నలుపై నొకడొప్పు తక్కువై
  గాయపు మచ్చలుండినను గుణ్యత గల్గిన వాడు గావుటన్
  రోయకఁ బెండ్లియాడెను కురూపిని చక్కని చుక్క ప్రేమతో.

  రిప్లయితొలగించండి
 16. ఎవరూ ష్రెక్కు జోలికి పోవడం లేదు కాబట్టి, నేనే
  రోయక పద్యమిచ్చెద కురూపికి ఉత్పలమాల వృత్తమున్

  మాయ వశంబునన్ రగులు మంట లగడ్తల మధ్య కోటలో
  రేయి బవళ్ళు తన్నచటి ఱెక్కలరక్కసి బారినుండి గా
  చే యువయోధుడెవ్వడని చేడియ చూడగ వచ్చె ష్రెక్కు, బా
  బోయని పారిపోవ తలపోయక ఓగరు రూపురేఖలన్
  రోయకఁ బెండ్లియాడెను కురూపిని చక్కని చుక్క ప్రేమతో

  రిప్లయితొలగించండి
 17. రవి గారూ,
  మీ రిండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.
  మొదటి పాదంలో న-త లకు యతి చెల్లదు. అనుస్వారంతో కూడిన త,థ,ద,ధ లకు ( ంత, ంథ,ంద,ంధ లకు ) "న" తో యతి చెల్లుతుంది. నాయక మన్యుడుండతడు (?)
  " నాయక మన్యుఁ డాతఁడు గనన్ ప్రపితామగుఁ డయ్యు నృత్యముల్ " అంటే ఎలా ఉంటుందంటారు?

  రిప్లయితొలగించండి
 18. సుమిత్ర గారూ,
  పూరణ బాగుంది. అభినందనలు. పేరు గుర్తుకు రావడం లేదు కాని ఇలాంటి సంఘటన ఏదో జానపద చిత్రంలో చిన్నప్పుడు చూసినట్లు జ్ఞాపకం.

  రిప్లయితొలగించండి
 19. కొత్త విషయం తెలిసింది. (త-న లకు యతి కుదరదని). మీ సవరణతో పూరణ.

  నాయక మన్యుఁ డాతఁడు గనన్ ప్రపితామగుఁ డయ్యు నృత్యముల్
  సై యని జేసి ప్రేక్షకులఁ జంపును,మోమునుఁ జూడ కోతియౌన్.
  ఆయన దొక్క భారమగు యాక్షను చిత్రము యంతమందునన్
  రోయకఁ బెండ్లియాడెను కురూపిని చక్కని చుక్క ప్రేమతో.

  రిప్లయితొలగించండి
 20. సనత్ శ్రీపతి గారూ,
  పూరణకు అత్యుత్తమమైన ఇతివృత్తాన్ని ఎన్నుకున్నారు. పద్యం నడక సాఫీగా ఉంది. అభినందనలు. అయితే పానకంలో పుడకలా మొదటి రెండు పాదాల్లో యతిమైత్రి తప్పింది. సవరించే ప్రయత్నం చేయండి. ఎలాగూ ఇది వారాంతపు సమస్య కదా. చాలా సమయం ఉంది.

  రిప్లయితొలగించండి
 21. గిరి గారూ,
  చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు. నేను "ష్రెక్" చిత్రాన్ని ఇంట్లో పిల్లలు చూస్తుంటే అక్కడక్కడ చూసాను. పూర్తిగా చూడలేదు.

  రిప్లయితొలగించండి
 22. "మాయలు చేయకన్" అని ఉండాలి "మాటలు మార్చకన్" బదులుగా.. తప్పే! తొందరలో దొర్లిన తప్పుకు చింతిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 23. కంది శంకరయ్య గారూ,
  మీ బ్లాగు చూశాను. చాలా బాగుంది. మీ కృషి అభినందనీయం. ఇలాగే ఈ బ్లాగును కొనసాగించండి.

  రిప్లయితొలగించండి
 24. సాయముఁజేసె దీపకుఁడు ఛాత్రవరుండెటు కుష్ఠు రోగికిన్?
  మ్రోయగ చాపమున్ విఱిచి మోహన రాముఁడు నేమిఁజేసెనో?
  మాయల మంథరెవ్వరు? సుమాలను కోసెడివారలెవ్వరున్?
  రోయకఁ, బెండ్లియాడెను, కురూపిని, చక్కని చుక్క ప్రేమతో!!

  రిప్లయితొలగించండి
 25. నాయన కన్న యింతులకు నాథుడె మిన్నని పల్కు పుత్రికన్
  గాయమునొంది తండ్రి యలుకన్ గుణసుందరినో కురూపికిన్
  యీయగ నిశ్చయింప జగదీశ్వరి యానతటంచు భక్తితో
  రోయక బెండ్లియాడెను కురూపిని చక్కని చుక్క ప్రేమతో

  - గుణసుందరి కథ సినిమా ఆధారంగా

  రిప్లయితొలగించండి
 26. ఫణి గారూ, నాకూ ఇదే అలోచన వచ్చిందండీ, సమస్య చూడగానే ..
  పద్యం అద్భుతంగా వచ్చింది... అభినందనలు..

  రిప్లయితొలగించండి
 27. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  "కలిసుంటే కలదు సుఖం " సినిమాలో
  "ఇదుగో బుల్లోయ్ ! మాయమ్మ చెప్పిందని ఒప్పుకుంటున్నావేమో !
  నేనొక అవిటి వాడిని ! మంచిగ ఉన్నోణ్ణి జేస్కో "
  మంటాడు ఎన్‌టీవోడు సాయిత్రితో !
  "అబ్బే అదేం లేదు ! నీకున్న మంచి మనసును జూసి యిష్టపడే ఒప్పుకున్నా!రూపం కాదు గుణమే ప్రధానం"
  అంటుంది సాయిత్రి ! సరే ! పెళ్ళైపోతుంది !
  తరువాత భర్త ననునయిస్తూ

  " మేలిమి బంగరు మెలిక తిరిగినా విలువ తరిగేనా ? "

  అని ఒక గొప్ప పాట కూడా పాడుతుంది !
  ఆ పాట వినాలన్నా అటువంటి భార్య దొరకాలన్నా - అదృష్టం కలసి రావాలి !
  అదీ సందర్భం :

  01)
  _____________________________________

  మాయమ జెప్పిన న్వినకు ! - మంచిగ రూపము గల్గు వానినే
  హాయిగ పెండ్లియాడుమని - యాతడు జెప్పగ; బాహ్య రూపమే
  హేయము గాదు! యీ జగతి - హీనగుణంబున హీనుడౌననె
  న్రోయకఁ బెండ్లియాడెను కు - రూపిని చక్కని చుక్క ప్రేమతో !
  _____________________________________

  రిప్లయితొలగించండి
 28. వసంత కిశోర్ గారూ,
  అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  "ఆ పాట వినాలన్నా అటువంటి భార్య దొరకాలన్నా - అదృష్టం కలసి రావాలి!" :-)

  రిప్లయితొలగించండి

 29. తోయమునిచ్చి స్నానమున దోసెడు పువ్వులు కోసిపెట్టుచున్
  కాయలు కూరలన్ తరిగి కమ్మగ వంటను జేసిపెట్టుచున్
  తీయని మాటలన్ నుడివి తీరుగ నందము మెచ్చువానినిన్
  రోయకఁ బెండ్లియాడెను కురూపిని చక్కని చుక్క ప్రేమతో

  రిప్లయితొలగించండి