2, జులై 2010, శుక్రవారం

సమస్యా పూరణం - 27

కవి మిత్రులారా,
శతాధిక వందనాలు. ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
ఇంద్రునకును మ్రొక్కె చంద్రధరుఁడు.

15 కామెంట్‌లు:

 1. దేవగణము లెల్ల శివలోకమున కేగ
  హరుడు ఎదురు రాగ సురుల రేడు
  కరములోడ్చి మ్రొక్కె కైలాస నాధుని
  ఇంద్రునకును మ్రొక్కె చంద్రధరుఁడు.

  రిప్లయితొలగించండి
 2. తపము జేయునట్టి తాపసు లెల్లరు
  వేడు కొనిరి శివుని వేగ వెళ్ళి
  అప్సరసల గోల ఆపించ మనగానె,
  ఇంద్రునకును మ్రొక్కె చంద్ర ధరుడు.

  రిప్లయితొలగించండి
 3. రామ నామమందు రమణీ రమించెద
  రామ రామ రామ రామ యనుచు
  రామ చంద్రునకును రఘుకుల శ్రేష్ఠ రా
  జేంద్రునకును మ్రొక్కె చంద్రధరుఁడు!!

  రిప్లయితొలగించండి
 4. శ్రీకరముగ సకలలోక శుభఁకరమై,
  చేరి దైవ గణము జే యనంగ,
  కంబుకంఠి గిరిజ కరముఁ జేగొని పర్వ
  తేంద్రునకును మ్రొక్కె చంద్రధరుఁడు.

  రిప్లయితొలగించండి
 5. కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకమ్.....

  రామ నామ మహిమ హైమకుఁ దెల్పుచు,
  యొక పరి మదిఁ దలచుకొన్న వేయి
  తలపుల ఫలముఁ దగ గలుగుననియె, కోస
  లేంద్రునకును మ్రొక్కె, చంద్రధరుఁడు

  రిప్లయితొలగించండి
 6. హరి దోర్నాల గారూ,
  శివుని చేత ప్రతినమస్కారం చేయించారు. బాగుంది.

  వెంకటప్పయ్య గారూ,
  గోల తగ్గించమని శివుడింద్రునికి నమస్కరించాడు. ఇంద్రుడు దేవతలకు రాజు. దేవుడైన శివునికి కూడా రాజే. రాజుకు ఎవరైనా నమస్కరించ వలసిందే. మంచి పద్యాన్ని ఇచ్చారు. బాగుంది.

  జిగురు సత్యనారాయణ గారూ,
  "శ్రీరామ రామ రామేతి .. " శ్లోకాన్ని ప్రస్తావించి మంచి పూరణ అందించారు. ధన్యవాదాలు.

  రవి గారూ,
  నా మనసులోని భావాన్ని మీరు పూరణలో పెట్టారు. చక్కని పూరణ. అభినందనలు.

  గిరి గారూ,
  మీరుకూడ జిగురు సత్యనారాయణ గారి బాట పట్టి రామ నామ ప్రాశస్త్యాన్ని వివరిస్తూ పద్యం చెప్పారు. బాగుంది. కాని రెండవ పాదంలో యతి తప్పింది. గమనించండి.

  రిప్లయితొలగించండి
 7. నా పూరణలు ............
  (1)
  వర మొసంగె శివుఁడు భస్మాసురునకు నా
  యసురుఁ డుసురుఁ దీతు నంచు వెంట
  పడఁగఁ గాచినట్టి పడతిగా నున్న ర
  మేంద్రునకును మ్రొక్కెఁ జంద్రధరుఁడు.

  (2)
  అర్జునుండు మురిసి యమరావతినిఁ జేరి
  యింద్రునకును మ్రొక్కె, చంద్రధరుఁడు
  వరదుఁడై యొసఁగిన పాశుప్తాస్త్రమ్ము
  ఘన జయమ్మొసంగు ననె సురపతి.

  (3)
  వేల్పులం దెవనికి వేయి కన్నులు గల?
  వేమి చేసె భక్తుఁ డేగి గుడికి?
  హిమ నగేంద్ర సుతకు హృదయేశుఁ డెవ్వఁడు?
  ఇంద్రునకును; మ్రొక్కె; చంద్రధరుఁడు.

  రిప్లయితొలగించండి
 8. అవునండీ,తప్పు జరిగింది. సవరించాను చూడండి.

  రామ నామ మహిమ హైమకుఁ దెల్పుచు,
  యొక పరి మదిఁ స్ఫురణమూన వేయి
  తలపుల ఫలముఁ దగ గలుగుననియె, కోస
  లేంద్రునకును మ్రొక్కె, చంద్రధరుఁడు

  రిప్లయితొలగించండి
 9. శంకరయ్య గారు,
  మూడు పూరణలూ బావున్నాయి, నేను ముందుగా భస్మాసురుని గూర్చి వ్రాద్దామనుకున్నాను, రమేంద్రుని తీసుకువద్దామనుకున్నాను కానీ చివరకు వ్రాయలేదు. మీ పద్యం చాల బావుంది.

  రవి గారి పూరణపై ప్రశ్న,
  పూరణ బాగుంది కానీ, శివపార్వతుల పెళ్ళికి గిరీంద్రుడు ఒప్పుకోవడమూ, అటుపై దేవతలు చూస్తూండగా శివుడు పార్వతిని చేపట్టి మామకు మ్రొక్కడమూ తటస్థించిందా?

  రిప్లయితొలగించండి
 10. @గిరి గారు: ఏమో తెలియదండి. మీరే తెలిస్తే విశదీకరించాలి.

  రిప్లయితొలగించండి
 11. నారసింహుడనిన నారాయణుండేను
  భయము వీడి యతని పాహియనుము
  అనుచు చెప్పె శివుడు అనిమిషాదులకును,
  ఇంద్రునకును; మ్రొక్కె చంద్రధరుఁడు

  రిప్లయితొలగించండి
 12. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  01)
  ____________________________________

  భస్మ దనుజు చేత - భస్మంబు గాకుండ
  తన్ను గాచి నట్టి - యన్ను గాంచి
  భక్తి పూర్వకముగ - భయము దీర్చిన, ల
  క్ష్మీంద్రునకు ను మ్రొక్కె ! - చంద్రధరుడు !
  ____________________________________

  రిప్లయితొలగించండి
 13. వసంత కిశోర్ గారూ,
  మీ లక్ష్మీంద్రుని పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. మాయ దర్పణమ్ము మహాదేవుడే జూడ
  తనదు మోము బదులు తారసిల్ల ,
  శంఖ చక్రములతొ శయనించి యున్నయు
  పేంద్రునకును; మ్రొక్కె చంద్రధరుఁడు.

  రిప్లయితొలగించండి