1, జులై 2010, గురువారం

సమస్యాపూరణం - 26

కవి మిత్రులారా,
నమస్కృతులు. ఈ రోజు "రవి" గారు పంపిన సమస్యను ఇస్తున్నాను.
అత్తకు కన్ను గీటె నల యల్లుఁడు తాపముఁ దీర్పఁ గోరుచున్.
నిజానికి వా రిచ్చిన సమస్యలో "దాహము" ఉంది. రవి గారు క్షమిస్తారనే నమ్మకంతో దానిని "తాపము"గా మార్చాను.

17 కామెంట్‌లు:

  1. కొత్తగ పెళ్లి యాడె నట కోమలి; అంతనె అల్గి భర్తపై
    చిత్తము సేదదీరుటకు చేరెను పుట్టిలు; మాసమీగగా;
    అత్తయె పుత్రి దోడుకుని అల్లుడి యింటికి వెళ్ళ; నా రజో
    న్మత్తకు కన్ను గీటె నల యల్లుఁడు తాపముఁ దీర్పఁ గోరుచున్.

    రిప్లయితొలగించండి
  2. చిత్తరువొక్కటిన్ కనగ చిత్తము కాముని కోర్కు విత్తినన్
    తత్తరపాటు లేక కడు తాపము తీరగ మామ కాముడై
    అత్తకు కన్ను గీటె, నల యల్లుఁడు తాపముఁ దీర్పఁ గోరుచున్
    హత్తుకు పోయెనంత తన ఆలిని సుందర నీల వేణినిన్!!

    రిప్లయితొలగించండి
  3. ముత్తియమంటి యల్లుఁడట పుణ్యము చేతను దక్కె నీకుఁబో
    సొత్తుగ జూచుకొమ్మితని శోభన పెండిలి కూఁతురా యనన్
    చిత్తమునందు సిగ్గులవి చెక్కిలి కెంపులు పూయఁగానటన్
    ఎత్తగు పట్టె మంచమున ఇంపుగఁ జేరిన కౌతుకీ సమా
    యత్తకు కన్ను గీటె నల యల్లుఁడు తాపముఁ దీర్పఁ గోరుచున్

    రిప్లయితొలగించండి
  4. అత్త ధరిత్రి, విష్ణువుకు నాతడు రాముని రూపమెత్తగా;
    అత్తరుణీలలామె సతి, యాతడు కృష్ణుని రూపమెత్తగా;
    చిత్తమునందు రామునిగ శ్రీహనుమంతుడు చూడ కృష్ణునిన్ -
    అత్తకు కన్నుగీటె నల యల్లుడు తాపముదీర్ప గోరుచున్!

    రిప్లయితొలగించండి
  5. కత్తిని చేతఁ బట్టు నరకాసురుఁ తోడను వాసుదేవుఁడున్
    అత్తిన సత్యభామ జత ఆహవమాడుచు సోలిపోవుచూ
    చిత్తగువేళ సంద్రముకు చెలువ గంగను గోరుచున్నటన్
    అత్తకు కన్నుఁ గీటెనల యల్లుఁడు తాపముఁ దీర్పగోరుచున్

    శ్రీహరి (కృష్ణుడు) కి మామయ్య సముద్రుడు (లక్ష్మి సముద్రజ కాబట్టి). సముద్రుడి భార్య గంగ, శ్రీహరికి అత్త. సత్యభామ తోడి, నరకాసురుడితో యుద్ధం చేస్తూ, సోలిపోతున్న తరుణంలో కృష్ణుడు, తన అత్తను తాపం తీర్చమని అడిగాడు.

    రిప్లయితొలగించండి
  6. (1)
    ఉత్తర భారతావని జనోక్తిని కృష్ణుని కత్తయై సదా
    చిత్తము నం దతండె నివసించఁగ రాధ నదీతటంబునన్
    కొత్త తలంపు లామె మది కొల్లలు గాగ ప్రతీక్ష సేయఁగా
    నత్తకు కన్ను గీటె నల యల్లుఁడు తాపముఁ దీర్పఁ గోరుచున్.

    (2)
    క్రొత్తగ నిల్లు జేరఁగనె కోడ లెవారికి వందనం బిడున్?
    మత్తుగ త్రాగి వచ్చి మఱి మామను చెప్పకు మం చెటుల్ గనెన్?
    చిత్తజు బాణముల్ తగిలి చెల్వను జేరె ప్రియుం డెవ్విధిన్?
    అత్తకు, కన్ను గీటె నల యల్లుఁడు, తాపముఁ దీర్పఁ గోరుచున్.

    రిప్లయితొలగించండి
  7. హరి దోర్నాల గారూ,
    పద్యం చక్కగా ఉంది. కాని "రజోన్మత్త"లో ఉన్మత్త ఉంది, అత్త లేదు. గమనించండి.

    రిప్లయితొలగించండి
  8. జిగురు సత్యనారాయణ గారూ,
    మామ చేతనే అత్తకు కన్ను గీటించారు. బాగుంది. మంచి పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. రవి గారూ,
    కొత్త అల్లుడు శోభనపు పెళ్ళికూతురికి కన్నుకొట్టాడా? బాగుంది. పద్యం చక్కగ సాగింది.

    రిప్లయితొలగించండి
  10. డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    ధన్యోస్మి! అద్భుతమైన పూరణ. ఈ సమస్యను రవి గారు పంపగానే భూదేవి, విష్ణువుల సంబంధాన్ని ఎవరు ప్రస్తావిస్తారా అని చూసాను. మీరు నా కోరిక తీర్చారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. రవి గారూ,
    మీ రెండవ పూరణ కొద్దిగా తికమక పెట్టింది. కొన్ని వ్యాకరణ దోషాలు, మూదవ పాదంలో గణదోషం ఉన్నాయి. చూడండి.

    రిప్లయితొలగించండి
  12. కంది శంకరయ్యగారు,

    చాలాకాలంగా మీ బ్లాగును తప్పక చూస్తున్నాను. సమస్యలు, పూరణలు మహాద్భుతంగా వుంటున్నాయి. ప్రత్యేకించి ప్రతి సమస్యకి వస్తువైవిధ్యంతో వచ్చే రకరకాల పూరణలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఈ ప్రయత్నం చేస్తున్న మీకు శతాధిక వందనాలు.

    (రామాయణంలో పిడకలవేట: మీరు టపాలకి పెట్టిన వర్గాలలో (లేబుళ్ళు) "చమత్కార పద్యాలు" అనటానికి బదులుగా "చమత్కార పాద్యాలు" అన్నారు. సరి చెయ్యగలరు. ఇంతమంచి సాహిత్యం మధ్య అచ్చుతప్పు పంటికింద రాయిలా తగుల్తోంది.)

    రిప్లయితొలగించండి
  13. కత్తినిఁ బూని వచ్చు నరకాసురుఁ తోహరి భండనమ్ముకున్
    అత్తిన సత్యభామ పతి ఆహవమాడుచు సోలిపోవుచూ
    చిత్తగువేళ సాగరుని చేడియ గంగను గోరుచున్నటన్
    అత్తకు కన్నుఁ గీటెనల యల్లుఁడు తాపముఁ దీర్పగోరుచున్

    రిప్లయితొలగించండి
  14. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    01)
    ___________________________________________

    విత్తము తక్కువౌట ! తమ - వీడుకు దగ్గర , భోగి నాడదే
    క్రొత్తగ షాపు పెట్ట, నట - కూరిమి మీరగ త్రాగి యింటికిన్
    మత్తుగ వచ్చినాడు ! తన - మానిని యంచు భ్రమించి; నయ్యయో
    అత్తకు కన్ను గీటె నల - యల్లుఁడు తాపముఁ దీర్పఁ గోరుచున్ !
    ___________________________________________

    రిప్లయితొలగించండి
  15. వసంత కిశోర్ గారూ,
    అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. క్రొత్తది గుఱ్ఱమున్ గనుచు కొంపను న్యాసము పెట్టియోడగా
    విత్తము గోరుచున్ వడిగ వేడుచు పాడుచు స్తోత్రగీతముల్
    సొత్తులు వేల కోట్లుగల సొంపున బంగరు బొమ్మవోలు మే
    నత్తకు కన్ను గీటె నల యల్లుఁడు తాపముఁ దీర్పఁ గోరుచున్

    రిప్లయితొలగించండి