25, జులై 2010, ఆదివారం

వారాంతపు సమస్యా పూరణం - 2

కవి మిత్రులారా!
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది ....
అమవస నాఁడు విస్తరిలె నాకసమందు మనోజ్ఞకాంతులే.

14 కామెంట్‌లు:

 1. అమవస యన్న పెద్దనపహాస్యముపాలయె రామలింగచే.
  అమవసయైన గానిమధురాక్షర కాంతుల సత్కవిత్వముల్
  క్రమమున భావనాకసము క్రమ్ముకొనెన్. పరికించి చూడగా
  నమవస నాఁడు విస్తరిలె నాకసమందు మనోజ్ఞకాంతులే

  రిప్లయితొలగించండి
 2. చింతా రామకృష్ణారావు గారూ,
  పూరణ బాగుంది. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 3. అమవస రోజునాడు మన హైందవ జాతికి గొప్ప పర్వమై
  తిమిరము నడ్డగించుటకు ధీరత నిచ్చును; దీప మాలలన్
  అమరిచి; ఎల్ల వారలును ఆకస వీధిని రాకెటుల్ విడన్
  అమవస నాఁడు విస్తరిలె నాకసమందు మనోజ్ఞకాంతులే

  రిప్లయితొలగించండి
 4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 5. అమరుల త్యాగముల్ ఫలియ అంతిమ తీర్పు నొసంగు రాష్ట్రమున్
  సమరపు బావుటా లెగుర సాకరమౌ తెలగాణ నిక్కమున్
  సమసమ రాజ్యమౌ మనదె సస్యపు శ్యామల ప్రాంతమౌ
  నమవస నాఁడు విస్తరిలె నాకసమందు మనోజ్ఞకాంతులే

  రిప్లయితొలగించండి
 6. వ|| కతిపయ వర్షములకు ముందు ఒక అమవస నిశిని

  చం||
  విమల మనోజ్ఞహాసమున వీనులవిందుగ నారి జెప్పె నో
  కమలము రూపునందునది గర్భమునందని ఆ దినంబునన్ .
  అమరెను నా మనో విశిఖ ఆకసమో యనునట్లు గానహో!
  అమవస నాఁడు విస్తరిలె నాకసమందు మనోజ్ఞకాంతులే!

  రిప్లయితొలగించండి
 7. హరి దోర్నాల గారూ,
  నచికేత్ గారూ,
  రవి గారూ,
  మంచి పూరణ లందించారు. అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 8. నా పూరణ -
  సమరము రీతి తీవ్రముగ సాగె క్రికెట్టది ట్వెంటి ట్వెంటిగా
  తమదగు జట్టు గెల్వఁగనె తాకెను నింగి జయధ్వనుల్ జనుల్
  సమధికమైన హర్షమును చాటిరి పేల్చి మతాబు లెల్లెడన్
  అమవసనాఁడు తేజరిలె నాకసమందు మనోజ్ఞ కాంతులే.

  రిప్లయితొలగించండి
 9. శంకరయ్య గారు!
  పరిశీలించి తప్పొప్పులు చెప్పండి.
  "నీవు లేక వీణ" పాటకి - చంపకమాల :)

  తమరిని వీడి నేనెటుల దైన్యమునొందెదొ చూపగోరెలే
  తమకన; నాటినాటికి సుధాకరుడే కడుచిన్నబోవడే
  కమలదళాయతాక్ష! తిధిగాంచితొ? గానవొ? నేడెజొచ్చెరా
  యమవస; నాడు విస్తరిలె నాకసమందు మనోజ్ఞకాంతులే


  భవదీయుడు
  ఊకదంపుడు

  రిప్లయితొలగించండి
 10. ఊకదంపుడు గారూ,
  నేను గమనించినంతలో మీ పద్యంలో దోషాలేమీ లేవు. మంచి పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. సాహితీ సమరాంగణ చక్రవర్తి, మురురాయ గండడు శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక పంచ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా...

  విమల యశో విభంబు దిశల వెల్గుల నింపెడు వేవెలుంగు ధీ
  సమ కవిరత్నదీప్తికల సౌరున మించెడు మంచురేడు యా
  సమరస రాయలుండు నదె స్వర్ణయుగంబట లేదులేదులే
  అమవస; నాఁడు విస్తరిలె నాకసమందు మనోజ్ఞకాంతులే

  రిప్లయితొలగించండి
 12. విమల యశో విభంబు నెడ వెల్గుల నింపెడు వేవెలుంగు, ధీ
  సమ కవిరత్నదీప్తికల సౌరున మించెడు మంచురేడు, యా
  సమరస రాయలుండు నదె స్వర్ణయుగంబట లేదులేదులే
  అమవస; నాఁడు విస్తరిలె నాకసమందు మనోజ్ఞకాంతులే

  రిప్లయితొలగించండి
 13. కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
  మీ పద్యంలో కొన్నిలోపాలున్నా మంచి భావం ఉంది. అభినందనలు. వీలును బట్టి మీ పద్యాన్ని సవరిస్తాను.

  రిప్లయితొలగించండి
 14. అమరిన దీపముల్ వెలిగి యందము చిందగ నింటియింటనున్
  కొమరులు కూతులందరును గూడును చేరిన సండందునన్
  తిమిరము పార ద్రోలెడిది దివ్వెల పండుగ ఢాముఢాములం
  దమవస నాఁడు విస్తరిలె నాకసమందు మనోజ్ఞకాంతులే

  రిప్లయితొలగించండి