29, జులై 2010, గురువారం

చమత్కార పద్యాలు - 11

సయ్యదలీ, అజ్మతుల్లా కవులు
గత శతాబ్దికి చెందిన సయ్యద్ అలీ, అజ్మతుల్లాలు సోదరులు. వీరిది దేవరకొండ. సంస్కృతంలోను, తెలుగులోను కవిత్వం చెప్పేవారు. సంగీత, జ్యోతిష శాస్త్రాల్లో విశారదులు. వీరు నవీన హరిశ్చంద్ర, సత్యాద్రౌపదీ సంవాదము, సీతారామ శతకము మొదలైన రచనలు చేశారట! కాని ఇప్పుడవి అలభ్యాలు. వీరి చాటువు ఒకటి గోలకొండ కవుల సంచికలో ప్రకటింప బడింది.
సీ.
కొమ్మయో యది పూల రెమ్మయో బంగారు
బొమ్మయో తోఁచెఁ గందమ్ములకును
నింతియో వలరాజు దంతియో నతను చే
బంతియో వింత నా స్వాంతమునకు
బోఁటియో రతనాల పేటియో యచ్చర
మేటియో కంటి వనవాటికందు
చానయో యమృతంపు సోనయో ముద్దుల
బానయో చెదిరె నా మానసంబు
తే.గీ.
దాని వయసు వయారంబు తళుకు బెళుకు
సోయగము ప్రోడతనమును సొరిది నమర
నెట్లు చేసెనో విధి దీని కెనయ సాటి
కాంత గల్గునె గన ముజ్జగంబులందు.

4 కామెంట్‌లు:

  1. మన ఆంధ్రవాణికి అలంకారంగా వెలుగొంద గలిగిన ఈ చతురకవుల రచనలు మనకు లభించకపోవడం మన అభాగ్యమే. ఎప్పటికైనా వీరి రచనలు మనకు లభించాలని ఆ వాగ్దేవికి విన్నవించుకొంటున్నాను.

    రిప్లయితొలగించండి
  2. చక్కని పద్యం అందించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. చింతా రామకృష్ణారావు గారూ,
    ఇలాంటి మరుగున పడ్డ మాణిక్యాలు సాహితీలోకంలో ఎందరో ఉన్నారు. వారి రచనలు మనకు అందుబాటులో లేకపోవడం మన దురదృష్టమే.

    రిప్లయితొలగించండి
  4. పంతుల జోగారావు గారూ,
    "శంకరాభరణం" బ్లాగుకు స్వాగతం. పద్యం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. నా బ్లాగును ఎప్పటికప్పుడు చూస్తూ మీ సూచనలు, సలహాలు ఇచ్చి ప్రోత్సహించ వలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి