4, జులై 2010, ఆదివారం

సమస్యా పూరణం - 29

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ....

మందు లనారోగ్య మొసఁగు మద్యమె మేలౌ.

16 కామెంట్‌లు:

 1. కంది వర వంశ సంభవ!
  మందే యారోగ్యమిచ్చుమద్యము కీడున్.
  ఎందుకు పలికెద రటు లే
  మందు లనారోగ్య మొసఁగు? మద్యమె మేలౌ?

  ఆర్యా! మీ నిరంతర కృషికి నా అభినందనలు.ఈ మీ కృషిని చూస్తుంటే మీ 35సంవత్సరాల తెలుగు ఉపాధ్యాయ వృత్తికి తగిన న్యాయం చేసి ఉంటారని ఊహుంచగలను. నాకు చాలా ఆనందంగా ఉండండి. మన భాషా పండితులు అందరూ కూడా అంకిత భావంతో భాషాభిమానంతో భాషాసేవ చేస్తూ; కనీసం తమను నమ్మి తమదగ్గర విద్యకొఱకు వచ్చే విద్యార్థులకు ధర్మ బద్ధంగా విద్య గరుపుతూ ఆంధ్రవిద్యార్థులకు ఆంధ్ర భాషాభిమానం పెరిగేలా చేయాలని నా కోరికను ఆభగవంతుఁడు తప్పక తీర్చాలని కోరుకొంటున్నాను.
  ఇక ఈ రోజు నేనొక సమస్యను అందిస్తున్నాను. అది చూడండి.

  "- క్లేశంబులు బాపుమయ్య! కృపతో సాయీ! జగన్నాయకా!"

  మొదటి అక్షరం కూడా పూరింపఁ బడాలి. మరి పూరణలకై ఎదురు చూద్దామా?

  రిప్లయితొలగించండి
 2. దేవదాసు మిత్రుడు తాగుడలవాటు చేయిస్తూ:

  బందువ! దేవద! చింతను
  పొందుటదేల! వలదోయి! పొమ్మను పారున్!
  విందులు జేయుము. అసలీ
  మందులనారోగ్యమొసఁగు మద్యమె మేలౌ.

  ఆక్లిష్టమ్మగు జీవితమ్ములివి పేరాశల్ సమృద్ధిం జనిం
  చు క్లాంతిన్ కలిగించి దాహమునుఁ బెంచున్. వేసరించున్. హరా!
  శుక్లప్రోతధరా! విశుద్ధ! జగదీశూ! ద్వారకామాయి వా
  సా! క్లేశంబులు బాపుమయ్య! కృపతో సాయీ! జగన్నాయకా!

  రిప్లయితొలగించండి
 3. ఈ క్లాంతిన్ ಭరియింపనాతరమ! నా కీజన్మమెట్లబ్బెనో!
  శుక్ల స్వాంతము తోడ నిన్ గొలువ నస్తోకప్రభామూర్తులై
  యీ క్లాంతిన్ విడి సౌఖ్యమొందునటగా! ఈ నా వ్యధల్ గాంచి; యా
  శా క్లేశంబులు బాపుమయ్య! కృపతో సాయీ! జగన్నాయకా!

  రిప్లయితొలగించండి
 4. " క్లేశంబులు బాపుమయ్య! కృపతో సాయీ! "
  అన్నది మాత్రమే తీసుకుంటే కందం లో పూరించ వచ్చును.

  క్లేశంబులునను గప్పుచు
  నాశగ నిను కొలువనీయ .వసదృశ భక్తిన్
  నాశన మొనరించెడి యీ
  క్లేశంబులు బాపుమయ్య! కృపతో సాయీ!

  రిప్లయితొలగించండి
 5. బ్రాందీ విస్కీ మొదలగు
  మందు లనారోగ్య మొసఁగు, మద్యమె మేలౌ
  గాంధీ మార్గము విడిచిన
  కొందరి పాలకులకు తమ కోశము నింపన్!!

  రిప్లయితొలగించండి
 6. గుడ్డిలో మెల్ల అంటే ఇదే..

  మందులు పల్ రూపంబులఁ
  బొందెను మత్తిలు జనముల పోకడ వరుసన్
  యందలి రొంపిన మాదక
  మందు లనారోగ్యమొసఁగు, మద్యమె మేలౌ

  రిప్లయితొలగించండి
 7. చింతా రామకృష్ణారావు గారూ,
  నా పట్ల మీరు చూపిస్తున్న అవ్యాజానురాగానికి ధన్యవాదాలు. ఆత్మసాక్షిగా నేను ఉపాధ్యాయునిగా విద్యార్థులకు న్యాయం చేసాననే భావిస్తున్నాను. నా విద్యార్థులు కొందరు తెలుగు పండితులుగా ఉద్యోగం చేస్తున్నారు. మీ ప్రొత్సాహం, సహకారం ఇలాగే కొనసాగించాలని మనవి.

  రిప్లయితొలగించండి
 8. రవి గారూ,
  పారూను మరిచిపోవాడనికి మద్యాన్ని మించిన మందు లేదు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. జిగురు సత్యనారాయణ గారూ,
  ఖజానా నింపడానికి మద్యమే మేలు. మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. గిరి గారూ,
  "గుడ్డిలో మెల్ల"గా మీరు చేసిన పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. చింతా రామకృష్ణారావు గారూ,
  నే నిచ్చిన సమస్యకు మీ పూరణ అద్భుతం. ఇక మీ సమస్యకు మీ రెండు పూరణలు బాగున్నాయి.

  రవి గారూ,
  చింతా వారి సమస్యకు మీ పూరణ బాగుంది. మరి గుణదోష విచారణ చింతా వారే చూస్తారు.

  రిప్లయితొలగించండి
 12. నే నిచ్చిన సమస్యకు నా పూరణ -

  పొందగు నారోగ్యమునకు
  మందు; లనారోగ్య మొసఁగు మద్యమె; మేలౌ
  నందును వ్యసనములు విడువ;
  నెందును సురపానరతుఁడు హీనుఁడు కనఁగన్.

  చింతా వారి సమస్యకు నా పూరణ -

  అక్లిష్టంబు త్వదీయ బోధనము సత్యంబై జనానందదం
  బై క్లిందజ్జన పాప సంహరణ విద్వద్దాయియై యొప్పు; దే
  వా! క్లిశ్యద్భువనావనోత్సుక సుసంపద్రాజితా! సాధు వే
  షా! క్లేషంబులు బాపుమయ్య కృపతో సాయీ! జగన్నాయకా!

  రిప్లయితొలగించండి
 13. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  01)
  _____________________________________

  సుందర రేపర్ల ,చెడిన
  మందు ,లనారోగ్య మొసగు - మద్యమె ! మేలౌ
  మందాకులతో జేసిన
  మందులె నారోగ్యమిచ్చు - మనకందరికిన్ !
  _____________________________________

  చెడిన = expired
  మందాకు = మూలిక (అంటే ఆయుర్వేదం అని భావం)

  రిప్లయితొలగించండి
 14. వసంత కిశోర్ గారూ,
  మందులు, మద్యము రెండూ అనారోగ్యకరములని చెప్పిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. పందుల ఫ్లూ పట్టుకొనగ
  బందుగు లెల్లరు భయపడి పరుగులు పెట్టన్
  పొందుగ రోగికి నిడగన్
  మందు లనారోగ్య మొసఁగు మద్యమె మేలౌ

  పందుల ఫ్లూ = swine flu

  రిప్లయితొలగించండి