8, డిసెంబర్ 2012, శనివారం

పద్య రచన - 184

మేఘ సందేశం 
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు:

  1. గంధర్వు డొకడు శిక్షనుబొంది దేశాంత
    ....రమ్మున గడు విరహమ్ము చేత
    నెంతయు గ్రుంగుచు జింతతో హృదయమ్ము
    ....వేదన నొందెడు వేళయందు
    గాంచె నాతడు నింగి గదలుచు నున్నట్టి
    ....మేఘంబు, నది చేయు మేలటంచు
    నెంచి దైన్యమున బ్రార్థించె నా మేఘునే
    ....దూతగా జనుమయ్య ప్రీతి తోడ
    ననుచు దన యూరి మార్గమ్ము నచట తనదు
    ప్రణయరూపిణి వివరమ్ములను దెలిపెను
    పిదప సురరాజు కృపనొంది విడువబడెను
    శిక్షనుండి నిజ గృహంబు జేరుకొనెను

    రిప్లయితొలగించండి
  2. మేఘ రాజమ ! వందన మిడుదు నీకు
    సీత పల్లి యందున్న నా చెలియ గలిసి
    నాదు ప్రేమను వివరించి చేదు కొనగ
    పూను కొనుమమ్మ ! నా బదుల్బు ణ్య శీ ల !

    రిప్లయితొలగించండి
  3. విరహమ్మున ప్రేమికులకు
    దొరికిన దేదైన తమరి తొత్తని భావిం
    చ,రయంబున తన వారికి
    చిరు సందేశమిడ మేఘ చెవిలో ననరే!

    రిప్లయితొలగించండి
  4. గాలికి చల్లగ కదలుచు
    గాలించుము నాదు చెలిని కష్టములన్నీ
    జాలిగ జల్లుగ చల్లుము
    మేలుగ తన దరికి జేరి మేఘమ దయతో.

    రిప్లయితొలగించండి
  5. గాలికి చల్లగ కదలుచు
    గాలించుము నాదు చెలిని కన్నీరంతా
    జాలిగ జల్లుగ చల్లుము
    మేలుగ తన దరికి జేరి మేఘమ దయతో.

    రిప్లయితొలగించండి
  6. గగన సీమను పయనించు మేఘ మాల
    కలను కరిగించు నాచెలి కలత పడక
    ప్రేమ జల్లును కురిపించి మమత పెంచి
    విరహ వేదన కరిగించి మరులు గొనగ

    రిప్లయితొలగించండి
  7. మందాక్రాంత వృత్తము :

    యక్షుం డొక్కండు ధనదుడి రాజ్యమ్ము శీఘ్రమ్ము వీడన్
    శిక్షన్ బొందెన్ భువినబడి క్లేశించి భార్యా వియోగం
    బీక్షించెన్ ; మేఘమును గని సంప్రీతుడై దూతగా బం
    పెన్ “ క్షేమంబే నను గనుము యో ప్రేయసీ ! వీడు చింతన్ "

    అనుచు త్రోవలో కన్ పట్టు యన్ని దృశ్య
    ములను వర్ణించి యతనికి నలకపురికి
    వెడలు గతి జెప్ప, మేఘుడు విన్న వించె
    గాథ యక్షిణికి, కథ సుఖాంత మయ్యె

    రిప్లయితొలగించండి
  8. అమ్మా! రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యమును చూచేను. ప్రాసయతి నియమములను మీరు గమనించుట లేదు. మీ పద్యమును మరింత సులభ గ్రాహ్యము చేయుటకై నేను సాహసించి క్రింది విధముగా మార్పులు చేసితిని.

    గగన సీమలో నలరు మేఘమ్మ! నాదు
    చెలికి నా మాట చెప్పుమా కలత పడక
    ప్రేమ జల్లును కురియుమా పెంచి మమత
    విరహ వేదన తొలగించు సరణి మెరయ

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. అయ్యా శ్రీ నాగరాజు రవీందర్ గారూ! శుభాశీస్సులు.
    మేఘసందేశము పూర్తిగా మందాక్రాంతములలో నున్నదే కాబట్టి మీరు అదే సంప్రదాయములో మందాక్రాంతమును వ్రాయుట సముచితముగ నలరారుతూ బహు ప్రశంసనీయముగా నున్నది. అభినందనలు. 2 చిన్న సవరణలు:

    1. మందాక్రాంతము 4వ పాదములో ప్రాస స్థానములో "న్" (ద్రుతము)ను వాడుతవలన ప్రాస నియమ భంగము జరిగినది. తగురీతిగా సవరించండి.

    2. తేటగీతిలో కన్ పట్టు + అన్ని = కన్ పట్టు నన్ని అని నుగాగమము వస్తుంది; యడాగగమము రాదు.

    స్వస్తి.

    కథలో "యక్షుడు" కథానాయకుడని గుర్తు లేక గంధర్వుడు అని నేను నా పద్యములో వ్రాసేను. దానిని కాస్త మార్చుకుంటాను.

    రిప్లయితొలగించండి
  10. మిత్రులారా!
    నా పద్యములో తొలుతలో "గంధర్వు డొకడు" అనుటకు బదులుగా "మును యక్షు డొకడు" అని సవరించుచున్నాను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. గురువర్యా ! సవరణలను చేసి సూచించి నందులకు బహుధా ధన్యవాదములు.

    మందాక్రాంత వృత్తము :

    యక్షుం డొక్కండు ధనదుడి రాజ్యమ్ము శీఘ్రమ్ము వీడన్
    శిక్షన్ బొందెన్ భువినబడి క్లేశించి భార్యా వియోగం
    బీక్షించెన్ ; మేఘమును గని సంప్రీతుడై బంపె వార్తన్
    “ నే క్షేమంబే నను గనుము యో నెచ్చెలీ ! వీడు చింతన్ "

    అనుచు త్రోవలో కన్ పట్టు నన్నిదృశ్య
    ములను వర్ణించి యతనికి నలకపురికి
    వెడలు గతి జెప్ప, మేఘుడు విన్న వించె
    గాథ యక్షిణికి, కథ సుఖాంత మయ్యె

    రిప్లయితొలగించండి
  12. గగనపు సీమలోనరుగు కారుమొయిళ్ళను గాంచి, ముద్దుగా
    నగవుల నొల్కు పత్నిని మనంబున దల్చిన యక్షుడాశతో
    దిగులును మానమంచునొక తియ్యని వార్తను జేర్చకోరుటన్
    సొగసుగ కావ్యరూపమున శోభిల వ్రాసెను కాళిదాసుడే.

    రిప్లయితొలగించండి



  13. ఆషాఢమాసాన నంబరమ్మున నీలి
    మబ్బుగముల జూడమదిని దోచు
    నెద్దియో యత్యద్భుతేచ్చా విహారమ్ము
    పులకితగాత్రమ్ము పొంగులెత్త
    కాళిదాసమహా కవిచంద్రు కావ్యమ్ము
    మేఘదూతమె మదిన్ మెదలుచుండు
    ప్రణయినీ విరహ సంబాధిత యక్షుని
    యుద్వేగభావమ్ము లొక్క పగిది
    జేరి నను జుట్టి యోచన జేయ బూన
    మధురసంగీత లాలసమానసమ్ము
    వలెను విభ్రాంతి గొల్పును వర్ణలిఖిత
    చిత్రపటమున నాకథ చెలువమొంద.

    శ్రీ శంకరయ్య గారికి,శ్రీ నేమాని వారికి ,
    నేను సాధారణంగా,యీ బ్లాగులో ఆలస్యంగా వ్రాస్తూ ఉంటాను.కాబట్టి,నా కవితల మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి సూచనలూ,అభిప్రాయాలూ తెలియజేయమని కోరుతున్నాను.

    రిప్లయితొలగించండి