3, డిసెంబర్ 2012, సోమవారం

సమస్యా పూరణం - 895 (పలికిన పల్కు లన్నియును)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పలికిన పల్కు లన్నియును పద్యము లైనవి యేమి చెప్పుదున్?
(ఆకాశవాణి సౌజన్యంతో)

29 కామెంట్‌లు:

  1. వెలువడె గొప్ప కావ్యములు పెక్కు ప్రబంధ పురాణ శాస్త్రముల్
    నలువ చతుర్ముఖమ్ములను నాలుగు వేదములట్లు ! పండితుల్
    పలికిన పల్కులన్నియును పద్యములైనవి యేమి చెప్పుదున్!
    పలుకుల తల్లి యిభ్భరత పావన ధాత్రి చరింప సత్కృపన్.

    రిప్లయితొలగించండి
  2. నిలిచితి భక్తి భావమున నేను శుభోదయ వేళ భారతిన్
    దలచి నమస్కరించుచును తద్విభవమ్ములు మన్మనమ్ములో
    నలరుచు దర్శనంబొసగ హర్ష పయోనిధిపైని దేలుచున్
    గొలుచుచు మానసార్చన నిగూఢ విధానమునందు తత్కృపా
    ఫలముగ నాదు డెందమున భావ పరంపర లుప్పతిల్లుచున్
    గలగల పారు నేరువలె క్రన్నన నాదు ముఖమ్మునుండి వే
    వెలుగుల జిమ్ముచున్ దగు వివేక వికాసముతోడ దివ్య సూ
    క్తుల కనురూప వైభవముతో రసపుష్టిని సంతరించుచున్
    వెలువడె స్తోత్రరాజములు పెక్కగు ఛందములందు పద్య రా
    శులు మది వేడ్కగూర్చు పలు సొంపులు నింపులు నింపుచున్ బళా!
    లలిత పదప్రశస్తి, సరళంబగు శైలి దనర్చు చంపకో
    త్పలముల మాలికల్, ద్విపద, పాదప, స్రగ్ధర, సీస, కంద, గీ
    తులు మొదలైన రీతులును తోటక, పృథ్వి, సుగంధు లొప్పుగా
    పలికిన పల్కులన్నియును పద్యము లైనవి యేమిచెప్పుదున్?
    మలచితి కావ్య రత్నముగ మంచి ముహూర్తమునన్ సరస్వతీ
    లలిత పదాబ్జ సన్నిధి నలంకరణమ్ముగ జేసి మ్రొక్కితిన్
    బులకితమయ్యె నా తనువు పొంగెను డెందము సంతసమ్ముతో
    నలరె రసజ్ఞులౌ బుధులు, నాప్తులు గూర్చ ప్రశంస లొప్పుగా
    దలచుచు మాటిమాటికినితల్లి యనుగ్రహ వైభవమ్ము ని
    స్తుల బహు యోగదాయియని చొక్కి రచించితి దివ్య లీలలన్

    రిప్లయితొలగించండి
  3. పద్యములు ఎంతగానో అలరిస్తున్నాయి.

    కలికి సరస్వతీ సతికి కంజదళాయత నేత్రి వాణికిన్,
    తలచిన చాలు విద్యలను దానము చేసెడు శారదాంబకున్,
    సలలితమౌ పదమ్ములను చక్కటి భావము జేర్చి యొప్పుగా
    పలికిన పల్కు లన్నియును పద్యము లైనవి యేమి చెప్పుదున్?

    రిప్లయితొలగించండి
  4. తలచితి పూరణంబు నొక దానిని వ్రాయగ బ్లాగునందునన్
    దలవని కార్య భారమున దప్పెను నీమము వ్రాయలేక నే
    నలసి పరుండ స్వప్నమున నాశువు రీతిగ భారతీ కృపన్
    బలికిన పల్కులన్నియును పద్యము లైనవి యేమి జెప్పుదున్!

    రిప్లయితొలగించండి
  5. నేమాని వారికి,
    చాలా గొప్పగా ఉన్నదండి మీ శారదా స్తుతి.
    మాతో పంచుకొన్నందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. సొంపుగ భారతీ మాతను
    చంపకముల రామ జోగి సన్యాసులు భా
    వింపగ! దయాంబు రాశిగ,
    పెంపొందగజేయు వారు పేరును బొందన్!

    రిప్లయితొలగించండి
  7. కవి మిత్రులకు నమస్కృతులు.
    నీజానికి ఈనాటి సమస్యలో ‘సమస్య’ లేదు. విపరీతార్థం ఉండేదే సమస్య. ఇది కేవలం పాదపూరణమే. ఆకాశవాణి వారిచ్చిన సమస్య అని మిత్రులు పంపిస్తే ప్రకటించాను. అద్భుతమైన పూరణలతో బ్లాగును శోభింపచేసారు. అందరికీ ధన్యవాదాలు.
    *
    మిస్సన్న గారూ,
    పామరుని చేతకూడా సుమధుర కవిత్వం చెప్పించిన పుణ్యభూమి మనది. మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ధన్యవాదాలు. ధన్యుల మయ్యాము మీ చంపకమాలికను చదివి. అద్భుతంగా ఆ ఉన్న ఆ ఖండికను కేవలం వ్యాఖ్యగా ఉంచడం ఇష్టం లేక మీ అనుమతి లేకుండానే ప్రత్యేకంగా పోస్ట్ చేసాను. మన్నించండి. దానికి పెట్టిన ‘శీర్షిక’ బాగుందా? లేకుంటే మరేదయినా సూచిస్తారా?
    *
    లక్ష్మీదేవి గారూ,
    లలిత పదాలతో సరస భావాలతో మీ పద్యం అలరారుతున్నది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    నేమాని వారిని స్తుతిస్తూ పద్యం వ్రాసినందుకు ధన్యవాదాలు.
    మొదటి పాదంలో గణదోషం. ‘భారతీ’ అని రగణం వచ్చింది. ‘భారతిమాతను’ అని సమాసం చేయడానికి వీలులేదు. కనుక ‘వాణీ మాతను’ అందాం.

    రిప్లయితొలగించండి
  8. పలువురు మెచ్చు పద్యములు వ్రాయగ పూని మనంబులోన నే
    పలుకుల తల్లి శారదను బ్రార్థన జేయ దయాంబురాశి తా
    నెలకొని జిహ్వాపైన నను నేర్పరిగన్ పొదలించె నప్పుడున్
    పలికిన పల్కులన్నియును పద్యములైనవి యేమి చెప్పుదున్


    రిప్లయితొలగించండి
  9. హార్దికముగా ప్రశంసలను తెలియజేసిన మిత్రులందరికీ శుభాశీస్సులు.

    పలికిన పల్కులన్నియును పద్యములైనవి యేమిచెప్పుదున్
    లలిత గుణాఢ్యులార! శుభ లక్షణులార! కవీంద్రులార! మీ
    చెలిమియె నాకు సంతతము శ్రేయము గూర్చును మీ ప్రశంసలే
    కలిమియు బల్మియౌచును సుఖమ్మిడు మీకు శుభాభినందనల్

    రిప్లయితొలగించండి
  10. శ్రీ శంకరయ్య గారూ!
    మీరు మాలికను బ్లాగులో ప్రకటించుటకు నా ఆమోదమేల? మీరు నాకు మేలే చేసేరు కదా. సమస్త సన్మంగళాని భవంతు అని మా దీవనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. పండిత నేమాని వారూ,
    మీ సౌహార్దానికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. పలికెను పల్కు తొయ్యలి సభాస్థలి శంకర బ్లాగు నందిటన్
    అలరెను పండితాళి రసనాగ్రములందు సుభాషితమ్ముయై
    వెలసెను దివ్యరూపమున వీణ ధరించి ; సుపండితుల్ కవుల్
    పలికిన పల్కులన్నియును పద్యములైనవి యేమి చెప్పుదున్

    రిప్లయితొలగించండి
  13. తెలివి యొకింత లేక కడు దీనత నొందుచు వాణి పాదముల్
    నలరగ జేయ వేడగను నాదు తపంబున మోద మందుచున్
    మలచి మనోహ రంబగు శమంతక మంజుల భాషణం బులై
    పలికిన పల్కు లన్నియును పద్యము లైనవి యేమి చెప్పుదున్ !

    రిప్లయితొలగించండి
  14. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    ‘పొదలించె నప్పుడున్’ కంటే ‘పొదలింప జేసినన్’ అంటే ఇంకా బాగుంటుందేమో!
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘సుభాషితమ్ము + ఐ’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘సుభాషితమ్ములై’ అందామా?
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మంజుల భాషణాంచితమైన ఈ పద్యాన్ని మీరేనా వ్రాసింది. చాలా బాగుంది. అభినందనలు.
    ‘వాణి పాదముల్ + అలరగ’ అన్నప్పుడు మధ్యలో నుగాగమం బెక్కడిది? ‘వాణి నామమే / యలరగ’ అని నా సవరణ.

    రిప్లయితొలగించండి
  15. పలువురు మెచ్చు పద్యములు వ్రాయగ పూని మనంబులోన నే

    పలికిన పల్కులన్నియును పద్యములైనవి యేమి చెప్పుదున్

    లలిత గుణాఢ్యులార! శుభ లక్షణులార! కవీంద్రులార! మీ

    చెలిమియె నాకు సంతతము శ్రేయము గూర్చును మీ ప్రశంసలే

    అలరెను పండితాళి రసనాగ్రములందు సుభాషితమ్ముయై

    మలచి మనోహ రంబగు శమంతక మంజుల భాషణం బులై

    వెలువడె గొప్ప కావ్యములు పెక్కు ప్రబంధ పురాణ శాస్త్రముల్

    ------------------------
    మీ పద్య పాదాలన్నీ కలిపి చదువుకుని సంతోషపడి పోతున్నాను. మీతో మీ కవిత్వాలతో పరిచయాలకి ఎంత పుణ్యం చేసుకున్నానో అని ఆలోచిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  16. లక్కరాజు వారూ,
    వివిధభాషలు కలిసిన కవిత్వాన్ని మణిప్రవాళమంటారు.
    వివిధ కవుల పద్య పాదాలను సాన్వయంగా, సార్థకంగా జోడించిన మీ ‘మణిప్రవాళ పద్యం(?)’ మీ పద్యకవిత్వాసక్తిని స్పష్టం చేస్తున్నది. ధన్యవాదాలు.
    ప్రశంసలే కవులకు ఆనందాన్నీ, ప్రోత్సాహాన్నీ ఇస్తాయి.

    రిప్లయితొలగించండి

  17. చిలుక మహామునీంద్రుడు వచించిన విష్ణువు దివ్య గాధలన్
    సలలిత యాంధ్రభాష సరసమ్ముగ సల్పగ నృత్య నాట్యముల్
    పలుకుల తల్లి దీవెనల బమ్మెర పోతన భక్తిఁ బాడుచున్
    బలికిన పల్కులన్నియును పద్యము లైనవి యేమి చెప్పుదున్ !

    రిప్లయితొలగించండి
  18. అసలు ప్రతి రోజు భయం భయంగా చూస్తాను .ఎన్ని తప్పులు ఉంటాయో అని . ఏమి నా భాగ్యము ? ఇంతటి పండితుల మధ్య నేను వ్రాయ గలగడమా ? ఎప్పడిదో జన్మ సుకృతం మిగిలి ఉంది ఈ జన్మకి ఈ అదృష్టం చాలు..ఇదంతా మీ గురువుల కటాక్షం. సరస్వతీ పుత్రు లందరికీ , శ్రీ లక్కరాజు గారికి , పాదాభి వందనములు .

    రిప్లయితొలగించండి
  19. అన్నయ్యగారు శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారి సరస్వతీ స్తుతి అత్యద్భుతము. సరస్వతీ దేవి ఆయన జిహ్వాగ్రముపై సదా నాట్యము సల్పుతుందని మనకు సుస్పష్టము ! ఇంతటి కవిపుంగవుని యాశీర్వచనముల భాగ్యత కలిగిన మన మదృష్ట వంతులము.వారికి మరో పర్యాయము సాష్టాంగ ప్రణామములు !


    రిప్లయితొలగించండి
  20. కొంచెం ఆలేస్యమయినా గన్నవరపు నరసింహ మూర్తి గారి పద్య పాదం కలపకుండా ఉండలేక పోయాను.

    పలువురు మెచ్చు పద్యములు వ్రాయగ పూని మనంబులోన నే

    పలికిన పల్కులన్నియును పద్యములైనవి యేమి చెప్పుదున్

    లలిత గుణాఢ్యులార! శుభ లక్షణులార! కవీంద్రులార! మీ

    చెలిమియె నాకు సంతతము శ్రేయము గూర్చును మీ ప్రశంసలే

    అలరెను పండితాళి రసనాగ్రములందు సుభాషితమ్ములై

    మలచి మనోహ రంబగు శమంతక మంజుల భాషణం బులై

    సలలిత యాంధ్రభాష సరసమ్ముగ సల్పగ నృత్య నాట్యముల్

    వెలువడె గొప్ప కావ్యములు పెక్కు ప్రబంధ పురాణ శాస్త్రముల్

    రిప్లయితొలగించండి
  21. సవరణతో నా పద్యము. గురువర్యులకు లక్కరాజు వారికి ధన్యవాదములు.

    చిలుక మహామునీంద్రులు వచించిన విష్ణువు దివ్య గాధలన్
    సలలిత నృత్యనాట్య సరసాంబుధి నాంధ్రము నోల లాడుచున్
    బలుకుల తల్లి దీవెనల బమ్మెర పోతన పాడి, భక్తితో
    పలికిన పల్కులన్నియును పద్యము లైనవి యేమి చెప్పుదున్ !

    రిప్లయితొలగించండి
  22. మిత్రులారా!
    శుభాశీస్సులు.
    నేను రచించిన లక్ష్మీ స్తోత్రము (కనకధారా స్తోత్రమునకు అనుకరణ) ఆంధ్రామృతం బ్లాగు లో ప్రకటింపబడినది. దానిని చదవండి.

    అయ్యా శ్రీ శంకరయ్య గారూ! శ్రీ చింతా రామకృష్ణారావు గారిని సంప్రదించి మీరు కూడా మన శంకరాభరణములో బ్లాగులో ప్రకటించండి.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  23. సలసలమండు టెండల విశ్రంతియు గొంచములేక బాధతౌ
    పలికిన పలుక్లన్నియు పద్యములైనవి, ఏమిచెప్పుదున్
    మలమల మాడి చచెచెడు యమాయక కార్మిక కర్షకావళిన్
    చెలిమినిజూపి యక్కున జేర్చు విశాల సహోదర భావమేదిలన్

    రిప్లయితొలగించండి
  24. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ ‘సులలితంగా’ మనోహరంగా ఉంది. అభినందనలు.
    *
    అజ్ఞాత గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    టైప్ చేయడంలో కొన్ని తప్పులు దొర్లాయి. నా సవరణలతో మీ పద్యం....

    సలసలమండు టెండలను శ్రాంతియు గొంచములేక బాధతో
    పలికిన పల్కులన్నియును పద్యము లైనవి, యేమి చెప్పుదున్
    మలమల మాడి చచ్చెడు నమాయక కార్మిక కర్షకావళిన్
    చెలిమినిజూపి యక్కుననె జేర్చు సహోదర భావమేదొకో.

    రిప్లయితొలగించండి




  25. పండిత శ్రీ నేమానివారికి అభినందనలతో ,

    అల యలసానివారి యటులద్భుతరీతిని పద్యరత్నమా
    లల విలసత్కళా పరిమళమ్ముల నద్ది ,యలంకరించి స
    ల్లలిత మనోజ్ఞ కావ్యము వెలార్చితిరయ్య సరస్వతీ కృపన్
    అలరితిమెల్లవారలము ;నందుకొనుండి మదీయ సంస్తుతిన్,
    పలికినపల్కులన్నియును పద్యములైనవి యేమి చెప్పుదున్.
    రెండవపాదంలో ,బంగరుకి తావి యబ్బినట్లని నా భావము.

    రిప్లయితొలగించండి

  26. చిలికెను శంకరాభరణ శ్రీకర "బ్లాగున" చేర శక్తులే
    కలిగెను శక్తి యుక్తులును కందము లాదిగ పద్యమల్లగా
    గలగల రోజు రోజు మరి కష్టము లేకనె వ్రాయ మనమునన్
    పలికిన పల్కు లన్నియును పద్యము లైనవి యేమి చెప్పుదున్?

    రిప్లయితొలగించండి
  27. కులుకుచు వృద్ధ ప్రాయమున గుండియ నిండుగ ప్రీతి పొంగుచున్
    తెలుపగ తెన్గు రాదనుచు తియ్యగ నేర్పగ నొజ్జలెల్లరున్
    పలుకగ శంకరాభరణ ప్రాంగణ మందున కోతిచేష్టలన్
    పలికిన పల్కు లన్నియును పద్యము లైనవి యేమి చెప్పుదున్?

    రిప్లయితొలగించండి