12, డిసెంబర్ 2012, బుధవారం

సమస్యా పూరణం - 904 (నక్రంబుల్ జలగల్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
నక్రంబుల్ జలగల్ ఝషంబులును సంతానంబు నీకౌ హరా!
ఆకాశవాణి సౌజన్యంతో ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదములు.

22 కామెంట్‌లు:

  1. శక్రాది త్రిదివ ప్రపూజిత పదాబ్జా! సర్వ భూతేశ! వి
    శ్వక్రీడా పరితోషితా! సలిల తత్త్వంబైన నీ లీల నే
    వాక్రుత్తున్ వనరాశులీవె గద దేవా! జ్ఞాన వారాన్నిధీ!
    నక్రంబుల్ జలగల్ ఝషంబులును సంతానంబు నీకౌ హరా!

    రిప్లయితొలగించండి
  2. అయ్యా! శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ!

    యతి మైత్రి గురించి మీకు ఎందుకు అనుమానము వచ్చినదో? యతి మైత్రి చక్కగా సరిపోయినది. అనునాసికములతో కూడిన వర్ణములకు ఆ సంబంధమైన అనునాసికతో యతి వేయవచ్చును. ఇక్కడ న కు న్తా కు చక్కగా కుదిరినది కదా. స్వస్తి

    రిప్లయితొలగించండి
  3. నేమాని పండితార్యా! ఎంత మనోహరమైన పూరణ నిచ్చారండీ!

    నాదొక యూహ:

    నక్రంబుల్ జలగల్ ఝషంబులును సంతానంబు నీకౌ హరా!
    చక్రీ! కావరె యన్న నిష్ఫల మిదే శాపంబు రాజాధమా!
    వక్రా! వేములవాడ భీమ కవి కా బన్నంబు? పొమ్మంచు తా
    నాక్రోశించె సభాంతరస్థలిని హాహాకారముల్ రేగగా.

    రిప్లయితొలగించండి
  4. అన్నయ్య గారి పూరణతో యీ దిన మొక యద్భుతమైన పద్యమును చదవగలిగాను. వారికి వినతులు !
    మిస్సన్న గారూ ! మీ పద్యము చాలా బాగుంది ! అభినందనలు !

    రిప్లయితొలగించండి
  5. భూమీపతిపై యలుగుచు
    భీమకవి శపించినట్టి వృత్తాంతంబున్
    మా మిస్సన్న వచించెను
    స్వామీ! యొక ఠీవి నలరు శార్దూలముతో

    రిప్లయితొలగించండి
  6. చక్రంబై తిరుగాడు ధాత్రిపయి -నీ శక్త్యాత్మరూపంబుగా
    నాక్రాంతంబయి యెట్లదెల్లెడల దేహంబుల్ ధరించెన్ శివా!
    యే క్రూరాత్మలునైన వారలును, నాగేంద్రాదులున్, వ్యాఘ్రముల్,
    నక్రంబుల్, జలగల్, ఝషంబులును సంతానంబు నీకౌ హరా!

    రిప్లయితొలగించండి
  7. నేమాని గారు చెప్పిన పద్యమందు భూమీపతిపై నలుగుచు అని యడాగమము రావలెను స్వస్తి

    రిప్లయితొలగించండి
  8. నేమాని గారు చెప్పిన పద్యమందు భూమీపతిపై యలుగుచు అని యడాగమము రాకుండా భూమీపతిపై నలుగుచు అని యుండవలెను స్వస్తి .

    రిప్లయితొలగించండి
  9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    అది అనుస్వార యతి. ‘బిందు పూర్వక వర్గాది వర్ణ చతుష్టయము తమ పంచమాక్షరముతో యతి జెల్లును’.
    ంక, ంఖ, ంగ, ంఘ - ఙ
    ంచ, ంఛ, ంజ, ంఝ - ఞ
    ంట, ంఠ, ండ, ంఢ - ణ
    ంత, ంథ, ంద, ంధ - న
    ంప, ంఫ, ంబ, ంభ - మ
    భువి ననుస్వార యతి బిందు పూర్వకముగ
    ణాకు నిట నాల్గు చెల్లుఁ బాండవసహాయ!
    నాకు నిట నాల్గు చెల్లుఁ గందర్పజనక!
    మాకు నిట నాల్గు చెల్లు సంపదలరాజ!

    రిప్లయితొలగించండి

  10. ఆక్రందించును ప్రాణులెల్ల జననీ యాపేక్ష నాశించగన్
    ఆక్రమ్మించి చరాచరమ్ముల హృదిన్ నన్నింటికిన్ నీవె గా !
    చిక్రోడంబుల చెట్ల మానవుల సంక్షేమమ్ము గావించుచున్
    నక్రంబుల్ జలగల్ ఝషంబులును సంతానంబు నీకౌ హరా!

    రిప్లయితొలగించండి
  11. పండిత నేమాని వారూ,
    అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు, ధన్యవాదములు.
    *
    మిస్సన్న గారూ,
    వేములవాడ భీమకవి శాపవచనాలుగా ‘ఠీవి యలరు శార్దూలము‘లో మీ పూరణ రక్తి కట్టింది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ధన్యవాదములు!
    *
    లక్ష్మీదేవి గారూ,
    మనోహరమైన ధారాశుద్ధితో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    అజ్ఞాత గారూ,
    ధన్యవాదములు. కవిమిత్రుల పూరణల దోషములనే కాక గుణములను కూడా ప్రస్తావించ వలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
  12. నాగరాజు రవీందర్ గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసింప దగింది.
    కాకుంటే కొన్ని లోపాలున్నాయి. ‘జననీ యాపేక్ష (అపేక్ష?), ఆక్రమ్మించి (ఆక్రమించి), హృదిన్ నన్నింటికిన్’ ... ఇవి సవరించవలసి ఉంది.

    రిప్లయితొలగించండి
  13. నా పద్యంలోని లోపాల నెఱిగించి నందులకు గురువు గారికి ధన్యవాదములు.


    ఆక్రందించును ప్రాణులెల్ల జననీ యాప్యాయ మాశించుచున్
    చక్రమ్మేయుచు సంహరింప మొసలిన్ సారంగమే వేడగా
    చిక్రోడంబుల చెట్ల మానవుల సంక్షేమమ్ము గావించుచున్
    నక్రంబుల్ జలగల్ ఝషంబులును సంతానంబు నీకౌ హరా!

    రిప్లయితొలగించండి




  14. విక్రాంతంబగు నీ మహత్త్వమును వేవే రీతులన్ గొల్చెదన్
    చక్రిన్ బ్రహ్మను నిల్పి యుంచెదవు విశ్వాత్మా ,కనన్ సర్వభూ
    చక్రంబంతయు నీదు సృష్టియె కదా,శక్రాదులౌ దేవతల్
    నక్రంబుల్,జలగల్,ఝషంబులును సంతానంబు నీకౌ హరా.

    రిప్లయితొలగించండి
  15. నాగరాజు రవీందర్ గారూ,
    సవరించినందుకు సంతోషం.
    అయినా ‘జననీ + ఆప్యాయము’ యణాదేశ సంధి జరిగి ‘జనన్యాపాయము’ అవుతుంది. అక్కడ యడాగమం రావాలంటే ‘జననీ’ అనేది సంబోధన కావాలి. ‘జననీ! యాప్యాయము’ ఇలా.. మరి మీరు జననీ శబ్దాన్ని షష్ట్యర్థంలో వాడారా సంబోధనగానా?
    *
    కమనీయం గారూ,
    మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. యతిమైత్రి గురించి నాకున్న సందేహమును తీర్చిన శ్రీ నేమాని వారికీ, సోదాహరణముగా ఛందో పాఠము చెప్పిన మాస్టారు గారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  17. ఆక్రందించిన వేడుకొన్న కొలువ న్నన్నైన జీవంబులన్
    చక్రీ మిత్రుడ రక్ష జేతువు కదా శంభో! మహేశా ! ధరా
    చక్రంబంతట నిండి యుండు జనముల్ చైతన్య మున్ గల్గు నా
    నక్రంబుల్ జలగల్ ఝషంబులును సంతానంబు నీకౌ హరా!

    రిప్లయితొలగించండి
  18. గురువు గారూ ! నేను జననీ శబ్దాన్ని షష్ట్యర్థంలోనే వాడాను.

    ఇలా అంటే సరిపోతుందేమో !( సంబోధనగా )
    ఆక్రందించును....జనకా ! యాప్యాయ మాశించుచున్

    రిప్లయితొలగించండి
  19. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ప్రతిరోజూ మొట్టమొదటి పూరణ మీదే ఉంటూ వస్తున్నది. ఈసారి మాత్రం చిట్టచివరి దయింది!
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    ‘కొలువన్ + అన్నైన’ అన్నప్పుడు ద్విత్వరూపం రావడం కొందరు ప్రసిద్ధకవుల ప్రయోగాల్లోనూ ఉంది. కానీ చాలా తక్కువ. ఎక్కువమంది దీనిని ఒప్పుకోరు.
    ‘చక్రీమిత్రుడు’ అని సమాసం చేయరాదు. ‘చక్రి’ స్త్రీలింగ శబ్దం కాదుకదా. ‘చక్రిన్ మిత్రుడఁ జేసి బ్రోతువు కదా’ అందాం.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ సవరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. నేమాని పండితార్యా నమస్కారములు.
    మూర్తి మిత్రమా ధన్యవాదములు.
    గురువుగారూ ధన్యవాదములు.

    మిత్రులందరి కలాల నుంచీ అద్భుతమైన శార్దూలాలు పుట్టుకొచ్చాయి. అందరికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. మాస్టరు గారూ ! ధన్యవాదములు.
    మీరు చూపిన సవరణ తో...

    ఆక్రందించిన వేడుకొన్న కొలువ న్నన్నైన జీవంబులన్
    చక్రిన్ మిత్రుడఁ జేసి బ్రోతువు కదా’ శంభో! మహేశా ! ధరా
    చక్రంబంతట నిండి యుండు జనముల్ చైతన్య మున్ గల్గు నా
    నక్రంబుల్ జలగల్ ఝషంబులును సంతానంబు నీకౌ హరా!

    రిప్లయితొలగించండి