14, డిసెంబర్ 2012, శుక్రవారం

సమస్యా పూరణం - 906 (తమ్ముఁడ రమ్మనెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
తమ్ముఁడ రమ్మనెన్ నగుచుఁ దామరసాక్షి మనోజకేళికిన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

32 కామెంట్‌లు:

  1. అమ్మడు మెచ్చె మామ గని యమ్మకు తమ్ముని పెండ్లియాడగా
    అమ్మయు నాన్నయున్ మరియు నమ్మకు నాన్నయు నమ్మ యొప్పగా
    నిమ్ముగ పెండ్లి యాడె మరి నిద్దుర వేళన రమ్ము యమ్మకే
    తమ్ముఁడ రమ్మనెన్ నగుచుఁ దామరసాక్షి మనోజకేళికిన్.

    రిప్లయితొలగించండి
  2. అమ్మడు మెచ్చె మామ గని యమ్మకు తమ్ముని ప్రేమ పండగా
    అమ్మయు నాన్నయున్ మరియు నమ్మకు నాన్నయు నమ్మ మెచ్చగా
    నిమ్ముగ పెండ్లి యాడె మరి నిద్దుర వేళన బిల్చె "నమ్మకే
    తమ్ముఁడ రమ్మనెన్" నగుచుఁ దామరసాక్షి మనోజకేళికిన్.

    రిప్లయితొలగించండి
  3. తమ్ముల రాశియై తనరు తల్లి కుమారుని, మారు, వారిజా
    తమ్ముల నాయుధమ్ములుగ దాల్చిన జోదును మించు సుందరా!
    నెమ్మది లోన కోరికలు నిండెను పండువు నేడు పూరుషో
    త్తమ్ముడ! రమ్మనెన్ నగుచు దామరసాక్షి మనోజకేళికిన్

    రిప్లయితొలగించండి
  4. శ్రీ పండిత నేమాని గారి పద్యములో "పూరుషోత్తమ్ముడు" అని వాడేరు. ఆ పదము సమర్థనీయము కాదు. ఉత్తముడను పదమును గణముల కొరకై ఉత్తమ్ముడు చేయదగునా . అయ్యా నేమాని గారు మీ పద్యమును మార్చవలెను.స్వస్తి.

    రిప్లయితొలగించండి
  5. అవధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యంశుక్రవారం, డిసెంబర్ 14, 2012 8:44:00 AM


    ఇమ్మహి నిన్ను దక్క మన మెవ్వరిఁ గోరదె, యేగుదెమ్ము నా
    సమ్మతిఁ జూపితిన్ కుసుమసాయకుఁ డేఁచుచునుండెఁ గావునన్
    కమ్మని మాటలన్ బలికి కావుము నన్నిక శౌరి! సీరికిన్
    తమ్ముఁడ! రమ్మనెన్ నగుచు తామరసాక్షి మనోజకేళికిన్.

    రిప్లయితొలగించండి
  6. పూరుషోత్తమ్ముడు అనే పదము సమర్థనీయము కాకపోయినచో - మరొక విధానము కలదు. ఆ మానిని భర్త పేరు పూరుషోత్తమ్ముడు అని అన్వయించుకొనండి. పద్యమును మార్చుటకు నవసరము లేదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. అయ్యా నేమాని గారూ , మీ ప్రతిస్పందన గమనించేము . మీ బోటివారి నుండి ఆలాటి సమాధానము వచ్చుట ఏమీ బాగుగ లేదు."ఉత్తమ్ముడు" అను పదమే దోషమనుచున్నప్పుడు ," పద్యమును మార్చవలసిన అవసరమేమీ లేదు , అది పేరు" అనడమెంత మాత్రమూ సమంజసము కాదు . ఆలాటి సమర్థన ఔత్సాహిక కవులు చేసిననూ తప్పే అయినప్పుడు మీరెందులకలాగున సమర్థించుకొనడమో తెలియదు . అప్పుడు ఏదో ఒకరకముగా గణములను కిట్టించి పద్యమును నింపేవారికి , మీకూ పెద్ద తేడా ఉండదు . పైపెచ్చు ఔత్సాహికులకు కూడ ఒక అవాంఛనీయమైన , దోషభూయిష్టమైన మార్గమును చూపినవారగుదురు . స్వస్తి .

    రిప్లయితొలగించండి
  8. కొమ్మని పుష్పగుచ్ఛములు గోముగ సుందరికందజేయుచున్
    కమ్మటి పిండివంటలన కన్నులనందము నారగించగా
    నమ్మనమోహనాంగుని, వయాళికి నేగుచు " పద్మసంభవున్
    తమ్ముఁడ రమ్మ"నెన్ నగుచుఁ దామరసాక్షి మనోజకేళికిన్.

    రిప్లయితొలగించండి
  9. అజ్ఞాత మిత్రులు సౌహార్దముగా చేసిన సూచన ననుసరించి మరొక విధమైన పూరణ:

    నెమ్మది బల్కుచుంటి విను, నీ సరియే మదనుండు చంద్రుడున్?
    సొమ్మసిలున్ నినున్ గనినచో రతియేనియు దారయేని నం
    దమ్ముల బ్రోవ!, లేవయసులో నలరారెదు గాన వారికిన్
    దమ్ముడ! రమ్మనెన్ నగుచు దామరసాక్షి మనోజకేళికిన్

    రిప్లయితొలగించండి
  10. నా పూరణలో పద్మసంభవునికి అనే అర్థంలో పద్మసంభవున్ అని నేను వ్రాసినది తప్పై ఉండవచ్చును.
    దానికి మారుగా బ్రహ్మదేవుకున్ అని సవరణ చేస్తున్నట్టుగా గమనించవలసినది.

    రిప్లయితొలగించండి
  11. అమ్మా! లక్ష్మీదేవి గారూ! శుభాశీస్సులు.
    బ్రహ్మదేవుకున్ అనరాదు. బ్రహ్మదేవునకు అనుటయే సరియైనది. ఇక్కడ గణములు సరియగుటకు -- తమ్మిచూలికిన్ అని గాని లేక పద్మసూతికిన్ అని గాని అనవచ్చు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. సందేహం తీర్చినందుకు ధన్యవాదాలండి.
    మీరు సూచించిన సవరణతో..

    కొమ్మని పుష్పగుచ్ఛములు గోముగ సుందరికందజేయుచున్
    కమ్మటి పిండివంటలన కన్నులనందము నారగించగా
    నమ్మనమోహనాంగుని, వయాళికి నేగుచు " తమ్మిచూలికిన్
    తమ్ముఁడ రమ్మ"నెన్ నగుచుఁ దామరసాక్షి మనోజకేళికిన్.

    రిప్లయితొలగించండి
  13. నా 2వ పద్యము 3వ పాదములో చిన్న సవరణ కనుక మళ్ళీ ఆ పద్యమును వ్రాయుచున్నాను:

    నెమ్మది బల్కుచుంటి విను, నీ సరియే మదనుండు చంద్రుడున్?
    సొమ్మసిలున్ నినున్ గనినచో రతియేనియు దారయేని నం
    దమ్మును గాంచ, లేవయసునన్ దలరారెదు గాన వారికిన్
    దమ్ముడ రమ్మనెన్ నగుచు దామరసాక్షి మనోజకేళికిన్

    రిప్లయితొలగించండి
  14. శ్రీ నేమాని గారు పునరుల్లేఖించిన రెండవ పద్యము మంచి భావముతో బాగుగ నున్నది. 'అలరారెదు కాన ' సరియైన ప్రయోగమగును .
    అమ్మా లక్ష్మీదేవి గారూ ' అమ్మన మోహనాంగుడు ' అంటే ఎవరు. ఆ మనసునకు మోహనమైన అంగం కలిగిన వాడు అని మీ భావమైనచో మనో మోహనాంగుడు కావలెను కదా . స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. ఒక వెసులుబాటున్నది .మనమోహనుడు అనుటను "మన" శబ్దాన్ని అకారాంతముగా తీసుకుని ఒకరకము గా సమర్థించుకోవచ్చును.స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. పెద్దలకు నమస్కారములు.

    మీరు సూచించిన పొరబాటును సరిదిద్దుకొన్నాను.

    కొమ్మని పుష్పగుచ్ఛములు గోముగ సుందరికందజేయుచున్
    కమ్మటి పిండివంటలన కన్నులనందము నారగించగా
    సమ్ముదమొప్ప దానిక, వయాళికి నేగుచు " తమ్మిచూలికిన్
    తమ్ముఁడ రమ్మ"నెన్ నగుచుఁ దామరసాక్షి మనోజకేళికిన్.

    రిప్లయితొలగించండి
  17. అమ్మా! లక్ష్మీ దేవి గారూ!
    మీరు పద్యమును సవరించేరు - బాగున్నది. 3వ పాదములో యతిమైత్రిని కూడా సరిచెయ్యాలి కదా. చూడండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  18. కొమ్మ లనేకులున్ మిగుల కూరిమి, సంపద , రూప యవ్వ నం
    బిమ్మహి నున్న పూరుషుల నిష్టముతో రమియింతు రార్తి తో
    సమ్ముద మొంద జూచి యొక సాధ్వి మహోన్నత ధీరు , సద్గుణో
    త్తమ్ముడ! రమ్మనెన్ నగుచు దామరసాక్షి మనోజ కేలికిన్ .

    రిప్లయితొలగించండి
  19. మన్నించండి.

    సమ్ముదమొప్పగా నపుడు జంకును వీడుచు "తమ్మిచూలికిన్

    రిప్లయితొలగించండి
  20. కమ్మని పాటలన్ వినగ గాయని నీరజ గౌళ రాగ మున్
    యిమ్ముగ నుండు చూడుమనె యింపుగ వీణియ నాదమున్ శృతిన్
    నమ్ముము నాదు మాటలను నచ్చును నీకిపు డంత విన్నచో
    తమ్ముడ రమ్మనెన్ నగుచు దామరసాక్షి మనోజ కేళికిన్ !

    రిప్లయితొలగించండి
  21. అమ్మహితాత్మునిన్ ప్రవరు నారసి శీతనగమ్మునన్ సకా
    శమ్ము వరూధినీ యనెడు సారసలోచన " శంబరారికిన్
    తమ్ముడ ! రమ్మ" నెన్ నగుచు దామరసాక్షి మనోజకేళికిన్
    “ పొమ్ము వరూధినీ !" యనుచు పొల్తుక నాతడు తూలనాడగన్

    రిప్లయితొలగించండి
  22. శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి
    ప్రణామములు!

    మన్మథునితో రతి అంటున్న మాట:

    సమ్మతి నాత్మలీనుఁ డగు శర్వు తపంబు సుమాంబకప్రయో
    గమ్ముల వమ్మొనర్చి త్రిజగమ్ములఁ గోరితి గీరితిన్; త ద
    స్తుమ్మతి తోడుతో విడచితో రతితో రతి, నబ్జసూతికిన్
    తమ్ముఁడ! రమ్మనెన్ నగుచు తామరసాక్షి మనోజకేళికిన్.

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  23. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మేనమామను పెండ్లాడిన అమ్మాయి పరంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    అజ్ఞాత గారి అభ్యంతరాలు, మీ సమర్థన, సవరణలు తత్సంబధ వ్యాఖ్యలు మాకు జ్ఞానదాయకాలు. ధన్యవాదములు.
    *
    29-3-2006 నాడు చందవోలులో జరిగిన అష్టావధానములో ఇచ్చిన సమస్య అది. అవధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారి పూరణను కూడా మిత్రుడు పంపి ప్రకటించమని సూచించాడు. పంపిన (కవి కాని) మిత్రునకు ధన్యవాదములు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ ప్రయత్నం ప్రశంసించవలసిందే.
    కాని భావమే అర్థం కావడం లేదు. రెండవపాదం ప్రారంభంలో యడాగమం కూడా దోషమే.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    ఏల్చూరి మురళీధరరావు గారూ,
    శబ్దాలంకారశోభితమైన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. తమ్ముడ యంచు నే పిలిచెదన్ మన భద్రము గోరుచు గొన్ని నాళ్ళు గో
    ప్యమ్ముగ నుంచు టొప్పగు ప్రియా! మన తంతులు నిత్యము సాగుచుండు కా
    కమ్మల బోలు నీ పొరుగు కాంతల కించుక కళ్ళు గప్పుచున్
    తమ్ముడ! రమ్మనెన్ నగుచు తామరసాక్షి మనోజ కేళికిన్

    రిప్లయితొలగించండి
  25. ఈ నా 3వ పద్యము 1వ పాదములో ఒక గణము ఎక్కువగా పడినది. ఆ పాదమును ఇలాగ సవరించుదము:

    తమ్ముడ యంచు నే పిలిచెదన్ సుమి యింకను కొన్ని నాళ్ళు గో
    ....

    రిప్లయితొలగించండి
  26. నా 3వ పద్యము 2వ పాదములో కూడ 1 గణము ఎక్కువ యున్నది - "నిత్యము" అను పదమును తొలగించుదాము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  27. "ళడయోరభేదః"
    వలె ఏదైనా అపద్ధర్మసూత్రం చెప్పుకొని తమ్ముల చేయవచ్చునా అండీ ( ఒకవేళ తమ్ముఁడ లో అరసున్న లేని పక్షంలో)

    రిప్లయితొలగించండి
  28. "ళడయోరభేదః"
    వలె ఏదైనా అపద్ధర్మసూత్రం చెప్పుకొని తమ్ముల చేయవచ్చునా అండీ ( ఒకవేళ తమ్ముఁడ లో అరసున్న లేని పక్షంలో)

    రిప్లయితొలగించండి
  29. యిమ్ముగ రాఘవుండు తన యింతిని గూడుక యున్న వేళలో
    నెమ్మది జేరి శూర్పణఖ నిన్ను వరించితి నన్న లక్ష్మణుం
    దమ్ముడ! రమ్మనెన్ నగుచు తామరసాక్షి మనోజ కేళికిన్
    గమ్మున దీనికిందగిన గౌరవముం బొనరింపవే యనెన్.

    రిప్లయితొలగించండి
  30. ఊర్వశి అర్జునితో:

    కమ్మని జుంటి తేనియల కౌగిట జుర్రగఁ జూడ బోవకన్
    గిమ్మన వేమి క్రీడి కనుగీటిన పేడివలెన్నుంటివే! దొరా!
    పొమ్మన భావ్యమా వనిత పొందును గోర? వరా! విరించికే
    తమ్ముడ రమ్మనెన్ నగుచుఁ దామరసాక్షి మనోజ కేళికిన్!

    రిప్లయితొలగించండి
  31. పండిత నేమాని వారూ,
    మీ తాజా పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    అజ్ఞాత గారూ,
    అలా మార్చడానికి వీలు లేదండీ.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘పేడివలెన్ + ఉంటివే’ అన్నప్పుడు ద్విత్వం రాకూడదు. ‘పేడిగ నుంటి వేలొకో’ అందామా?

    రిప్లయితొలగించండి
  32. కమ్మగ మాటలాడకయె గందర గోళపు నత్తగారునున్
    తమ్ములు మేన మామలును తన్నుకు చచ్చెడి కాకినాడలో
    వమ్మయె నాదు జీవితము వద్దుర యిచ్చటి గోలగోలలన్
    సుమ్ముగ పారిపోవుదము సూళురు పేటకు,...బావగారికిన్
    తమ్ముఁడ! రమ్మనెన్ నగుచుఁ దామరసాక్షి మనోజకేళికిన్

    రిప్లయితొలగించండి