18, డిసెంబర్ 2012, మంగళవారం

సమస్యా పూరణం - 910 (సంతానము లేని వారలకె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
సంతానము లేని వారలకె తప్పక కల్గును సద్గతుల్ సఖా!

32 కామెంట్‌లు:

  1. జ్ఞానవిహీనులున్ గులము నాశమొనర్పగ జాలునట్టి సం
    తానము గల్గు వారలకు తథ్యము గల్గును దుర్గతుల్ భువిన్
    దానవ లక్షణాన్వితులు ధర్మవిహీనులరై చెలంగు సం
    తానము లేని వారలకె తప్పక గల్గును సద్గతుల్ సఖా!

    రిప్లయితొలగించండి
  2. మానుము సంతు లేదనెడు మ్లానము చూడుము లోకమందు సం-
    తానము గల్గు వారలకు తప్పవు తిప్పలు నేడు బిడ్డలన్ జ్ఞానుల జేయు విద్యలవి నాస్తి కదా! కలికాల! మెన్న సం-
    తానము లేని వారలకె తప్పక కల్గును సద్గతుల్ సఖా!

    రిప్లయితొలగించండి
  3. దానము ధర్మముల్ సలిపి తప్పక పుత్రుని కల్గ జేయగా
    మానస మందు కోరుదురు మందిని కొందర జూడగానిలన్
    మానము మంట గల్పి యవ మానము నిచ్చెడు చెడ్డ సం
    తానము లేని వారలకె తప్పక కల్గును సద్గతుల్ సఖా !

    రిప్లయితొలగించండి
  4. అయ్యా! శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.

    మీ పద్యము బాగున్నది. 3వ పాదములో చివరలో 2 అక్షరములు తక్కువగా నున్నవి.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  5. వేనగు తారలుంగలవు వేడుకఁ జీకటి పారద్రోలకన్
    కాని తమస్సు దొల్చును జగద్విదితుండగు చంద్రుడొక్కడే
    కాన ధరిత్రి సద్గుణుడొకండగు పుత్రుడు చాలు దుష్ట సం
    తానము లేని వారలకె తప్పక కల్గును సద్గతుల్ సఖా !

    రిప్లయితొలగించండి
  6. సంతానహీనుల గురించి మిత్రుల సంభాషణ.

    ఈ నరకంబు బోలు వగపిట్లు దహించుట వారి బోలు సం
    తానము లేని వారలకె తప్పక కల్గును,సద్గతుల్ సఖా
    కానగ లేమటంచు నిల గౌరవమున్ పరదైవమందు,సం
    లీనము కాగ యోగ్యతయె లేదని దైన్యత నొందరే, సదా!

    రిప్లయితొలగించండి
  7. అయ్యా డా. అనిల్ కుమార్ గారు!
    శుభాశీస్సులు.
    మీరు పారద్రోలకన్ అని ప్రయోగించేరు కదా. వ్యతిరేకార్థకములగు పదములు ద్రుతాంతములు కావు - కళలే యగును. పరిశీలించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మమంగళవారం, డిసెంబర్ 18, 2012 1:46:00 PM

    కానగ వంశగౌ రవము కాల్చెడి కూల్చెడి జారచోరులై
    జ్ఞానవి చక్షణా రహిత నైజము గల్గియు రాక్షసాధముల్
    మానవ సంస్కృతిన్ మహిని మానవి హీనత మంటగల్పు సం
    తానము లేనివారలకె తప్పక కల్గును సద్గతుల్ సఖా!

    రిప్లయితొలగించండి
  9. డా. తోపెల్ల రామలక్ష్మిమంగళవారం, డిసెంబర్ 18, 2012 3:03:00 PM

    మానవ దేహమే మహిని మానిత మైనదటంచునెంతటన్
    తానము మాని మద్యమును త్రాగుచు పాప్యను పాటపాడుచున్(పాప్ అను)
    మానస మందుమానినుల మానము దోచుట కిచ్చగించు సం
    తానము లేనివారలకె తప్పక కల్గును సద్గతుల్ సఖా!

    రిప్లయితొలగించండి
  10. దానము, ధర్మనిష్టయునుదారత సత్యవచ:ప్రసంగముల్
    కానగ లేక లోకమున గర్వితులై దురితప్రబుద్ధులై
    మానములెక్కజేయకవమానముదెచ్చెడునట్టిదుష్ట సం
    తానములేనివారలకె తప్పక కల్గును సద్గతుల్ సఖా.

    రిప్లయితొలగించండి
  11. వేనగు తారలుం గలవు వేడుకఁ జీకటి వెళ్ళ నివ్వదే ,
    కాని తమస్సు దొల్చును జగద్విదితుండగు చంద్రుడొక్కడే
    కాన ధరిత్రి సద్గుణుడొకండగు పుత్రుడె చాలు సం
    తానము లేని వారలకె తప్పక కల్గును సద్గతుల్ సఖా !
    ఆర్యా ! నమస్తే. మీరు చెప్పిన దోషానికి సవరణ చేసుకున్నాను.
    ధన్య వాదాలు.

    రిప్లయితొలగించండి
  12. అయ్యా! డా. అనిల్ కుమార్ గారు! శుభాశీస్సులు.
    చాల సంతోషము. కాని మళ్ళీ చిన్న తప్పుటడుగు వేసేరు. 3వ పాదములో చివరలో 2 అక్షరములు తగ్గినవి. ఈ చిన్న పొరపాటును కూడా సరిదిద్దండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. మిత్రులందరికి శుభాశీస్సులు.
    ఈనాటి సమస్యకు అందరి నుండి మంచి మంచి పూరణలు వచ్చినవి. అందరికీ అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. మానవ రూప దానవులు , మంచి నెరుంగని జ్ఞాన హీనులున్,
    మానసమందు ప్రేమ యను మాత్ర ములేని యసూయ చిత్తులున్,
    హీన ప్రవృత్తితో సుజన హింసకు హారతి పట్టు నట్టి సం
    తానము లేని వారలకె తప్పక కల్గును సద్గతుల్ సఖా !

    రిప్లయితొలగించండి
  15. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఈనాటి సమస్యలో ఒక విశేషం ఉంది. ఇందులో ఛందో నిగూఢ చమత్కృతి ఉంది. పద్యపాదాన్ని పూర్తిగా ఇవ్వకుండా కొన్ని అక్షరాలను తగ్గించికాని, పెంచి కాని ఇవ్వవచ్చు. అవధాని అది ఏ ఛందమో ఊహించి తదనుగుణంగా పూరణ చేయవలసి ఉంటుంది.
    ‘ఉత్పలగంధిరో యిపుడు నీ వూహూయనన్ బాడియే?’ ఈ సమస్య పూర్వార్ధాన్ని చూస్తే ఉత్పలమాల అనిపిస్తుంది. ఉత్తరార్ధం మత్తేభ శార్దూల వృత్తాల కనుగుణంగా ఉంది. పాదాదిని నగణం చేర్చితే మత్తేభం, గగం చేర్చితే శార్దూలం అవుతుంది.
    కనుసన్నం గొలువంగ నొప్పితి, వలంకారమ్ములం బంప వే
    డ్కను గైకొంటివి, పూవుసెజ్జ దరియంగా రమ్మటంచున్ వయ
    స్కను బుత్తెంచితి, నమ్మి వచ్చితిఁ, గటాక్షం బింత లేనట్టి చె
    య్వుననో యుత్పలగంధిరో! యిపుడు నీ వూహూ యనం బాడియే? (అవధాన సారము)
    ‘యోషాక్లీబులు గూడ బుట్టె జగమెల్లన్ దాన్’ ఈ సమస్యలో మొదటి అక్షరాన్ని పైపాదానికి పంపితే కందం అవుతుంది.
    అక్లేశము బ్రహ్మము ని
    త్యక్లీబత్వంబు గలుగు తత్త్వము, తుచ్ఛా
    యాక్లిన్న మాయ తద్యో
    షాక్లీబులు గూడ బుట్టె జగమెల్లన్ దాన్. (అవధాన సారము)
    ఈనాటి సమస్య కూడా ఇట్టిదే. రెండవ అక్షరంతో ఉత్పలమాల అవుతున్నది. ఛందాన్ని గురించి సందేహాన్ని వ్యక్తం చేయకుండా సమర్థంగా, వైవిధ్యంగా పూరణలు చెప్పిన....
    పండిత నేమాని వారికి,
    మిస్సన్న గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    డా. మాడుగుల అనిల్ కుమార్ గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    డా. తోపెల్ల రామలక్ష్మి గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి
    అభినందనలు, ధన్యవాదములు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మూడవ పాదం చివర ‘ఇచ్చెడునట్టి చెడ్డ సం...’ అందాం.
    *
    డా. మాడుగుల అనిల్ కుమార్ గారు సవరించిన పూరణలో ‘దుష్ట’ శబ్దాన్ని టైపు చేయడం మరిచారు. అంతే!
    *
    డా. తోపెల్ల రామలక్ష్మి గారూ,
    ‘పాప్ + అను’ పాప్యను అనరాదు కదా. దానికి పాపను అనే అందాం. అపార్థానికి అవకాశం ఉందనుకుంటే ‘మ్లేచ్ఛుల/ పశ్చిమ/ పాపపు’ ఎదైనా అందాం.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    ‘అణుమాత్రము’ టైపాటు వల్ల అనుమాత్రము అయిందా?

    రిప్లయితొలగించండి
  16. దానవ నైజమున్ గలిగి తామస మార్గములో చరించుచున్
    మానుష గౌరవమ్ములను మంటల వైచెడు మానవాధముల్
    మానుచు మంచి కర్మలను మందికి చేటును దెచ్చు దుష్ట సం
    తానము లేని వారలకె తప్పక గల్గును సద్గతుల్ సఖా !

    రిప్లయితొలగించండి
  17. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. పానము జేయుచున్ ధరను పాపపు కృత్యము లెల్ల జేయగా
    దానము ధర్మమున్ మరచి తల్లిని దండ్రిని వీడి నిర్ధ యన్
    జ్ఞానము లేక మూర్ఘతను జాతికి బ్రష్టుడు నైన దుష్ట సం
    తానము లేనివారలకె తప్పక గల్గును సద్గతుల్ సఖా !

    రిప్లయితొలగించండి

  19. ఆనతి నీయగా హరుడు నాగక నాతని కింకరుల్ వెసన్
    బ్రాణము దీయ, కాలగతిఁ బాధమనమ్మునఁ దొల్గినంత నే
    వైనమునన్ దిథిన్ మరచి వర్తిలు జన్మవిరుద్ధ పుత్ర సం
    తానము లేని వారలకె తప్పక గల్గును సద్గతుల్ సఖా!

    రిప్లయితొలగించండి
  20. రాజేశ్వరి అక్కయ్యా,
    చాలా బాగుంది మీ పద్యం. అభినందనలు.
    కాకుంటే ‘నిర్ధయ, మూర్ఘత, బ్రష్టుడు’ శబ్దాలలో టైపాట్లు!
    *
    రామకృష్ణ గారూ,
    పితృయజ్ఞాన్ని మరిచిన సంతానాన్ని గురించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. శ్రీ నేమాని గారికి, శ్రీ శంకరార్యులకు నమస్కారములు. మీ సూచనతోచిన్న సవరణ.. ధన్యవాదములు.

    దానము ధర్మముల్ సలిపి తప్పక పుత్రుని కల్గ జేయగా
    మానస మందు కోరుదురు మందిని కొందర జూడగానిలన్
    మానము మంట గల్పి యవ మానము నీయగ జూచు చెడ్డ సం
    తానము లేని వారలకె తప్పక కల్గును సద్గతుల్ సఖా !

    రిప్లయితొలగించండి




  22. జ్ఞానవిహీనమానసులు,సద్గుణవర్తనదూరులైన ఏ
    మానములేని దుర్మతులు,మందమతుల్ ధనలోభవాంఛచే
    దానవులట్లు నెల్లపుడుదారతలేక చరించు దుష్ట సం
    తానములేనివారలకె తప్పక కల్గును సద్గతుల్ సఖా.

    రిప్లయితొలగించండి



  23. జ్ఞానవిహీనమానసులు,సద్గుణవర్తనదూరులైన ఏ
    మానములేని దుర్మతులు,మందమతుల్ ధనలోభవాంఛచే
    దానవులట్లు నెల్లపుడుదారతలేక చరించు దుష్ట సం
    తానములేనివారలకె తప్పక కల్గును సద్గతుల్ సఖా.

    రిప్లయితొలగించండి
  24. వేనగు తారలుం గలవు వేడుకఁ జీకటి వెళ్ళ నివ్వదే ,
    కాని తమస్సు దొల్చును జగద్విదితుండగు చంద్రుడొక్కడే
    కాన ధరిత్రి సద్గుణుడొకండగు పుత్రుడె చాలు దుష్ట సం
    తానము లేని వారలకె తప్పక కల్గును సద్గతుల్ సఖా !

    ఆర్యా ధన్య వాదములు ముద్రణ లోపం సవరించు చున్నాను.

    రిప్లయితొలగించండి
  25. పానము జేయుచున్ ధరను పాపపు కృత్యము లెల్లచేయగా
    దానము ధర్మమున్ మరచి తల్లిని దండ్రిని వీడి నిర్దయన్
    జ్ఞానము లేక మూర్ఖతను జాతికి భ్రష్టుడు నైన దుష్ట సం
    తానము లేనివారలకె తప్పక గల్గును సద్గతుల్ సఖా !

    క్షమించాలి సరిగా చూసుకో లేదు ఇప్పుడు సరి పోయిం దను కుంటాను

    ఇంతటి విశేష మైన చందస్సు ఇచ్చి నందులకు చాలా సంతోషం గా ఉంది.తెలియని వి ఎన్నొ తెలుసు కోగలిగాను. అసలు నిజానికి రాత్రి సమస్య చూడ గానె అర్ధం కాలేదు.సరే అసలే అంతంత మాత్రం ఇక ఈ నిద్ర కళ్ళ్లకి ముందేతట్టదు . పొద్దున్నకి అందరూ వ్రాస్తారుకదా అని ఉదయాన్నే చూసాను. శ్రీ పండితుల వారి పద్యం చదివాక హమ్మయ్య కుస్తీ పట్టచ్చును అనుకున్నాను.అదన్న మాట అసల్ సంగతి .

    రిప్లయితొలగించండి
  26. ఏదో దురవస్థలో యుండి బ్లాగు సంగతే మర్చిపోయిన
    నన్ను ఆత్మీయంగా ఫోన్లో యెలా ఉన్నారంటూ పలుకరించి
    గుర్తు చేసిన నేమాని వారికి కృతఙ్ఞతాంజలులు !

    రిప్లయితొలగించండి
  27. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    తల్లిని కొట్టే వాడొకడు !
    తండ్రిని చంపేవాడింకొకడు !
    ఆశ్రమాల్లో చేర్చే వాళ్ళూ
    శ్మశానంలో(బ్రతికుండగానే) వదిలే వాళ్ళూ !
    ఛీ ! యీ కలి పురుషుల సంతతి రోజు రోజుకీ పెరిగి పోతోంది !
    అబ్బబ్బ !వీరి చర్యలు చూస్తుంటే , వింటుంటే
    ఆ యుగాంతమేదో నిజంగా వచ్చేస్తేనే బాగుంటుందేమో ?

    అటువంటి సంతానం ఉండడం కన్నా లేకుండడమే మేలు గదా :
    ఏమంటారు ??????????????

    01)
    _________________________________________

    దీనము , నేడు జూడ , తమ - దేహము చీల్చుక వచ్చు బిడ్డలే
    హీనము జేయుచుండె , నతి - యిత్వరులై తమ తల్లి దండ్రులన్
    ఛీ ! నిజమే గదా ,యిపుడు - చేర్చుట నేర్చిరి యాశ్రమంబులన్ !
    హీనముగా చరించు నతి - హీనపు సంతతి గల్గు కన్న, సం
    తానము లేని వారలకె - తప్పక కల్గును సద్గతుల్ సఖా!
    _________________________________________
    ఇత్వరుడు = క్రూరుడు

    రిప్లయితొలగించండి
  28. తేనె పూసిన కత్తి తియ్యగా ఉందని నాకితే , నాలుక తెగకుండా ఉంటుందా ?
    తేనియపాలు పోసి పిల్లల్ని సాకినా, పీకలు కొయ్యరనే నమ్మకం పోతుంటే
    దీనిని దానవత్వ మందామన్నా వీలు లేకుండా ఉందే ! ఏది దారి ?

    అటువంటి సంతానం ఉండడం కన్నా లేకుండడమే మేలు గదా :
    ఏమంటారు ??????????????

    02)
    _________________________________________

    తేనియపాలు పోసి కడు - తీరుగ పిల్లల బెంచినన్ సరే
    తానక మింత లేక ; ఘన - దానవ ముఖ్యులె సిగ్గుజెందగాన్
    తేనెను గొన్న కత్తివలె - తీయగ ప్రాణము ముందుకొచ్చు , సం
    తానము లేని వారలకె - తప్పక కల్గును సద్గతుల్ సఖా!
    _________________________________________
    తేనియపాలు = తేనెవంటిమధురిమ కలిగిన పాలు(చనుబాలు)
    తానకము = వినయము
    తేనెను గొన్న కత్తి = తేనె పూసిన కత్తి

    రిప్లయితొలగించండి
  29. వృద్ధులైన తల్లిదండ్రులకు తిండి పెట్టడం కూడా దండుగే నని
    లాభ నష్టాలు తూకంవేసే నేటి పిల్లల లోకం నడచే దారెటు?

    అటువంటి సంతానం ఉండడం కన్నా లేకుండడమే మేలు గదా :
    ఏమంటారు ??????????????

    03)
    _________________________________________

    దీనులు , వృద్ధులౌట గని - తీరెను మాకిక , వారికిన్ రుణమ్
    దేనికి తల్లులున్? పితలు - దేనికి మాకిక ?యంచు వారినే
    తూనిక వేతురే , పరమ - ధూర్తపు వర్తన ! వారివంటి , సం
    తానము లేని వారలకె - తప్పక కల్గును సద్గతుల్ సఖా!
    _________________________________________

    రిప్లయితొలగించండి
  30. మీనము మేషముల్ విడిచి మిక్కిలి సంతుల తుర్కవారికిన్
    దానము చేసి భూములను దండిగ సీట్లను గెల్వగోరుచున్
    గానము జేయుచున్ మమత కన్నులు కొట్టుచు నవ్వులాడె: "సం
    తానము లేని వారలకె తప్పక కల్గును సద్గతుల్ సఖా!"

    రిప్లయితొలగించండి