15, ఫిబ్రవరి 2013, శుక్రవారం

చమత్కార పద్యాలు -206



అపూర్వ ద్వర్థి సమస్యాపూరణము
దాశరథి యనంగ ధర్మరాజు
ఇది  పూరణకొరకు ఇవ్వబడిన సమస్య. దీనికి ఏల్చూరి మురళీధరరావు గారు రెండర్థాల పూరణ చెప్పారు. నా 'ఎఱుక'లో ఏ అవధానీ ఇటువంటి ప్రయోగం చేయలేదు. వారి పాండితీప్రకర్షకు నమోవాకాలు. వారిలో నెలకొన్న వాణీదేవికి పాదాభివందనాలు.

పూరణము -

శ్రీ ప్రభాకరాన్వయప్రాతరారాధ్యుఁ

డుత్తముండు వెలయు నుదితయశుఁడు

భువి నయోధ్య నాగపురికి నధీశుండు

దాశరథి యనంగ ధర్మరాజు.

దాశరథి శ్రీరామచంద్రునికి, ధర్మరాజు యుధిష్ఠిరునికి ఉభయాన్వయం ఇది.

శ్రీరామచంద్రుని పరంగా అర్థం:

భువిన్ = పుడమి యందు; అయోధ్య నాఁగన్ = అయోధ్య అను పేరుఁగల; పురికిన్ = పట్టణమునకు; అధీశుండు = అధిపతి యగు; శ్రీ = సర్వసంపత్కరమైన, ప్రభాకర+అన్వయ = సూర్యవంశమునందు (ప్రభాకరః = రవౌ), ప్రాతః + ఆరాధ్యుఁడు = ప్రాతఃకాలమున ఆరాధింపఁదగిన స్వామి; ఉత్తముండు = శ్రీ మహావిష్ణుస్వరూపుఁడు; ఉదితయశుఁడు = విశ్రుతమైన కీర్తి గలవాఁడు (యశః = విశ్రుతత్వే); దాశరథి = దశరథాత్మజుఁ డైన శ్రీరామచంద్రుఁడు; అనంగన్ = అనఁగా; ధర్మరాజు = ధర్మస్వరూపుఁ డగు ప్రభువు; వెలయున్ = ఒప్పారును.

ధర్మరాజు పరంగా అర్థం:

భువిన్ = భూమి యందు; అయోధ్య నాఁగన్ = శత్రుయోధులకు గెలువ శక్యము గానిది యగు; నాగపురికిన్ = హస్తినాపురమను పేరుఁగల పట్టణమునకు; అధీశుండు = అధిపతి యగు; శ్రీ = సర్వసంపత్కరమైన, ప్రభాకర+అన్వయ = చంద్రవంశమునందు (ప్రభాకరః = చంద్రే), ప్రాతః + ఆరాధ్యుఁడు = ప్రాతర్వంద్యుఁడు; ఉత్తముండు = సర్వశ్రేష్ఠుఁడు; ఉదితయశుఁడు = ప్రసిద్ధికెక్కినవాఁడు; దాశరథి = తనను నిత్యము సేవించు వీరుల మహాసైన్యముఁ గలవాఁడు (రథ = పౌరుషవంతులైన, దాశ = సేవక గణము - "రథః స్యన్దనే శరీరే పౌరుషే యోద్ధరి" అని శబ్దార్థకల్పతరువు), అనంగన్ = అనఁగా; ధర్మరాజు = ధర్మరాజు అను పేరుఁగల యుధిష్ఠిరుఁడు; వెలయున్ = ఒప్పారును.

8 కామెంట్‌లు:

  1. మురళీ ధర! నే జేతును
    నిరతము శత వందనంబు నియమము దోడ న్
    సురుచిర మే మీ పద్యము
    ఇరు యర్ధము లుండె సామి !యే ల్చు రి మురళీ !

    రిప్లయితొలగించండి
  2. పృతనాషాడ్ప్రమదావనమ్మున మనోభీష్టమ్ములీడేర స
    మ్మతి సంసృష్ట మధువ్రతాళి మృదు ఝంకారాభిపన్న ప్రసూ
    న తతిన్ గాంచిన గల్గు సంబరము లన్నా ! నీ కవిత్వమ్ము మా
    శ్రుతి యుగ్మమ్మును జేరుచో గలుగు నిచ్చో సత్కవీ ! యేల్చురీ !

    ( నందనవనమ్ములో చేతః ప్రీతిమై విహరిస్తూ , అక్కడ తమ చుట్టూ చేరిన తుమ్మెదల గుంపుల ఝంకారాలతో ఒప్పిదమైన ప్రసూన గుచ్ఛములను మనసారా తిలకిస్తే ఎంత సంతోషం కలుగగలదో , అంతటి సంతోషమూ నీ కవిత్వము మా చెవుల బడినంతనే కలుగుతుంది కదా ఏల్చూరి మురళీధర సత్కవీ ! అభినందనలు !)

    రిప్లయితొలగించండి
  3. పండిత బ్రహ్మ శ్రీ మురళీదర రావు గారి అద్భుత రచనకి శిరసాభి వందనములు

    రిప్లయితొలగించండి
  4. “శంకరాభరణం” బ్లాగుముఖముఖరితంగా రాతిగుండెలలో రమణీయరాగాలను రవళింపజేస్తున్న సుకవిమాన్యులు శ్రీ శంకరార్యుల మేరలేని సహృదయతకు నా వినమ్రహృదయాంజలి!

    విద్వన్మాన్య, పద్యసరస్వతీనిత్యారాధనతత్పర, కవయిత్రీతిలక శ్రీమతి లక్ష్మీదేవి గారి సౌజన్యపూర్ణాత్మీయస్పందనకు ధన్యవాదాలు!

    కవితామరందాస్వాదలోలహృన్మత్తమిళిందచక్రవర్తిని, పద్యసరస్వతీచరణవర్తిని శ్రీమతి నేదునూరి రాజేశ్వరి గారి హృద్యస్పందనకు ధన్యవాదాలు!

    మీ దీవెనలకు లోఁగితిఁ
    గాదాచిత్కముగఁ బలుకుకలికికిఁ బ్రజ్ఞా
    వాదము లర్పించుటకు ని
    రాదిత్సుఁడ నేను సుబ్బరాయ కవీంద్రా!

    అందం బిందెడు కంది శంకరబుధేంద్రాశీర్వచస్సౌమన
    స్యాందూనందన విష్ణునందన కవీట్సౌజన్యమాన్యక్రమా
    మందానందమరందతుందిలమరున్మందారమందానిల
    స్పందాందోలితసుందరాత్మలతికాసంపత్తి ఱంపిల్లితిన్!

    రిప్లయితొలగించండి
  5. రెండర్థమ్ముల పూరణ
    మెండుగ నాశ్చర్యపరచె మేటివి సుకవీ!
    నిండుమనమ్ముతొ మెచ్చితి
    లెండిక కృతి చేయగ మురళీధరరావూ!

    రిప్లయితొలగించండి
  6. డా. ఏల్చూరి మురళీ ధరరావు గారు మన బ్లాగు మిత్రులవడం మన అందరి పూర్వ సుకృత ఫలం.

    రిప్లయితొలగించండి