21, ఫిబ్రవరి 2013, గురువారం

భీష్ముఁడు



భీష్మ ఏకాదశి సందర్భముగా సమర్పించిన కవిత

భీష్ముఁడు

వసులలో ననుజుండు వసుధపై భవమొందె

వసుమతీ వల్లభ వంశమందు

జాహ్నవీ తటినికి శంతన నృపతికి

పుత్ర రత్నమ్ముగా పుణ్యశీలి

భార్గవ రాముని వద్ద శస్త్రాస్త్రాదు

లౌ క్షత్ర విద్యల నభ్యసించె

తండ్రి సౌఖ్యమ్మునే తన సౌఖ్యముగ నెంచి

తగ బ్రహ్మచర్య వ్రతమ్ము బూనె

భీషణ ప్రతిజ్ఞ నొనరించె భీష్ముడనుచుఁ

బరగె దేవవ్రతుఁడు రాజ్యపదము నేని

త్యాగమొనరించె తృణమట్లు ధన్యజీవి

జ్ఞాన విజ్ఞాన ధనుఁడు ప్రఖ్యాత యశుఁడు



సమరమున కౌరవేంద్ర పక్షమును జేరె

కృష్ణ పరమాత్ముఁ గనుచు తత్కృపనుఁ బడసి

ఉత్తరాయణ భవ్య ముహూర్తమందు

పరమపద మొందె భీష్ముండు భద్ర గుణుఁడు



వృద్ధుఁడును జ్ఞానవృద్ధుఁడు వీరవరుఁడు

భీష్ముఁ డాతని చరితమున్ వినయమలర

తలఁచు వారికి ధాత్రి సత్ఫలము లొదవు

నాదరమ్మున నాతని కంజలింతు


పండిత నేమాని రామజోగి సన్యాసిరావు

3 కామెంట్‌లు:

  1. అంప శయ్యన నున్నట్టి యార్య ! భీష్మ !
    అగ్ర గురువుల శ్రేణి యం దగ్ర గణ్య !
    నీదు మరణము దెలియును నీ కు నౌర!
    అందు కొనుమయ్య సాదర వంద నాలు

    రిప్లయితొలగించండి
  2. పండిత నేమాని వారూ,
    భీష్ముని వ్యక్తిత్వాన్ని అద్భుతంగా చిత్రించారు. ధన్యవాదాలు.
    *
    సుబ్బారావు గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. ప్రతిన బూనిన ఘోటక బ్రమ్మ చారి
    కోరి మరణించ స్వచ్చంద వరము నొంది
    అంప శయ్యను పవళించి నార్యు డనగ
    యుగము మెండుగ యశమొందె గంగ పుత్ర

    రిప్లయితొలగించండి