11, ఫిబ్రవరి 2013, సోమవారం

సమస్యాపూరణం – 963 (శ్రీపతియే దరిద్రుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
శ్రీపతియే దరిద్రుఁడు కుచేలుని కంటెను నమ్ము మిత్రమా!
వరంగల్ శతావధానంలో నేనిచ్చిన సమస్య ఇది.
శతావధాని శ్రీ కోట వేంకట లక్ష్మీనరసింహం గారి పూరణ....
ఆపఁడు డబ్బుకై పరుగు లాతఁడు వెట్టుచు రొప్పుచుండు, నే
పాపము పుణ్యముల్ దనకు పట్ట వటంచు వచించుచుండు, నే
దీపముఁ బెట్టఁబోవఁడు, మతిన్ ధనమందు వ్యయించునట్టి యా
శ్రీపతియే దరిద్రుఁడు కుచేలుని కంటెను నమ్ము మిత్రమా!

(శ్రీపతి = ధనవంతుఁడు)

32 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !

    అటుకులు మొత్తం తినడం రుక్మిణి ఆపకపోతే జరిగేదదేగా !


    01)
    _________________________________________

    చూపుల నెంచి, స్నేహితుని - జోలెను గట్టిన చిట్టి మూటలో
    నాపద దీర్చు నంచతని - యాలదె పెట్టిన భక్ష్య మంతయున్
    తీపిగ నున్నవంచు తిన - ధీమతి రుక్మిణి యడ్డకున్నచో
    శ్రీపతియే దరిద్రుఁడు కు - చేలుని కంటెను నమ్ము మిత్రమా!
    _________________________________________

    రిప్లయితొలగించండి
  2. పిల్లలు లేక విలవిలలాడిన గొప్ప శ్రీమంతుడిని కళ్ళారా చూసిన జ్ఞాపకాల నేపధ్యంలో:

    పాపము వోలె వచ్చిబడు భారపు సంపద లేల నాకు యీ
    కాపుర మందు నాదు సతి గర్భము దాల్చక పోయినప్పుడౌ
    పాపలు లేని కొంపయను భావన యందున చిక్కిశల్యమౌ
    శ్రీపతియే దరిద్రుఁడు కుచేలుని కంటెను నమ్ము మిత్రమా!

    రిప్లయితొలగించండి
  3. కోపమునూని లక్ష్మి చనె కొండొకనాడు, ముకుందు డంతటన్
    దాపమునొందె వీడె నిజధామము ధారుణిపై జరించెగా
    బాపురె! యా పరిస్థితిని భావన చేయుటయా! హరీ! హరీ!
    శ్రీపతియే దరిద్రుడు కుచేలుని కంటెను నమ్ము మిత్రమా!

    రిప్లయితొలగించండి
  4. భూపతి నాదు మిత్రుడిట పూటకు పూటకు తిండి యత్నమే
    మాపటి దాక కూలి పని మస్తుగ జేసిన పొట్ట నిండదే
    చూపుము దారి యంచు మరి శుధ్ధిగ పూజలు జేయ నిచ్చుగా
    శ్రీపతియే, దరిద్రుఁడు కుచేలుని కంటెను నమ్ము మిత్రమా!

    రిప్లయితొలగించండి
  5. పెళ్ళి కోసం అప్పుచేసి కలియుగాంతం వరకూ వడ్డీ కట్టే వాడు :

    02)
    _________________________________________

    శ్రీ పతి మీద కోపమున - శ్రీ సతి వీడిన చోటు వీడి , యా
    శ్రీపతి రూపుదాల్చె ధర - శ్రీ వకుళాంబకు శ్రీనివాసుడై !
    శ్రీపతి-పద్మ పెళ్ళికని - శ్రీ కుహు ద్రవ్యము నప్పు దెచ్చుటన్
    శ్రీపతియే దరిద్రుఁడు కు - చేలుని కంటెను నమ్ము మిత్రమా!
    _________________________________________
    కుహుడు = కుబేరుడు

    రిప్లయితొలగించండి

  6. ఫిబ్రవరి మాసము బడ్జెటు కాలం అదిగో వస్తున్నది !
    ప్రజల గుండె గుభేలు మంటున్నవి 'వరి' వార్త ల తో
    మా రామనారాయణుడు హస్తిన కు ఏగు కాలమాయే !
    శ్రీపతియే దరిద్రుఁడు కుచేలుని కంటెను నమ్ము మిత్రమా!

    రిప్లయితొలగించండి
  7. దోపిడిదార్ల లోకమిది దోచుటె వారల నిత్య కృత్యముల్
    గోపనమొప్ప నుంచుదురు దోసిన డబ్బును అడ్డ దారిలో
    పాపము, దీనహీనులకు పట్టెడు బువ్వను పెట్టనట్టి యా
    శ్రీపతియే దరిద్రుడు కుచేలుని కంటెను నమ్ము మిత్రమా!

    రిప్లయితొలగించండి
  8. పాపపు సొమ్ములన్ మిగుల భాగ్యమటంచు దలంచి పెంచగా
    నే పని యైన జేయు జనులెవ్వరికైనను బోధయొక్కటే.
    శాపము వోలె దుఃఖమిక చావుకు మిక్కిలి బాధ పెట్టు; నా
    శ్రీపతియే దరిద్రుఁడు కుచేలుని కంటెను నమ్ము మిత్రమా!

    రిప్లయితొలగించండి
  9. పాపుల బ్రోచు నెందరినొ , భాగ్యములన్ గలిగించు దేవు డా
    శ్రీపతియే ; దరిద్రుడు కుచేలుని కంటెను , నమ్ము మిత్రమా !
    శ్రీపతి లేడు, గోపకుడె స్నేహితుడయ్యెను - భాగ్యశాలి , ల
    క్ష్మీపతి ప్రాణస్నేహితుని క్షేమము నెంచుచు నాదరించగన్

    రిప్లయితొలగించండి
  10. అవధానుల వారి బాటలోనే.........

    ఏపనికైనగాని ధనమే పరమావధిగాదలంచి సం
    తాపమునొందబోక చెడుదారులయందు ధనార్జనంబుచే
    పాపపుసొమ్ములన్ కలిగి భ్రాంతిఁ చరించుచు కింపచానుడౌ
    శ్రీపతియే దరిద్రుడు కుచేలునికంటెను నమ్ము మిత్రమా!

    కింపచానుడు = పిసినిగొట్టు,
    శ్రీపతి = ధనవంతుడు

    రిప్లయితొలగించండి
  11. శ్రీ పెరుగంగ లోభి తన క్షేమమె యెంచుచు స్వార్థ చింతనన్
    పాపము మూట గట్టుకొని పైకము నెంతయొ కూడబెట్టుచున్
    కాపును జేయుచున్ ధనము కాకికి యెంగిలి కూడు బెట్టకన్
    శ్రీపతియే దరిద్రుడు కుచేలుని కంటెను నమ్ము మిత్రమా!

    రిప్లయితొలగించండి
  12. అవధాని కోట వేంకట లక్ష్మీనరసింహం గారి పూరణ అద్భుతంగా ఉంది. దయచేసి మిగతా పృచ్ఛకులు ఇచ్చిన సమస్యలను, అవధాని గారి పూరణలను కూడా బ్లాగులో ప్రకటించండి.

    రిప్లయితొలగించండి

  13. పాపెను లేమి నా బడుగు బాపని జూచిన తక్షణంబె యా
    శ్రీపతియే దరిద్రుఁడు కుచేలుని కంటెను నమ్ము మిత్రమా
    క్ష్మాపయి భాగ్యశాలి మరొకండెట నుండును సత్యమౌ కృపన్
    జూపగ హద్దు లుండవనుచో పరమాత్ముని కెన్న డేనియున్.

    రిప్లయితొలగించండి

  14. మొదటి పద్యమునకు సవరణ :

    పాపుల బ్రోచు నెందరినొ , భాగ్యములన్ గలిగించు దేవు డా
    శ్రీపతియే ; దరిద్రుడు కుచేలుని కంటెను , నమ్ము మిత్రమా !
    శ్రీపతి లేడు యిమ్మహిని , స్నేహితుడయ్యెను గోపకుండె, ల
    క్ష్మీపతి ప్రాణస్నేహిత క్షేమము నెంచుచు నాదరించగన్

    రిప్లయితొలగించండి




  15. 1కోపముచే రమామణి,వికుంఠుని వీడును వేగ వీడగా
    యీ పరిణామమేమొ ,జగదీశ్వరుడైనను నిస్సహాయుడై,
    శాపవశమ్మునన్, హరియు సర్వము గోల్పడె చిత్రమేకదా!
    శ్రీపతియే దరిద్రుడు కుచేలుని కంటెను నమ్ము మిత్రమా.

    2. ఏపనిచేయకుండను ధనేచ్చయె యెప్డు ప్రధానమైన యా
    కాముకుడైన మానవుడు కాంక్షలు తీరక యాస్తిపాస్తులన్
    జీకటిదారి నాశనము జేసి తుదన్ నిరుపేదయాయెగా
    శ్రీపతియే దరిద్రుడు కుచేలుని కంటెను నమ్ము మిత్రమా.

    రిప్లయితొలగించండి
  16. శ్రీ కోట వేంకట లక్ష్మీనరసింహం గారి శతావధానం అన్ని విధాలుగా మనోరంజకంగా విజయవంతమయింది. ఎక్కడా తొట్రుపడకుండా, అలవోకగా అవధానాన్ని పూర్తిచేసిన వారి ప్రతిభ, ధారణాశక్తి ఆశ్చర్యాన్ని కలిగించింది.
    పృచ్ఛకులు వందమందికీ తిరుమల తిరుపతి దేవస్థనం వారు వ్యాఖ్యానంతో ప్రచురించిన పోతన భాగవతం 5 భాగాలను కానుకగా అందించారు.
    ఈ అవధానంలోని సమస్యలను, దత్తపదులను నీలువెంబడి బ్లాగులో ప్రకటిస్తాను.

    రిప్లయితొలగించండి
  17. శంకరార్యా ! శ్రీ కోట అవధాని గారికి అభిననందనలు.అవధానం విశేషాలు తెలిపిన మీకు ధన్యవాదములు. మిగతా సమస్యల కోసం ఎదురు చూస్తూ ఉంటాము.

    రిప్లయితొలగించండి
  18. వసంత కిశోర్ గారూ,
    1. పిడికెడు అటుకులు తిని రెండవ పిడికెడు తినబోతున్న కృష్ణుని రుక్మిణి వారించి...
    సొంపారఁగ నితనికి బహు
    సంపద లందింప నవియ చాలును నిఁక భ
    క్షింపఁగ వలవదు త్రిజగ
    త్సంపత్కర! దేవదేవ! సర్వాత్మ! హరీ!
    అన్నదట... ఆ ఘట్టాన్ని మీ మొదటి పూరణలో చక్కగా వివరించారు.
    'ఆలి + అదె = ఆలి యదె' అని యడాగమం వస్తుంది. సంధి లేదు... అతని యాలియె / అతనిదౌ సతి... అందామా
    2. అప్పులేనివాడే సంపన్నుడంటారు. కుచేలుడు అప్పు చేయలేదు. కాని శ్రీనివాసుడు అప్పులపాలయ్యాడు. ఈ విషయాన్ని సమర్ధంగా పూరణలో ప్రతిఫలింపజేసిన మీ రెండవ పూరణ బాగుంది.
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. వందమందికీ ఐదు భాగాలను అందించడం నిజంగా గొప్ప విషయం. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. అవధానులకు అభినందనలు.
    నా ప్రయత్నం:
    ఆపదలో గజేంద్రుడట నార్తిగఁ బిల్వగ కావఁ బోవలెన్!
    ద్రౌపది తన్ను బ్రోవుమన దారగ చీరల నీయగా వలెన్!
    పాపులకందనీక సుధ పంచగ మోహిని రూపమెత్తగా
    శ్రీపతియే దరిద్రుఁడు కుచేలుని కంటెను నమ్మ మిత్రమా!

    రిప్లయితొలగించండి
  21. చంద్రశేఖర్ గారూ,
    సంతానమూ సంపదే అనీ, అది లేనివాడు దరిద్రుడే అన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీరు వసంత కిశోర్ గారి బాటే పట్టారు. చాలా బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    భూపతి అన్న దరిద్రుని గూర్చిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మస్తుగ.. అన్నది తెలుగు కాదు.. మానక అని అందాం.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    రెండవ పాదంలో యతి తప్పింది.
    ప్రథమ పాదాంతంలో పొల్లు లకారం ఉంది కదా.. అందువల్ల దోసిన అన్నచోట లుబ్ధులు... అందాం.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం.
    కానీ అన్వయమే కొద్దిగా తికమక పెడుతున్నది.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    వికుంఠుడు అనడం సరియైనదేనా అని నాకు సందేహం.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    కానీ ప్రాణరక్ష, మానరక్ష, సురలోకరక్ష చేయగలిగిన శ్రీపతి దరిద్రుడని ఎలా సమన్వయం చేయాలి?
    *
    తోట భరత్ గారూ,
    ధన్యవాదాలు.
    *

    రిప్లయితొలగించండి
  22. పాఁపను పక్కగా మలిచె, పాన్పుకు "టేకు"ను వాడ లేదుగా
    వీపున మ్రోసెగా గరుఁడు, వింతగ "యిండిక" కూడ లేదుగా
    తీపుల కాళ్లు శ్రీసతియె తీర్చును, "మాత్ర"ను మ్రింగ లేదుగా
    శ్రీపతియే దరిద్రుఁడు కుచేలుని కంటెను నమ్ము మిత్రమా!!

    రిప్లయితొలగించండి
  23. పాపిని గాను నేననుచు భాగ్యము నొందితి దానమీ యగన్
    శ్రీపతి చేయి క్రిందగుట చింతన జేయగ సంతసం బునన్
    భూపతి నైననే బలిని భూవల యమ్మును ధార బోయగా
    శ్రీపతి యే దరిద్రుడు కుచేలుని కంటెను నమ్ము మిత్ర మా !

    రిప్లయితొలగించండి
  24. గురువు గారూ వందనములు. ... దరిద్రుడు కుచేలుని కంటెను , నమ్ము మిత్రమా !, శ్రీపతి లేడు యిమ్మహిని , స్నేహితుడయ్యెను గోపకుండె....

    అన్వయము :
    సాక్షాత్తు కృష్ణుడే ఆయనకు మిత్రుడు కావున కుచేలుని కంటె భాగ్యవంతుడు లోకంలో ఎవరూ లేరని దీని యొక్క భావం . నా భావం !!

    రిప్లయితొలగించండి
  25. జిగురు సత్యనారాయణ గారూ,
    శ్రీపతి యేవిధంగా దరిద్రుడో వివరిస్తూ చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    బలిముందు చేయిచాచిన శ్రీపతి దరిద్రుడన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. గురువుగారికి ధన్యవాదములు.ప్రతిదానికి తనే పరుగెత్తాల్సి రావటం సామాన్యుని దృష్టిలో యాతన అనిపిస్తుంది కదా! అందుకే అలా అన్వయించాను . హరిని తలుచుటే సంపద,తలపుకు రాకపోవటమే దరిద్రము అని ఆర్యోక్తి కదండీ?

    రిప్లయితొలగించండి
  27. దోపిడిదార్ల లోకమిది దోసిన డబ్బును అడ్డదారిలో
    గోపనమొప్ప నుంచుదురు కూళులు చేయరు దాన ధర్మముల్
    పాపము, దీనహీనులకు పట్టెడు బువ్వను పెట్టనట్టి యా
    శ్రీపతియే దరిద్రుడు కుచేలుని కంటెను నమ్ము మిత్రమా!

    రిప్లయితొలగించండి
  28. ఏ పని చేయఁ బోయిన ఫలింపని యత్నమునందు, సౌఖ్యమే
    లోపము గాగ భార్య నగలున్ సిరు లెవ్వియు లేక పిల్లలన్
    రేపును మాపు నాకలి భరింపఁగఁ జేయుటయందుఁ జూడఁగన్
    శ్రీపతియే దరిద్రుడు కుచేలుని కంటెను నమ్ము మిత్రమా!

    రిప్లయితొలగించండి
  29. శాపము మెండు సంపదయె శాంతము వీడుచు టాక్సు వారటన్
    కోపము జేసి జైలుకట కొట్టుచు తిట్టుచు పంపబూనగా
    పాపము శిస్తు కట్టగను పంచెను మాత్రమె కానవచ్చెడిన్
    శ్రీపతియే దరిద్రుఁడు కుచేలుని కంటెను నమ్ము మిత్రమా!

    రిప్లయితొలగించండి