28, ఫిబ్రవరి 2013, గురువారం

పద్య రచన – 266 (దానశీలము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"దానశీలము"

27 కామెంట్‌లు:

 1. ఫలముల నిచ్చును వృక్షము
  సలిలములిచ్చును నదులును చక్కగ నెపుడున్
  ఫలితము కోరక జనులకు
  కలకాలము మేలొనర్త్రు గద సాధు జనుల్.

  రిప్లయితొలగించండి
 2. తోపెళ్ళ బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
  "పరోపకారాయ ఫలంతి వృక్షాః" శ్లోకభావంతో చక్కని పద్యం వ్రాసారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 3. గురువుగారూ! ఇదంతా మీయొక్క శ్రీ పండితుల వారి ఆశీఃప్రభావము. నమస్కారములతో.

  రిప్లయితొలగించండి
 4. రఘువు, శిబి, బలి, కర్ణుండు, రంతిదేవు
  డాదిగాగల రవని మహావదాన్యు
  లగు యశోధను లవ్వారి నాత్మ దలచి
  నంతనె లభించు పుణ్య మత్యంత మనఘ!

  రిప్లయితొలగించండి
 5. పండిత నేమాని వారూ,
  దానశీలుర పట్టికతో రమ్యమైన పద్యాన్ని చెప్పారు. అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 6. దానము సేయట యొక కళ
  దానము నిల జేయువాడు ధర్మా త్ముడగున్
  దానములు బెక్కు రకములు
  వానిలొ నేదానమైన బరగును జేయన్ .


  మొయిలు వర్షించు నిరతము పుడమి యందు
  చేయు నుపకృ తి మిత్రుడు ప్రియము తోడ
  పండ్ల నిచ్చును వృక్షము బాగు గాను
  దాన శీ లుని గుణమిదె ధర్మ నిరత !  రిప్లయితొలగించండి
 7. కవచ కుండలా లర్పించె కర్ణు డపుడు
  వామను కొసంగె బలి చక్రవర్తి యంత
  ఈగిన తన మాంస మిడెను డేగకు శిబి
  దానశీలము గలవారె ధన్యులౌర !

  రిప్లయితొలగించండి
 8. సుబ్బారావు గారూ,
  బాగున్నవి మీ పద్యాలు. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  "వామను కొసంగె" అన్నదానిని "వామనున కిచ్చె" అందాం.

  రిప్లయితొలగించండి
 9. దానశీలత యను ధర్మమార్గముఁ బట్టి
  పుణ్యలోకములను పొందినట్టి
  బుధుల దలచినంత పుణ్యమె మనకును
  కరుణఁ జూపు గుణము కలుగవలెను.

  రిప్లయితొలగించండి
 10. గురువు గారూ ! మీరు ఇచ్చు, ఇవ్వు అనే పదాలు వాడొద్దంటారు గదా !?

  రిప్లయితొలగించండి
 11. లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  "వామను కొసంగె" అన్నదానిని "వామనున కొసంగె" అనాలి. దానివల్ల గణదోషం వస్తుంది. అందుకే అలా సవరించమన్నాను. ఇచ్చు శబ్దాన్ని ప్రయోగించరాదని నేనెప్పుడు అనలేదే.

  రిప్లయితొలగించండి
 12. సందేహ నివృత్తి చేసినందులకు గురువు గారికి ధన్యవాదములు.
  మరొక పద్యం -

  ఏమి యాశించి నది ప్రవహించు నెపుడు !?
  సాల మేమి గోరుచు ఫలసాయ మొసగు !?
  ఛాయ నొసగు !? తుదకు తన కాయ మొసగు !?
  అలరుచుందు రిమ్మహిని మహాత్ము లటులె

  రిప్లయితొలగించండి
 13. నాగరాజు రవీందర్ గారూ,
  మీ తాజా పద్యం చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. చేదుకొద్ది బావి నీరు చేరునెంతొ వేగమే
  పోదు నీవు ఇచ్చినంత పొందు మార్గమేనురా
  రాదు నీవు కూడబెట్టు రాశి నీకు తోడుగా
  ఆదుకుంటె వచ్చు నీకునాదరమ్ము హెచ్చుగా.

  రిప్లయితొలగించండి
 15. అన్ని దానముల కంటెను
  యన్న దానము మిన్న యందు రానందముగన్ !
  తిన్నది చాలని తృప్తిగ
  మన్నన జేయంగ బుధులు మాహేశ్వరులై !

  రిప్లయితొలగించండి
 16. collection :
  అందె గత్తె యైన అమ్మాయి గావచ్చు
  అద్ద మొకటి ఆమె కవసరమ్ము
  తెలివి తేటలున్న తేజశ్వి గావచ్చు
  ఉండ వలయు గురువు అండ తనకు.
  namaste! Master garu.

  రిప్లయితొలగించండి
 17. నీటిని గ్రహియించి నోటి ముందరి కూడు
  .........దానమ్ము జేసెనో దాత యిచట!
  పతనమ్ము దెలిసియు పరమాత్ము డడుగగా
  .........తన సర్వమిచ్చెనో త్యాగి యిచట!
  తనువున భాగమై తనరిన కవచమ్ము
  .........వితరణ జేసెనో వీరు డిచట!
  వేడగా సురపతి వెన్నెముక నిడగ
  ..........తనువును వీడెనో తపసి యిచట!

  నరనరమ్మున ప్రవహించు నరులకిచట .
  దాన గుణమును వితరణ తత్త్వ మనఘ!
  భారతీయాత్మ భవ్యమౌ ప్రాభవమ్ము
  సాటి లేనిది సృష్టిలో సత్య మిద్ది.

  రిప్లయితొలగించండి
 18. మిస్సన్న గారూ,

  అదరగొట్టారండీ. అభినందన మాల అందుకోండి.

  రిప్లయితొలగించండి
 19. మిస్సన్న గారూ! సీసం అదిరింది .ఈ రోజు గోలీమార్ మీరే. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. మిస్సన్న గారూ మీ పద్యం బ్రహ్మాండంగా వుంది. అభినందనలు.

  అడిగిన పాత్రుని కొసగన్
  తడబడకనె యిచ్చు దాని దానంబనగన్
  కడవరకు పరులకొరకే
  వడలెడువృక్షమున్ బిలువగ పదమే లేదా!?

  రిప్లయితొలగించండి
 21. సహకార సంఘ ఎన్నికల సమయాన మీ "సహకార" వృత్తపు టెన్నిక మన్నిక కు మిత్రశ్రీ సహదేవుడు గారికి నాఅభినందనలు. మీ పూరణ చదివి సరదాగా దానం చెయ్యాలంటే చెయ్యి ఉండలిగదా! నిత్యమూ చేతినీపనికే ఉంచుట కుదరదు గదా! కాని వృక్షానికి ఉన్న గొప్ప పేరు "పాదపము". మీరు చెప్పినట్లు యావచ్చరీరాన్ని నిత్యమూ ఇతరులకే వినియొగించునది వృక్షము. జీవనానికి కావలసిన నీరు వేళ్లద్వారా త్రాగుతుంది. ఈ భావాన్ని పూర్తిగా ఆవిష్కరించలేకపోయినను సరదాగా వ్రాసాను.

  చేయి కుదురునపుడె దాన మీయ గలరు
  కావలెను నీరు త్రావగ కరము నంత
  పరుల కొసగుచుండును రేయి పవలు లేక
  పాదపమను నామంబున పరగు చుండు.

  రిప్లయితొలగించండి
 22. డా. ప్రభల రామలక్ష్మి గారూ,
  మీ సుగంధి వృత్తం మనోహరంగా ఉంది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్య గారూ,
  మీ ప్రయత్నం ప్రశంసనీయం. మొదటి, రెండవ పాదాల్లో గణదోషం. నా సవరణ...
  అన్నిటి కంటెను మిన్నగ
  నన్నపు దానమ్మె యందు రానందముగన్ !
  *
  సాహిత్యాభిమాని గారూ,
  మీరు సేకరించిన పద్యం బాగుంది. ధన్యవాదాలు.
  కాని ఇది నేటి అంశమైన దానశీలానికి చెందింది కాదు.
  *
  మిస్సన్న గారూ,
  అద్భుతమైన సీసం వ్రాసారు. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  కాకుంటే చివరి పాదంలో గణదోషం... నా సవరణ....
  "వడలెడువృక్షమును బిలువ పదమే లేదా!"

  రిప్లయితొలగించండి
 23. తోపెల్ల వారూ,
  సరదాగా వ్రాసినా సరిగానే మెప్పిస్తున్నది మీ పద్యం. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. సంపత్కుమార్ శాస్త్రి గారూ, సుబ్రహ్మణ్య శర్మగారూ, సహదేవుడు(సహకారుడు) గారూ! ధన్యవాదాలు.

  గురువుగారూ ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 25. దానము చేయగ పెరుగు ని
  ధానము నీశు పద సన్ని ధానము గలుగున్
  దానము చేయని చోటది
  పానమునకు పనికి రాని పాకుడు కొలనౌ.

  రిప్లయితొలగించండి