26, ఫిబ్రవరి 2013, మంగళవారం

సమస్యాపూరణం – 978 (పతినిఁ దలఁదాల్చు స్వామికి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పతినిఁ దలఁదాల్చు స్వామికి వందనములు.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

36 కామెంట్‌లు:

  1. పశుపతికి భూతపతికి విశ్వాధిపతికి
    శైలారాజాత్మజాతను సగము మేన
    దాల్చు హరునకు నీలకంధరునకు నుడు
    పతిని దలదాల్చు స్వామికి వందనములు

    రిప్లయితొలగించండి
  2. పండిత నేమాని వారూ,
    మీ పూరణ రెండవ పాదంలో "శైల" టైపాటు వల్ల "శైలా" అని పడింది.

    రిప్లయితొలగించండి
  3. అయ్యా! శైలరాజాత్మజా అనుటే ఒప్పు. టైపు పొరపాటును గుర్తు చేసిన మీకు అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  4. చిన్ని బాలుడు గణపతి చేరి " తండ్రి
    చందమామయె నాచేతి కందవలెను"
    అనగ నెత్తి ముద్దిడుచును నపుడు విఘ్న
    పతిని దలదాల్చు స్వామికి వందనములు

    రిప్లయితొలగించండి
  5. శిరముపై నిడుకొని స్వామి కరివదనుని
    జనుచు నుండె ప్రతిమ నిమజ్జనము సేయ
    విభుని నవరాత్రు లర్చించి వెడలెడు గణ
    పతిని తలదాల్చు స్వామికి వందనములు

    రిప్లయితొలగించండి
  6. కంఠమున హలాహలమును, గళము చుట్టు
    భూషణముగ సర్పముఁ బొంది, భూధరాత్మ
    జాతకును శరీరమ్ములో సగ మిడి, యుడు
    పతినిఁ దలఁదాల్చు స్వామికి వందనములు.

    రిప్లయితొలగించండి
  7. ఠవఠవలు లేక మున్ను తాటకిని దునిమె
    స్వామి కార్యముఁ దీర్చును వాలిఁ జంపి
    చనెద మ్రొక్కెదఁ దనకని సాగిలి జన
    పతినిఁ దలఁదాల్చు స్వామికి వందనములు

    రిప్లయితొలగించండి
  8. సకల శుభములు గలి గించు శంకరునకు
    ఆది మధ్యాంత రహితుడు నాది దేవు
    నకును , భవునకు ,తారకా నాధు ని ,నుడు
    పతిని దలదాల్చు స్వామికి వందనంబు

    రిప్లయితొలగించండి
  9. ఏక పత్నీవ్రతుండగు నినకులజుని,
    తండ్రి మాటకు రాజ్యముఁ దమ్ముకొసగు
    ధర్మమూర్తిని, రాముని, ధరణి సుతకు
    పతినిఁ దలఁదాల్చు స్వామికి వందనములు.

    రిప్లయితొలగించండి
  10. నూత్నచ్ఛందోవిధాత శ్రీ సహదేవుడు గారికి
    హార్దికాభినందనములతో,

    నిన్న మీరు కల్పించిన వృత్తం సంస్కృతాంధ్రాలలో ఎక్కడా లేనందువల్ల శ్రీ వావిళ్ళ వారికి నేను పరిష్కరిస్తున్న “అప్పకవీయము” పీఠికలో “ఆధునిక కాలమున నూతనప్రయోగములు” అన్న విభాగంలో సంతోషంగా చేర్చుకొంటున్నాను. దీనికి శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారు “సహకారము” అని చేసిన నామకరణం మనోహరంగా ఉన్నది.

    మీకు, ఈ విధమైన చిత్రకల్పనలకు ఆలవాలమైన “శంకరాభరణం” కల్పయిత మాన్యులు శ్రీ శంకరయ్య గారికి కూడా అభినందనలు!

    ఇహపరతారకపదసం
    గ్రహమై వాణీపదాబ్జఘటితామరభూ
    రుహనవపుష్పకమై మీ
    సహకారము వ్యాప్తిఁజెందు సహదేవకవీ!

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  11. శ్రీ శంకరయ్యగురుదేవులకు,శ్రీ నేమాని పండితవర్యులకు, పెద్దలకు వినమ్రవందనములు

    కష్టములలో ఆదుకొన్న స్వామికి వందనములు
    ======*======
    ముందు వెనుక దారి మందమై గనుచుండ
    బంధములను ద్రుంచి బందువువలె,
    దండిగ గణ పతిని దల దాల్చు స్వామికి
    వందనములు, కోటివందనములు.

    రిప్లయితొలగించండి
  12. ఆటవెలదియయ్యె తేటగీతి సమస్య
    మన వరప్రసాదు మలచె నటుల
    పలుకు తల్లి యతని తలపులలో నింపు
    కాంతు లనవరతము కరుణ మెరయ

    రిప్లయితొలగించండి
  13. కంది శంకరయ్య కవి సమస్యను చాల
    కాలమైన పిదప కలము బూని
    నింపిరయ్య వినగ నింపుగా సొంపుగా
    నతని గీతి రీతి నభినుతింతు

    రిప్లయితొలగించండి
  14. మంచుకొండలయందునిర్మలమనమున
    ఘనతపంబొనరించునంగజహరునకు,
    అర్ధనారీశ్వరునకు, నియంతకు,నగ
    పతినిఁ తలఁదాల్చు స్వామికి వందనములు.

    భక్తులను మోయటానికైన ( నగపతి ని తలదాల్చి ) తనశరీరాన్ని ఇవ్వడానికైన ( అర్ధనారీశ్వరుడు ) ఈశ్వరుడు భోళాశంకరుడు.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ శంకరయ్యగురుదేవులకు,శ్రీ నేమాని పండితవర్యులకు, పెద్దలకు వినమ్రవందనములు
    శ్రీ నేమాని పండితులకు ధన్యవాదములు
    =======*======
    సర్వము గురుదేవుల కృప, సత్కవులకు
    శిష్య పరమాణువు బలుకు శిరమువంచి
    వినయ మండిత ప్రణతులన్ ఘనముగాను,
    తమ కరుణకై దపించెడి తంతి వీడు.

    రిప్లయితొలగించండి
  16. హృదయాహ్లాద పూరణలు చెప్పిన కవిమిత్రులు....
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    గన్నవరపు నరసింహమూర్తి గారికి,
    సుబ్బారావు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    వరప్రసాద్ గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. గోలి వారూ,
    'అందవలెను అనగ' అని విసంధిగా వ్రాయడానికి బదులు "అందవలయు ననగ" అందాం.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పూరణ ప్రత్యేకంగా ప్రశంసింపదగినది.
    *
    స్వాస్థ్యమా మందగించెను, సత్కవి ప్ర
    శంస లందింపఁగల భావసంపదా వి
    ముఖుఁడ, నెవ్విధిఁ జేతును పూరణముల?
    శిష్యవాత్సల్య మేపారు శిష్టులకు న
    మస్కరించెద మీకు నేమాని వారు.
    *
    ఏల్చూరి మురళీధర రావు గారూ,
    ధన్యవాదాలు. సహదేవుడు గారి జన్మ ధన్యమైనది.

    రిప్లయితొలగించండి
  18. మానులు శ్రీ శంకరయ్య గారికి
    పునఃపునర్ధన్యవాదాలతో,

    పరమశివుని కంఠంలో హాలాహలం స్వామి జగద్రక్షాదీక్షకు, గళాభరణమైన సర్పం పారమార్థికజ్ఞానానికి, అర్ధాంగికి అర్ధాంగాన్ని ప్రసాదించటం దాంపత్య ధర్మసూత్రబోధకు, మౌళిస్థ చంద్రరేఖ అవ్యాజమైన అనుగ్రహానికి సంకేతాలుగా ఈశ్వరుని తత్త్వాన్ని అధికరించి మీరు చేసిన పూరణ ఈ రోజు అనల్పార్థమనోరమంగా ఉన్నది. ప్రసన్నమైన మీ పద్యధార ప్రశస్తమైన సంగతి - దాస్తే దాగేది కాదు కదా!

    ప్రళయకాలానలజ్వాలికామాలికా
    ప్రభలు విశ్వంభరాప్రభుతఁ దెలుపఁ
    బ్రాంచితతాండవాకుంచితపాదంబు
    పంచక్రియాశక్తిఁ బంతుగొలుప
    ఫణభృన్మహాగ్రణీబ్రహ్మసూత్రము సర్వ
    కర్మాధిపత్యంబు గండరింప
    నిగ్రహానుగ్రహనిపుణముద్రాభద్ర
    కరయుగీరోచులు గందళింప

    వ్రతినికాయంబు లేకాంతమతినిఁ బ్రేమ
    ప్లుతిని వలగొల్చు స్వామికిఁ బూర్వదేవ
    పతిని నిలవేల్చు స్వామికిఁ బార్వణర్క్ష
    పతినిఁ దలఁదాల్చు స్వామికి వందనములు!

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  19. పాలలోచనునకు భక్త పాలునకును
    విశ్వ లయకార శివునకు విషధరునకు
    త్రిపుర వైరికి భస్మాంగ తేజున కుడు
    పతిని తలదాల్చు స్వామికి వందనములు

    రిప్లయితొలగించండి
  20. చి. డా. మురళీధర రావు గారికి హార్దిక శుభాశీస్సులు.
    ఆ భవానీపతిని గూర్చిన మీ సీసము పద్య శీర్షమే. ఆ ధార రసధారయే. ఆ వాక్పటుత్వము అనన్య సామాన్యము. పఠితులను నిజముగా నుర్రూతలూగింప జేసినది అనుటలో సందేహము లేదు. అదియొక కవితా సౌందర్య లహరీ ప్రవాహమే. అద్భుతము. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  21. శ్రీ శంకరయ్యగురుదేవులకు, శ్రీ నేమాని పండితవర్యులకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  22. ఉన్నది యొక్క పదార్ధము
    అన్నది నిజమన్న మాట నాత్మల యందున్ !
    మిన్నగు రాజును పేదైన
    మన్నున కలియంగ నొకటె మహిలో కనగన్ !

    రిప్లయితొలగించండి
  23. తన్మయమ్మున నగజాత తలచును పశు
    పతిని ; తలదాల్చు ; స్వామికి వందనములు
    జేయు ; మదిలోన పతిగ నెంచి ముదమొందు ;
    పురహరుని జేరి భక్తిని పూజ సేయు

    రిప్లయితొలగించండి




  24. అందరూ 'ఉడుపతి-'అని పూరించారు.కొంచెం భిన్నంగా

    రాక్షసాధీశు దునుమాడి రాఘవుండు
    సతిని గూడి యయోధ్యకు జనెడి వేళ
    అమితభక్తిని బూజించి యద్రితనయ
    పతిని తలదాల్చు స్వామికి వందనములు .

    రిప్లయితొలగించండి
  25. పూజ్యశ్రీ పండిత నేమాని గురుదేవులకు ప్రణామములు!

    యత్కృపావృష్టి సత్ఫలోద్యతము గాఁగఁ
    గావ్యరసమందు నించుక గలిగె ననుభ
    వంబు; ద ద్గురుమౌళి భావంబు నందు
    మసలి సాఫల్యమందె జన్మంబు నాకు.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  26. పెద్దలు, మిత్రులందరకూ నమస్కారములు. అందరూ ఈ సమస్యను శివపరంగానే పూరించారు. తద్భిన్నంగా నా చిన్ని ప్రయత్నం.
    ----------------------------
    సతిని యెడబాసి రాముండు సఖులగూడి
    రావణాసురుసేనపై రణము సలుపు
    వేళ తేరుతానుగనిల్చి వేగమె రఘు
    పతిని తలదాల్చు స్వామికి వందనమ్ము

    రిప్లయితొలగించండి
  27. పండితులు శ్రీ ఏల్చూరి వారికి ధన్యవాదములు. తమరికి కృతజ్ఞతలు తెలుపడానికి భాష చాలదని పిస్తుంది. సదా తమ సహకారము కొనసాగించ ప్రార్థన.
    నేను శంకరాభరణంలో పద్యాలను వ్రాయటం ప్రారంభించి మొదటి సంవత్సరము పూర్తి కావస్తోంది. యాదృచ్ఛికంగా పుట్టిన కొత్త ఛందంతో నిజంగానే నా జన్మధన్యమైనది. దీనికి బ్లాగు రూపకర్తలైన గురువర్యులు శంకరార్యుల వారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. మరియు లక్ష్మిదేవి గారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  28. ఏల్చూరి మురళీధరరావు గారూ,
    నా పూరణను విశ్లేషించి ప్రశంసించిన మీ సౌహార్దానికి ధన్యావాదాలు.
    ఇక మీ పూరణ అద్భుతంగా ఉంది. నేమాని వారి ప్రశంసకు అన్ని విదాలుగా తగినది. సర్వతోముఖ ప్రతిభ ఉండికూడ వినయశీలం కలిగి ఉండడం మీకే చెల్లింది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్య గారూ,
    పద్యరచన శీర్షికకు వ్రాసిన పద్యాన్ని ఇక్కడ పోస్ట్ చేసారు. నా సవరణలతో మీ పద్యాన్ని ఆ శీర్షికలో చూడండి.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పింగళి శశిధర్ గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  29. ఓ వధువు తన వివాహ సమయాన వేంకటేశ్వర స్వామి కలశమును తల మీద దాల్చిన తన భర్తకు వందనములు చెప్పిందన్న భావంతో...
    బాల్యమందున నుండియు బాలాజిఁ గొలచితి
    పెళ్లి రోజున జరిగేటి వేడుకందు
    పెద్ద కలశంపు రూపాన వేంకటాద్రి
    పతిని తలఁదాల్చు స్వామికి వందనములు

    రిప్లయితొలగించండి
  30. సహదేవుడు గారూ,
    మీ తాజా పూరణ వైవిధ్యంగా ఉండి అలరిస్తున్నది. అభినందనలు.
    'బాలాజి' అన్నప్పుడు గణదోషం. 'వేడుక + అందు' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. నా సవరణ...
    బాల్యముననుండియును శ్రీనివాసు గొలచు
    పెళ్లి రోజు జరుగునట్టి వేడ్కలందు

    రిప్లయితొలగించండి
  31. క్షమించాలి నా కంప్యూటర్ రెండు రోజులు గా అలిగింది.సరిగా వినటల్లేదు అదన్నమాట అసలు సంగతి

    రిప్లయితొలగించండి
  32. గురువుగారికి శతాధిక వందనములు మరియు ధన్యవాదములు.తమరి సూచన ప్రకారం సవరించిన పద్యం:

    బాల్యమున నుండియును శ్రీనివాసుఁ గొలువ
    పెళ్ల రోజున జరిగెడు వేడ్క లందు
    పెద్ద కలశంపు రూపాన వేంకటాద్రి
    పతిని తలఁదాల్చు స్వామికి వందనములు.

    రిప్లయితొలగించండి
  33. నూతన చంద ఆవిష్కర్త లగు శ్రీ సహదేవుడు గారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  34. పనుల వత్తిడి వల్ల గత మూడు రోజులుగా శంకరాభరణం చూడటం లేదు. ఈ మధ్య కాలంలోనే ఉద్భవించిన సహకార వృత్తాన్ని స్వాగతిస్తూ వృత్త కర్త శ్రీ సహదేవుడు గారికి శుభాభినందనలు తెలియజేస్తూ ఈ ఛందస్సులో నేను కూడా ప్రయత్నిస్తానని తెలియజేస్తున్నాను.

    రిప్లయితొలగించండి