20, ఫిబ్రవరి 2013, బుధవారం

పద్య రచన – 258 (ధూర్త లక్షణము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"ధూర్త లక్షణము"

16 కామెంట్‌లు:

  1. (భాస్కర శతకమున చెప్పినట్లుగా..)

    పెట్టెను పెట్టిన బట్టల
    కొట్టును గా పనియెలేక కొరుకును చిమటే
    అట్టులె ధూర్తుడు మరి చెడ
    గొట్టుటకే జూచు సుజన కోటిని ధరలో.

    రిప్లయితొలగించండి
  2. పరమానందము స్వస్వరూపమగుచున్ భాసిల్లుచుండన్ సమా
    దర రీతిన్ దలపోయ డప్పగిది వ్యర్థంబైన భావమ్ముతో
    స్థిరముల్ కాని వినోద రీతులకు నాశించున్ ప్రలోభాన జూ
    దరుడై జీవుడు మాయలోబడి మహాత్మా! దిద్దుమా యీ స్థితిన్

    రిప్లయితొలగించండి
  3. అతి వినయము ధూర్తు నవలక్షణమనుచు
    తాతగారు బలుకు తలపులందు
    నేఁడు మెదిలె, నాదు నిన్నటి జ్ఞాపక
    ములను దలచి మనము మోదమందె.

    రిప్లయితొలగించండి
  4. మాట మాటకు గపటపు బాట బట్టి
    మనము నిండుగ బోషించి మత్సరమ్ము
    పరుల హితముల గుందుచు బరులు వగచ
    రక్తి నొందుట నతిధూర్తలక్షణమ్ము !

    రిప్లయితొలగించండి
  5. ధూర్త లక్ష ణంబు దురవ గాహంబులు
    పరుల వృద్ది జూచి వగలు జెందు
    అతివి నయము గలిగి యాపద గలిగించు
    మత్సరంబున మెలగు మదిని జెఱచు

    రిప్లయితొలగించండి
  6. డాంబిక మతివినయము నా
    డంబరము మదము కుటిలము టక్కరి తనమున్
    డంబపు పలుకుల తోడ ను
    దుంబరమును బోలు వాడె ధూర్తుడు మహిలో !

    *ఉదుంబరము = మేడి పండు

    రిప్లయితొలగించండి
  7. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    సుమతీ శతక పద్యం చదినిన అనుభూతి కలిగింది. మంచి పద్యం వ్రాసారు. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మాయాప్రభావంతో ధూర్తత్వాన్ని పొందిన జీవుని తత్త్వాన్ని చక్కగా వివరించారు. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    చిన్న పద్యంలో ధూర్తలక్షణాలను చక్కగా వివరించారు. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    అందమైన కందంలో ధూర్తుని లక్షణాలను బాగుగా చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. తనలాభములేకున్నను
    కనలేక నితరుల బాగు గర్వాంధుండై
    మనమందు రజోతమసపు
    గుణంబులను వీడలేక కుములుచు నుండున్!

    రిప్లయితొలగించండి
  9. బలముతా తలపక బలమున్నవానితోడ
    ...... తలపడు నెపుడును తగ్గకుండ
    విద్యావిహీనుడై వినయంబు జూపుచు
    ...... పరిహాస మాడును పండితులను
    వికృత రూపంబున విపరీత చేష్టల
    ...... మానిని మనమును మలిన పరచు
    తల్లిదండ్రులనన్నదమ్ములన్ గురువులన్
    చేయును వంచన చింత లేక

    ఆడి మాట తప్పు నతివల నేడ్పించు
    మాయ మాట లందు మాయ జేయు
    అతివినయము జూపి యఘముజేయుచునుండు
    ధూర్త లక్షణంబు దురిత దూర!

    రిప్లయితొలగించండి
  10. ధూర్త లక్షణములపై లభ్యమైన రెండు శ్లోకములు

    ముఖం పద్మదళాకారం వాచా చందన శీతలా
    హృదం క్రోధసంయుక్తం త్రివిధం ధూర్తలక్షణం.

    నారికేళ సమాకారా దృశ్యంతేపి హి సజ్జనాః
    అన్యే బదరికాకారా బహిరేవ మనోహరా.

    సామెత: మాటలో " చక్కెర ", మనసులో " కత్తెర ".

    రిప్లయితొలగించండి
  11. మితి మీరిన విలసితు డై
    గతి తప్పి దిరుగు చున్న కాపురుషు డనన్ !
    సతి సుతులను మభ్య పఱచు
    నతి వినయము ధూర్త లక్షణ మనగా !

    రిప్లయితొలగించండి
  12. సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    మీ పద్యం ధూర్త లక్షణాలను నినరంగా తెల్పింది. మంచి పద్యం. అభినందనలు.
    సీసం మొదటి పాదం చివర డ అనే అక్షరం ఎక్కువై గణదోషం... దానిని తొలగిస్తే సరి.
    నీతిశ్లోకాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ ప్రయత్నం అభినందనీయం.
    చివరి పాదంలో గణదోషం...

    రిప్లయితొలగించండి
  13. నిజమే గురువుగారూ! సవరణానంతరం

    బలముతా తలపక బలమున్నవానితో
    ...... తలపడు నెపుడును తగ్గకుండ
    విద్యావిహీనుడై వినయంబు జూపుచు
    ...... పరిహాస మాడును పండితులను
    వికృత రూపంబున విపరీత చేష్టల
    ...... మానిని మనమును మలిన పరచు
    తల్లిదండ్రులనన్నదమ్ములన్ గురువులన్
    చేయును వంచన చింత లేక

    ఆడి మాట తప్పు నతివల నేడ్పించు
    మాయ మాట లందు మాయ జేయు
    అతివినయము జూపి యఘముజేయుచునుండు
    ధూర్త లక్షణంబు దురిత దూర!

    రిప్లయితొలగించండి
  14. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    ధూర్త లక్షణములు :

    01)
    _______________________________

    దూరు నితరుల నెన్నడు - దుడుకుతనము
    దుష్ట బుద్ధుల పరులను - తురుము నెపుడు
    దుండగించును తరుణుల - తుచ్ఛబుద్ధి
    ధూర్త లక్షణ మది,మరి- దొంగ తనము !
    _______________________________
    దుండగించు = అల్లరి చేయు
    మరి = మఱియు

    రిప్లయితొలగించండి
  15. వసంత కిశోర్ గారూ,
    చక్కని పద్యం వ్రాసారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి



  16. వీసమైనను దెలియని మోసకారి
    కపటవర్తన,లోలోన గల్మషమ్ము
    వినయమును నటియించుచు ,వెన్నుపోటు
    బొడుచు ధూర్త లక్షణమును బోల్చగలమె.

    రిప్లయితొలగించండి