21, ఫిబ్రవరి 2013, గురువారం

పద్య రచన – 259 (తెలుఁగు పద్యము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"తెలుఁగు పద్యము చచ్చినదని కొందఱిమాట - నిజమా?"

48 కామెంట్‌లు:

 1. చచ్చెను కుమతుల బుద్ధులు
  చచ్చెను కువ్యాఖ్యలెల్ల శంకర సుకవీ!
  హెచ్చెను తెలుంగు పద్యపు
  పచ్చదనము రాను రాను వర్ధిల్లు ధరన్

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  మన తెలుగు చిరంజీవి :
  మన తెలుగు పద్యమూ చిరంజీవే :

  01)
  ________________________

  తెలుగు పద్యములవి - తేనె లొలుకు చుండు
  తెలుగు పద్యము బహు - తీపి తీపి !

  తెలుగు పద్యంబది - తిమిరారి సాటిలే
  తెలుగు పద్యము మహా- తిముల సమము

  దివిని తారల ప్రభ - లవి యుండు వరకును
  తెలుగు వెలుగులవి - వెలుగు నిజము

  దేశ భాషల గొప్ప - ది యగు తెలుగు భాష
  దివ్యమైనది , మహా - దీప్తి నొందు !


  తెలుగు వెలుగును కడదాక - దివ్యముగను
  దివిని సూర్యుడు వెలిగెడి - దినము వరకు !
  "తెలుగు పద్యము చచ్చిన - ది" యను మాట
  తెలివి లేనట్టి వారలు - పలుకు పలుకు !
  ________________________
  తిమిరారి = సూర్యుడు
  తిమి = సముద్రము

  రిప్లయితొలగించండి
 3. తియ్య తియ్యని పదముల తేనె లూరు
  తెలుగు భాషయు దివ్యమై తేజరిల్లు
  పద్య సుమపరిమళములు పర్వుచుండ
  చవియు నెఱిగిన తుమ్మెదల్ గవియు బ్రాతి

  రిప్లయితొలగించండి
 4. పలకపై నక్షరాభ్యాసమ్ము జేయించె
  నయమార మనకు నన్నయ్య సుకవి ;
  తెలుగులో గల మేటి పలుకుబడుల సౌరు
  జూపించె తిక్కన్న సోమయాజి ;
  శబ్దగతికి భావ శబలత గుదిగుచ్చి
  వివరించె మన యెఱ్ఱ ప్రెగ్గడ కవి ;
  పలికిన పదమెల్ల భాగవతము సేసి
  పులకించుటను నేర్పె పోతరాజు ;

  ప్రౌఢ పదగుంఫనమ్మున బరిఢవిల్లు
  నైగనిగ్యము జాటె శ్రీనాథ సూరి ;
  సకల కావ్య ప్రబంధ లక్షణములెల్ల
  దెల్పినారు కదా యష్ట దిగ్గజములు !

  గున్నమామిడి చెట్టు కొమ్మపై కోయిల
  పంచమ స్వరమును పాడినట్లు ;
  హోమగుండము ముందు హోత సస్వరముగా
  వేదమంత్రమ్ము జపించినట్లు ;
  శారద రాత్రుల సారాభ్రమున మిన్కు
  మినుకని తారలు మెరిసినట్లు ;
  చెలగి వేగమ్ముగా జీవనదీ ప్రవా
  హము ముందు ముందునకరిగినట్లు ;

  తెలుగు గీతమ్ము నిత్యమై నిలుచుగాక
  తెలుగు పద్యమ్ము నిక్కమై పొలుచుగాక
  తెలుగు వ్యవహార మచలమై వెలయుగాక
  తెలుగు పలుకులు స్థిరములై చెలగుగాక !

  (సీసము లోని మొదటి నాలుగు పాదాల్లో ఒక్కొక్క పాదానికి ఎత్తుగీతి లోని ఒక్కొక్క పాదముతో అన్వయము )

  నింగిలో సూర్యచంద్రులు నెగడు దనుక
  నవని పై జలనిధులింక నంత దనుక
  జాతి మున్ముందునకు బేర్మి సాగు దనుక
  తెలుగు పద్యమ్ము నిత్యమ్ము - తిరుగు లేదు !!!


  జయమహో తెల్గు తల్లీ !!!

  రిప్లయితొలగించండి
 5. హృద్యమైన పద్యవిద్యకు ప్రాణంపోసి, "దివిని సూర్యుఁడు వెలిఁగెడి - దినము వఱకు", "జాతి మున్ముందునకుఁ బేర్మి సాగు దనుక" చిరాయువును ప్రతిపాదించిన కవివతంసులు శ్రీ వసంత్ కిశోర్ గారికి, డా. విష్ణు నందన్ గారికి హృదయపూర్వకమైన అభినందన!

  రిప్లయితొలగించండి
 6. “కంది శంకరార్య” బ్లాగు కాంచు చుండ
  పండితార్య” శ్రీనేమాని” పద్యధార
  ముదము నిచ్చుచు”నేల్చూరి” మేథ తెలియు
  “విష్ణు నందను” డనువైద్య విభుని జూడ
  “మన తెలుగు చంద్ర శేఖరు” మహిమ గనుము
  “గన్నవరపు” మెరపులుండు ఘనము గాను
  “గోలి” వారి సద్యస్ఫూర్తి గ్రోలు చుండ
  అన్న” మిస్సన్న” ధీశక్తి హాస్య రక్తి
  జిగియు బిగియు జూడ దగును “జిగురు” వారి
  కనుము”గండూరి” పద్యమ్ము గంగ యనగ
  కవన వన “కమనీయము” నవవిధముల
  “సంపతకుమార” పాండిత్య సహజ రీతి
  సహజ పద్యంపు” సహదేవ” శక్తి జూడ
  “నాగరాజు” నుడువ భవ్య నవ్య కవిత
  “లక్కరాజు” వారిచ్చెడి లాస్య కవిత
  “పోచిరాజం”త కవితల ప్రోది చేయ

  నిత్యము “వసంత కోకిల” నిండు దనము
  “మూర్తి” ముత్యాల పద్యాల మురిపెమివ్వ
  “ఊక దంపుడు” కబ్బమ్ము నూదు వెండి
  రాణ కెక్కిన “రాంభట్ల” రచన చదువ
  “వామనకుమారు” ధారగ వర్ష మిడగ

  సరస సాహిత్యపు "జిలేబి" సరస నుండు
  అక్క” రాజేశ్వరి” కవిత లెక్క పెట్ట
  వీణ మీటు “లక్ష్మీదేవి” వాణి యెపుడు
  ప్రభల రామలక్ష్మి కవితా ప్రభల వెలుగ
  అరస విరస సరసమ్ము లణగద్రొక్క
  తెలుగు పద్యమెటుల చచ్చు? తెరచిచూడ
  జీవి నిర్జీవి యగుచుండు జీవ గతిని
  జీవ మున్న పద్యమునకు చావులేదు.

  రిప్లయితొలగించండి
 7. మంచి పద్యములను అందించిన మిత్రులు శ్రీ వసంత కిశోర్ గారికి మరియు డా. విష్ణునందన్ గారికి అభినందనలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 8. తమ్ముడు చి. డా. నరసింహమూర్తికి మరియు శ్రీ తోపెల్ల శర్మ గారికి కూడా మా ప్రశంసలు. మంచి పద్యములను అందించేరు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 9. శ్రీ పండితులవారి ప్రశంస పొందిన నా జీవితము ధన్యము. ప్రనామములతో మరియు మిత్రులందరికి భీష్మ ఏకాదశి శుభమ్ములను గోరుచూ
  ........... మీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ

  రిప్లయితొలగించండి
 10. తెలుగు పద్యము నమరము తేలిక యును
  అర్ధ మగునది సులువుగ నందరకును
  మూర్ఖు లందురు మృ తమని మొరటు గాను
  తెలుగు పద్యమ ! జోహార్లు దెలుపు చుంటి

  రిప్లయితొలగించండి
 11. “జీవమున్న పద్యమునకు చావు లేదు”

  అన్న మహితనినాదాన్ని మనోహర కవిత్వాత్మకంగా మలిచిన మధురకవి శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి హృదయపూర్వకమైన అభినందన !

  రిప్లయితొలగించండి
 12. ఇంతమంది కవీశ్వరులు ఉంటే తెలుగు పద్యము ఎక్కడికి పోతుంది మనదగ్గరనుంచి?

  తియ్య తియ్యని పదముల తేనె లూరు

  ప్రౌఢ పదగుంఫనమ్మున బరిఢవిల్లు

  జీవమున్న పద్యమునకు చావు లేదు

  దివిని సూర్యుడు వెలిగెడి - దినము వరకు !

  తెలుగు పద్యమ్ము నిత్యమ్ము - తిరుగు లేదు !!!

  తెలుగు పద్యమ ! జోహార్లు దెలుపు చుంటి

  గన్నవరపు వారు, విష్ణునందన్ గారు, సుబ్బారావు గారు, శర్మ గారూ, వసంత కిశోర్ గారూ ప్రణామములు.

  రిప్లయితొలగించండి
 13. శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి, పెద్దలకు,
  ప్రణామములు!

  ప్రాగ్జన్మార్జితపుణ్యము
  దిగ్జేతృత్వాపదేశదీపితకవితా
  భాగ్జయము లడర పూజా
  స్రగ్జాతము లివియె నీకు సాహిత్యనిధీ!

  జ్యోతిర్మయమగు శబ్ద
  శ్వేతారణ్యమునఁ బద్యవీణామధుసం
  గీతికలను వినుపింపుము!
  చేతములను నింపు కలశసింధువు సుధలన్.

  సుకవీ! వాఙ్మయదీపం
  బిఁక దీధితు లంతరించి హీనాంధతమం
  బెకదొట్ట రసజ్ఞమనోం
  బకములు బొగులు నను దిగులు మాన్పు గరుణమై.

  చచ్చునొ! చావదో! సుకవిసంహితమంగళకావ్యగీతసం
  పచ్చయ, మాంధ్రభావుకశుభావహపద్యకవిత్వరీతి యన్
  మచ్చర మేల? మేలయిన మచ్చుగ నచ్చును; చచ్చు పద్యముల్
  చచ్చును; నిల్చి పొల్చు నఖిలంబుగ నుద్యతహృద్యపద్యముల్.

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 14. పుంభావ సరస్వతీ పుత్రులు మాన్యశ్రీ ఏల్చూరి మురళీధర రావు గార్కి శతసహస్ర ప్రణామములు. సముత్తుంగతరంగిత తెనుగు కవితాగంగాప్రవాహమందున భీష్మ ఏకాదశి పర్వదినాన స్నానమాడించినారు. జోహార్లు మహామహోపాధ్యాయా!. మీవంటి పెద్దల ఆశీస్సులెల్లప్పుడు కావలెనని ఆశించుచున్నాను. తెనుగు పద్యము పై నాభావనను మెచ్చి "మధురకవి" యనుట నాజీవితమున మరపురాని రోజు.

  రిప్లయితొలగించండి
 15. ఆహా.. ఏమి నా భాగ్యం! ఈనాటి పద్యరచనా శీర్షిక శంకరయ్య బ్లాగుకు ఆభరణమై నామసార్థక్యాన్ని పొందింది. "తెలుగు పద్యం చచ్చింది" అనే వారికి సమాధానంగా తిరుపతి ప్రపంచ తెలుగు మహాసభల్లో ఒక కవి (పేరు చెప్పారు కాని మరిచిపోయాను) ఒక పద్యం చెప్పారట. దానిని మొన్నటి వరంగల్ అవధానంలో శతావధాని కోట నేంకట లక్ష్మీనరసింహం గారు వినిపించారు. అద్భుతంగా ఉంది. వెంటనే వ్రాసుకొనడానికి వీలు కాలేదు. ఆ పద్యాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాను. ఈనాటి శీర్షికకు అదే స్ఫూర్తి.
  కవిమిత్రులు మాతృభాషపై, పద్యకవిత్వంపై ఆవేశంతో, ఉత్సాహంతో, అభిమానంతో మనోహరమైన పద్యాలు చెప్పారు.
  పండిత నేమాని వారికి,
  వసంత కిశోర్ గారికి,
  గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
  డా. విష్ణునందన్ గారికి,
  తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
  సుబ్బారావు గారికి,
  ఏల్చూరి మురళీధర రావు గారికి,
  లక్కరాజు వారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 16. తెలుగు పద్యము మన్మనంబను దేవళంబున దీపమున్
  తెలుగు పద్యము నాదు కైతకు దివ్య సుందర రూపమున్
  తెలుగు పద్యము నాదు భాగ్యము దేవ పాదప వర్యమున్
  తెలుగు పద్యము పావనంబగు తీర్థరాజము సోదరా!

  రిప్లయితొలగించండి
 17. ఏల్చూరి మురళీధరరావు గారూ
  మీలాంటి వారుంటే పద్యాలు ఎక్కడికి పోయి దాక్కుండి పోతాయి? మీరు చెప్పినట్లే

  సుకవిసంహితమంగళకావ్యగీత ములు అల్లుకుపోతూ ఉంటే
  నిల్చి పొల్చు నఖిలంబుగ నుద్యతహృద్యపద్యముల్

  Pandita Nemani వారు అన్నట్లు
  తెలుంగు పద్యపు
  పచ్చదనము రాను రాను వర్ధిల్లు ధరన్

  రిప్లయితొలగించండి
 18. తోపెల్ల వారూ ! ధన్యవాదములు.

  ఎల్లరు కవిమిత్రుల తో
  పెల్ల కులాన్వయులె కలిపి పెద్దగ పద్యం
  బెల్లను నింపిరి చక్కగ
  నుల్లము పొంగెను చదువగ నో కవి వర్యా !

  రిప్లయితొలగించండి
 19. పద్యము చచ్చినదని యెవరన్నారు.ఇక్కడ మాటలే పద్యాలౌతుంటే...

  మాటల పద్యము వ్రాయగ
  నాటల యని యనెడువారి యాటలు కట్టెన్
  మాటలె పద్యము లాయెను
  దీటుగ శంకరుని బ్లాగిదే గను మయ్యా !

  రిప్లయితొలగించండి
 20. తోపెల్ల వారూ ! ధన్యవాదములు

  “జీవించి లేదు పద్యము"
  ఈ వాక్యము లన్న దెవరు !? యెందుకు కల్లల్ ?
  జీవింపకున్న పద్యము
  నీ విధముగ వ్రాతు రేల !? యిప్పటి సుకవుల్

  రిప్లయితొలగించండి
 21. తోపెల్ల వారికి ధన్యవాదములు.

  నవకవనమ్ముల మెరయుచు
  నవకలములు వ్రాయుచుండ నాశము కల్లే!
  నవగళములఁ నర్తించగ
  జవసత్వమ్ముల తెలుంగు జగతిన చెల్లున్!

  రిప్లయితొలగించండి
 22. సీ|| నన్నపార్యునిచేతి నాణ్యంపు శిల్పమై
  ప్రభవించినది తెల్గు భారతమున
  వాగ్గేయకారుడై పదకవితలనల్లి
  అమరుడైనాడు నాడన్నమయ్య
  ఉభయభాషాప్రౌఢి నుప్పొంగురాయలు
  తెలుగు వల్లభునిగ తెలుపుకొనియె
  సంఘసంస్కరణకై సాహిత్యమందించి
  తెలుగులో గురజాడ తేజరిల్లె
  గీ|| ఎందరెందరొ మాన్యులు యేర్చికూర్చి
  తీర్చిదిద్దినమేలైన తెలుగు భాష
  చదువ సంగీతమగును నజంత భాష
  తేనె లొలికెడి కమ్మని తెలుగు భాష!

  ఉ|| వేమన పద్యపంక్తులకు ప్రేరణనొందిన సీ.పి.బ్రౌను, యా
  సీమను నున్నపండితుల చెంతనుచేరి తెలుంగునేర్చి, భా
  షామణిహారమా! యనగజాలు నిఘంటువు కూర్చి యిచ్చి నా
  డా మహితాత్ము స్వీయమహదాశయ మిమ్మహి వ్యాప్తిచెందగన్

  రిప్లయితొలగించండి
 23. సీ|| నన్నపార్యునిచేతి నాణ్యంపు శిల్పమై
  ప్రభవించినది తెల్గు భారతమున
  వాగ్గేయకారుడై పదకవితలనల్లి
  అమరుడైనాడు నాడన్నమయ్య
  ఉభయభాషాప్రౌఢి నుప్పొంగురాయలు
  తెలుగు వల్లభునిగ తెలుపుకొనియె
  సంఘసంస్కరణకై సాహిత్యమందించి
  తెలుగులో గురజాడ తేజరిల్లె
  గీ|| ఎందరెందరొ మాన్యులు యేర్చికూర్చి
  తీర్చిదిద్దినమేలైన తెలుగు భాష
  చదువ సంగీతమగును నజంత భాష
  తేనె లొలికెడి కమ్మని తెలుగు భాష!

  ఉ|| వేమన పద్యపంక్తులకు ప్రేరణనొందిన సీ.పి.బ్రౌను, యా
  సీమను నున్నపండితుల చెంతనుచేరి తెలుంగునేర్చి, భా
  షామణిహారమా! యనగజాలు నిఘంటువు కూర్చి యిచ్చి నా
  డా మహితాత్ము స్వీయమహదాశయ మిమ్మహి వ్యాప్తిచెందగన్

  రిప్లయితొలగించండి
 24. అమ్మా! పింగళి మోహినిగారూ! అద్భుతంగా ఉన్నది మీపద్యము. అభినందనలు.

  శ్రీ పండితనేమాని వారి పద్యస్ఫూర్తితో వార్ని అనుకరించుచూ నా చిన్న ప్రయత్నము.

  ధృవకోకిలావృత్తము.

  తెలుగు పద్యము పాయసాన్నపు తీపినిచ్చును గ్రోలగన్
  తెలుగు పద్యము నాట్యమాడును తేనెలొల్కుచు నాల్కపై
  తెలుగు పద్యము హృద్యమై యుతేజమై నలుదిక్కులన్
  తెలుగు పద్యము సుస్థిరంబగు తియ్యమామిడి చూడగన్.

  రిప్లయితొలగించండి
 25. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  నాగరాజు రవీందర్ గారూ,
  సహదేవుడు గారూ,
  తోపెల్ల వారూ,
  చక్కని పద్యాలు వ్రాసారు. అభినందనలు.
  *
  పింగళి మోహని గారూ,
  శంకరాభరణం బ్లాగు మీకు సంతోషంతో స్వాగతం పలుకుతున్నది.
  ధారాశుద్ధితో మనోహరమైన పద్యాలను వ్రాసారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 26. పద్యమే కద భాషకు పట్టుగొమ్మ
  చచ్చెనన్నను వానిని తానె చంపు
  వచ్చి చూడుడు శంకర వనములోకి
  తెలుగుపద్యము పొందిన తేజమెంతొ.!

  పద్యము చచ్చిన దన్నను
  విద్యకు విలువెక్కడుండు వినువీథులలో
  పద్యము పరుగెడుచున్నది
  హృద్యముగా తెలిసికొనుడు హృదయములోనన్.

  రిప్లయితొలగించండి
 27. వచ్చి చూడుడు శంకర వనములోకి
  తెలుగుపద్యము పొందిన తేజమెంతొ.!
  ----------------------
  రామలక్ష్మి గారూ పద్యం బాగుంది.

  రిప్లయితొలగించండి
 28. శంకర సాహితీవన వాహ్యాళులందరికి అభినందనలు.
  ఈ వనము యొక్క తెలుగు పరిమళపు గుబాళింపు ఇక ఏ నందనమందును ఉండదేమో?
  అద్భుతమైన పూరణలు, సౌహార్ద్రపూరితమైన సన్మానాలు.
  ఈ ఉద్యానంలో విహరించడం సుకృతమే !

  రిప్లయితొలగించండి
 29. గురువుగారు,
  బహుశ మీరు చెబుతున్న తిరుపతి ప్రపంచ తెలుగు మహాసభల్లో చెప్పిన పద్యము క్రింద ఇవ్వబడిన కడిమెళ్ల వారి పద్యము అనుకుంట.

  పద్యమ్ము నెవడురా పాతి పెట్టదనంచు
  ******నున్మాదియై ప్రేలుచున్నవాడు
  పద్యమ్ము నెవడురా ప్రాతబడ్డదియంచు
  *****వెఱ్ఱివాడై విర్ర వీగువాఁడు
  పద్యమ్ము ఫలమురా పాతిపెట్టిన పెద్ద
  ****** వృక్షమై పండ్ల వేవేలనొసగు
  పద్యమ్ము నెప్పుడో పాతిపెట్టితిమేము
  ******లోకుల హృదయాల లోతులందు

  ఇప్పుడద్దాని పెకలింప నెవని తరము
  వెలికి తీసి పాతుట యెంత వెఱ్ఱితనము
  నిన్నటికి ముందు మొన్ననే కన్ను తెఱచు
  బాల్య చాపల్యమునకెంత వదరు తనము!!

  రిప్లయితొలగించండి
 30. తెలుగుతల్లి పదముల మీద
  పద్య పద్మములను సమర్పించిన
  కవి మిత్రులందరికీ హృదయ పూర్వక
  అభినందనలు మరియు ధన్యవాదములు !

  మన తెలుగు చిరంజీవి !
  మన తెలుగు పద్యమూ చిరంజీవే !

  రిప్లయితొలగించండి
 31. జిలుగు వెలుగుల వర్షంపు తెలుగు పంట
  సాహితీ స్రష్ట కలమందు సాగు బడిన
  అమర మైనది కమనీయ మాతృ భాష
  వాణి పలికిన వాక్కులు వమ్ము గావు 1

  రిప్లయితొలగించండి
 32. మిత్రులందరికి అభినందనలు. తెలుగు తల్లి గురించి మంచి మంచి పద్యములు జాలువారినవి. ఇదొక ప్రయత్నము చూడండి:

  అమ్మా! కమ్మని తెన్గు బాషయె యనాద్యంతమ్ము నిత్యమ్ము స
  త్యమ్మంచున్ భువనాంతరాళముల నుద్భాసించు నీ దివ్య త
  త్వమ్మున్ గూర్చి ప్రశంస జేయుదు మమున్ బాలింపుమా నీ పదా
  బ్జమ్ముల్ పూని నమస్కరించెదను సేవాయత్త చిత్తుండనై

  రిప్లయితొలగించండి
 33. ఈ దినము శంకరాభరణమొక ఉద్యానవనముగా వెల్లివిరిసింది.. కవికోకిలలు అద్భుతమైన పద్యాల నాలాపించారు. అన్నయ్యగారు శ్రీ పండిత నేమాని రామజోగిసన్యాసిరావు గారు, డా.విష్ణునందన్ గారు,శ్రీ ఏల్చూరి మురళీమోహన్ గారు,శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యం గారు,శ్రీ లక్కరాజు వారు, పింగళి మోహిని గారు,శ్రీ వసంత కిశోర్ గారు,శ్రీ హనుమచ్ఛాస్త్రి గారు,డా.ప్రభల రామలక్ష్మి గారు,రాజేశ్వరి అక్కయ్య గారు ,శ్రీ రవీందర్ గారు,శ్రీ సహదేవుల వారు శ్రీ సుబ్బారావు గారు,శ్రీ జిగురు సత్యనారాయణ గారు తెలుగు పద్య ఢంకా చక్కగా మ్రోగించారు. శ్రీ తోపెల్ల శర్మగారికి,శ్రీ లక్కరాజు రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనములు.

  ఒక పర్యాయము అన్నయ్య గారు నాతో ' కళలను మనము పరిరక్షించ వలసిన అవసరము లేదు, అవే కొంత మందిని ఆశ్రయించి తమ వైభవమును చాటు కొంటాయని ' చెప్పారు. అది ముమ్మాటికి నిజమే ! తెలుగు పద్యము శ్రీ విష్ణునందన్ గారు చెప్పినట్లు శతాబ్దాలుగా తన ఖ్యాతిని చాటి చెబుతున్నాది. ఎవరైనా బుట్టలో తోసేసినా మళ్ళీ పడగ విప్పి బుస్సున లేచి నాట్యము చేస్తుంది. అందఱికీ ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 34. శ్రీ గురువుల పద్యంలో "నీ పదా, బ్జమ్ముల్ పూని నమస్కరించెదను సేవాయత్తచిత్తుండనై" అన్న చోట నీవు అనుగ్రహించిన సుప్తిఙంతపదములు అను పద్మములను పూని భాషామతల్లికి నీకు నమస్కరించెదను; నీ యొక్క పాదపద్మములను ఆశ్రయించి నమస్కరించెదను అన్న అర్థద్వితయం మనోహరంగా ఉన్నది.

  మాన్యులు శ్రీ శంకరయ్య గారికి, శ్రీ లక్కరాజు వారికి, శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారికి, పెద్దలందరికి ధన్యవాదాలు!

  రిప్లయితొలగించండి
 35. హృద్యముగా తెలుగుకవులు
  పద్యమునకుపోసినారు ప్రాణము, కవితా
  విద్యల తలమానికమౌ
  పద్యపు ప్రభ తగ్గ లేదు పరికింపంగన్ !!!

  రిప్లయితొలగించండి
 36. తమ్ముడు డా. చి. నరసింహ మూర్తి గుర్తు చేసినట్లు, ఏ కళ యైనను పార్వతీ పరమేశ్వరుల స్వరూపమే. సకల కళలకు వారే ఆది గురువులు. శివానంద లహరిలో మొదటి శ్లోకము ఇదే భావమును ప్రస్ఫుటము జేయుచున్నది. ఏ కళకును అంతముండదు. అది స్వతస్సంరక్షితము, అజరామరణము. అప్పుడప్పుడు కొన్ని ఆటు పోటులకు గురైనప్పటికీ మరల నవనవోన్మేషముగా విలసిల్లుననుట నిర్వివాదాంశము. మన తెలుగు పద్య కళ కూడ ఆ కోవకు చెందినదే. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 37. చి. డా. ఏల్చూరి వారు చెప్పినట్లు నా పద్యములో "పద" శబ్దము బహుళార్థ భరితమయినది. వర్ణ, పద, వాక్య, అర్థములు సరస్వతి యొక్క స్వరూపములే. అందుచేత ఆ యమ్మ స్తుతిలో "పద" శబ్దమునకు అర్థ వైవిధ్యము సహజముగా చోటు చేసుకొనినది. శ్రీ ఏల్చూరి వారికి శుభాశీస్సులు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 38. పెద్ద మనసుతో కవితల నాదరించిన కవి పండితుల కందరికీ మనసా వచసా బహుధా కృతఙ్ఞతాభివందనములు ! చక్కని పద్యములు రచించిన కవి బృందానికి హృదయపూర్వకాభినందనలు !

  రిప్లయితొలగించండి

 39. తెలుగు పద్యరచన తన వెలుగు తగ్గి
  మసకబారెను,ప్రొత్సాహమంతలేక
  కాని ,చచ్చిపోలేదు సుకవుల కావ్య
  దీక్ష జిగురెత్తి మరలను దేజరిల్లు.

  రిప్లయితొలగించండి
 40. పద్యమే కద భాషకు పట్టుగొమ్మ
  చచ్చెనన్నను వానిని చంపు తానె
  వచ్చి చూడుడు శంకర వనములోకి
  తెలుగుపద్యము పొందిన తేజమెంతొ.!

  పద్యము చచ్చిన దన్నను
  విద్యకు విలువెక్కడుండు వినువీథులలో
  పద్యము పరుగెడుచున్నది
  హృద్యముగా తెలిసికొనుడు హృదయములోనన్.

  శంకర సాహితీవన వాహ్యాళులందరికి అభినందనలు.
  ఈ వనము యొక్క తెలుగు పరిమళపు గుబాళింపు ఇక ఏ నందనమందును ఉండదేమో?
  అద్భుతమైన పూరణలు, సౌహార్ద్రపూరితమైన సన్మానాలు.
  ఈ ఉద్యానంలో విహరించడం సుకృతమే !

  రిప్లయితొలగించండి
 41. ఏమండోయ్ కమనీయం గారు
  తెలుగు పద్యరచన తన వెలుగు తగ్గి
  మసకబారెను,ప్రొత్సాహమంతలేక

  అంటున్నారు. అలా అనిపించవచ్చు కానీ

  పింగళి మోహిని గారు చెప్పినట్లు
  నన్నపార్యునిచేతి నాణ్యంపు శిల్పమై
  ప్రభవించినది తెల్గు భారతమున

  అలా ఇప్పుడు లేకపోయినప్పటికీ అది రాజేశ్వరి గారన్నట్లు

  సాహితీ స్రష్ట కలమందు సాగు బడిన
  జిలుగు వెలుగుల వర్షంపు తెలుగు పంట

  ఆ పంటలో పండిన పద్యాలు ఏల్చూరి వారు అన్నట్లు
  మేలయిన మచ్చుగ నచ్చును; చచ్చు పద్యముల్
  చచ్చును; నిల్చి పొల్చు నఖిలంబుగ నుద్యతహృద్యపద్యముల్.

  కావాలంటే చూడండి Pandita Nemaani వారు కూడా అదే అంటున్నారు
  హెచ్చెను తెలుంగు పద్యపు
  పచ్చదనము రాను రాను వర్ధిల్లు ధరన్

  ఇంకా నమ్మకం లేకపోతే ప్రభల రామలక్ష్మి గారన్నట్లు
  వచ్చి చూడుడు శంకర వనములోకి
  తెలుగుపద్యము పొందిన తేజమెంతొ.!

  రిప్లయితొలగించండి
 42. లక్కరాజు మహోదయా! తెలుగు భాషపై ఎంతప్రేమమీకు. శంకర నందన వనములో పూచిన సుగంధ సుమముల నొక హారముగా మలచి తెనుగుసరస్వతికి చేయుచున్న సమర్పణపు తీరు మనోహరము. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 43. జిగురు సత్యనారాయణ గారూ,
  ఆహా... ధన్యోస్మి!
  నేను విన్న పద్యం ఇదే... కృతజ్ఞుడను.
  *
  డా. ప్రభల రామలక్ష్మి గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  మంద పీతాంబర్ గారూ,
  ఈమధ్య మీ దర్శనం కరువైనది. నమస్కారం.
  మంచి పద్యం వ్రాసారు. అభినందనలు.
  *
  కమనీయం గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  *
  లక్కరాజు వారూ,
  ధన్యవాదాలు.. మీ పరిశీలనా శక్తికి, తెలుగు పద్యం పట్ల మీ అభిమానానికి జోహార్లు.
  *
  గన్నవరపు నరసింహమూర్తి గారూ,
  అంతా నేను, మన బ్లాగు, తెలుగు ప్రజలు నోచుకున్న అదృష్టం...

  రిప్లయితొలగించండి
 44. ఆహా! ఎంతటి సుదినమండీ! ఎంతటి మధురమైన తెలుగు పద్యాలండీ! పద్యానికి మరణం యెక్కడున్దండీ?

  రిప్లయితొలగించండి