22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

పద్య రచన – 260 (ఉగ్రవాదము - హింస)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"ఉగ్రవాదము - హింస"

22 కామెంట్‌లు:

 1. మాటున దాగుచు పాపము
  బాటన బోయేటి వారి ప్రాణము దీసే
  చేటును గూ' ర్చెడు ' వారిని
  వేటును మన ప్రభుత పట్టి వేయగ వలెగా !

  రిప్లయితొలగించండి
 2. కఠిన చిత్తమేల గల్లోలమది యేల
  మమత లెఱుగ లేని మతము లేల ?
  భూతహింస మాని పూజింప రాదుటే
  దైవ మొకటి గాదె తఱచి చూడ ?

  రిప్లయితొలగించండి
 3. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  నిన్నటి దిల్‌షుక్‌నగర్ దుర్ఘటన హృదయ విదారకం !
  ఎందరో అమాయకులను పొట్టన బెట్టుకుంటున్న ఉగ్రవాదుల కురే సరైనది :

  01)
  _______________________________

  పాలు తేబోయిన - బాలుడు కనుమూసె !
  పళ్ళు పూలు కొనెడి - పడతి మడిసె !

  పల్లె వెళ్ళుటకును - బళ్ళ మీదనె బోవు
  పల్లెటూరి జనుల - బ్రతుకు ముగిసె !

  పాఠశాల విడువ - పరుగెత్తుకొని వెళ్ళు
  పసి బాలురెందరో - యుసురు విడచె !

  పక్షవాతము తోడ - వైద్యాలయము బోవు
  వృద్ధ రోగి యకట - విగతుడయ్యె !

  పనుల మీద తిరుగు - పనిలేక తిరిగెడి
  ప్రజలెందరోయట - బ్రతుకు విడిరి !

  పగజేత పలుచోట్ల - ప్రతిఘులు పెట్టిన
  బాక్సుల బాంబులు - బ్రళ్ళు మనుట !

  వ్యగ్రతను వారు జేసిన - వ్యర్థ వృత్తి
  నిగ్రహము లేని , దుర్మార్గ , - నీతిబాహ్య
  నిర్దయాపర , నిష్పల, - నీచ వృత్తి !
  ఉగ్రవాదుల కురి మేలు - యుర్వి మేలు !
  _______________________________

  రిప్లయితొలగించండి
 4. ఉగ్ర వాదులు బ్రభుతపై నాగ్ర హించి
  హింస గావించు చుండిరి హేడు లగుచు
  దారు ణం బది బరికింప యుగ్ర వాదు
  లార ! జేయుడు సత్కర్మ లలిత ముగను .

  రిప్లయితొలగించండి
 5. దేశమీ రీతి భీతిల్లగా దుష్టతన్
  నాశమున్ జేసిరే! నాయకమ్మన్యులా
  వేశమున్ జూపరే!వీరులై సేన కా
  దేశముల్ పంపుచో దిప్పికొట్టంగరో!

  రిప్లయితొలగించండి
 6. అందరి పద్యములు బాగుగ నున్నవి. అభినందనలు. వసంత కిశోర్ గారి సీసము వివరముగా నున్నది. లక్ష్మీ దేవి గారు విశేష ఛ్ఛందస్సు (స్రగ్విణి)ని బాగుగ వ్రాసేరు. సంతోషము.

  రిప్లయితొలగించండి
 7. నరసింహాకృతి దాల్చెదో దనుజులన్ దండించుచున్ సాధులన్
  బరిరక్షించుచు ధర్మమున్ నిలుపగా భద్రాత్మకా! రాగదే
  ధరపై ఛాందస దుష్ట శక్తుల మహోన్మాదమ్ము బోద్రోలుమా
  పరమాత్మా! సరిదిద్దు మీ స్థితిని దేవా! సాధుసంరక్షకా!

  రిప్లయితొలగించండి
 8. చిత్రమ్మే యిది యుగ్రవాదమను పేచీకోరు పంతంబుతో
  మిత్రత్వమ్మును శాంత్యహింసలను తామే బుగ్గి పాల్జేసి ది
  ఙ్మాత్రంబైనను జంకు లేక యిదె ధర్మంబంచు మూఢాత్ములై
  సూత్రాల్ వల్కెడి నీచ మానవులు దుష్టుల్ నాశమొందన్వలెన్ !

  కోరి యమాయక ప్రజల కొంపల గోడుల గూల్చి పేల్చి హిం
  సా రణ నీతి దాల్చి మనసా వచసా గరళమ్ము జిమ్మి హుం
  కారము సేయు త్రాచుల వికార పిశాచుల బట్టి శీఘ్రమే
  కోరల బీకి వేయవలె ; గూర్మిని బెంచవలెన్ ధరిత్రిలో !

  బుద్ధదేవుడు సదా బోధించె బ్రేమతో
  శాంతి గరుణ నహింసా ప్రవృత్తి ;
  నొక చెంప గొట్టుచో నొక చెంప జూపగా
  దగునని క్రీస్తు సత్యమ్ము నుడివె ;
  సత్యాగ్రహమ్ముతో సాధింపవచ్చు గో
  ర్కెలనని బాపూజి ప్రీతి బల్కె ;
  చీదరించుట కన్న నాదరించుట మిన్న
  యమ్మ తేరీసా హితమ్ము జెప్పె ;

  పరమ హంస పుట్టిన నేల పరమ హింస
  కెటుల జేతులల్లాడె నోయీ నిహీన !
  మానవుడె మాధవుండను మాట దలచి
  కూర్మి జరియించుమికనైన ధార్మికముగ !

  మంచి బెంచిన మంచిని బంచిపెట్టు
  జెడును బోషించుచో నీకె చెడుపు జేయు ;
  మానవత్వమ్ము మించిన మతము లేదు
  మమత యేనాటికైనను మాసిపోదు !!!

  రిప్లయితొలగించండి
 9. పండితులవారికి ధన్యవాదములు.

  కొద్దిగా సవరించి

  దేశమీ రీతి భీతిల్లగా దుష్టతన్
  నాశమున్ జేసిరే! నాయకమ్మన్యులా
  వేశమున్ జూపరే!వీరులై సేన కా
  దేశముల్ పంపుచో దేశమిట్లుండునే?

  రిప్లయితొలగించండి
 10. ఉగ్ర వాద మనుచు నాగ్రహమ్మును జెంది
  దారి పోవు వాని దాడి జేసి
  సతిని పతిని జంపి సంతానమును జంపి
  రాక్ష సాధ ముండు రాటు దేలె !

  రిప్లయితొలగించండి
 11. మాటలు రావు వ్రాయుటకు ,మారణహోమము దల్చుకొన్నచో,
  చేటుగమారె నీ విషపు జీడ వదల్చగ దీవ్రచర్యలన్,
  బాటుపడంగ బద్ధమయి భారతజాతి ప్రతిజ్ఞ బూనుచున్
  ఘాటుగ బుద్ధి జెప్పవలె ఘాతుకవైరి సమూహ మంతకున్.

  రిప్లయితొలగించండి
 12. మాటలు రావు వ్రాయుటకు ,మారణహోమము దల్చుకొన్నచో,
  చేటుగమారె నీ విషపు జీడ వదల్చగ దీవ్రచర్యలన్,
  బాటుపడంగ బద్ధమయి భారతజాతి ప్రతిజ్ఞ బూనుచున్
  ఘాటుగ బుద్ధి జెప్పవలె ఘాతుకవైరి సమూహ మంతకున్.

  రిప్లయితొలగించండి
 13. దుర్ఘటనలో అశువులుబాసిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ...

  తె.గీ: ఒక్క నికృష్ట నీచ హింసోపభోగ
  లాలసుడు పన్ని బిగియించి లాగినట్టి
  యుచ్చు, శాంతిశ్రీ విభుమెడకచ్చమైన
  భయద యమపాశమై మహాధ్వంసమిడియె.

  ఉ: నాయను దిక్కులేని మరణమ్మును పొందిన మానవాళి, న
  న్యాయపు మృత్యువాత కెరయౌనటు జేసిన మానవాధమా!
  ఆయువుపోయు శక్తి కసహాయుడవైన భవత్కరమ్ముచే
  నాయువు తీయుహక్కు లెటు లబ్బును నీయది పాపకృత్యమౌ.

  ఉ: జానెడు పొట్టకోసమయి సాటిజనాళిని మట్టువెట్టు, ఓ
  మానవ మాంసభక్షకుడ! మైల దొరంగెను నీదు జన్మ, నీ
  మ్లానిత హీన కృత్యమున మ్రగ్గినదీవ, త్వదీయ చేతనో
  ద్యానము కారుచిచ్చునకు నాహుతి యాయెను, దగ్ధజీవికా!

  తె.గీ: బాంబు విస్ఫోటనములోన ప్రాణములను
  బాసి దివికేగినట్టి నా భరత మాత
  ముద్దు బిడ్డల యాత్మలు ముక్తినొంద
  కవిత నంకితమ్మిడి, జేతు ఘన నివాళి.


  క్రితంసారి గోకుల్ చాట్, లుంబినీపార్కు జంటపేలుళ్ళ విషాదంలో వచ్చిన కవిత
  పూర్తిపాఠం ఈ క్రింది లింకులో చదవచ్చు.
  http://pingali.blogspot.in/2008/11/blog-post.html

  రిప్లయితొలగించండి
 14. ఉగ్రవాదమనుచు దనుజులుండగ దండింప ప్రభుత
  ఉగ్రరూపము దాల్చదేల? ఊరపందుల దునుమాడ
  అగ్రరాజ్యపు (నీ)రీతి గనుమ! అసహాయులన్ రక్షజేయ
  ఉగ్ర నృసింహ సిపాయి లొక్కపెట్టున మట్టుబెట్ట.

  రిప్లయితొలగించండి
 15. ఉగ్రవాద దుశ్చర్యను నిరసిస్తూ కరుణరసాత్మకంగా పద్యాలు చెప్పిన కవిమిత్రులు...
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  గన్నవరపు నరసింహమూర్తి గారికి,
  వసంత కిశోర్ గారికి,
  సుబ్బారావు గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  పండిత నేమాని వారికి,
  డా. విష్ణునందన్ గారికి,
  రాజేశ్వరి అక్కయ్య గారికి,
  కమనీయం గారికి,
  పింగళి వెంకట శ్రీనివాస రావు ( శ్రీ కాశ్యప ) గారికి,
  తోపెళ్ళ బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 16. గోలి వారూ,
  'పోయేటి' అని వ్యావహారికం వాడారు. "బాటనఁ బడి పోవువారి" అందాం.
  *
  పింగళి వెంకట శ్రీనివాస రావు (శ్రీ కాశ్యప) గారూ,
  శంకరాభరణం బ్లాగు మీకు సంతోషంగా స్వాగతం పలుకుతున్నది.
  చక్కని ధారతో, శబ్దవైభవంతో మీ పద్యాలు శోభిల్లుతున్నాయి. అభినందనలు.
  మొదటిపద్యం మొదటి పాదంలో టైపాటు వల్ల "ఒక"... 'ఒక్క' అయి గణభంగం అవుతున్నది.
  *
  తోపెళ్ళ వారూ,
  ఉగ్రవాద మనుచు... మట్టుబెట్ట... దీని ఛందస్సు అర్థం కాలేదు.

  రిప్లయితొలగించండి
 17. చాటుగ చేసిన పనులకు
  చేటెక్కువ అన్నమాట చెవినిడలేదా?
  కోటు(COAT)ల కోటులు నిండిన
  దాటుట శక్యంబుగాదు ధరలో శిక్షల్.

  ఉసురు తీసితిమని ఉత్సాహపడకండి
  తగులు వారి ఉసురు తరతరాలు
  మతముపేరు చెప్పి మతిలేని చేష్టలన్
  చేసితేమి కలుగు చేటు తప్ప.  రిప్లయితొలగించండి
 18. గురువులకు నమస్సులు. శ్రీపండితులవారి ఉత్సాహాన్ని లక్ష్మీదేవి గారి స్రగ్విణి చూచి మధ్యన అక్కరకు వచ్చునని మధ్యాక్కరలో ప్రథమప్రయత్నముగ వ్రాసితిని. గుణదోష విభజన శీ గురువులది.
  .... మీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ.

  రిప్లయితొలగించండి
 19. ఉసురు తీసితిమని ఉత్సాహపడకండి
  తగులు వారి ఉసురు తరతరాలు
  మతముపేరు చెప్పి మతిలేని చేష్టలన్
  చేసితేమి కలుగు చేటు తప్ప.
  ------------------------
  ప్రభల రామలక్ష్మి గారు --- వావ్

  అందుకే గన్నవరపు నరసింహమూర్తి గారు అన్నారు
  కఠిన చిత్తమేల గల్లోలమది యేల
  మమత లెఱుగ లేని మతము లేల ?

  రిప్లయితొలగించండి
 20. అందరి పద్యములు బాగుగ నున్నవి. అందరికీ శుభాభినందనలు.

  శ్రీ పింగళి వేంకట శ్రీనివాస రావు గారి పద్యపాదము: "ఒక్క నికృష్ట నీచ హింసోపభోగ" లో శ్రీ శంకరయ్య గారు కూడా సరియైన పరిష్కారము చెప్పలేదు. నికృష్ట అనే పదములో "ని" గురువు కాదు - లఘువే అవుతుంది. కృ అనే అక్షరము సంయుక్తాక్షరము కాదు - ఋ అచ్చే కాని హల్లు కాదు కదా - అందుచేత కృ ముందున్న "ని" గురువు కాలేదు. కొంచెము చూచి సరిజేయండి.

  శ్రీ తోపెల్ల శర్మ గారు మధ్యాక్కర చక్కగా వ్రాసేరు.

  డా. విష్ణునందన్ గారి పద్యాలు శ్రీ పింగళి వారి పద్యాలు చక్కని ఖండికలుగా భాసించుచున్నవి.

  రిప్లయితొలగించండి
 21. మానవులమైన మనకున్
  బ్రాణంబులఁదీయఁజూడ భావ్యంబగునే?
  దానవ గుణంబు వీడుచుఁ
  బ్రాణంబులునిల్ప జూడఁభగవంతులమే!

  రిప్లయితొలగించండి