18, ఫిబ్రవరి 2013, సోమవారం

పండిత నేమాని వారికి జన్మదిన శుభాకాంక్షలు పూజ్యశ్రీ పండిత నేమాని రామ జోగి సన్యాసిరావు గురుదేవులకు
జన్మదిన ముహుర్ముహురావృత్త్యాకాంక్షా పురస్సరముగా సమర్పించు
సర్వానంద సర్వాభ్యుదయ సర్వశుభాకాంక్షలు

శ్లో.    శ్రీ నేమాని శుభాన్వవాయకలశీసింధో స్సుధాదీధితేః 
        నానాకావ్యవిచక్షణస్య సుమన స్త్రైలిఙ్గభాషాకవేః 
స్వీయోత్కృష్టకృతిప్రభూతయశసః శ్రీపాదయోః సన్నిధౌ
నన్దోక్తిర్మమ పణ్డితాఙ్కవిదుషో భూయాత్సదేయం ముదే.

గీ.     ఆంధ్రపద్యవిద్య కవధానభారతి
కంకితమ్మొసంగి యఖిలశక్తి
గ్రంథరచన సేయు కవిరాజచంద్రుని
 జన్మదినము నాఁడు సన్నుతింతు.

 గీ.     శంకరుఁడు శంకరార్యుల శంకరాభ
రణముఖమ్మున వేద్యమార్గమ్ము మాకుఁ  
జూపు నభిరూపు శుభరూపుఁ జూచి ప్రోచుఁ   
జిరముఁ బండిత నేమాని గురువరేణ్య!

గీ.     అమృతవాహిని మీ కవిత్వము; నితాంత
భక్తిపూర్ణము; లోకపావనము మనము;
మీ దయాంభోధి నోలాడి నాదు జన్మ
ధన్యతను గాంచె, చరితార్థతముఁడ నైతి.

సీ.     ముగ్ధమన్మథకాంతి మోహినీతనుకాంతి
మోహినీతనుకాంతి మోహనముగఁ
బద్మకేసరజటా పద్మరాగచ్ఛాయ
పద్మరాగచ్ఛాయఁ బాయఁజేయ
నీలాళి నీలాబ్జ నీలకంధరశోభ
నీలకంధరశోభఁ దూలఁ బోలఁ
గాళిమ గజచర్మ కల్పితాంబరదీప్తి
కల్పితాంబరదీప్తిఁ గడకుఁ జిమ్మ
గీ.      విశ్వవిభుఁ డోము మిమ్ముఁ గవిత్వ తత్త్వ 
సత్త్వసుమహత్త్వనిత్యత్వసంపదలను   
గేహినీపుత్త్రపౌత్త్రాభిగీయమాన
శాంతిసుఖసర్వవృద్ధుల సంతతమ్ము.

విధేయుఁడు,
ఏల్చూరి మురళీధరరావు

17 కామెంట్‌లు:


 1. పండిత నేమాని వారికి శుభాకాంక్షలు!
  వీరి కవితా ఝురి మరిన్ని సోబగులతో
  తెలుగు బ్లాగు లోకానికే వన్నె తేవాలని ఆశిస్తూ


  జిలేబి.

  రిప్లయితొలగించండి
 2. నేమానివారికి నూతన జన్మ దిన శుభాకాంక్షలు !

  రిప్లయితొలగించండి
 3. పూజ్య గురువులు శ్రీ పండితుల వారికి [ ఆది దంపతులకు ] జన్మ దిన శుభా కాంక్షలు

  రిప్లయితొలగించండి
 4. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మసోమవారం, ఫిబ్రవరి 18, 2013 8:03:00 AM

  బ్రహ్మశ్రీ పండిత నేమాని గురువులకి జన్మదిన శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 5. శ్రీ నేమానివారికి జన్మ దిన శుభాకాంక్షలు !

  నతులందుకొనుమ శ్రీపం
  డిత వర్యా ! భావి దేవుడీ విధి నిడుగా
  శతవత్సరములు పైగా
  హితకరముగ సాగవలయు హేరంబు కృపన్

  రిప్లయితొలగించండి
 6. అన్నయ్యగారు శ్రీ పండిత నేమాని రామజోగిసన్యాసి రావు గారికి ప్రణామములు. జన్మదిన శుభాకాంక్షలు !

  నలువ రాణి మీదు నాల్కపై నాడంగ
  జెలువమూరు గవిత జెప్పి యిచట
  శంక లెన్నొ దీర్చి శంకరాభరణంబు
  ఖ్యాతి బెంచి రయ్య గీర్తి బడసి

  దినము దినము మీరు దివ్య సంప్రాప్తమౌ
  స్తుతుల జేత దేవ గతులె మార్చ
  నెలవు జేసి రిచట నిటలాక్ష శ్రీధవుల్
  శిష్యతతియు మ్రొక్క శివము లమరె

  అన్న యన్న యనుచు ననుగు సోదరునకు
  వినతు లిడగ నేను విమల మతియు
  ఆదరమ్ము దోడ నాశీస్సులిడు నెప్డు
  ముదము ముదురు గొనగ హృదిని నాకు

  జన్మదినము నిఖిల జగదీశ్వరుడు గూర్మి
  శుభము లొసగి మీకు సుఖము గూర్చు
  హరియు నిడును గరుణ నాయురారోగ్యముల్
  కృతులు గూడు వాణి కృపయు నెగయ !
  రిప్లయితొలగించండి
 7. గురువు సముడవు ,నేమాని గురు వరేణ్య !
  సకల శుభములు గలిగించు శంకరుండు
  ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
  కంటికిని ఱె ప్ప యట్లయి కాచు గాత !

  రిప్లయితొలగించండి
 8. జన్మ దిన శుభాకాంక్షలు దెలిపిన మిత్రులందరికీ శుభాశీస్సులు.

  నేడొక పండువంచు కమనీయ మనస్కులు మిత్రులెందరో
  వేడుక గల్గజేసిరివె ప్రేముడి గూర్చు వచస్సుమాళితో
  వేడుదు తల్లి భారతిని విద్యల సారము పెంపు జేయుచున్
  తోడయి ప్రోవుమా యనుచు స్తోత్రము జేయుచు సాదరమ్మునన్

  శ్రీ కంది శంకరయ్య గారికి
  డా. ఏల్చూరి మురళీధర రావు గారికి
  శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి
  శ్రీ పోచిరాజు సుబ్బా రావు గారికి
  శ్రీ తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి
  శ్రీమతి జిలేబి గారికి
  శ్రీ వసంత కిశోర్ గారికి
  శ్రీమతి నేదునూరి రాజేశ్వరి గారికి
  శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారికి
  శ్రీమతి లక్ష్మీ దేవి గారికి
  తమ్ముడు డా. చి. నరసింహమూర్తికి
  శ్రీ మిస్సన్న గారికి

  మరియు, మరియు, మరియు .. .. అందరికీ

  రిప్లయితొలగించండి
 9. పూజ్య గురువులు శ్రీ నేమాని పండితవర్యులకు జన్మ దిన శుభా కాంక్షలు.
  -----
  గురువు గారికి,శ్రీ నేమాని పండితవర్యులకు నా చిన్ని పద్య హారము
  ========*=====
  శ్రీ సద్గురు శంకరులకు,
  మా సద్గురు రామజోగి మహనీయులకున్
  వాసిగ వరములనీయవె
  భాసురముగ జనని,వారి వంశీయులకున్  రిప్లయితొలగించండి
 10. బ్రహ్మశ్రీ నేమాని పండితార్యులకు జన్మదిన శుభాకాంక్షలు.

  డెబ్బది పడిలో బాలుడ!
  కబ్బమ్ముల సృష్టికర్త! కవితావనిలో
  బెబ్బులి! నేమాని సుకవి!
  నిబ్బరుడవు పండితార్య! నీకివె జోతల్.

  రిప్లయితొలగించండి
 11. గురుదేవులు పండిత నేమాని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన
  ఏల్చూరి మురళీధర రావు గారికి,
  వసంత కిశోర్ గారికి,
  రాజేశ్వరి అక్కయ్య గారికి,
  తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
  సుబ్బారావు గారికి,
  వరప్రసాద్ గారికి,
  మిస్సన్న గారికి,
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 12. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మమంగళవారం, ఫిబ్రవరి 19, 2013 1:00:00 AM

  శ్రీకర పదముల్ వశీకరమగుచును
  ...... హృద్యపద్యమందమరియుండు
  రుచిరార్థ శబ్దంపు రోచిష్ణువై తెన్ గు
  ...... నధ్యాత్మ రామాయణంబు వ్రాసె
  పండితిడనగ నా పరమాత్మ పరతత్త్వ
  ...... మర్మ మెరుంగుచు మసలువారు
  ఆభరణము శంకరాభరణపు బ్లాగు
  ...... నందు పదామృత విందు చేయ

  "మురళి" రవళించె గురుభావమున్న వారు
  "గన్నవర" వర తమ్ముడు గారవింప
  గైకొనుడు జన్మదినశుభాకాంక్షలిపుడు (లె)
  వందనమ్మిదె "నేమాని పండితార్య!"

  మీ ఏకలవ్య శిష్యుడు

  రిప్లయితొలగించండి
 13. నలువ రాణి మీదు నాల్కపై నాడంగ
  జెలువమూరు గవిత జెప్పి యిచట
  శంక లెన్నొ దీర్చి శంకరాభరణంబు
  ఖ్యాతి బెంచి రయ్య ఘనత బడసి

  ( యతి సరిపోలేదు,సవరణ చేసాను )

  రిప్లయితొలగించండి
 14. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ, నమస్సులు, ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి