24, ఫిబ్రవరి 2013, ఆదివారం

సమస్యాపూరణం – 976 (కలఁడు కలం డనెడుమాట)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కలఁడు కలం డనెడుమాట కల్లయె సుమ్మీ.

26 కామెంట్‌లు:

 1. నలువయె వ్రాయును వ్రాతలు
  తలపైనను నెవరికైన ధర బడునపుడే
  ఇలనది దాటగ నెవ్వడొ
  కలఁడు కలం డనెడుమాట కల్లయె సుమ్మీ.

  రిప్లయితొలగించండి
 2. ఇలలో లోపమ్మనునది
  కలవారే యెల్లరు, వెదుకంగా నే లో
  టులు లేనివాడు పృథివిని
  కలఁడు కలం డనెడుమాట కల్లయె సుమ్మీ.

  రిప్లయితొలగించండి
 3. ఇదొక క్రొత్త ప్రయోగము. 4 పాదములలో సమాన లక్షణములతో వ్రాయబడిన క్రొత్త వృత్తము:

  ప్రహ్లాదునితో హిరణ్యకశిపుడు చెప్పిన మాటలుగా:

  కలడు ధరిత్రిని జలాన కాంతిని గాలిన్
  కలడు నభమ్మున మురారి గాదె యటంచున్
  పలికెదు కాదది నిజమ్ము బాలక! నీ యీ
  కలడు కలండనెడు మాట కల్లయె సుమ్మీ

  రిప్లయితొలగించండి
 4. పండిత నేమాని వారూ,
  మీ ప్రయోగం అద్భుతంగా ఉంది.
  ఈ క్రొత్త వృత్తానికి "మాకందము" అని పేరు పెడితే ఎలా ఉంటుంది?
  ఉద్దిష్టము ద్వారా ఇది 15వ ఛందము అతిశక్వరిలో 6896వ వృత్తం అని తెలుస్తున్నది.
  మాకందము.
  గణములు - న జ స జ య.
  యతిస్థానం - 11
  ప్రాసనియమం ఉంది.

  రిప్లయితొలగించండి
 5. ఆయ్యా! శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు.

  మీ సూచన బాగుగనే యున్నది. మాకందము అనే పేరుతో 1, 2 పాదములలో మూడేసి, 2,4 పాదములలో ఐదేసి చతుర్మాత్ర గణములతో పూర్వము వారపత్రికలలో కొన్ని పద్యములు ప్రచురింప బడినవి. అందుచేత నా యీ క్రొత్త ప్రయోగమును మధురకందము అని అందాము. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 6. కల డంటివి యా విష్ణువు
  కలడైనచొ జూపు నాకు కనకపు కొండా !
  కల గంటివేమొ రేయిని
  కలడు కలం డనెడు మాట కల్లయె సుమ్మీ !

  కనకపు కొండా =ముద్దుగా బంగారు కొండా
  అని సంబోధన

  రిప్లయితొలగించండి
 7. పండిత శ్రీ నేమాని, శంకర గురువర్యులకు నమస్సులు. మధురకందావిష్కరణ ఒక అద్భుతము. మీయాశీస్సులతో నా చిరు ప్రయత్నము. దోషములు తెలుప ప్రార్థన.
  " మధుర కందము"
  మధుర పదాల సుమమాల మాన్యులు "నేమా
  ని" ధిషణ ధీ జనిత నవ్య నిర్మితి నీవై
  ప్రథిత మగున్ "మధురకంద" ప్రాచురి నొందన్
  మధుర మతుల్ బొగడ తెల్గుమాత తరింపన్.

  రిప్లయితొలగించండి
 8. సులువుగ నాస్తికు లందురు
  “కలడు కలం డనెడు మాట కల్లయె సుమ్మీ"
  ఇలలో దేవుని నమ్ముచు
  కలవర మేమియును లేక కలరే ! భక్తుల్!

  రిప్లయితొలగించండి
 9. కలడని సుభాసు చంద్రుడు
  తలపోసిన సందియముగ తారస పడడే?
  తెలవారల పాల్పడగన్
  కలడు కలండనెడు మాట కల్లయె సుమ్మీ!

  రిప్లయితొలగించండి
 10. నూతన వృత్త విరచన
  మ్మో తోపెల్ల కవివర్య! యుత్సాహముతో
  చేతో మోదము గూర్చెడు
  రీతి నలరె, నీకు గూర్తు ప్రియమగు సూక్తుల్

  రిప్లయితొలగించండి
 11. క్రొత్త వృత్తమును సృష్టించిన అన్నయ్య గారికి, వెనువెంటనే ఆ వృత్తములో పద్య రచన చేసిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యము గారికి అభినందనాభివందనములు.

  రిప్లయితొలగించండి
 12. అలరెడి యల్లుడు మామకు
  చెలువముగా నిజము బలుకు స్త్రీ గల ధవుడున్
  వెల బెట్ట రాని నేతయు
  కలడు కలండనెడు మాట కల్లయె సుమ్మీ !

  రిప్లయితొలగించండి
 13. సిలువకు మ్రొక్కిడు శైవుడు
  కలనైనను శివుని దలచు క్రైస్తవగురుడున్
  జలజాక్షు నమ్ము యూదుడు
  కలడు కలం డనెడు మాట కల్లయె సుమ్మీ !

  రిప్లయితొలగించండి
 14. హరినామ సంకీర్తనార్తినిజేయ "ప్ర
  ...... హ్లాద!" "కలడు కలండనెడి మాట
  కల్లయె సుమ్మీ"!యగపడునె కంబాన
  ...... డింభక! యంచును డెప్పరమున
  హిరణ్య కశిపుని హరినట గాంచగ
  ...... ద్రూఘణా ఘాత మున్ దూయుముడిగ
  పెళపెళ రవళుల కళకళ లాడగ
  ...... నారసింహుండు భీకరకరాగ్ర
  ఘోర రూపమున్ వెడలుచు కోరలందు
  రక్కస భుజాంతరాళము వ్రక్కలింప
  చక్రి "కలడు కలండను" సత్యమరయ
  శుభము చేకూర్చునంతట సుజనులార!.

  రిప్లయితొలగించండి
 15. శ్రీ తోపెల్ల శర్మ గారి నరసింహావతార ఆవిర్భావ ఘట్టము ప్రశంసనీయము. అభినందనలు. మిత్రులందరికి అభినందనలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 16. పండిత శ్రీనేమాని గురువర్యులకు తదనుంగు సోదరులు మద్భాత్రు సమానులగు మాన్యశ్రీ గన్నవరపు నరసింహముర్తిగారికి సాదర ప్రణామములు. శ్రీ మండితులవారి, శ్రీ శంకరార్య గురువర్యుల, ఏల్చూరి మురళీధరరావు మహోదయుల ఆశీస్సులు ముఖ్యముగా శంకరాభరణ మిత్రబృందపు ప్రోత్సాహము వలన మాత్రమే ఈరీతిగ వ్రాయగల్గుచుంటిని. మీ ఆదరాభిమానములకు సర్వదా కృతజ్ఞుడను.

  రిప్లయితొలగించండి
 17. విలవిల లాడి కరేణువు
  జలజిహ్వపు నోట జిక్కి చక్రిని వేడెన్
  తలచెను కరి హరి గూర్చిట
  కలడు కలండనెడు మాట కల్లయె సుమ్మీ.

  రిప్లయితొలగించండి
 18. అల వైకుంఠపురంబున
  కలడనియెను పోతరాజు కమనీయముగా
  కలడందరిడెందమ్మున
  కలడుకలండనెడు మాట కల్లయెసుమ్మీ!!!

  రిప్లయితొలగించండి
 19. శిల కాదని పూజించగ
  తొలగించడు యిడుము లేవి తుది వరకైనన్ !
  కలతల బ్రతుకుల నిచ్చిన
  కలఁ డు కలండనెడి మాట కల్లయె సుమ్మీ !

  రిప్లయితొలగించండి
 20. వలదు వలదు నీవిటు రా
  యిలాగ! రా! యిల దిగిదిగి యిలకున్ రారా
  శిలయె శివుఁడు కాకుండిన
  కలఁడు కలం డనెడుమాట కల్లయె సుమ్మీ

  రిప్లయితొలగించండి
 21. 1.కలిమియు,నధికారమ్మును
  బలగర్వమ్మున నెవరిని బాటింపకయే
  తలచును ,లోకులు చెప్పెడి
  కలడు కలండనెడి మాట కల్లయె సుమ్మీ.

  2. కలుగును సందేహ మచం
  చల భక్తులకైన జిత్త చాంచల్యముచే
  బలు యిడుమల బడి నప్పుడు
  కలడు కలండనెడిమాట కల్లయె సుమ్మీ.

  మెను,నేమానివారు ,నగరజీవితమును ప్రశంసించాము కాని నిరసించలేదు
  ఈ సంగతి శంకరార్యులు తమ పరిశీలనలో గమనించినట్లు లేదు.

  రిప్లయితొలగించండి
 22. నేటి సమస్యకు చక్కని పూరణలు చెప్పిన కవిమిత్రులు....
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  పండిత నేమాని వారికి,
  సుబ్బారావు గారికి,
  తోపెళ్ళ బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
  నాగరాజు రవీందర్ గారికి,
  సహదేవుడు గారికి,
  గండూరి లక్ష్మినారాయణ గారికి,
  మంద పీతాంబర్ గారికి,
  రాజేశ్వరి అక్కయ్య గారికి,
  జిగురు సత్యనారాయణ గారికి,
  కమనీయం గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 23. ఇలలో నార్జించి పసిడి
  కలలో కన్నియల కిచ్చి కౌగిలిలోనన్
  కిలకిల నవ్వించు ఘనుడు
  కలఁడు కలం డనెడుమాట కల్లయె సుమ్మీ

  రిప్లయితొలగించండి
 24. చెలియా! రాహులు వోలుచు
  పులివలె గర్జించి కడకు పుస్సను రాజే
  వెలుపల దాపట వెదకిన
  కలఁడు కలం డనెడుమాట కల్లయె సుమ్మీ

  రిప్లయితొలగించండి