9, అక్టోబర్ 2013, బుధవారం

సమస్యాపూరణం – 1199 (కనుల వినవచ్చు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
కనుల వినవచ్చు వీనులఁ గాంచవచ్చు.
ఈ సమస్యను పంపిన గుండా సత్యనారాయణ గారికి ధన్యవాదములు.

27 కామెంట్‌లు:

 1. ధ్యాన మందు నిమగ్నమై తపము జేసి
  నిహప రమ్ములు వీడుచు నహ రహమ్ము
  యోగ మాయను బొందిన భోగ దేహి
  కనుల వినవచ్చు వీనుల గాంచ వచ్చు

  రిప్లయితొలగించండి
 2. వాణి వీణాగానము స్వప్నవాటి గంటి
  కనుల; వినవచ్చు వీనులఁ గాంచవచ్చు
  కలలయందున; జేర నా కల్పవల్లి
  చరణ సన్నిధి -మోక్షము సాధ్యమగునె?

  రిప్లయితొలగించండి
 3. చెవులు పనిజేయకున్నచో చెవిటి వాడు
  చూపులేని కబోదియు చోద్యముగను
  సాధనమ్మున విషయమ్ము సవివరముగ
  కనుల వినవచ్చు, వీనుల గాంచ వచ్చు

  రిప్లయితొలగించండి
 4. చెవులు వినపడ లేనట్టి చెవిటివాడు
  లుప్తమైనట్టి చూపుతో గ్రుడ్డివాడు
  బుద్ధి వాడుచు నెప్పుడు పూర్తిగాను
  కనుల వినవచ్చు వీనుల గాంచవచ్చు

  రిప్లయితొలగించండి
 5. కనులకు కన్నయి తనరారు గద యాత్మ
  ....చెవులకు జెవియయి చెలగు చుండు
  జ్ఞానేంద్రియములకు కర్మేంద్రియములకు
  ....నంతరంగ చతుష్టయమునకేని
  ఆధారమై సారమై యాత్మయే యొప్పు
  ....ఆత్మయే సర్వమై యలరుచుండు
  ఆత్మయే కనుచుండు నాత్మయే వినుచుండు
  ....కనులు వీనులు గోళకములె సుమ్ము
  అందుచే జూడగలిగెడి దాత్మ యొకటె
  అటులనే వినగలిగెడి దాత్మ యొకటె
  ఆత్మయే సర్వమను భావమలరు నెడల
  కనుల వినవచ్చు వీనుల గాంచవచ్చు

  రిప్లయితొలగించండి
 6. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..

  శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

  గృహప్రవేశకార్యక్రమము నందు యజమానికి విప్రులు ఈ విధముగా చెప్పుచున్నారు.
  =======*==========
  కట్టి జూపి నారు కలల సౌధమ్మును
  కనుల విందు జేయు కట్టడమ్ము,
  చెడ్డ వారి తోడ చెలిమి గల్గిన వారు,
  దొడ్డ మనుజులనెడి దుష్ట జనులు

  గనిన పాడు కనుల,వినవచ్చు వీనుల,
  గాంచ వచ్చు మీరు కష్ట కడలి
  నింటి యందు నెపుడు నింపుగాను,గనుక
  పెట్ట వలయు దిష్టి గట్టి గాను !

  రిప్లయితొలగించండి
 7. ఘనులు ననురక్తులగు భక్త జనములకును
  నేను నీవు నొక్కటి యని తానెరుంగు
  జ్ఞానసిద్ధులు యోగి పుంగవుల కెల్ల
  కనులు వినవచ్చు వీనులు గాంచ వచ్చు

  రిప్లయితొలగించండి
 8. భక్తి శ్రధ్ధల శంకరు భజనజేయు
  పరమ పురుషుండుతనదగు వరముతోడ
  కనులవినవచ్చువీనుల గాంచవచ్చు
  తారతమ్యము లెఱుగనియార్యుడతడు

  రిప్లయితొలగించండి
 9. గోచరమ్మను పదమునుఁ గోరి యొకఁడు
  "దృష్టి", "కర్ణ"ములకు వెన్కఁ బ్రీతిగ నిడఁ;
  "గనుల వినవచ్చు, వీనులఁ గాంచవచ్చు"
  ననియె నొక తుంటరియు నట హాస్యమునకు!

  (గోచరమగు=కనిపించు, వినిపించు నను నర్థములను తారుమారు చేసి హాస్యమును సాధింపనైనది)

  రిప్లయితొలగించండి
 10. మానవాతీత శక్తులు లేని మనము
  కనుల వినలేము వీనుల గాంచలేము
  దివ్య దృష్టిని గలిగిన దివిజు లెల్ల
  కనుల వినవచ్చు వీనుల గాంచవచ్చు

  రిప్లయితొలగించండి
 11. లక్ష్మీదేవి గారూ ! 'కలల యందున ' అన్నప్పుడు యడాగం వస్తుందా ? 'కల లందున ' అనుట సరి యేమో !

  ఎవ్వ డాత్మను దర్శించు నీ జగమున
  నాత డింద్రియములకు నతీతు డగుచు
  వినును కనుల తోడ, కనును వీను లొగ్గి
  కనుల వినవచ్చు వీనుల గాంచవచ్చు!

  రిప్లయితొలగించండి
 12. రాజేశ్వరి అక్కయ్యా,
  అబ్బ! ఎంత మంచి పూరణ చెప్పారు. ఈ మధ్యకాలంలో మీరు వ్రాసిన పద్యాలలో ఇది అన్ని విధాల ఉత్తమోత్తమంగా ఉంది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  మొదటి పాదం ‘వీణాగానము’ అన్నచోట గణభంగం. సవరించండి.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  అంగవైకల్యం ఉన్నవారి మిగిలిన అంగాలు చురుకుగా పనిచేస్తాయట! మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  ‘ఆత్మయే కనుచుండు నాత్మయే వినుచుండు’ అంటూ మీరు చెప్పిన పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  ‘దిష్టి’ పెట్టించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  వరప్రభావాన్ని తెలిపుతూ మీరు చేసిన పూరణ బాగుంది. అభినందనలు.
  చివరి పాదంలో యతి తప్పింది. ‘తారతమ్యము లెఱుగని ధన్యుడతడు’ అందామా?
  *
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణలోని చమత్కారం అలరించింది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘కలలందు, కలలయందు’ రెండూ సరియైన ప్రయోగాలే.
  ‘శబరి కనుల యందు స్వామి తా దన ప్రతిబింబమరసి’ అని విశ్వనాథ వారి ప్రయోగం.

  రిప్లయితొలగించండి
 13. అమ్మా! లక్ష్మీదేవి గారూ!
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. చిన్న సూచన:
  "ఎవ్వ డాత్మను దర్శించు నీ జగమున" అన్నారు కదా. ఆత్మ ద్రష్టయే కాని(చూచేవాడే కాని) దర్శింపబడేవాడు కాదు. "ఎవ్వ డాత్మానుభవ మొందునీ జగమున" అనుట మేలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 14. గురువు గారికి వందనములు. అయ్యో ! అలా వ్రాసింది నేను - లక్ష్మీదేవి గారు కాదు. మీరు సూచించినట్లు "ఎవ్వ డాత్మానుభవ మొందునీ జగమున" అనుట సబబుగా నున్నది.

  రిప్లయితొలగించండి
 15. ఏక దృష్టిని నిలిపిన ఎవ్వ రైన
  నాద జలధిని గాంచును నమ్మకముగ
  ఒక్క టయినట్టి ఓంకార మాతను
  కనుల వినవచ్చు వీనుల గాంచవచ్చు

  రిప్లయితొలగించండి
 16. పరమ పురుషుని బ్రహ్మోత్సవముల వేళ
  తిరుమలకు జేర లేనట్టి నరుల కింట
  శోభ దూరదర్శన మగు! చూడవచ్చు
  కనుల! వినవచ్చు వీనుల! గాంచవచ్చు!

  రిప్లయితొలగించండి
 17. గురువుగారూ,
  మన్నించండి.
  నాగరాజ్ గారూ,
  ధన్యవాదములు.

  వాణి చేతి వీణను స్వప్నవాటి గంటి;
  కనుల; వినవచ్చు వీనులఁ గాంచవచ్చు
  కలలయందున; జేర నా కల్పవల్లి
  చరణ సన్నిధి -మోక్షము సాధ్యమగునె?

  రిప్లయితొలగించండి
 18. శైలజ గారూ,
  ఇప్పటికీ మీ పద్యం మూడవ పాదంలో గణదోషం ఉంది.
  *
  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  సంతోషం!

  రిప్లయితొలగించండి
 19. ఏక దృష్టిని నిలిపిన ఎవ్వ రైన
  నాద జలధిని గాంచును నమ్మకముగ
  మాతృ దైవమా మోంకార మాత నపుడు
  కనుల వినవచ్చు వీనుల గాంచవచ్చు

  రిప్లయితొలగించండి
 20. శ్రీ కంది శంకరయ్య గురువర్యులకు వందనములు,విద్యుత్ అంతరాయం వలన ఆలస్యంగా పంపిస్తున్నందులకు మన్నించి,అర్థ గణదోషములున్న సవరించ ప్రార్థన !
  ముక్తి కోసము జేయగా మునులు తపము
  దైవశక్తుల వరమొంది తనియు వారు
  భక్తితో కలిగిన దైవ శక్తితోడ
  కనుల వినవచ్చు వీనుల గాంచ వచ్చు

  రిప్లయితొలగించండి