26, అక్టోబర్ 2013, శనివారం

సమస్యాపూరణం - 1216 (సంచిత పాప కర్మములు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.....
సంచిత పాప కర్మములు సౌఖ్యము లిచ్చును జన్మజన్మలన్.
ఈ సమస్యను పంపిన అందవోలు విద్యాసాగర్ గారికి ధన్యవాదాలు. 

20 కామెంట్‌లు:

  1. మంచిని బెంచ లేక మది మాయల యందున మున్ గి దేలుచున్
    వంచన జేయుచున్ జనులు పాపపు భారము బెంచు చుండగా
    సంచిత పాప కర్మములు , సౌఖ్యము లిచ్చును జన్మ జన్మ లన్
    మించిన దైవ ధ్యాన మట మేలొన రించదె ? మోక్ష మీయగన్ ?

    రిప్లయితొలగించండి
  2. అంచిత జ్ఞానవైభవ మహానలమందు నశించినంతనే
    సంచిత పాప కర్మములు; సౌఖ్యము లిచ్చును జన్మ జన్మలన్
    మంచి మనస్సుతో జరుప మంగళదాయక కృత్యముల్ శివా!
    యంచు మహేశ్వరా! యనుచు నా పరమేశు భజించుచున్ సదా

    రిప్లయితొలగించండి
  3. అమ్మా రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు.
    మీ పూరణ బాగుగ నున్నది. దైవ ధ్యానమట అనుచోట ధ్యాకి ముందున్న అక్షరము గురువు అగును అందుచేత గణ భంగమగును. "దైవ ధ్యానమట" కి బదులుగా "ధ్యాన యోగములు" అందాము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  4. ఎంచగ మోక్షమన్నదిక నేగతి వచ్చునొ నంతదాక నా
    పంచముఖంబులన్ గలిగి పార్వతి నాథుగ వెల్గు వానినే
    మంచిగ దల్చి మానవులు మానసమందున గొల్వ దొల్గుగా
    సంచిత పాప కర్మములు, సౌఖ్యము లిచ్చును జన్మ జన్మలన్

    రిప్లయితొలగించండి
  5. పూజ్యులు నేమాని వారికి నమస్కారములు. తమరి పూరణము విరుపుతో, విశిష్టముగ నున్నది. కాని, యీ పూరణమున మొదటి పాదములో "అంచిత జ్ఞాన..." యనుచోట "త" గురువగునా, లఘువగునా?యను సందేహము కలుగుచున్నది. అన్యధా భావింపక, తెలుపగలరు.

    నా పూరణము:

    అంచిత శీలసంపదల హర్షమొసంగెడువాని భార్యయౌ
    కాంచన, "యెడ్డె"మన్న, వెనుకాడక "తెడ్డె"మనంగఁ బూనుఁ; దా
    "సంచిత పుణ్యకర్మములు సౌఖ్యము లిచ్చు"ననంగ, వెంటనే
    "సంచిత పాపకర్మములు సౌఖ్యము లిచ్చును జన్మజన్మ" లన్!

    రిప్లయితొలగించండి
  6. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..

    శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...

    కందములో
    ========*============
    పెన గొను నిడుములు జేసిన
    మును సంచిత పాపకర్మములు సౌఖ్యము లి
    చ్చును జన్మజన్మలను,వం
    దనములు బలికిన హరునకు తండ్రివియనుచున్!

    ==========*============
    లంచము ముక్తి నిచ్చునని రాముని రాజ్యము నందు రక్కసుల్
    పంచన జేరి సజ్జనుల పైనిడు భారము,నెల్ల వేళలన్
    వంచన తోడ పెన్గొనును పాపము,కాలుడు లెక్క వేయురా !
    సంచిత పాపకర్మములు,సౌఖ్యము లిచ్చును జన్మజన్మలన్
    ముంచిన భక్తి సాగరపు ముత్యము నందున నీదు కర్మలన్ !
    (ముక్తి= కష్టముల నుండి కాపాడునని,రాముని రాజ్యము= భారత దేశము)

    రిప్లయితొలగించండి
  7. శ్రీ గుండు మధుసూదన్ గారు! శుభాశీస్సులు.
    మీరు బాగుగనే పట్టు కొన్నారు. నాది పొరపాటే. ఇలాగ మార్చుదాము: "అంచిత యోగ కల్పిత మహానలమందు........" స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. మంచిని పెంచునట్టి యొక మాటను జెప్పెద వ్రాయుడంచు నే
    "సంచిత పాపకర్మములసౌఖ్యమునిచ్చును జన్మజన్మముల్ "
    యంచని జెప్పనేర్చితిని, యర్థము మారె "ల"కార కొమ్ము తోన్
    సంచిత పాపకర్మములు సౌఖ్యమునిచ్చును జన్మజన్మముల్.

    రిప్లయితొలగించండి




  9. మంచిఫలమ్ములిచ్చు తగుమార్గమునన్ జరియించుచుండి ప్రా
    పంచికసౌఖ్యముల్ విడచి పావనమూర్తిని మాధవున్ మదిన్
    నెంచి స్వధర్మపాలనము నిచ్చలుజేసిన ''బాసిపోయి నీ
    సంచితపాపకర్మములు '' ,సౌఖ్యము నిచ్చును జన్మజన్మముల్.

    రిప్లయితొలగించండి
  10. పంచుము ప్రేమ లోకులకు పంచుము మానవతా మృతంబు గా
    వించుము దాన ధర్మములు పేద జనాళికి, దొల్గిపోవు నీ
    సంచిత పాప కర్మములు, సౌఖ్యము లిచ్చును జన్మ జన్మలన్
    అంచిత మైనదీ జనన మందరి కబ్బదు మానవోత్తమా!

    రిప్లయితొలగించండి
  11. పండిత నేమాని గారికి పూజ్యులుగురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    సంచిత పాపకర్మములు సౌఖ్యము నిచ్చును;జన్మజన్మలన్
    ఎంచగ కీటకమ్ము వలె హీనపు జీవిగ నట్లుగాక యే
    కొంచెపు పుణ్యమున్ సలుప కూరిమి సద్గతి కల్గునెట్లనన్
    మంచిగ చిన్న విత్తనము మర్రి మహా తరువైన రీతిగా

    రిప్లయితొలగించండి
  12. పెంచుచు మానవత్వమును పేదల బాధలఁ దీర్చనెంచుచున్
    సంచిత పాప నాశకుడు సాంబశివుండని వేడినంత నూ
    హించగ లేని రీతి మనకెన్నియొ పుణ్యములంది తొల్గగా
    సంచిత పాపకర్మములు, సౌఖ్యము నిచ్చును జన్మ జన్మలన్

    రిప్లయితొలగించండి
  13. కలికాలంలో నిజమే గదండీ,"సంచిత పాపకర్మములు సౌఖ్యమునిచ్చును జన్మజన్మముల్".లేకపోతే ఈ పాటికి రాజకీయనాయకులెందరో దేశకాలమాన పరిస్థితుల బట్టి కష్టాలపాలయ్యేవాళ్ళు.

    రిప్లయితొలగించండి
  14. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈ నాటి సమస్యకు అందరూ మంచి మంచి పూరణలు చేసేరు. అందరికీ అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. మించిన శోకమందకట మృత్యువు మేలనిపింపజేయు; నే
    వంచన లేని ధర్మపరిపాలన పుట్టుక చావులాపు; నీ
    వెంచుకొనంగ నేమరకమెప్పుడు; దుఃఖము తోడు జేర్చి యీ
    సంచిత పాప కర్మములు సౌఖ్యము లిచ్చును జన్మజన్మలన్.

    రిప్లయితొలగించండి
  16. లంచము సంగ్రహించక విలాస మనంబున సేవ జేయుచున్
    వంచన జేయు మానవుల పాపపు చర్యల మాన్పివేయ వా
    రించుచు దుష్ట మానవుల నెన్నుచు శిక్షలు వేయనప్పు డా
    సంచిత పాప కర్మములు సౌఖ్యము లిచ్చును జన్మ జన్మలన్

    రిప్లయితొలగించండి
  17. బొడ్డు శంకరయ్య గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    అయినా దుష్ట శిక్షణ పాపకర్మ మెలా అవుతుంది?

    రిప్లయితొలగించండి
  18. దించగ బెంగుళూరునను దీన కుమారుని సీటునుండి భల్
    వంచన తోడ భాజపులు వారికి కూడును వేనవేలవౌ
    సంచిత పాప కర్మములు;...సౌఖ్యము లిచ్చును జన్మజన్మలన్
    సంచిని కూడబెట్టినవి స్వర్ణపు రాసులు కుండమార్పులన్

    రిప్లయితొలగించండి