2, అక్టోబర్ 2013, బుధవారం

పద్య రచన – 482 (జాతిపిత)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“జాతిపిత”

49 కామెంట్‌లు:

 1. శుభోదయం..అందరికి వందనములు...
  గాంధీ తాతకు జోహార్లు....

  కళ్ళ జోడుతో నడచిన కాంతి మూర్తి
  సత్యా పింసలు చాటిన సమర స్పూర్తి
  తెల్ల దొరలను తరిమిన దేశ భక్తి
  జాన్మ దినమున జేజేలు జాతిపితకు

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  మహాత్మాగాంధీ :

  01)
  _________________________________

  భుజంగప్రయాతము :

  భయం లేని గాంధీ ! కృ - పాళుండు గాంధీ !
  జయోత్సాహి గాంధీ ! కృ - శానుండు గాంధీ !
  ప్రియాపూర్ణు డైనా , గ - భీరుండు తానే !
  దయాశాలి గాంధీ ! వ - దాన్యుండు గాంధీ !

  సయోధ్యానుయోగీ !ని - జాపూర్ణ యోగీ
  జయం గల్గు దాకా , వి - చారించు గాదా !
  నయా మార్గ దర్శీ , స -నాథా, నిదానీ
  అయోగ్యుండు గాడే ! క్రి- యాశీలి వాడే !
  _________________________________
  కృపాళువు = కరుణామయుడు
  కృశానుడు = అగ్ని
  గభీరుడు = గంభీరుడు
  వదాన్యుడు = మనోఙ్ఞముగా మాటలాడువాడు
  సయోధ్య = విభేదాలు తొలఁగించుకొని ఏర్పఱచుకొను స్నేహము
  అనుయోగి = పూనిక గలవాడు
  సనాథుడు =one who has a master or protector
  నిదాని = ఆత్రపడక విచారించువాడు

  *****


  మహాత్మా ! మహాత్మా ! నమస్తే ! నమస్తే :

  02)
  _________________________________

  భుజంగప్రయాతము :

  మహాత్మా ! మహాత్మా ! అ- మానత్ హమారీ !
  కహాహో ? కహాహో ? షి - కాయత్ బహుత్ హై !
  జహాహో మహాత్మా, బ - చావో సభీహమ్ !
  మహాత్మా ! మహాత్మా ! న - మస్తే ! నమస్తే !
  _________________________________

  రిప్లయితొలగించండి
 3. తెల్ల దొరల దాస్యమ్ము మేమొల్ల మనుచు,
  జాతి నెల్ల మేల్కొలిపిన నేత యితడు.
  హింస మార్గము వీడి యహింస బాట,
  పోరు సల్పిన అసలైన వీరుడితడు.

  శ్వేత పాలక మూకల పీచ మడచి,
  స్వేచ్చ వాయువు లూదిన సింగ మితడు.
  ఇట్టి ఘనున కేమిచ్చినారీ జనమ్ము?
  పుట్టిన దినాన తట్టెడు పూలు దక్క

  రిప్లయితొలగించండి
 4. శైలజ గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  రెండవ పాదంలో ‘సత్యాహింసలు, సమరస్ఫూర్తి’ అన్నచోట గణభంగం. ‘సత్యము నహింసలను చాటె సమరయోద్ధ’ అందామా?
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  కాకుంటే వ్యావహారిక పదాలను ప్రయోగించారు.

  రిప్లయితొలగించండి
 5. అందవోలు విద్యాసాగర్ గారూ,
  బహుకాల దర్శనం. చాలా ఆనందాన్ని కలిగించింది.
  మీ రెండు పద్యాలూ చాలా బాగున్నవి. అభినందనలు.
  ‘హింసామార్గము’ అనవలసి ఉంటుంది కదా. అక్కడ ‘హింస చేయుట వీడి...’ అనండి.
  రెండవ పద్యంలో ‘సింగ మీత/ డిట్టి ఘనున...’ అనండి.

  రిప్లయితొలగించండి
 6. వసంత కిశోర్ గారూ,
  మీ హిందీ పద్యం చాలా బాగుంది. మీ ప్రయోగం ప్రశంసనీయం. అభినందనలు.
  ‘బచావో సభీకో/హమే అబ్’ అంటే అన్వయం కుదురుతుందనుకుంటాను. లేకుంటే ‘సభీ హమ్ (మే మందరం)’కు అన్వయం కుదరదు.

  రిప్లయితొలగించండి
 7. శంకరార్యులకు ధన్యవాదములతో :

  మహాత్మా ! మహాత్మా ! నమస్తే ! నమస్తే :

  02అ)
  _________________________________

  భుజంగప్రయాతము :

  మహాత్మా ! మహాత్మా ! అ- మానత్ హమారీ !
  కహాహో ? కహాహో ? షి - కాయత్ బహుత్ హై !
  జహాహో మహాత్మా, బ - చావో సభీకో !
  మహాత్మా ! మహాత్మా ! న - మస్తే ! నమస్తే !
  _________________________________

  రిప్లయితొలగించండి
 8. సత్యాహింసల మార్గము
  నీత్యాగము మరువలేము నీవే గాంధీ !
  ముత్యపుటుంగరమైతివి
  సత్యంబుగ భరత మాత సరియంగుళికిన్.


  రిప్లయితొలగించండి
 9. బోసినవ్వుల గాంధితాతయె పోరుసల్పెను నాడురా
  బాసకోసము అన్నదమ్ముల బంతులాటలు చూడరా
  దేశమన్నది జాతినేతయె దేవళమ్మని చాటెరా
  మూసపోసిన మానవత్వము మచ్చుకైనను లేదురా

  రిప్లయితొలగించండి
 10. హిందీలో కందం...కిశోర్ గారి పద్యము స్పూర్తి తో..
  బాగుందంటారా..

  గాంధీ జీకో మాన్లో
  అంధా నేతా జనోంకొ అందర్ దాలో
  అంధేరా కో మారో
  గాంధీ జీకా జమాన కల్సే దేఖో !

  రిప్లయితొలగించండి
 11. గురువు గారూ, నమస్కారం.
  నిజమే, చాలా రోజులుగా పద్యం వ్రాయటానికి సాహసించ లేదు.
  కానీ, బ్లాగ్ చూస్తూనే వున్నాను. యెన్నో మంచి పద్యాలను చదువుతూనే వున్నాను.
  యెందుకో ఈనాడు గాంధీ గారి గురించి రెండు పద్యాలు నాలోంచి వెలువడ్డాయి. వాటిని మీ అందరితో పంచుకోవాలనిపించింది.
  అయితే, 'స్వేచ్చ వాయువు లూదిన సింగ మితడు.
  ఇట్టి ఘనున కేమిచ్చినారీ జనమ్ము?' అన్నప్పుడు 'ఇతడు' 'ఇట్టి' అన్న రెండు పదాలు రెండు వేర్వేరు పాదాలలో వున్నాయి కనుక, ఆ రెంటికీ సంధి జరుగుతుందనుకోలేదు. నా తప్పులను మన్నించి, సవరించినందుకు ధన్యవాదాలు.
  బ్లాగుకి ఆణి ముత్యాల లాంటి పద్యాలను పంపుతున్న కవి శ్రేష్ఠులందరికీ సహస్రాభి వందనాలు.

  రిప్లయితొలగించండి
 12. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ రెండు (తెలుగు, హిందీ) పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  ‘డాలో’ టైపాటు వల్ల ‘దాలో’ అయినట్టుంది.
  *
  శైలజ గారూ,
  మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
  *
  అందవోలు విద్యాసాగర్ గారూ,
  సంతోషం. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 13. మత్తకోకిల:
  హే మహాత్మ! మహోన్నతా! ఘన హేమ భూమి ఫలప్రదా!
  రామభక్త! స్వరాజ్య కాముక! గ్రామ వృద్ధి కృతేప్సితా!
  ధీమతా! లవణోద్యమ వ్రత! దేశభక్తి ప్రచారకా!
  క్షేమ దాయక! నీచ హేయక! !శిష్ట కీర్తిత నాయకా!! (1)

  తేటగీతి:
  శ్వేతముఖులను ద్రోలంగఁ జేసితయ్య
  యెన్నియో యుద్యమమ్ముల నిచట నీవు!
  పేదలకు లేని వస్త్రాలు వీడి నీవు
  ముతుక దోవతి కండువల్ ముఱిసినావు!! (2)

  ఆటవెలది:
  కరమునందుఁ గఱ్ఱ; కాళ్ళకుఁ జెప్పులు;
  పుట్ట గోచి; యొల్లె భుజము పైని;
  రొండిని గడియారముండ శోభిల్లుచు,
  దేశభక్తి నిడిన దేశికుఁడవు! (3)

  చంపకమాల:
  “కుల మత వర్గ జాతి మనకున్న తిరోగమనంపు గోడలే;
  యిల నివి యున్న, యున్నతియె యెందును నుండక, భష్టమౌదు; మే
  విలువలు లేక, యొండొరు లభీప్సితముల్ దెగటార్చి, శత్రులై
  నిలుతురు; కొట్టుకొందు; రివి నీచములయ్య; త్యజింప మేలొగిన్
  గలుగు” నటంచు బోధనలఁ గాచితివే మన భారతీయులన్! (4)

  కందము:
  దండమయా గాంధీజీ!
  దండమయా బాపు! నీకు దండము నేతా!
  దండము మోహనదాసా!
  దండమయా కర్మచంద్ర! దండములయ్యా!! (5)

  రిప్లయితొలగించండి
 14. భారతమాత హస్త యుగ పద్మములన్ దవిలించ సంకెలల్,
  జారెను బాష్ప బిందువులు జాలిగ నాయమ కల్వ కన్నులన్
  ధారగ, నీ యెడంద నవి తాకెను, చివ్వున నీవు చూడగా
  క్రూరులు తెల్ల రక్కసుల కొంపలు కూలెను బాపుజీ! భళా!

  మేరు సమాన ధీరుడవు, మేదిని నీదగు వీరు లెన్ననీ
  ధారుణి నింక బుట్ట రిది తథ్యము! యోరిమి దివ్య చాపమున్!
  భూరి యహింస సత్యమను పొల్పగు బాణ యుగమ్ము! వీనితో
  పోరితివీవు శత్రువుల మోములు ఛిద్రము గాగ బాపుజీ!

  రిప్లయితొలగించండి
 15. జాతిపితగనుబేరొంది జగమునందు
  సత్యము మఱియు నాయహింసా పథమ్ము
  నెఱపి యాంగ్లరాజులమఱి తఱిమి కొట్టి
  తెచ్చె స్వరాజ్య ముమనకు దెగువతోడ

  రిప్లయితొలగించండి
 16. గాంధి తాతకు గాంధి తాతకు గాంధి తాతకు జోతలున్
  గాంధి నేతకు గాంధి నేతకు గాంధి నేతకు సన్నుతుల్
  బంధనమ్ములు త్రుంచె నొప్పుగ భారతాంబకు భక్తిమై
  యంధకారము బాపి జాతికి హాయి గూర్చెను రక్తిమై

  రిప్లయితొలగించండి
 17. గుండు మధుసూదన్ గారూ,
  ఖండకృతిగా మీ గాంధిస్తుతి మనోహరంగా ఉంది. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  మీ రెండు పద్యాలూ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. పండిత నేమాని వారూ,
  మనోజ్ఞమైన పద్యాన్ని చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
  భావమునకు గానీ ధారకు గానీ మీకు మీరే సాటి. మీ 2 పద్యములును బాగుగ నున్నవి. 2వ పద్యము గురించి కొన్ని సూచనలు:

  1. తథ్యము తరువాత ఓరిమి వచ్చినది కాబట్టి యడాగమమునకు తావు లేదు. ఉత్తునకు సంధి నిత్యము కదా.
  2. పద్యములో మేదిని మరియు ధారుణి అని 2 సారులు వాడుటను మానుట మంచిది.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 20. శ్రీగురుభ్యోనమ:

  పగగొను శత్రువు నైనను
  నగుమోమున నిగ్రహించినావట బాపూ
  భగవద్గీతవు నీవై
  జగతిని వెలిగించినావు జాతికి పితవై

  రిప్లయితొలగించండి
 21. శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. నేమాని పండితార్యా! దోషములను సవరించాను. ధన్యవాదాలు.

  మేరు సమాన ధీరులరు, మీ సము లే తరమందునైన నీ
  ధారుణి నింక బుట్ట రిది తథ్యమె! యోరిమి దివ్య చాపమున్!
  భూరి యహింస సత్యమను పొల్పగు బాణ యుగమ్ము! వీనితో
  పోరితిరయ్య! శత్రువుల మోములు ఛిద్రము గాగ బాపుజీ!

  రిప్లయితొలగించండి
 23. అందవోలు విద్యా సాగర్ గారి పద్యాలు చూశాక యీ పద్యం పెట్టాలనిపించింది.

  పుట్టిన రోజునాడు నిను బుద్ధి దలంతురె? చెప్పలేమె యి-
  ప్పట్టున బాపుజీ! సెలవు! పండుగ! సత్యమహింస తుంగలో
  గట్టిగ త్రొక్కి పట్టి, కడు కమ్మగ మాంసము మెక్కి, మద్యమున్
  పట్టుగ పట్టి ద్రావి కడుపారగ, దొర్లెదరయ్య హాయిగా!

  రిప్లయితొలగించండి
 24. పోరుబందరునందుబొడిచిన సూర్యుండు
  ....నస్తమించగ జెసె నాంగ్ల దృతిని,
  ఊతకర్రను బట్టి జాతిని కదిలించి
  ....చైతన్య స్పూర్తిని జ్వలన జేసె,
  సత్యాగ్రహమ్మునే సాధనంబుగ జెసి
  ....సామ్రాజ్య వాదుల సాగనంపె,
  కరవాలమునులేక పరపాలనంబుకు
  ....చరమ గీతము పాడి చరితకెక్కె,

  హింస హేయమన్న పరమ హంస గాంధి,
  నీతి నియమాల దప్పని నేత గాంధి,
  స్పూర్తి నొసగిన కారుణ్య మూర్తి గాంధి,
  జాతి పిత గాంధి భారత గీత గాంధి !!!

  రిప్లయితొలగించండి
 25. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..

  మన జాతి పితకు జోహార్లు పల్కుచు
  =========*==========
  పడి లేచి శక్తి జూపెడి
  కడలికెరటము మన గాంధి,కరవాలము పై
  నడచిన ధీరుడు,వీరుడు,
  నడిపించె కడవరకు ఘన నాయక గణమున్!

  **జైహింద్ **

  రిప్లయితొలగించండి
 26. ఏ మహామహునామ మింపార నిత్యంబు
  ..........స్మరణయోగ్యంబయ్యె సర్వజగతి,
  ఏ మహామహుగాథ లీపుణ్యభూమిలో
  ..........హరికథానిభములై యవతరించె,
  ఏ మహామహురూప మీభారతంబున
  .......... విగ్రహస్థంబౌచు విస్తరించె,
  ఏ మహామహువాక్కు లీవేదభూమిలో
  ..........మంత్రతుల్యంబులై మహిమ జూపె
  అతడు మోహనదాసాఖ్యు డనుపముండు
  కరమచందుండు ధీరుండు గాంధి ఘనుడు
  ధర్మరక్షణ చేయంగ కర్మభూమి
  కంపబడినట్టి దివ్యాత్ము డనగవచ్చు.

  సత్యనిష్ఠతోడ స్వాతంత్ర్యదీప్తులు
  భరతభూమియందు పర్వజేసి
  జనుల గాచినట్టి చరితార్థజీవికి
  నతులు చేతు జాతిపితకు నేడు.

  రిప్లయితొలగించండి
 27. మిస్సన్న గారూ,
  గాంధీ జయంతి అంటే ‘ఎంజాయ్’ చేయడానికి ఒక సెలవు దినమైంది. మీ తాజా పద్యం వాస్తవానికి ప్రతిరూపంగా ఉంది. అభినందనలు.
  *
  మంద పీతాంబర్ గారూ,
  గాంధీని వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించిన మీ సీసపద్యం చాలా బాగుంది. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 28. పూజ్యగురుదేవులు శ౦కరయ్య గారికి వందనములు

  సత్యాహింసల శాంతిమార్గముననే స్వాతంత్ర్యమార్జించి నీ
  వత్యౌన్నత్యపు జాతికే పితరుడై భాసించినావిత్తరిన్
  నిత్యమ్మున్ చెలరేగు హింసలను దుర్నీతిన్ నిరోధింపగా
  నత్యాశా పరులైన నాయకుల నీవైనా ప్రబోధి౦పుమా

  విగ్రహమైతివీవు నడివీధిని నిల్పిరినీదు కంఠమ౦
  దగ్రవినాయకామణులు హాయన మందుననొక్కమారు స
  త్యాగ్రహవింతలన్ మరల ధ్యానమొనర్తురు మాలవైచుచున్
  వ్యగ్రత నీదు బోధలను ఆశయముల్ మరువంగ నేర్తురే

  ఏదిర నీవు గన్న కల ఎచ్చటి కేగెను రామరాజ్యముల్
  ఏదిర పల్లె సీమలను ఏర్పడబోయిన ప౦చ పాలనల్
  ఏదిర రైతుసేమములు ఇంతుల మానము ప్రాణ రక్షణల్
  రాదుర గాంధి నీవిటకు రాకను సత్యముశాంత్యహింసలున్

  రిప్లయితొలగించండి


 29. ధన్యత జెందె నీ భరత ధాత్రి మహాత్ముని జన్మచేత లే
  రన్యులు వారి సాటి భరతావనిలోనను, విశ్వమందు స
  న్మాన్యతబొందినట్టి యసమాన మహోన్నత మానవుండు మా
  పుణ్య ఫలంబె మాకతని పూజలొనర్చగ నబ్బె భాగ్యముల్ .

  రిప్లయితొలగించండి
 30. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ మూడు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
  మొదటి పద్యంలో ‘నీవైనా’ అనకుండా ‘నీవైనన్’ అనండి.
  రెండవ పద్యంలో ‘బోధలను నాశయముల్/ బోధల సదాశయముల్’ అనండి.
  మూడవ పద్యంలో విసంధులు ఎక్కువగా ప్రయోగించారు. పద్యంలో మధ్య మధ్య అచ్చులు రావడం మన సంప్రదాయం కాదు. నా సవరణలతో మీ పద్యం....
  ఏదిర నీవు గన్న కల యెచ్చటి కేగెను రామరాజ్యమే
  యేదిర పల్లె సీమలను నేర్పడబోయిన ప౦చ పాలనం
  బేదిర రైతుసేమములు నింతుల మానము ప్రాణ రక్షణల్
  రాదుర గాంధి నీవిటకు రాకను సత్యము శాంత్యహింసలున్
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 31. దేశ బానిస సంకెళ్ళు తెగను గొట్ట
  ఆయుదంబులు బూనకాహింస తోడ
  తెల్లదొరల తరిమె తాను తెగువతోడ
  జాతిపితగ నిల్చెను దేశ జనులకెల్ల

  రిప్లయితొలగించండి
 32. కుసుమ సుదర్శన్ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘పూనక + అహింస’ అన్నప్పుడు సంధి లేదు. ‘ఆయుధములు బూనకయె యహింస తోడ’ అనండి.

  రిప్లయితొలగించండి
 33. ఏ మహామహునామ మింపార నిత్యంబు
  ..........స్మరణయోగ్యంబయ్యె సర్వజగతి,
  ఏ మహామహుగాథ లీపుణ్యభూమిలో
  ..........హరికథానిభములై యవతరించె,
  ఏ మహామహురూప మీభారతంబున
  .......... విగ్రహస్థంబౌచు విస్తరించె,
  ఏ మహామహువాక్కు లీవేదభూమిలో
  ..........మంత్రతుల్యంబులై మహిమ జూపె
  అతడు మోహనదాసాఖ్యు డనుపముండు
  కరమచందుండు ధీరుండు గాంధి ఘనుడు
  ధర్మరక్షణ చేయంగ కర్మభూమి
  కంపబడినట్టి దివ్యాత్ము డనగవచ్చు.

  సత్యనిష్ఠతోడ స్వాతంత్ర్యదీప్తులు
  భరతభూమియందు పర్వజేసి
  జనుల గాచినట్టి చరితార్థజీవికి
  నతులు చేతు జాతిపితకు నేడు.

  రిప్లయితొలగించండి
 34. మాస్టరుగారూ ! ధన్యవాదములు.
  అవునండీ .. డాలో.. బదులు దాలో..టైపాటు ...
  తెలియజేసినందులకు ధన్యవాదములు

  సరిజేసిన పూరణ..

  గాంధీ జీకో మాన్లో
  అంధా నేతా జనోంకొ అందర్ డాలో
  అంధేరా కో మారో
  గాంధీ జీకా జమాన కల్సే దేఖో !

  రిప్లయితొలగించండి
 35. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  ‘జాతిపితకు నతులు’ అర్పించిన మీ పద్యాలు మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.

  రిప్లయితొలగించండి

 36. నిత్య సత్య శోధన జేయు నిపుణుడతడె!
  యాయుధమ్ములు లేనట్టి సాయుధుండు!
  ధైర్య సాహసముల జూపె ధర్మ మూర్తి!
  జాతి స్వాతంత్ర్య శోభల స్వస్థతంద
  జాతి పితగా ఘనతనందె జగతి మెచ్చ!

  రిప్లయితొలగించండి
 37. Sri Sudarshan kusma gaaru!

  శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది.
  శ్రీ శంకరయ్య గారు కూడా పాదమును సరిగ చూడ లేదు. ఈ క్రింది విధముగా సవరించినచో చాల బాగుగ నుండును:
  "ఆయుధవరమ్ము సత్యాగ్రహమ్ము బూని"
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 38. Sri H.V.S.N.Moorti gaaru!

  శుభాశీస్సులు. మీ పద్యములు బాగుగ నున్నవి.
  చిన్న సవరణ:

  తేటగీతి ఆఖరి పాదమును ఇలాగ మార్చండి:
  "కంప బడినట్టి దివ్యాత్ము డన జెలంగు"

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 39. పూజ్యులు గురిదేవులు శంకరయ్య గారికి వందనములు
  మీ సూచనలకు సవరణలకు ధన్యవాదములు

  తిమ్మాజీరావు

  రిప్లయితొలగించండి
 40. మహాస్రగ్ధర:

  జయహే గాంధీ మహాత్మా! జనగణ వినుతా! శాంత్యహింసా ప్రకాశా!
  జయహే స్వాతంత్ర్య వీరా! సతత హితమతీ! శత్రు ధైర్యాపహారీ!
  జయహే ధర్మ స్వరూపా! సమర జయకరా! సత్య రూపాంచితాస్త్రా!
  జయహే దేశాగ్ర నేతా! జయ జయ జయహే! సాధుశీలాభిరామా!

  రిప్లయితొలగించండి
 41. పండిత నేమాని వారూ,
  మీ మహాస్రగ్ధరకు నా జేజేలు. ధన్యవాదాలు.
  మూర్తి గారి పద్యపాదం విషయంలో నేను పొరబడ్డాను. మన్నించండి.
  *
  సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి

 42. ఆంగ్లేయ పాలన నంత మొందించగ
  స్వాతంత్ర్య సమరపు శంఖ మూదె
  సత్యమ్ము బలుకుచు సత్యాగ్రహమ్మును
  సాగించి పలు మార్లుగ జైలు కేగె
  భారతీయుల కెల్ల భాగ్య విధాతగ
  స్వాతంత్ర్యమిచ్చిన జాతి రత్న
  గాంధి మహాత్ముండు ఘనతను సాధించి
  విశ్వ మందున నెంతొ విలువ నొందె
  మత సామరస్యమ్మె మానవత్వమ్మని
  జగతి కంతకు తాను జాటి చెప్పె
  పేద వారికి సేవ నాదరమ్ముగ జేసి
  యాదర్శమును చాటె నవని నందు
  నంటరాని తనము నణచి వేయగ నెంచి
  హరిజను లెల్లర కాప్తు డయ్యె
  శాంతి యహింసలు జాతి సమైక్యత
  గ్రామ స్వరాజ్యపు ప్రతిన బూనె

  శాంతి మార్గము జూపిన క్రాంతి గాంధి
  జాతి భేదము వలదన్న నేత గాంధి
  మానవత్వమ్ము చాటిన మాన్య గాంధి
  స్వేచ్ఛ సాంధించి పెట్టిన వేల్పు గాంధి.

  రిప్లయితొలగించండి
 43. పూజ్యనీయ గురువర్యులు, శ్రీయుత పండిత నేమాని గారికి పాదాభివందనములు..
  సవరించి ప్రోత్సహించి నందులకు ధన్యవాదములు!

  రిప్లయితొలగించండి
 44. పూజ్యనీయ గురువర్యులకు పాదాభివందనములు..
  సవరించి ప్రోత్సహించి నందులకు ధన్యవాదములు!
  ఆర్యా! నిజానికి నేను నేర్చుకోవాలనే తపన, అభిరుచితో రాస్తున్నాను.కావున అన్యదా భావించకుండ
  దోషాలను సవరించి ప్రోత్సహించ మనవి

  రిప్లయితొలగించండి
 45. గోలి వారు హిందీలో కందాన్ని మహా అందంగా ఆనందంగా మలచారు.

  రిప్లయితొలగించండి