22, అక్టోబర్ 2013, మంగళవారం

సమస్యాపూరణం - 1212 (పచ్చికను దిన నొల్లదు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.....
పచ్చికను దిన నొల్లదు పాడియావు.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

26 కామెంట్‌లు:

  1. అయ్యా ! వరప్రసాద్ గారూ !
    మీకు mail పంపించాను !
    చూడండి !

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించ నున్నవి !

    ఇప్పుడంతా గడ్డి తినే నేతలే గదా !

    పూర్వపు నేతలు ( రాజకీయ నాయకులు)
    ప్రజల సొమ్మును మాత్రమే గాకుండా
    వారి వారి సొంత సొమ్మును కూడా
    ప్రజల కోసమే ఖర్చు జేసే వారు !
    మొన్న పంచాయతీ ఎలక్షన్లు జరిగినప్పుడు
    రోజూ పేపర్లలో
    ఉన్న ఆస్తంతా ప్రజల కోసం ఊరి కోసం ఖర్చు జేసి
    నేడు కటిక దారిద్ర్యం లో మగ్గుతున్న
    పూర్వపు సర్పంచుల గురించి ఎన్నో కథనాలు !
    కళ్ళు చెమర్చేవి చదువుతుంటే !

    పూర్వపు నేతలు పచ్చిక(గడ్డి) తిననొల్లని పాడియావులు గదా :

    01)
    ______________________________________

    పాడి యావుకు సమముర - పాత నేత !(వారు)
    ప్రజల కొఱకే వాడిరి - వారి సొమ్ము !
    ప్రజల సొమ్మును పోల్చిన - పచ్చికగను
    పచ్చికను దిన నొల్లదు - పాడి యావు !
    ______________________________________

    రిప్లయితొలగించండి
  3. మాయాబజార్ వంటి మహత్తరమైన సినిమాలు చూచిన వారికి
    నేటి నీతీ నియమం లేని సినిమాలు చూడాలంటే మనసొప్పుతుందా ?

    02)
    _________________________________

    మనసు నాహ్లాద పరచెడు - మంచి మంచి
    పాత సినిమాల ప్రేమించు - జాతివారు
    నేటి సినిమాల గందురే - నీతి లేని !
    పచ్చికను దిన నొల్లదు - పాడి యావు !
    _________________________________

    రిప్లయితొలగించండి
  4. సకల దేవత లందరు నికర ముగను
    కొలువు దీరిన దైవము గోవు యనగ
    కల్ప తరువది నింటింట గాడి పశువు
    పచ్చి కను దిన నొల్లదు పాడి యావు

    రిప్లయితొలగించండి
  5. || మత్తేభము ||
    అరయన్ , వంశము నిల్పనేగద , వివా - హంబట్టి వైవాహిక
    స్ఫురణం బిప్పటి కెన్నడో , జరిగె ! స - త్పుత్రుండు పుట్టెన్ ! వయః
    పరిపాకంబును , తప్పు చున్న యది ! ! ఈ - ప్రాయంబునన్ , వర్ణ సం
    కరపుం పెండిలి , ఏల చుట్టెదవు ? నా - కంఠంబునన్ , కౌశికా!!!
    (బలిజేపల్లి వారి సత్య హరిశ్చంద్ర నుండి)

    మాతంగ కన్యలను పెళ్ళాడు మన్న విశ్వామిత్రునితో హరిశ్చంద్రుడు :

    03)
    _________________________________

    వంశమును నిల్ప నే గద - భార్య వచ్చు !
    భార్య వచ్చిన దెన్నడో - భాగ్యవశము !
    వంశమును నిల్పె పుత్ర సౌ - భాగ్య మిచ్చి !
    పయన ముడుగుచు నున్నట్టి - వయసు నందు
    వర్ణ సంకర మేలనో ?- వలదు ! స్వామి
    పచ్చికను దిన నొల్లదు - పాడి యావు !
    _________________________________

    రిప్లయితొలగించండి
  6. మాకు గోవొక్కటి కలదు; మానిత గుణ
    శీల! యదియ యెప్పుడును మా చేనిలోని
    పచ్చిగడ్డియె మేయును! పరుల చేలఁ
    బచ్చికను దిన నొల్లదు! పాడియావు!!

    రిప్లయితొలగించండి
  7. ఒక రైతు దిగులుగా మరొక రైతుతో :

    వేల రూకలు వెచ్చించి బేరమాడి
    మచ్చలు గల యావు నొకటి తెచ్చితేను
    అయ్యొ యేమైనదో గాని యంతలోన ?
    పచ్చికను దిన నొల్లదు పాడి యావు

    రిప్లయితొలగించండి
  8. పాడి యావుకు పచ్చిక పాత మేత
    పచ్చ గడ్డియె కరువాయె పట్టణముల
    వాలు పోస్ఠరు తినుటలో వాసికెక్కి
    పచ్చికను దిన నొల్లదు పాడి యావు


    గంగి గోవును బూజించ గలుగు నఘము
    గోవు మాలక్ష్మి యందురు గోము గాను
    పళ్ళు బియ్యము యన్నను బరమ ప్రీతి
    పచ్చికను దిన నొల్లదు పాడి యావు

    రిప్లయితొలగించండి
  9. ఆవురావురనుచు గడ్డినంత మేసి
    అరగకదిపుడు జైలునకరిగె కొంద
    రనెడు మాటలకర్థంబు నరయలేక
    పచ్చికను దిన నొల్లదు పాడి యావు

    రిప్లయితొలగించండి
  10. పట్నమందలి యావును పట్టితెచ్చి
    పంటపొలముల దిప్పగ పల్లెనందు
    నాగరీకపు తిండిలా నచ్చకేమొ
    పచ్చికను దిన నొల్లదు పాడి యావు

    రిప్లయితొలగించండి
  11. పచ్చికను గూర్చి దుర్వార్త వచ్చుట విని
    ఆవు నిర్ఘాంతముపడె ననంతరమున
    నకట! ధర్మార్జితము కాని యట్టి యెడల
    పచ్చికను దిన నొల్లదు పాడియావు

    రిప్లయితొలగించండి
  12. జంతు మాంసము దినగోరు జాతి కేశి
    చంపి వేటాడి తిను గాని చక్కనైన
    పచ్చికను దిన నొల్లదు, పాడియావు
    పచ్చికను మెచ్చి తిని యిచ్చు పాలు లెస్స .

    రిప్లయితొలగించండి
  13. పచ్చి మాంసము తినే ఆవు అని కొంత కాలం క్రితం చదివిన వార్త ఆధారంగా...
    పచ్చి మాంసమె కావలె పాల నీయ
    కాల మహిమేమొ! లేకను కల్కిమాయొ!
    మాంస భక్షనమ్మది తప్ప మచ్చు కైన
    పచ్చికను దిననొల్లదు పాడియావు!

    రిప్లయితొలగించండి
  14. పందిత నేమానిగారికి పూజ్యులుశంకరయ్య
    గారికి వందనములు

    తినగ మేలిమి కసవును మనిషి తినుచు
    కలుషితమ్మగు పచ్చిక గవిలకిడగ
    నిరశనవ్రత మొనరిచె నేతల వలె
    పచ్చికను దిన నొల్లదు పాడి యావు

    రిప్లయితొలగించండి
  15. శ్రీ కంది శంకరయ్య గురువర్యులకు వందనములు,
    అర్థ గణదోషములున్న సవరించ ప్రార్థన !


    కౄర జంతువు సింహము ఘోరముగను
    పచ్చిమాంసము తిననిష్ట పడును గాని
    పచ్చికను దిననొల్లదు, పాడియావు
    పచ్చికను ప్రీతితో దిని పాలనిచ్చు

    రిప్లయితొలగించండి
  16. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..

    శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

    అందరికీ అభివందనములు !

    శ్రీ వసంత కిషోర్ గారు జెప్పినట్లు, ఇప్పుడంతా గడ్డి తినేడి వారు నేతలు,వారి సహచరులే!
    ========*=========
    మేను శాశ్వతం బనుచును మేదిలోన,
    జిహ్వ కిష్టమైన మిగుల జిగురు గారు
    సర్వ రుచులు దినుట నేర్చి,శంక వీడి
    పచ్చికను దిన నొల్లదు పాడి యావు !

    రిప్లయితొలగించండి
  17. జీతమునే నమ్ముకున్న సుఖము లేదు నేడు, లంచములు తీసుకున్నచొ సుఖము గలుగునని అధికారులు నమ్ముచున్నారు.
    =======*============
    పచ్చిక దిన,శక్తి మిగుల పది ఘడియలు
    ఫాలితిన్ సంచులను దిన పది దినములు
    సుఖము నొందుచు నుండగ సొగసుగాను
    పచ్చికను దిన నొల్లదు పాడి యావు!

    రిప్లయితొలగించండి
  18. ఆవు చేలో మేసిన దూడ గట్టున మేయునా?
    =========*===========
    3. ఎండు గడ్డి దినుట నేర్చి మెండు గాను
    జిక్క కుండె వలకు రైతు స్థిరము గాను,
    కనుల జూచి గలత జెంది,కమ్మ నైన
    పచ్చికను దిన నొల్లదు పాడి యావు!

    (ఎండు గడ్డి= లంచము, వలకు = సి బి ఐ,రైతు= యజమాని,నాయకుడు, పాడి యావు= సేవకుడు )

    రిప్లయితొలగించండి
  19. గడ్డి బెట్టిన పాలిచ్చు దొడ్డ మనసు
    పాలు ద్రావిన మనుజులు మేలు మరచి
    విషము గ్రక్కుచు వధియించ వింత గాదె
    పచ్చికను దిన నొల్లదు పాడి యావు

    రిప్లయితొలగించండి
  20. పొంది మేలును మఱచిన నందు రవని
    శ్వానమైనను ముట్టదు వాని శవము
    నంతియే గాదు వినుమట్టి యధము చేతి
    పచ్చికను దిన నొల్లదు పాడి యావు

    రిప్లయితొలగించండి

  21. లాలూ మిశ్రా గడ్డి మేసే నని జెప్పిన
    తీర్పు విని పాడియావు కలత చెందె
    నొల్ల నొల్ల ఇక గడ్డి నాకు నొల్ల నొల్ల
    పచ్చికను దిన నొల్లదు పాడియావు!!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  22. చెంగు చెంగున గెంతుచు చేరి పొదుగు
    బాగుగా క్షీరమును ద్రావు లేగదూడ
    తప్పిపోవ మందను వీడి దారి మరచి
    పచ్చికను దిన నొల్లదు పాడియావు

    రిప్లయితొలగించండి
  23. వసంత కిశోర్ గారూ,
    ప్రజల సొమ్మును గడ్డిలాగా మేయని పాతతరం నాయకుల గురించిన మొదటి పూరణ, నీతి లేని గడ్డిని తినిపించే నేటి సినిమాల గురించిన రెండవ పూరణ, హరిశ్చంద్రుని వాక్యంగా మూడవ పూరణ... దేనికదే ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
    మొదటి పూరణ రెండవ పాదంలొ గణదోషం. ‘వారు ప్రజలకై వాడిరి వారి సొమ్ము’ అనండి.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘గోవు + అనగ’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘గో వనంగ’ అనవచ్చు. ‘తరువది యింటింట’ అనవలసి ఉంటుంది.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    పరుల గడ్డిని మేయని ఆవును గురించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    ఏదో రోగంతో బాధపడుతున్న ఆవును కొన్న అవస్థను చక్కగా వివరిస్తూ మొదటి పూరణ చెప్పారు.
    దూడను పోగొట్టుకున్న ఆవును గురించిన రెండవ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    వాల్ పోస్టర్లను తినమరిగిన ఆవును గురించిన మీ మొదటి పూరణ బాగుంది.
    రెండవ పూరణలో పళ్ళు, బియ్యము, అన్నము తినే ఆవును గురించి చెప్పారు. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మొదటి పూరణ లోని సెటైర్ అదిరింది.
    పట్నవాసపు ఆవును గురించిన రెండవ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరన ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    ఆ వార్తను నేను కూడా చదివినట్టు గుర్తు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    కల్తీ గడ్డిని తిననొల్లని ఆవు గురించిన మీ పూరణ బాగుంది.అభినందనలు.
    *
    కుసుమ సుదర్శన్ గారూ,
    విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ మూడు పూరణలూ వైవిధ్యంగా బాగున్నవి. అభినందనలు.
    ‘మేదిని’ని ‘మేది’ అన్నారు.
    *
    మిస్సన్న గారూ,
    అధముని చేతి పచ్చికను ఆవు తినదన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. గురువులు శంకరయ్య గారికి నమస్కారములు
    నావద్ద మీవి రెండు ఫోన్ నెంబర్లు ఉన్నాయి కానీ ఒక్కటీ పనిచేయ డము లేదు .ఇక మైల్ లో పంపితే తిరిగి వస్తున్నాయి సమస్యలు చేరటల్లేదు దయచేసి మీ నెంబర్లు , మరియు ఈ మైల్ ఐడి ఇవ్వ గలరు ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  25. ఇచ్చినట్టి మాట నిలుప నిచ్చగించి
    హెచ్చయిన బాధ పడు కథ నెట్లు వినెనొ
    నచ్చట నిలిచి మేసెడి యాశ వీడె;
    పచ్చికను దిన నొల్లదు పాడియావు.

    రిప్లయితొలగించండి